మెయన్ ఫీచర్

రాజ్యాంగానికి 70 వసంతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశిష్టమైన భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ నెల 26వ తేదీ నాటికి 70 వసంతాలు పూర్తవుతున్నాయి. ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ, విజయవంతమైన ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించిన భారత రాజ్యాంగానికి ఉన్న ఘనకీర్తి అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశంగా ఖ్యాతి చెందిన భారత్‌లో భారీ సంఖ్యలో ప్రజలు ఎన్నికల్లో పాల్గొని , తమకు నచ్చిన నేతనే ఎన్నుకునే మహద్భాగ్యం ఈ రాజ్యాంగంతోనే వచ్చింది. రాజ్యాంగం దేశానికి వౌలిక శాసనం, ప్రభుత్వానికి మూల చట్టం .
సాధారణ చట్టాలకు, శాసనాలకు లేని ప్రాధాన్యత ఆధిక్యత రాజ్యాంగానికి ఉంటుంది. లిఖిత రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా ఏర్పడిన రాజ్యాంగ సభ రూపకల్పన చేసింది. రాజ్యాంగేతర శాసనాలను సాధారణ శాసనసభలు రూపొందిస్తాయి. రాజ్యాంగ శాసనానికి స్వయం సిద్ధ్ధాకారం ఉంటుంది. ఇతర శాసనాలకు లేని ప్రత్యేకతను రాజ్యాంగ శాసనాలకు కల్పించడం ప్రజాస్వామిక పాలనా వ్యవస్థ ప్రధాన లక్షణం. పాశ్చాత్య దేశాల్లో రెండు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం అర్థ్ధవంతంగా , సుస్థిరంగా ప్రయోజనకరంగా నెలకొనడానికి, రాజ్యాధికారం దుర్వినియోగం కాకుండా ఉండటానికి విశిష్టత ఉన్న రాజ్యాంగం తప్పనిసరని భావించారు. బ్రిటిష్ పాలనను నిరసించి, స్వాతంత్య్రాన్ని సాధించి, ప్రజాస్వామిక వ్యవస్థను స్ఢాపించుకున్న తర్వాత ఇతర ప్రజాస్వామిక దేశాలను అనుసరించి మన నాయకులు, పాలకులు దేశానికి చక్కని రాజ్యాంగాన్ని రూపొందించారు.
ఆచరణాత్మక, సలక్షణమైన రాజ్యాంగ నిర్మాణాన్ని ధ్యేయంగా పెట్టుకుని ప్రపంచంలోని ప్రజాస్వామిక రాజ్యాంగాలు అన్నింటినీ అధ్యయనం చేసి వాటిలో మన దేశ పరిస్థితులకు సరిపడే అంశాలను గ్రహించి, వాటిని మన రాజ్యాంగంలో తగిన చోట్ల పొందుపరిచారు. బ్రిటిష్ పాలనా వ్యవస్థతో మనకున్న విస్తృత అనుభవం, అవినాభావ సంబంధ బాంధవ్యాల వల్ల మన రాజ్యాంగంలోని ముఖ్యమైన భాగాలు అన్నీ బ్రిటిష్ రాజ్య విధానానే్న ప్రతిబింబిస్తాయి.
భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును మనం గణతంత్రదినోత్సవం (రిపబ్లిక్ డే) గా నిర్వహించుకుంటున్నాం. రాజ్యాంగం అమలులోకి రాకముందు, రాజ్యాంగ రూపకల్పనకు పెద్ద కసరత్తే జరిగింది.
భారతదేశానికో రాజ్యాంగం ఉండాలని 1914లోనే గోపాలకృష్ణ గోఖలే డిమాండ్ చేశారు. 1934లో ఎంఎన్ రాయ్ రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకతను వివరించారు. 1935లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభ ఈ అంశాన్ని తీర్మానించింది. రాజ్యాంగ పరిషత్‌ను స్థాపించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1940లో అంగీకరించింది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా 1946లో తొలిసారి రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. శాసనసభల ద్వారా 292 మంది, సంస్థానాల నుండి 93 మంది, చీఫ్ కమిషనర్ ప్రావిన్స్‌ల ప్రతినిధులు నలుగురు సభ్యులయ్యారు. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 389కి పెరిగినా తర్వాత వౌంట్ బాటెన్ దేశ విభజన ప్రణాళికతో సభ్యుల సంఖ్య 299కి తగ్గిపోయింది. 1946 డిసెంబర్ 9 వ తేదీన ఢిల్లీలోని పార్లమెంటు భవన్ సెంట్రల్ హాలులో రాజ్యాంగ సభ తొలి సమావేశం జరిగింది. దీనికి 211 మంది మాత్రమే హాజరయ్యారు. రాజ్యాంగ సభకు డాక్టర్ సచ్చిదానంద సిన్హాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ , వౌలానా అబుల్ కలాం అజాద్, సర్దార్ పటేల్, ఆచార్య జేబీ కృపలానీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయడు, రాజాజీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, టంగుటూరి ప్రకాశం పంతులు, డాక్టర్ పట్ట్భా సీతారామయ్య వంటి వారు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
రాజ్యాంగ రూపకల్పనలో భాగంగా 19 కమిటీలను కూడా నియమించారు. రాజ్యాంగ సారథ్య సంఘానికి, స్ట్ఫా- ఫైనాన్స్ కమిటీకి, జాతీయ జండా అడ్‌హక్ కమిటీకి, నియమనిబంధనల కమిటీకి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, ముసాయిదా కమిటీకి డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాజ్యాంగ సలహా సంఘానికి , ప్రాథమిక హక్కుల కమిటీకి, అల్పసంఖ్యాక వర్గాల కమిటీకి, రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ చైర్మన్లుగా వ్యవహరించారు. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీకి జేబీ కృపలానీ, కేంద్ర రాజ్యాంగ కమిటీకి, కేంద్ర అధికారాల కమిటీకి జవహర్‌లాల్ నెహ్రూ, సుప్రీంకోర్టు సన్నాహక కమిటీకి వరదాచారి, బిజినెస్ కమిటీకి కేఎం మున్షీ , ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీకి గోపీనాథ్ బోర్డు లాయిడ్, హౌస్ కమిటీకి భోగరాజు పట్ట్భా సీతారామయ్య, పార్లమెంటరీ నియమనిబంధనావళి కమిటీకి జీవీ వౌలాంకర్ చైర్మన్లుగా వ్యవహరించారు.
రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు రెండేళ్ల 11 నెలల 18 రోజులు పట్టింది. రాజ్యాంగ సభ 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది. 114 రోజులు రాజ్యాంగ ప్రతి రూపకల్పనపై వెచ్చించింది. రాజ్యాంగ ప్రతిరూప కల్పనలో భాగంగా 7635 సవరణలు వచ్చాయి. 2473 ప్రతిపాదనలను చర్చించి, పరిష్కరించింది. రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న రాజ్యాంగంపై 284 మంది సభ్యులు సంతకాలు పెట్టారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి, భారత తాత్కాలిక పార్లమెంటు ఏర్పాటైంది. 1952లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగి కొత్త పార్లమెంటు సభ్యులు ఎన్నికైన వరకూ తాత్కాలిక సభ కొనసాగింది.
పార్లమెంటరీ ప్రభుత్వం, ఏకపౌరసత్వం, స్పీకర్ పదవి, శాసనవ్యవస్థలు బ్రిటన్ నుండి తీసుకున్నవే. ప్రాధమిక హక్కులు, న్యాయసమీక్ష, సుప్రీంకోర్టు, సమాఖ్య రాజ్య పద్ధతులకు మూలం అమెరికా రాజ్యాంగం. సమాఖ్య రాజ్యాన్ని రాష్ట్రాల యూనియన్‌గా ఏర్పరచడంలో దక్షిణాఫ్రికా, కేంద్ర రాష్ట్ర సంబంధాలను కెనడా దేశాల రాజ్యాంగాన్ని అనుసరించడం జరిగింది. ఆదేశ సూత్రాలు, రాష్టప్రతి ఎన్నిక, రాజ్యసభ నామనిర్దేశం మొదలైన అంశాల్లో స్పెయిన్, ఐర్లాండ్ రాజ్యాంగాలు మార్గదర్శకమయ్యాయి. ప్రాథమిక విధులను రష్యా నుండి గ్రహించారు. అత్యవసర పరిస్థితులకు సంబంధించిన అంశాల రూపకల్పనకు జర్మనీ రాజ్యాంగాన్ని అనుసరించారు. రాజ్యాంగ సవరణ పద్ధతికి దక్షిణాఫ్రికా రాజ్యాంగాన్ని పాటించారు.
ఇంత వరకూ రాజ్యాంగంలో 124 సవరణలు జరిగాయి, ఇందుకు 103 రాజ్యాంగ సవరణ చట్టాలు అమలులోకి వచ్చాయి. 22 విభాగాలు, 395 అధికరణాలు రాజ్యాంగంలో ఉన్నాయి. రాజ్యాంగంలో తొలి సవరణకు 1951 జూన్ 18న రాష్టప్రతి ఆమోదం లభించింది.
