మెయన్ ఫీచర్

ఇలా అయితే.. ‘బంగారు తెలంగాణ’ ఎలా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రినిటాడ్ దేశపు పార్లమెంటు సభ్యుడు శంభునాథ కపిల్‌దేవ్ ఓసారి భారతదేశ పర్యటనకు వచ్చాడు. వాళ్ల దేశంలో హిందువులకు ఎన్నో సమస్యలు ఉండేవి. ముఖ్యంగా ట్రినిటాడ్‌లో షోడశ కర్మలు చేసుకోవాలన్నా అక్కడి హిందువులకు చర్చి మాత్రమే దిక్కవుతుందని శంభునాథ బాధపడి దానికి పరిష్కారం కోసం ఆనాటి ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్‌గా వున్న గురూజీని కలుసుకోవాలనుకొన్నాడు. అపుడు యం.యస్.గోల్వాల్కర్ (గురూజీ) బెల్గాంలో వుంటే అక్కడికి వెళ్లాడు. ఆ రోజు గురూజీ ఓ సార్వజనికోత్సవంలో పాల్గొనాల్సి వుంది. శంభునాథ కపిల్‌దేవ్‌ని కూడా అందులోకి రమ్మని ఆహ్వానించారు. శంభునాథ తన దేశంలోని హిందువుల పరిస్థితిని వివరించాడు. అంత పెద్ద కార్యక్రమంలో ఆరెస్సెస్ కార్యకర్తల క్రమశిక్షణ, విన్యాసాలు చూసి ఆయన ఎంతగానో ఆశ్చర్యపోయాడు.
ఆర్‌ఎస్‌ఎస్ సంస్థకు అధిపతిగా ఉండి కూడా ఎలాంటి భద్రతా వలయం లేకుండా గురూజీ సాధారణంగా ఉండడం ఆయనకు నచ్చలేదు. ‘గురూజీ.. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది’ అంటూ అప్పుడెప్పుడో జరిగిన అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యను ప్రస్తావించాడు. అందుకు గురూజీ- ‘కెనడీ భద్రతా వ్యవస్థలో ఏ లోపం లేకపోయినా అతని జీవితకాలం ముగిసింది కదా! ప్రపంచ పరిస్థితుల సంతులనం కోసం రష్యా దురాక్రమణ ప్రవృత్తిని అణచడం, అమెరికాలో నల్ల,తెల్లవారి మధ్య సమన్వయం నిర్మాణం చేయడం ఈ రెండు పనులూ పరమేశ్వరుడు ఆయనకు అప్పగించాడు. అవి గొప్పగా చేశాడు. ఇకముందు ఏ సంఘర్షణ జరిగినా ఆయనకు అపకీర్తి జరుగవచ్చు. ఆ అపకీర్తి కలుగవద్దని భగవంతుడు ఆయనను తీసుకెళ్లాడు’’ అని అన్నారు. ఈ తర్కం శంభునాథ్ కపిల్‌దేవ్‌కు బాగా నచ్చింది.
