మెయన్ ఫీచర్

‘కాషాయం’ కరుగుతోందా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ స్థాయిలో చూస్తే భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. వరసగా రెండుసార్లు (2014, 2019) లోక్‌సభ ఎన్నికల్లో సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థాయిలో ప్రజా మోదం పొందింది. సంఖ్యా బలాన్ని గణనీయంగా పెంచుకుంది.ఒకప్పుడు కేవలం రెండు స్థానాలకు పరిమితమైన ఆ పార్టీ ఇప్పడు 303 స్థానాలకు చేరుకుంది. జాతీయ స్థాయిలో ఇలా ఎదురన్నదే లేకుండా సాగిపోతున్న బీజేపీ నాయకత్వానికి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఎదురవుతున్న పరాభవాలు మింగుడు పడడం లేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే కాషాయం పార్టీ పలు శాసనసభ ఎన్నికల్లో అదే స్థాయిలో ఫలితాలు సాధించ లేక పోతోంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న రాష్ట్రాలలో తిరిగి అధికారం నిలుపుకోవడం కోసం తంటాలు పడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. మరి కొన్ని సందర్భాల్లో ‘తప్పక’ తప్పటడుగులు వేస్తోందనే అభిప్రాయం, ఆందోళన పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. ఎందుకిలా జరుగుతోంది? లోపం ఎక్కడుంది..?
అయితే, ఇదేమీ చిక్కుప్రశ్న కాదు. ‘జాతీయ స్థాయిలో సిద్ధాంత పరంగా గానీ, సంస్థాగతంగా గానీ, బీజేపీకి సమఉజ్జీగా నిలవగల ప్రత్యామ్నాయ పార్టీ ఏదీ లేదు. కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోల్పోయింది. కమ్యూనిస్టు పార్టీలు అంతకు ముందే సైద్ధాంతిక పిడివాదం, దివాలాకోరు రాజకీయాలు, చారిత్రక తప్పిదాల భారానికి కుంగి కనుమరుగై పోయాయి. మరోవంక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమఉజ్జీగా నిలిచే నాయకుడు మరొకరు లేరు. రాహుల్ గాంధీ పలాయనం తర్వాత కాంగ్రెస్ పరిస్థితి మరింత అగమ్య గోచరంగా మారిపోయింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పేరుకు ప్రధాన ప్రతిపక్షం అయినా, చాలా రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో ప్రాతినిధ్యమే లేదు. ప్రాధాన ప్రతిపక్షంగా గుర్తింపు లేదు. ఈ అన్నిటినీ మించి నాయకత్వ లోపం కారణంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయం కాలేక పోయింది. ప్రాంతీయ పార్టీల మధ్య సంయోధ్య లేక పోవడంతో గత లోక్ సభ ఎన్నికల ముందు మమతా బెనర్జీ, కేసీఆర్, చంద్రబాబు ఇత్యాదులు తెరపైకి తెచ్చిన ఫ్రంట్లు, టెంట్లు కార్యరూపం దాల్చలేదు. వారు ప్రజల విశ్వాస పొందలేదు. ప్రత్యర్ధుల బలహీనతే బీజేపీ ప్రధాన బలం అని కొందరు విశే్లషిస్తున్నారు.
ఇందులో కొంత నిజం ఉన్నా అదే సంపూర్ణ సత్యం కాదు. నిజానికి బీజేపీలో వ్యక్తులకు అంతగా ప్రాధాన్యత ఉండదని అంటారు. అది నిజమా? అంటే అన్ని సందర్భాల్లోనూ నిజం కాకపోవచ్చును. మోదీ వ్యక్తిగత చరిష్మా కారణంగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రయోజనం పొందుతోంది. ఇది కాదనలేని నిజం. చాలావరకు రాష్ట్రాలలో భాజపా పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. స్థానిక నాయకత్వ లోపంతో పాటుగా, ప్రాతీయ పార్టీల ప్రభావం కారణంగా బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేక పోతోందనే అభిప్రాయం వినవస్తోంది. కారణాలు ఏవైనా బీజేపీ జాతీయ ఇమేజ్‌కి, రాష్ట్రాలలో పార్టీ పరిస్థితికి మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు అనేక రాష్టాలలో పార్టీ పరిస్థితి అద్దం పడుతోంది.
