మెయన్ ఫీచర్

ఉరిశిక్ష అమలుకు ‘క్షమాభిక్ష’ అడ్డంకి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జస్టిస్ ఫర్ దిశ’ నినాదంతో ఇపుడు దేశం యావ త్తూ ఉద్యమిస్తోంది. అత్యాచారం కేసుల్లో దోషులకు ఉరిశిక్ష ప్రకటిస్తూ కోర్టులు తీర్పులు ఇచ్చినా అమలుకాని పరిస్థితులు నెలకొన్నాయి. గత 19 ఏళ్లలో కేవలం నలుగురికి మాత్రమే మన దేశంలో మరణశిక్షను అమలు చేశారు. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన ధనుంజయ్ ఛటర్జీని అలీపూర్ (పశ్చిమ బెంగాల్) జైలులో 2004 ఆగస్టు 14న ఉరి తీశారు. అప్పటికే దోషి 14 ఏళ్లు జైలులో ఉన్నాడు. ఇక, ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి 2012 నవంబర్ 21న పాక్ తీవ్రవాది కసబ్‌ను, 2013 ఫిబ్రవరి 9న పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురును, 2015 జూలై 30న ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడు యాకూబ్ మెమోన్‌ను ఉరితీశారు. ఘోరమైన నేరాలకు పాల్పడిన ఈ దోషులకు శిక్ష తగ్గిస్తే ప్రజలు క్షమించరనే భయంతో వీరిని ఉరితీశారు. లేకుంటే క్షమాభిక్ష పెట్టేందుకు మన రాజకీయ వ్యవస్థ ఏ మాత్రం వెనుకంజ వేయదనే విమర్శలున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ కేసుల్లో మరణశిక్ష ఖరారైన 426 మంది దోషులు- ‘రాష్టప్రతి క్షమాభిక్ష పెడితే జీవితాంతం జైలులో గడిపేయవచ్చున’ని ఎదురు చూస్తున్నారు. మరణశిక్ష పడిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించే అధికారం రాష్టప్రతికి 72వ అధికరణ కల్పించింది. అప్పటి రాష్టప్రతి ప్రతిభాపాటిల్ 2012లో ఉదారంగా క్షమాభిక్షలు ఇచ్చారు. ఆనాటి యూపీఏ ప్రభుత్వం సిఫార్సుపై 35 మంది కరడుగట్టిన నేరగాళ్లకు మరణశిక్షను తప్పించారు. బందూ బాబూరావు టిడ్కే అనే నేరగాడు 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు రుజువైనా చివరికి క్షమాభిక్షను ప్రసాదించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేట బస్సు దహనం కేసు గురించి అందరికీ తెలిసిందే. బస్సుకు నిప్పంటించగా 23 మంది ప్రయాణీకులు అగ్నికి ఆహుతి కాగా, ఈ ఘాతుకానికి పాల్పడిన విష్ణువర్థన్ రావు, చలపతిరావుకు గుం టూరు జిల్లాకోర్టు మరణిశిక్ష విధించగా, సుప్రీం కోర్టు ఆ తీర్పును ఆమోదించింది. ఆనాటి రాష్టప్రతి నారాయణ్ వీరికి క్షమాభిక్ష ప్రసాదించారు. వీరిద్దరూ ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నారు. పెరోల్ ఇస్తే ఇంటికి వెళ్లి బంధుమిత్రులతో గడిపి వస్తామని వీరు పెట్టుకున్న దరఖాస్తును ఏపీ హోం శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. విజయవాడలో ఎంసీఏ విద్యార్థిని రావూరి శ్రీలక్ష్మిని మనోహర్ అనే విద్యార్థి తరగతి గదిలోనే హత్య చేస్తే దిగువకోర్టు మరణ శిక్ష విధించగా, దాన్ని హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లినా ఎలాంటి ఫలితం కనిపించలేదు.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఎంతమందికి మరణశిక్షను అమలు చేశారన్న విషయమై విభిన్న గణాంకాలు ప్రచారంలో ఉన్నాయి. ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్’ సంస్థ నివేదిక ప్రకారం 1953 నుంచి 1963 మధ్య 1,422 మందిని ఉరితీశారు. నేషనల్ లా యూనివర్శిటీ-్ఢల్లీ సర్వే ప్రకారం 2000 సంవత్సరం నుంచి వివిధ కోర్టులు 1617 మంది నిందితులకు మరణశిక్ష విధించాయి. ఇందులో 71 మందికి మాత్రం ఉన్నత న్యాయస్థానాలు ఉరిశిక్ష సరైనదేనని ధృవీకరించినా, అందరినీ ఉరి తీయలేదు. 1947 నుంచి ఇప్పటి వరకు 1414 మందిని ఉరి తీశారు. 1995లో 13 మందిని, 1996, 1997ల్లో ఒక్కొక్కరిని, 1998లో ముగ్గురిని, 2004, 2012, 2013, 2015ల్లో ఒక్కొక్కరిని ఉరి తీశారు. 2001లో 106 మంది నిందితులకు, 2002లో 126, 2003లో 142, 2004లో 125, 2005లో 164, 2006లో 129, 2007లో 186, 2008లో 126, 2009లో 137, 2010లో 97, 2011లో 117, 2012లో 97, 2013లో 2016లో 186, 2017లో 220, 2018లో 400 మందికి ఉరిశిక్ష విధించాలని కోర్టులు తీర్పు ఇచ్చాయి. 2001లో 303 మందికి ఉరిశిక్షను అనేక కారణాలతో జీవిత ఖైదుగా మార్చారు. 2002లో 301, 2003లో 142, 2004లో 179, 2005లో 1241, 2006లో 1020, 2007లో 881, 2008లో 46, 2009లో 104, 2010లో 62, 2011లో 42 మంది, 2012లో 61, 2013లో 115, 2016లో 220, 2017లో 223, 2018మందికి కోర్టులు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. గత 19 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఎన్నో దారుణ ఉదంతాలు జరిగినా కేవలం నలుగురికి ఉరిశిక్షను అమలు చేశారు.