నిజమే..! కొందరు కొన్ని పనులు చేసేందుకే జన్మిస్తారు. ఇపుడు తెరాస పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన ప్రాంత ప్రజల పోరాట అస్తిత్వం కోసమే జన్మించాడని అనుకుందాం. అయితే తెలంగాణ రాష్ట్రం రాగానే అధికారం వేరొకరికి అప్పగించి, తాను సాక్షీభూతంగా ఉంటే జాన్ ఎఫ్ కెనడీలా చిరస్థాయిగా కీర్తి పొందేవాడేమో! బహుశా.. ఉద్యమ నాయకుడిగా అలాంటి త్యాగబుద్ధి ఆయనకూ ఉండి ఉండవచ్చు. అందుకే ‘తెలంగాణకు తొలి దళిత ముఖ్యమంత్రి’ ఉండాలని అన్నాడు. మొత్తానికి అందరినీ కలుపుకొనివచ్చి తెలంగాణకు నాయకుడయ్యాడు. ‘దాచి దాచి దయ్యాల పాలు చేయడమెందుకు?’ అనుకున్నాడో, ఉద్యమాలు, విప్లవాలు జరిగినపుడు ప్రజల్లో క్రమశిక్షణ లోపిస్తుందని అనుకున్నాడో తానే ముఖ్యమంత్రి అయ్యాడు. తెలంగాణ అస్తిత్వాన్ని భుజాలపై వేసుకొన్నందున మొదటి దఫాలో ప్రజల్లో ఆయనపై ఎనలేని గౌరవం కలిగింది. కేసీఆర్ ఏదిచేసినా ‘సై’ అన్నట్లు ప్రజలూ సంబరపడ్డారు. అప్పటికే ఉ ద్యమ పార్టీని ‘్ఫక్తు’ రాజకీయ పార్టీగా మారుస్తున్నానని అన్నాడు. తెలంగాణ పు నర్నిర్మాణం కోసం అన్ని పా ర్టీల వాళ్లను ప్రభుత్వంలోకి తీసుకున్నా ప్రజలు పట్టించుకోలేదు. కొందరు నేతలు మంత్రులు అయ్యారు. ధనిక రాష్ట్రం అంటూ చేతికి ఎముక లేకుండా దానధర్మాలు చేయడం, బోనాలు, బతుకమ్మ నిర్వహణ, యాదాద్రి నిర్మాణం, చండీయాగాలు, కుల భవనాలు, హద్దులు మీరిన సంక్షేమ పథకాలు, మైనారిటీ సంతుష్టీకరణ.. వంటివి చేసినా- ఇవన్నీ ప్రజలు తెలంగాణ అభివృద్ధే అనుకున్నారు.
2018లో శాసనసభ ఎన్నికలకు వెళ్లేనాటికి కేసీఆర్ ‘తెలంగాణ జాతిపిత’ అన్నంతగా ఎదిగిపోయారు. రెండవసారి ఎన్నికలు వచ్చి గెలిచేసరికి ఇవన్నీ తలకిందులయ్యాయి. కేసీఆర్‌పై ఎక్కడో అసంతృప్త వాతావరణం మొదలయ్యింది. ఉద్యమంలో వాడుకొన్న వాళ్లలో చాలామందిని వాడుకొని వదిలేశాడన్న అపప్రధను మూటగట్టుకున్నాడు. నిజానికి బాల్క సుమన్, రసమయి, ఘంటా చక్రపాణి, అల్లం నారాయణ, దేవీప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, దేశపతి శ్రీనివాస్, దేవులపల్లి ప్రభాకర్‌రావు, నందిని సిధారెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య.. వంటివాళ్లకు పదవులు దక్కింది ‘ఉద్యమ కోటా’లోనే. కానీ కాసోజు శంకరమ్మ, కోదండరాం వంటి వాళ్లు బయట కన్పించేసరికి కేసీఆర్ తన చుట్టూ పెట్టుకున్న ఆ ‘అయిదుగురే’ కన్పిస్తున్నారు. ఇపుడు ఆర్థిక మాంద్యమో, ఇంకే కారణమో తెలియదు కానీ- రెండవ దఫా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాక కేసీఆర్ కఠినాత్ముడయ్యాడు.