తెలంగాణ విషయానే్న తీసుకుంటే రాష్ట్ర శాసన సభకు 2018 లో జరిగిన ఎన్నికల్లో బీజీపీ అతి కష్టం మీద ఒక్క సీటు గెలుచుకుంది. నాలుగు సిట్టింగ్ స్థానాల్లో ఓడిపోయింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి సహా ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో నలుగురు ఓడిపోయారు. గోషామహల్ స్థానం నుంచి రాజాసింగ్ ఒక్కరు మాత్రమే తిరిగి ఎన్నికయ్యారు. అదే కమలం పార్టీ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా నాలుగు స్థానాల్లో జెండా ఎగరేసింది. అందులోనూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఇద్దరు, (కరీంనగర్ నుంచి బండి సంజయ్, సికింద్రాబాద్ నుంచి జి. కిషన్ రెడ్డి) లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. సీట్లే కాదు ఓట్ల శాతం చూసినా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి పోలైన ఓట్ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అసెంబ్లీ ఎన్నికలో బీజేపీకి కేవలం 6.98 శాతం ఓట్లు పోలయితే అదే లోక్ సభకు వచ్చే సరికి కమల దళం ఓటింగ్ బలం 12.52 శాతం పెరిగి 19.5 శాతానికి చేరింది. ఇటీవల హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ చతికిల పడింది. పార్టీకి కేవలం 1.31 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలకు మధ్య కొంత వ్యత్యాసం ఉండడం సహజం. గతంలో అలా జరిగిన సందర్భాలు లేక పోలేదు. నిజానికి తెలంగాణలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల మధ్య అన్ని పార్టీల జాతకాలు మారిపోయాయి. తెరాస ‘కారు- పదహారు’ కల నిజం కాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి,ఆ తర్వాత జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వంటి పరిణామాల నేపధ్యంలో కాంగ్రెస్ అనూహ్యంగా మూడు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. సొంత అసెంబ్లీ నియోజక వర్గం కొడంగల్‌లో ఓడిన రేవంత్ రెడ్డి మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి గెలిచారు. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కంటే లోక్ సభ ఎన్నికల్లో ‘ఉత్తమ’ ఫలితాలు సాధించింది. హుజురాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటులో ఓడిపోయింది. లోక్‌సభకు ఎన్నికైన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన కారణంగా ఉప ఎన్నిక జరిగిన నియోజక వర్గంలో అయన సతీమణి పద్మావతి ఓడిపోయారు.
కాంగ్రెస్ కథ అలా ఉంచి, బీజేపీ విషయానికి వస్తే ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు, చాలా వరకు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు, లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు మధ్య పొంతన కుదరడం లేదు. వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ విషయానే్న తీసుకుంటే, 2016లో జరిగిన రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో బీజీపీ మూడంటే మూడు స్థానాల్లో గెలిచింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 18 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఓట్ల శాతం కూడా గణనీయంగా పెరిగింది. ఇలా అసెంబ్లీ, లోక సభ ఎన్నికల ఫలితాల మధ్య వచ్చిన వ్యత్యాసంతో అందరి అంచనాలు తల్లకిందు లయ్యాయి. మరో సంవత్సర కాలంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి గట్టి షాక్ తప్పదన్న ఉహాగానాలు వినివచ్చాయి. అయితే, ఇటీవల మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలో బీజేపీ సిట్టింగ్ స్థానం కూడా తృణమూల్ ఎగరేసుకు పోయింది. ఈ ఫలితాలను గమనిస్తే, లోక్ సభ ఎన్నికల్లో జాతీయ కోణంలో ఆలోచించి, బీజేపీకి జై కొడుతున్న ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రాంతీయ కోణంలో అలోచిస్తున్నారేమో అనిపిస్తుంది.
ఓటర్లు అలా ఆలోచించడం వల్లనే కావచ్చును 2014 ఎన్నికల్లో కంటే 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సొంత బలం గణనీయంగా పెరిగింది. మోదీ సారథ్యంలో జరిగిన తొలి (2014 ) ఎన్నికల్లో 282 సీట్లు సొంతగా గెలుచుకున్న బీజేపీ, 2019లో ఏకంగా 303 స్థానాల్లో విజయం సాధించింది. కొన్ని మినహాయింపులు ఉన్నా, చాలావరకు రాష్ట్రాలలో అధికారాన్ని నిలుపుకోవడానికి భాజపా చాలా చాలా అగచాట్లు పడవలసి వస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ‘సెమీ ఫైనల్స్’ గా పేర్కొన్న మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అయితే ఏకంగా ఓటమి చవి చూడక తప్ప లేదు. మళ్ళీ అదే రాష్ట్రాల్లో కొద్ది నెలల తేడాతో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజీపీ టోటల్ గా స్వీప్ చేసింది. మధ్య ప్రదేశ్‌లో 29 సీట్లకు 28 సీట్లలో కమల దళం విజయ సాధించింది. రాజస్థాన్‌లో 25కు 24 స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఛత్తీస్‌గఢ్‌లో 11కు 9 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కర్ణాటకలోనూ అంతే, బీజేపీ మెజారిటీ స్థానాలను సొంతం చేసుకుంది.