నేరారోపణలు రుజువైన పక్షంలో నిందితులకు దిగువ కోర్టులు మరణశిక్షను విధిస్తే, వారు హైకోర్టును సీఆర్‌పీసీ సెక్షన్ 366(1) కింద ఆశ్రయిస్తారు. దిగువ కోర్టు తీర్పును హైకోర్టు ధ్రువీకరిస్తే దోషులు 134వ అధికరణ కింద సుప్రీం కోర్టులో అపీల్ చేస్తారు. అధికరణ 137 కింద రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేస్తే సుప్రీం కోర్టు విచారిస్తుంది. సుప్రీం కోర్టులో ఉపశమనం లభించకపోతే, క్యురేటివ్ పిటిషన్‌ను దాఖలు చేసుకోవచ్చు. దీని వల్ల కాలహరణం జరిగి ఖైదీలు జైల్లో అన్ని సుఖాలు పొందుతూ ఉంటారు. కాలక్రమంలో ఆ నేరగాళ్ల గురించి ప్రజలు మర్చిపోతారు. సుప్రీంలో చుక్కెదురైతే దోషులు రాష్టప్రతికి క్షమాభిక్ష దరఖాస్తు పెట్టుకోవచ్చు. రాష్టప్రతి వద్ద ఏళ్లతరబడి క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్‌లో ఉంటాయి.
రాజీవ్ గాంధీ హత్య కేసు 1991 మే 21న నమోదైతే, సుప్రీం కోర్టు మరణశిక్ష విధించినా దోషులను ఇప్పటికీ ఉరితీయలేదు. ఈ కేసులో 28 ఏళ్లుగా జైల్లో ఉన్న నళినికి ఉరిశిక్ష నుంచి మినహాయించారు. ఇటీవల ఆమెకు ‘కుమార్తె వివాహం’ సందర్భంగా కోర్టు నెలరోజుల పాటు పెరోల్ మంజూరు చేసింది. త్వరలో మనవడో, మనవరాలు పుడితే బారసాల, అన్నప్రాసనలకు ఆమె హాజరయ్యేందుకు చట్టం అనుమతించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాజీవ్ హత్య కేసులో నిందితులను విడుదల చేయాలంటూ ద్రవిడ పార్టీల నుంచి కేంద్రంపై వత్తిడి ఉంది. 2012 నాటి ఢిల్లీ నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసులో నిందితులు రాష్టప్రతికి క్షమాభిక్ష పిటిషన్‌ను పెట్టుకున్నారు. వీరికి ఎటువంటి పరిస్థితుల్లో క్షమాభిక్ష ఇవ్వరాదని జాతీయ మహిళా కమిషన్ విజ్ఞప్తి చేసింది. రాష్టప్రతి వద్దకు వచ్చిన క్షమాభిక్ష పిటిషన్లను పరిష్కరించేందుకు నిర్ణీత కాలపరిమితి లేదు. దీనికి కాలపరిమితి విధించాలని మహిళా కమిషన్ కేంద్రాన్ని కోరింది.
