మెయన్ ఫీచర్

హాంక్‌కాంగ్‌లో జనాగ్రహం కొత్తపుంతలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వందల ఏళ్లుగా వలస ప్రాంతంగా ఉన్న హాంక్‌కాంగ్‌లో ఇపుడు స్వతంత్య్ర రాజ్యం కోసం ఉద్యమాలు రాజుకున్నాయి. గత పదేళ్లుగా క్రమం తప్పకుండా కొనసాగుతున్న ఈ ఉద్యమాలు కొత్త రూ పాన్ని సంతరించుకొన్నాయి. వేల ఏళ్ల చరిత్ర ఉన్న ప్రాంతం హాంక్‌కాంగ్. 156 ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో ఉన్న హాంక్‌కాంగ్ 1997 జూలై 1న చైనా అధీనంలోకి వెళ్లింది. హాంక్‌కాంగ్‌కు స్వయం ప్రతిపత్తి ఉన్నా, పూర్తిస్థాయి ప్రజాస్వామిక దేశంగా దీన్ని చైనా గుర్తించాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. ఉద్యమాల నేపథ్యంలో ఖైదీల అప్పగింత చట్టానికి చైనా సవరణలు చేయడంతో హెచ్చుమీరిన ఈ నిరసనలు స్వాతంత్య్ర పోరాటంగా మారాయి.
హాంక్‌కాంగ్‌కు చైనా నుండి విముక్తి కల్పించాలని, తమ రాజ్యాంగాన్ని కాపాడాలని అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. నిజానికి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించేవారెవరూ లేకపోయినా, సామాజిక మాధ్యమాల్లోని యాప్స్ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి. టెలిగ్రాం సహా పలు యాప్స్ ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నాయి. దీంతో లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసన గళం వినిపిస్తున్నారు. బ్రిటిష్ పాలనలో ఉన్న హాంక్‌కాంగ్‌ను చైనాకు అప్పగించినపుడు ఆ ప్రాంతంలో ప్రజాస్వామ్యం, సొంత న్యాయవ్యవస్థ ఉండేలా కొన్ని చట్టాలను బ్రిటన్ రూపొందించింది. వాటిని కాదని, స్వయం ప్రతిపత్తికి భిన్నంగా హాంక్‌కాంగ్‌లో నేరాలకు పాల్పడే వ్యక్తులను తమకు అప్పగించేలా, తమ కోర్టులు విచారించేలా కొత్తగా మరో బిల్లును చైనా తీసుకువచ్చింది. దీంతో తమ ప్రజాస్వామ్య హక్కులను, స్వేచ్ఛను చైనా హరించి వేస్తోందని హాంక్‌కాంగ్ వాసులు ఉద్యమబాట పట్టారు.
విపరీతమైన చైనా జోక్యాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యవాదులు ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ప్రపంచానికి ఆర్థిక ఆయువుపట్టు వంటి హాంక్‌కాంగ్‌లో ఉద్యమాలు ఆ నగరానికి ఉన్న చారిత్రక విశిష్టతను దెబ్బతీస్తున్నాయి. ఆందోళనలు శ్రుతి మించితే చూస్తూ ఊరుకోబోమని ఉద్యమకారులను చైనా హెచ్చరిస్తోంది. చైనాలో ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అవుతోందని, ఉద్యోగాలు పోతున్నాయని, పరిశ్రమలు మూతపడుతున్నాయని, ఆ దేశం తమతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలనుకుంటోందని వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో అడుగు ముందుకు వేసి, అంతకంటే ముందు హాంక్‌కాంగ్ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. దీంతో ప్రపంచం దృష్టిని మరోమారు హాంక్‌కాంగ్ ఉద్యమం ఆకర్షించింది. ఉద్యమాన్ని అణచివేసేందుకు చైనా ప్రభుత్వం చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కాగా, తిరిగి ఉద్యమం మరింత పుంజుకుంది. హాంక్‌కాంగ్‌లో నిరసనలకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు జరుగుతున్నాయి. అసలు హాంక్‌కాంగ్‌లో ఏం జరుగుతోంది?
ఐదేళ్ల క్రితమే 2014లో అక్కడి కళాకారులు, ఉద్యమకారులు ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కోసం ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమానికి చిహ్నంగా గొడుగును వినియోగించారు. గొడుగుతో అనేక కళాఖండాలు రూపొందించారు. గొడుగు ఆయుధంగా పాలకుల పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మిగతా చైనా నగరాలతో పోలిస్తే హాంక్‌కాంగ్ చాలా భిన్నమైన నగరం. హాంక్‌కాంగ్ అనేది ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ అధీనంలోని ప్రత్యేక పాలనా నగరం.