ఉద్యోగస్తులను పూచిక పుల్లల్లా తీసిపారేయడం ఇపుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఉద్యమం నడుస్తున్న కాలంలో తెలుగుదేశం, కాంగ్రెస్ అధికారంలో వున్నపుడు (ఇపుడు టీఆర్‌ఎస్‌లో ఉన్న) పెద్ద నాయకులంతా ఆ రెండు పార్టీల్లో వుండి ఉద్యమాన్ని అణచివేస్తుంటే ఆనాడు ఉద్యోగస్తులే కేసీఆర్‌కు అండగా నిలబడ్డారు. మరి ఈ రోజు ఉద్యోగులను కేసీఆర్ చులకన భావంతో తీసిపారేస్తున్నా సంఘ నాయకులంతా మన్నుతిన్న పాముల్లా ఉంటున్నారన్నది క్రింది స్థాయిలో జరుగుతున్న చర్చ. ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తర్వాత కేసీఆర్ మరింతగా అపఖ్యాతి పాలు అయ్యాడన్నది నిజం. ఎందుకంటే కేసీఆర్ లాంటి వ్యక్తి మొదటనే కార్మికులను పిలిచి ఒక్కమాట చెబితే వాళ్లేం వినకుండా బెట్టుచేసేవాళ్లు కారు. ఇపుడు జరగాల్సినదంతా జరిగిపోయింది. మామూలు ప్రజలకు- ‘కేసీఆర్‌ను రోజూ కలవాల్సిన’ అవసరం లేదు. కానీ ఇపుడు కేసీఆర్ ‘ఎవరినీ కలవడు’ అనే మాట జనాల్లో వినిపిస్తుంది. అలాగే ఎవ రూ అడగకున్నా అడ్డగోలుగా జిల్లాలను విభజించ డం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ప్రజలు తిట్టిపోస్తున్నారు. ప్రజలు ఏదైనా జిల్లా కేంద్రానికి వస్తుంటేనే కదా ఆర్థిక స్థితి ఆ కేంద్రానికి మెరుగుపడేది. ఇపుడు కూతవేటు దూరంలో జిల్లాలు అయ్యేసరికి కలెక్టర్ల పరిస్థితి ‘ఆర్డీవోకు తక్కువ, ఎమ్మార్వోకు ఎక్కువ’ అన్నట్లు అయింది. రెండు జిల్లాలు చేయాల్సిన వాటిని కూడా నాలుగు జిల్లాలుగా విభజన చేయడం అశాస్ర్తియం. ఏ జిల్లాలోనూ సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి జరగడం లేదు. మిషన్ భగీరథ వల్ల ఎక్కడి రోడ్లు అక్కడ నాశనం అయ్యాయి. నిధులు లేవంటూ ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు. పాలమూరును విభజించగా నదులు జోగులాంబ జిల్లాకు, అడవులు నాగర్‌కర్నూలు జిల్లాకు, పరిశ్రమలు రంగారెడ్డి జిల్లాకు వెళ్లి ఇపుడు శతాబ్దాల చరిత్ర వున్న పాలమూరు అస్థిపంజరం అయ్యింది. సంపన్నంగా వున్న రంగారెడ్డి జిల్లాను అర్బన్ మొత్తం రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలుగా చేసి వికారాబాద్‌ను అనాథగా మార్చారు. జిల్లాకు ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా వికారాబాద్‌కు లేదు. ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే.
అలాగే ఇపుడు కలకత్తా నగరంలో వలే ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌లో కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ నగరం నడిబొడ్డున కట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు. ఓ వైపు డబ్బులు దేనికీ లేవంటూనే వాటికి ఖర్చుపెట్టడం దండగ అని ప్రజలు ఆలోచిస్తున్నారు. నిజానికి వాటిని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)కు బయట మొయినాబాద్ పక్కనో, శంషాబాద్ పక్కనో భారీ నిర్మాణాలు చేపడితే ఆ చుట్టుప్రక్కల 50 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం వుంది. అలాగే ఓఆర్‌ఆర్ చుట్టూ మెట్రోరైల్ వస్తే రవాణాకు ఇబ్బంది ఉండదు. వాయు కాలుష్యం, ట్రాఫిక్ నుండి ప్రజలను బయటపడేసిన వాళ్లవుతారు. ఇప్పటికే శామీర్‌పేట వైపు, రామోజీ ఫిల్మ్ సిటీ వైపు చాలా అభివృద్ధి జరిగింది. పాలమూరు, వికారాబాద్‌కు జిల్లాల విభజనలో చేసిన అన్యాయం నుంచి ప్రజలకు ఉపశమనం దక్కడమే గాక, కొత్తగా అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుంది. హ ద్దులు మీరిన సంక్షేమ పథకాలను కొంతైనా తగ్గిస్తే, కేసీఆర్ అనుకొన్న బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. జి ల్లాల విభజన లాగే ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ యుద్ధం చేస్తున్నట్లు బయట ‘సిన్మా’ కన్పిస్తుంది. మనం బయటివారితో యుద్ధం చేస్తే ప్రజలకు సంతోషం కలుగుతుంది. మనపై మనమే యుద్ధం చేస్తే వికటిస్తుంది. కేసీఆర్ కన్నతండ్రిలా ఆలోచించడమే తెలంగాణ ప్రజల ఆకాంక్ష.

-శ్రీకౌస్త్భు