మెయన్ ఫీచర్

భయం లేకనే నేతల బరితెగింపు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజల అభీష్టం మేరకు ఏర్పడాలి, సుపరిపాలన సాగించాలి. ప్రస్తుతం మహారాష్టల్రో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. భాజపా, శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీలు అధికారమే పరమావధిగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి. శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ఘోరంగా అవమానించారు. శివసేన పార్టీ అధినాయకుడు ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడి చివరికి- ‘ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన’ ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లను అధికారం పీఠం ఎక్కించారు. ఎన్నికలకు ముందు రాజకీయ ప్రత్యర్థులుగా తలపడినవారే ఇపుడు అధికారం కోసం ఆకస్మికంగా మిత్రులైపోయారు. ఇలా అనైతిక పద్ధతులకు పాల్పడుతున్న సమయంలో నాయకులు ఏ మాత్రం మందూ వెనకా ఆలోచించటం లేదు. ఎన్నికలకు ముందు భాజపా, శివసేన ఒక కూటమిగా, ఎన్‌సీపీ, కాంగ్రెస్ మరో కూటమిగా ఏర్పడి ఓటర్ల తీర్పు కోరాయి. ప్రజలు తమను ఎందుకు ఎన్నుకోవాలన్న విషయమై రెండు కూటములు ప్రచారంతో హోరెత్తించాయి. ప్రత్యర్థుల తప్పులను ప్రజల ముందు పెట్టి తీర్పు ఇవ్వాలంటూ అభ్యర్థించాయి. రెండు కూటములు చేసిన వాదనలను విన్న ప్రజలు భాజపా-శివసేన కూటమికి మెజారిటీ సీట్లు ఇచ్చారు. ఎన్‌సీపీ-కాంగ్రెస్ కూటమిని ప్రతిపక్షంలో కూర్చోపెడుతూ ఓటర్లు నిర్ణయం తీసుకున్నారు. ప్రజల తీర్పు ప్రకారం భాజపా-శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఎన్నికల్లో ఒకరినొకరు తిట్టుకున్న శివసేన,ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఇది ఓటర్ల తీర్పుకు వ్యతిరేకమే కాకుండా ప్రజలను మోసం చేయడంతో సమానం.
శివసేన అధినాయకత్వం కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం ఓటర్లకు వెన్నుపోటు పొడిచింది. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన పార్టీలకు శివసేన అధికారంలో భాగస్వామ్యం కల్పించింది. ప్రజల తీర్పును దుర్వినియోగం చేయడంలో శివసేనతో పాటు భాజపా సైతం బాధ్యత వహించకతప్పదు. శివసేన మాదిరిగానే భాజపా కూడా అధికారం కోసం ఎన్‌సీపీతో చేతులు కలపటం రాజకీయ వ్యభిచారమే. తమ పార్టీకి చెందిన 54 మంది శాసనసభ్యుల సంతకాలతో కూడిన మద్దతు లేఖతో వచ్చిన ఎన్‌సీపీ లేజిస్లేటివ్ పార్టీ నాయకుడు అజిత్ పవార్‌తో భాజపా అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చలు జరపడం, ఆ తరువాత అజిత్ పవార్ మద్దతు ఆధారంగా నాలుగు రోజుల ప్రభుత్వాన్ని భాజపా ఏర్పాటు చేయడం అవకాశవాదమే. భాజపా కేంద్ర నాయకత్వం ముఖ్యమంత్రి పదవి కోసం రాష్టప్రతి, గవర్నర్ వ్యవస్థలను కూడా భ్రష్టుపట్టించింది. కొంపలు ముంచుకుపోతున్నట్లు రాష్టప్రతిని అర్ధరాత్రి సమయంలో నిద్ర లేపి, రాష్టప్రతి పాలన తొలగింపు ఫైలుపై సంతకం చేయించడం, ఆ తరువాత మహారాష్ట్ర గవర్నర్‌తో ఉదయం ఎనిమిది గంటలకు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లచే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించటం అధికార దుర్వినియోగం కాదా? రా జ్యాంగాన్ని పవిత్ర గ్రం థంగా భావించేవారు ఇలా చేయవచ్చా?
శివసేన దూరం కావటంతో మెజారిటీ లేనందున తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని గవర్నర్‌కు మొ దట చెప్పిన మాటకు భాజపా కట్టుబడి ఉండాల్సింది. శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలిశాక, దొడ్డి దారిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి ఆ తరువాత నాలుగో రోజున రాజీనామా చేయించడం భాజపా నైతిక పతనానికి నిదర్శనం. విలువల గురించి మాట్లాడే భాజపా నేతలు అధికారం కోసం సిద్ధాంతాలను తుంగలోకి తొక్కటం సిగ్గు చేటు. ఎలాంటి పరిస్థితిలోనైనా సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటమే నిజాయితీ. అజిత్ పవార్‌తో చేతులు కలిపిన భాజపా తనను తాను అవమానించుకొని, రాజ్యాంగాన్ని అవహేళన చేసింది. మహారాష్టల్రో మొత్తానికి భాజపా, శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లు ప్రజలు ఇచ్చిన తీర్పుపట్ల ఏ మాత్రం గౌరవం పాటించలేదు. రాజకీయ వ్యవస్థను మరింతగా భ్రష్టుపట్టించిన ఘతన ఈ నాలుగు పార్టీలు దక్కించుకున్నాయి.