పీర్ల్ నది, సౌత్ సీ సంగమం వద్ద దక్షిణ చైనా సముద్రతీరంలో ఉన్న హాంక్‌కాంగ్ ప్రపంచంలోనే అతి పెద్ద వాణిజ్య నగరం. ఈ నగరంలో అత్యంత ఖరీదైన 1,223 ఆకాశ సౌధాలు, వెయ్యికి పైగా భవన సముదాయాలు, లోతైన ఓడరేవులున్నాయి. ప్రపంచంలో ఎతె్తైన వంద నివాస గృహాల్లో 36 ఇక్కడే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న నగరంగా కూడా ఖ్యాతి గడించింది. హాంక్‌కాంగ్ అనేది హక్కాగాంగ్ అనే పదం నుండి వచ్చింది. హక్కా అంటే సువాసన రేవు. ఇక్కడి అబర్దీన్ రేవు నుండి అగరబత్తి ఎగుమతులు జరిగేవి. 1842లో హాంక్‌కాంగ్ పేరు అధికారిక దస్తావేజుల్లోకి ఎక్కింది. అంతకు ముందు ఈ దీవులను ‘వాంగ్ తేయ్ తుంగ్’ , ‘త్రీ ఫాంతిస్ కోవ్’లుగా వ్యవహరించేవారు. క్రీస్తు పూర్వం 214లో చైనా మొదటి చక్రవర్తి ‘క్విన్ షి హంగ్’ జంగ్జీలో బయూ గిరిజనులను జయించి మొదటిసారి ఈ ప్రదేశాన్ని తన సామ్రాజ్యంలో విలీనం చేశాడు. టాంగ్ సామ్రాజ్యకాలంలోనూ ‘గాంగ్‌డాంగ్స్’ ప్రదేశం వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది. 1513లో పోర్చుగీసు నావికుడు జార్జి ఆల్వర్స్ కొత్త సరికొత్త భూభాగాన్ని వెతుకులాడుతున్న సమయంలో ఇక్కడకు వచ్చినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. 1889లో క్వింగ్ సామ్రాజ్య ఆధిపత్యం ఓపియం దిగుమతులను నిరాకరించిన కారణంగా చైనా, బ్రిటన్ మధ్య ఓపియం యుద్ధం సంభవించింది. 1841 జనవరి 20న బ్రిటన్ సైన్యం హాంక్‌కాంగ్‌ను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన యుద్ధ విరమణ ఒప్పందంలో భాగంగా బ్రిటన్ హాంక్‌కాంగ్‌పై ఆధిపత్యాన్ని వదులుకుంది. అయినా ఇరు వైపులా ఉన్న ఉన్నతోద్యోగుల వాదులాట కారణంగా ఆ ఒప్పందం అమలు కాలేదు. చివరికి 1842 ఆగస్టు 29న జరిగిన నాన్‌కింగ్ ఒప్పందం ఆధారంగా ఈ ద్వీపాన్ని బ్రిటన్‌కు శాశ్వతంగా అప్పగించారు. సహజంగా ఉన్న హాంక్‌కాంగ్ ద్వీపాన్ని స్వాధీన పరుచుకున్న తర్వాత కాలనీ సరిహద్దులను 1860లో క్రమంగా పెంచుకుంటూ కోలూన్ ద్వీపకల్పం వరకూ విస్తరించి 1868 నాటికి సరికొత్త భూభాగం ఏర్పాటైంది. 1941 డిసెంబర్ 8న జపాన్ హాంక్‌కాంగ్‌పై దండెత్తింది. డిసెంబర్ 25న ఈ నగరాన్ని జపాన్ స్వాధీనం చేసుకుంది. 1945లో దీన్ని తిరిగి బ్రిటన్ ప్రభుత్వం తన స్వాధీనంలోకి తీసుకుంది.
కాలగమనంలో హాంక్‌కాంగ్ చాలా రద్దీ ఉన్న రేవుపట్టణంగా మారింది. 1950లో దాని ఆర్థిక వ్యవస్థ బాగా ఊపందుకుని తయారీ రంగ కేంద్రంగా అవతరించింది. పేదరికం, పాలనలో అస్థిరత కారణంగా చాలా మంది చైనా ప్రధాన భూభాగం నుండి హాంక్‌కాంగ్‌కు పారిపోయారు. దేశంలో కమ్యూనిస్టుల కారణంగా హింస చెలరేగవచ్చనే భీతి కారణంగా ప్రజలు హాంక్‌కాంగ్‌కు వలస వెళ్లారు. లీజు గడువు దగ్గర పడటంతో 1980 దశకం ఆరంభంలో హాంక్‌కాంగ్ భవిష్యత్‌పై బ్రిటన్ , చైనాలు చర్చలు మొదలు పెట్టాయి. చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం మొత్తం హాంక్‌కాంగ్‌ను తమకు అప్పగించాలని వాదించింది. చివరికి ‘వన్ కంట్రీ- టూ సిస్టమ్స్’ సూత్రంతో హాంక్‌కాంగ్‌ను అప్పగించేందుకు బ్రిటన్ ముందుకు వచ్చింది.