అన్ని దేశాల్లో ఉన్నతమైన, విశిష్టమైన అంశాలతో రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచ లిఖిత రాజ్యాంగాల్లో పెద్దది. ప్రారంభంలో రాజ్యాంగ నిర్మాణ సభ చిహ్నం ఏనుగు. అదే మాదిరి భారత రాజ్యాంగం కూడా ఏనుగువలే విస్తృతమైనది, విశాలమైనది కూడా. ఆనాటి దేశ కాల రాజకీయ, సాంఘిక పరిస్థితులు పెద్ద పరిణామం ఉండే రాజ్యాంగ రూపకల్పనకు దారితీశాయి. భారతదేశంలోని విస్తృత సంస్కృతుల వారు, అనేక భాషలు మాట్లాడేవారు, విభిన్న మతాలు, కులాలకు చెందిన వారు ఉండటంతో అందరి మధ్య సమన్వయం సాధించడమై రాజ్యాంగ నిర్మాతల లక్ష్యం కావడంతో విస్తృతరూపంలో రాజ్యాంగాన్ని రూపొందించక తప్పలేదు. బ్రిటిష్ పాలనా కాలంలో అమలులో ఉన్న చట్టాల్లో 1935 చట్టాన్ని చేర్చడం వల్ల కొత్త రాజ్యాంగం విస్తృత రూపం దాల్చిందని చెప్పవచ్చు. కొత్త రాజ్యాంగంలో 1935 చట్టంలోని అనేక భాగాలు చేర్చడంపై అప్పట్లోనే తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. దానికి సమాధానంగా రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1935 చట్టం నుండి తీసుకున్న అంశాలు పాలనాపరమైనవి కనుక వాటిపై విచారించాల్సిన పనే్లదని చెప్పారు. సాధారణంగా పాలనా పరమైన అంశాలను రాజ్యాంగంలో పొందుపర్చడం జరగదు. పాలనా వివరాలు ఆచరణలో అదృఢతరంగా ఉండటం చాలా మంచిది. రాజ్యాంగ నిర్మాణ సమయంలో ప్రజల్లో సాంఘిక స్పృహ, రాజకీయ చైతన్యం తక్కువ స్థాయిలో ఉండటం వల్ల గత రాజ్యాంగ సంప్రదాయాలు లేకపోవడం వల్ల పాలనాపద్ధతులను కూడా వివరంగా పేర్కొనాల్సి వచ్చిందనే చెప్పాలి. ప్రజాస్వామిక వ్యవస్థలో అనుభవం లేని దేశంలో పాలనా పద్ధతులను తమ ఇష్టానుసారం శాసనసభలు రూపొందించుకోకుండా ఉండటానికే పాలనా పద్ధతులను ముందు చూపుతో రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో చేర్చారు.
రాజ్యాంగ ప్రవేశిక భారతదేశ సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగా పేర్కొంది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక సామ్యవాద అనే మాటలు చేర్చారు. అంటే ప్రస్తుతం మన దేశం సర్వ సత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా చెప్పవచ్చు. సర్వసత్తాక అనడంలోనే మన దేశం మీద ఏ ఇతర రాజ్యానికి సంబంధించిన ఎటువంటి అధికారం లేదని అర్థం. ఇతర దేశాలతో సాధారణంగా ఉండే సంబంధ బాంధవ్యాల వల్ల మన దేశ సర్వస్వామ్యానికి కష్టం కలుగుతుందని ముందే ఊహించనక్కర్లేదు. రాజ్యాధికారం రాజు చేతిలో లేని రాజ్యం కనుక మనది ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం. పరిమిత కాలం పాటు రాజ్యాన్ని పాలించే పాలకులను ప్రజలు నేరుగా ఎన్నుకునే దేశం మనది. పాలకులను ప్రజలు తొలగించదలచుకుంటే శాంతియుతంగా ఎన్నికల పద్ధతిలో వారిని తొలగించి కొత్త వారిని ఎన్నుకుంటారు. పాలకుల చర్యలను స్వేచ్ఛగా విమర్శించే హక్కు ప్రజలకుంది. ప్రాథమిక హక్కుల ద్వారా వ్యక్తి వికాసానికి, సంఘ శ్రేయస్సుకు అవసరమయ్యే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు ప్రజలకు ఇచ్చారు.
అమెరికా అధ్యక్ష పద్ధతిని, స్విట్జర్లాండ్‌లోని కాలేజీయేట్ ప్రభుత్వ పద్ధతిని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత రాజ్యాంగ నిర్మాతలు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పార్లమెంటరీ ప్రభుత్వ పద్ధతులను ఏర్పాటు చేశారు. పార్లమెంటరీ ప్రభుత్వ ఏర్పాటుకు మరో కారణం 1919 నుండి కొంత వరకూ, 1935 తర్వాత చాలా వరకూ పార్లమెంటరీ పద్ధతిలోనే దేశ పాలన సాగడంతో ఆ విధానానికే పాలకులు, ప్రజలు అనుభవం పొంది ఉండటం మరో కారణం. అధికార నిర్వహణలో రాష్టప్రతికి సలహా ఇవ్వడానికి సహాయ పడటానికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉండే మంత్రివర్గం అందుబాటులో ఉంటుంది. మంత్రివర్గం లేకుండా మంత్రివర్గం సలహా లేకుండా రాష్టప్రతి ఏ పనీ చేయలేరు. ఒక వేళ చేస్తే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. మంత్రివర్గం పార్లమెంటుకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. లోక్‌సభలో అధిక సంఖ్యా బలం ఉన్న పక్షానికి నాయకుడే ప్రధానమంత్రి అవుతారు. మంత్రులను తన పక్షం నుండి ప్రధానమంత్రి నియమిస్తారు. అధిక సంఖ్యాబలం ఉన్నంత వరకే ప్రధానమంత్రి, ఇతర మంత్రులు అధికారంలో కొనసాగగలుగుతారు.

-బీవీ ప్రసాద్ 99633 45056