తాము ఏం చేసినా ప్రజలు పట్టించుకోరనే ధీమా వల్లనే రాజకీయ పార్టీలు ఓటర్ల తీర్పును అవమానిస్తున్నాయి. తమ తీర్పుకు భిన్నంగా వ్యవహరించే పార్టీలు, రాజకీయ నాయకులను ప్రజలు బహిరంగంగా నిలదీసినపుడే- అపవిత్ర రాజకీయ సమీకరణలకు తెర పడుతుంది. మహారాష్ట్ర పరిణామాలపై సామాజిక మాధ్యమాలలో కొంత వ్యతిరేకత కనిపించినా అది రాజకీయ నాయకులకు ఆందోళన కలిగించే స్థాయికి ఎదగలేదు. ప్రజాభిప్రాయం ఉప్పెనలా వచ్చినప్పుడే పార్టీలు, రాజకీయ నాయకులు భయపడతారు. ప్రజలు ఏం జరిగినా భరించే స్థితిలో పడిపోయినప్పుడే పార్టీలు, నాయకులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తారు. దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రజలను మభ్యపెట్టి తమ పబ్బం గడుపుకుంటోంది తప్ప, ఓటర్లకు ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవటం లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికల సమయంలో ప్రజలకు చేసే వాగ్దానాలను అమలు చేయటం లేదు. ఎన్నికల ప్రణాళికలు ఫార్స్‌గా మారాయి తప్ప ఆచరణ, అమలుకు నోచుకోవటం లేదు.
అధికారంలోకి వచ్చే ప్రతి రాజకీయ పార్టీ తమను తాము బ్రిటీష్ పాలకులుగా భావించుకుంటున్నాయి. ప్రజలను తమ సేవకులుగా చూస్తున్నాయి తప్ప తామే వారి సేవకులమనే వాస్తవాన్ని ఆంగీకరించటం లేదు. రాజకీయ పార్టీలు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. మహారాష్టల్రో ఇదే జరిగింది. తమ అభీష్టానికి భిన్నంగా వ్యవహరించే పార్టీలను దారికి తెచ్చేందుకు ప్రజలు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది. తాము ఏమి చేసినా చెల్లిపోతుంది, ప్రజలు పట్టించుకోరు.. అనే రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని మార్చవలసిన బాధ్యత పౌర సమాజంపై ఉంది. తమ తీర్పును ఉల్లంఘించే పార్టీలను ప్రజలు క్షమించరనే సందేశాన్ని పంపించటం ఎంతో అవసరం. నయవంచన చేసే పార్టీలను శిక్షించేందుకు ఓటర్లు తదుపరి ఎన్నికల వరకు వేచి చూడకూడదు. తమ తీర్పును ఉల్లంఘించిన పార్టీలను సామాజిక మాధ్యమాల ద్వారా శిక్షించే ప్రక్రియకు ఓటర్లు శ్రీకారం చుట్టాలి. సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున స్పందించటంతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులకు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పాలి.
తమ తీర్పును దుర్వినియోగం చేసే ప్రజాప్రతినిధులను స్థానికంగా వెలివేసే స్థాయికి ఓటర్లు ఎదగవలసిన అవసరం ఉన్నది. అటువంటి రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులపై కోర్టును ఆశ్రయించే అవకాశాలను కూడా ప్రజలు పరిశీలించాలి. ప్రజలు ఏమీ చేయలేరు.. ఓట్లు వేసి మరిచిపోతారు.. డబ్బు తీసుకుని ఓటు వేసే వారికి తాము జావాబుదారీ కాదనే అభిప్రాయంతో పని చేసే ప్రజాప్రతినిధులను దారికి తీసుకురాగలిగే శక్తి కేవలం ఓటర్లకు మాత్రమే ఉన్నది. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులకు రానురానూ ప్రజలంటే భయం లేకుండాపోయింది. ఎన్నికల సమయంలో తప్పుడు హామీలు, ఆచరణ యోగ్యం కానీ వరాలు ఇవ్వడం, డబ్బు వెదజల్లి ఓట్లు దండుకుని, ఆ తరువాత ఐదు సంవత్సరాల పాటు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. దీనికి చరమగీతం పాడవలసిన బాధ్యత ఓటర్లపై ఉన్నది. ఓటర్లంటే రాజకీయ పార్టీలు, నాయకులు భయపడే పరిస్థితులు రావాలి. అప్పుడే వారు ప్రజల అభీష్టం మేరకు నడుచుకుంటారు. ప్రజలకు భయపడే పరిస్థితులు ఉంటే కాంగ్రెస్, ఎన్‌సీపీలతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ధైర్యం శివసేన చేసేది కాదు. అజిత్‌పవార్‌తో చేతులు కలిపి భాజపా నాలుగు రోజుల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాదు. ప్రజలు కూడా ఓట్లు వేసి తమ బాధ్యత ముగిసిందనుకుంటున్నారే తప్ప- ఆ తరువాత జరిగే రాజకీయ పరిణామాలపై తమ నిరసన గళాన్ని వినిపించడం లేదు. రాజకీయ పార్టీలు తమ తీర్పును ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయో పరిశీలించాల్సిన బాధ్యత ఓటర్లదే. *