ఈ పరిణామాలను పరిశీలిస్తే, బీజేపీ కంటే మోదీ ఇమేజ్ పెరుగుతున్న వైనం స్పష్టమవుతోంది. లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపించిన మోదీబ్రాండ్ ఇమేజ్ అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా పనిచేయడం లేదు. ఎందుకలా? బీజేపీ ఎందుకిలా రాష్ట్రాల్లో ఎదగలేక పోతోంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలంటే ‘బీజీపీ బ్రాండ్ ఇమేజ్’ స్థానంలో మోదీ బ్రాండ్ ఇమేజ్ ఓవర్ ల్యాపయి, పార్టీ ఇమేజ్ కనిపించకుండా పోతోందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్త పరుస్తున్నారు. పార్టీ ఇమేజ్ కంటే ప్రధాని ఇమేజ్ ఎక్కువగా ఫోకస్ అవుతోంది. ప్రధాని చరిష్మా లోక్ సభ ఎన్నికల్లో పనిచేసినంతగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపడం లేదు. ఈ పరిణామం పార్టీకి మంచిదా? కాదా?? అంటే విభిన్న అభిప్రాయాలను వ్యక్త మవుతున్నాయి.
ఒకటొకటిగా రాష్ట్రాలు బీజేపీ చేతుల్లోంచి జారిపోవడాన్ని ఆందోళన కలిగించే అంశంగానే పరిగణించవలసి ఉంటుంది. లోక్ సభ ఎన్నికలకు ముందు మూడు ప్రధాన రాష్ట్రాలలో అధికారం కోల్పోయిన కమల దళం లోక్ సభ ఎన్నికల అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన హర్యానాలో ఓడి గెలిచింది. దుష్యత్ చౌతాలా పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మహారాష్టల్రో గెలిచి ఓడింది. చిరకాల మిత్రపక్షం శివసేనతో కలిసి పోటీచేసి మెజారిటీ సాధించినా, శివసేన, ముఖ్యమంత్రి పీఠం కోసం పెట్టిన మడత పేచీతో అధికారం కోల్పోయింది. శివసేన సంకీర్ణ మిత్ర ధర్మానే్న కాదు, చివరకు సిద్ధాంతాలకు కూడా తిలోదకాలు ఇచ్చి, సోనియా కాంగ్రెస్- పవార్ కాంగ్రెస్‌లతో చేతులు కలిపింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రభుత్వం ఎంత కాలం మనుగడ సాగిస్తుంది? ఎప్పుడు కూలి పోతుంది? అనేది ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే, మరో కీలక రాష్ట్రం బీజేపీ చేజారిపోయింది. ఈశాన్య రాష్ట్రాలు, డిల్లీ, పుదుచ్చేరి వంటి కేంద్ర ప్రాంతాలను పక్కన పెట్టి, మిగిలిన 20 పెద్ద రాష్ట్రాలలో బీజేపీకి మిగిలింది ఆరు రాష్ట్రాలు మాత్రమే.
భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య ఇంచు మించుగా- 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న సంఖ్యకు దగ్గరవుతోంది. కర్ణాటకలో ఉపఎన్నికలు జరుగుతున్న 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో 8 స్థానాలు గెలుచుకుంటేనే ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం నిలబడుతుంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఝార్ఖండ్‌లో, మరో మూడు నాలుగు నెలలలో ఎన్నికలు జరిగే డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే గందరగోళం కొనసాగితే, బీజేపీ భవిష్యత్ జాతీయ స్థాయిలోనూ ప్రశ్నార్ధకంగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. కర్ణాటకలో కుమారస్వామి అల్పాయుష్షు సర్కారు బాటలో మహారాష్టల్రో ముక్కోణ సంకీర్ణ ప్రభుత్వం కాలం చేసినా, మహారాష్ట్ర అనుభవం నుంచి బీజేపీ గుణపాఠాలు నేర్చుకుని మిత్రపక్షాల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా, ఇంకా ఏదైనా జరిగినా, అయోధ్య రామమందిర నిర్మాణం వంటి సెంటిమెంటల్ ఇష్యూస్ కీలకంగా మారినా పరిస్థతి మరోలా ఉంటుంది. రాజకీయాలలో, క్రికెట్‌లో ఎప్పుడు ఏమి జరుగుతుందో.. ప్రజాభి ప్రాయం ఎటు మొగ్గు చూపుతుందో ఊహించలేము. ఇప్పుడు అలాంటి ఊహగానాలు చేయడం అంత మంచిది కాదు. జీవితంలో ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయని శివసేన అధినేత ఉద్దవ్ థాకరే ఏకంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చును.

-రాజనాల బాలకృష్ణ 99852 29722