1997లో హాంక్‌కాంగ్‌పై స్వాధీనత సాధించుకున్న చైనా ప్రభుత్వం ఆ నగరంపై పట్టు సాధించినా, తక్కువ జోక్యానికి మాత్రమే వీలు కలిగింది. ఆమోదయోగ్యమైన సంస్కరణలు అమలులో భాగంగా 2009 వరకూ ఇంగ్లాండ్ విద్యా విధానమే అక్కడ కొనసాగింది. ‘ఒకే దేశం రెండు వ్యవస్థలు’ అనే నిబంధనలను అనుసరించి చైనా రాజ్యాంగానికి హాంక్‌కాంగ్ రాజ్యాంగం విభిన్నంగా ఉంటుంది. ఇక్కడి స్వతంత్య్ర న్యాయవ్యవస్థ కామన్‌లా ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. విదేశీ వ్యవహారాలు, సైన్యం, రక్షణ మినహా మిగిలిన అన్ని రాజ్యాంగ వ్యవహారాల్లో హాంక్‌కాంగ్ ప్రభుత్వానికి స్వతంత్రమైన విశేష అధికారాలున్నాయి. చట్టం, పన్ను విధింపు, స్వంతంత్య్ర వాణిజ్యం, ద్రవ్య వ్యవహారాల ప్రత్యేకతలతో కూడిన ప్రధాన పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఉన్న అంతర్జాతీయ ఆర్ధిక కేంద్రంగా ఈ నగరం విలసిల్లుతోంది. హాంక్‌కాంగ్ డాలర్ ప్రపంచంలో క్రయవిక్రయాలు జరుగుతున్న ద్రవ్యరూప వ్యాపారంలో ఎనిమిదో స్థానంలో ఉంది. భూమి కొరత కారణంగా అతి సమీపంలో బహుళ అంతస్థుల నిర్మాణాలు జరగడం వల్ల వరుసగా ఆకాశమే హద్దుగా ఉన్న ఎతె్తైన భవనాలతో కూడి ఉంటుంది. జనసాంద్రత వల్ల ప్రైవేటు రవాణా చాలా ఖరీదైన వ్యవహారం కావడంతో ప్రభుత్వ రవాణాకు రద్దీ పెరిగింది. ఇలా అనేక విషయాల్లో ఇది అంతర్జాతీయంగా చాలా ప్రాముఖ్యతలున్న నగరం. ఆర్థిక స్వాతంత్య్రం, ద్రవ్య ఆర్థిక పోటీ, జీవన నాణ్యత, అవినీతిపై అవగాహన, మానవ వనరుల అభివృద్ధిలో హాంక్‌కాంగ్‌కు ప్రత్యేకత ఉంది. అన్ని దేశాల కంటే ఈ నగర వాసుల జీవనకాలం అధికమని ప్రపంచంలో అనేక అధ్యయనాలు తేల్చాయి.
అయితే చైనా ప్రధాన భూభాగంలోని ప్రజలకు ఉన్న ప్రజాస్వామిక హక్కులు కంటే హాంక్‌కాంగ్‌లో ప్రజలే ఎక్కువ స్వేచ్ఛను అనుభవిస్తున్నారని చెప్పాలి. ఈ క్రమంలోనే హాంక్‌కాంగ్‌లో పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఇక్కడి లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో అనేక స్థానాలకు చైనా ప్రభుత్వ అనుకూల వర్గీయులే నామినేట్ అవుతూ వస్తున్నారు. ప్రమాణ సమయంలో ‘ఇది చైనా కాదు..’ అంటూ నిరసన తెలిపిన వారిని లెజిస్లేటివ్ కౌన్సిల్ నుండి తొలగించి తమ ఆధిక్యతను చైనా ప్రదర్శించుకుంటోంది. అలా చిన్నగా మొదలైన వివాదాలు నేడు స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరులు ఊదాయి. చైనా ప్రభుత్వం ప్రతిపాదిత కమిటీ రూపొందించిన ఓటర్ల జాబితాలోని వారికే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలనడం ఉద్యమాలను మరింత రగిల్చాయి. చైనా ఒక అడుగు వెనక్కు తగ్గినట్టు కనిపిస్తున్నా ఉద్యమాలు మాత్రం ఆగేలా లేవు.

-బీవీ ప్రసాద్ 99633 45056