కొన్ని దేశాల్లో అమలవుతున్న మరణశిక్షలను విశే్లషిస్తే పలు విషయాలు విస్మయాన్ని కలిగిస్తాయి. చైనాలో 2017లో వెయ్యిమందికి మరణశిక్షను విధిస్తే అంతమందిని ఉరితీశారు. అదే ఏడాది ఇరాన్‌లో 507 మందిని, సౌదీ అరేబియాలో 146 మందిని, ఇరాక్‌లో 125 మందిని, పాకిస్తాన్‌లో 60 మందిని, ఈజిప్టులో 35 మందిని, అమెరికాలో 23 మందిని, అఫ్ఘానిస్తాన్‌లో ఐదుగురిని, మలేషియాలో నలుగురిని, జపాన్‌లో నలుగురిని ఉరితీశారు. భారత్‌లో 2017లో ఒక్కరికి కూడా ఉరిశిక్షను విధించలేదు. ప్రపంచంలో 142 దేశాలు ఉరిశిక్షను రద్దు చేశాయి. 56 దేశాలు మాత్రం ఇప్పటికే ఈ శిక్షను అమలు చేస్తున్నాయి. మన దేశంలో మరణశిక్ష విధించే చట్టాలు ఉన్నా, ఆ శిక్షలు అంతగా అమలు కావడం లేదు.
అమెరికా చెందిన ప్రముఖ న్యాయ కోవిదుడు ఆలివల్ వెండల్ హోల్మ్స్ ఒక సందర్భంలో మాట్లాడుతూ, ‘ఆధునిక ప్రజాస్వామ్యంలో కోర్టులు అన్ని రకాలుగా విచారణ చేసి నిందితులకు మరణ శిక్ష విధిస్తాయి. కాని ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఏవో ఒక కారణాలతో ఆ మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చడం జరుగుతోంది’ అని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ ఒక సందర్భంలో మాట్లాడుతూ,‘నిందితుడు ఎవరన్నది న్యాయవ్యవస్థ నిర్థారిస్తుంది. క్షమాభిక్ష ఇవ్వడంలో కోర్టుల పాత్ర లేదు..’ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ధర్మేంద్ర సింగ్, నరేంద్ర యాదవ్ అనే నిందితులు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హతమార్చడమే కాకుండా, 15 ఏళ్ల బాలికను దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ కేసులో ఇద్దరికీ మరణశిక్ష విధించినా 2010లో క్షమాభిక్ష లభించింది.
72వ అధికరణ రాష్టప్రతికి క్షమాభిక్ష ఇవ్వడంపై విశేషాధికారాలను ఇచ్చింది. కేంద్రం సిఫార్సుపై రాష్టప్రతి నడుచుకుంటారనే విషయం విదితమే. తమిళనాడుకు చెందిన గోవింద స్వామి 1984లో తన ఐదుగురు బంధువులను హత్య చేశాడు. 22 ఏళ్ల తర్వాత గోవిందస్వామికి 2010లో అప్పటి రాష్టప్రతి ప్రతిభాపాటిల్ క్షమాభిక్ష ప్రసాదించారు. కోయంబత్తూరు జైలులో ఉన్న కరుడు గట్టిన ఓ నేరగాడు క్షమాభిక్షకు అర్హుడా? అనే విషయమై గతంలో పెద్దఎత్తున చర్చ జరిగింది.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టులకు 2016 నుంచి 2019 వరకు రూ. 2993 కోట్లను ఖర్చుపెట్టినా, కేసుల పరిష్కారంపై ఆశించిన ఫలితాలు రావడం లేదనే అపవాదు ఉంది. రెగ్యులర్ కోర్టుల్లోని ప్రొసీజర్‌నే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో అనుసరిస్తారు. ఢిల్లీలో ఏర్పాటైన ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడుల కేసులను మాత్రమే విచారిస్తాయి. పశ్చిమబెంగాల్‌లో అన్ని కేసులను విచారిస్తాయి. ఈ కోర్టుల్లో కేసులు త్వరితగతిన పరిష్కారం కావాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్‌లు వెంటనే నివేదికలు ఇవ్వాలి. కొన్ని కోర్టుల్లో కంప్యూటర్లు, ఆడియో, వీడియో రికార్డింగ్ పరికరాలు, ఏసీలు, ఫర్నీచర్ లేదని ఫిర్యాదులు వస్తున్నాయి.
మహిళలపై లైంగిక దాడి, అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసుల్లో దిగువ కోర్టులు తీర్పు ఇచ్చిన తర్వాత- సుప్రీం కోర్టు తప్ప ఏ కోర్టు కూడా విచారించేందుకు వీలులేకుండా చట్టాలు రావాలి. దిగువ కోర్టుపైన హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్టు, రివ్యూ పిటిషన్ , రాష్టప్రతి క్షమాభిక్ష.. ఇలా ఎన్నో స్పీడ్ బ్రేకర్లు ఉండడంతో బాధిత కుటుంబాలు న్యాయం కోసం ఏళ్ల తరబడి ఆక్రోశిస్తున్నారు. దిగువ కోర్టు తర్వాత ఒకే అపీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. రాష్టప్రతి క్షమాభిక్ష పరిధి నుంచి అత్యాచారాలు, హత్యకేసులను తొలగించాలి. సుప్రీంలో అపీల్‌ను కొట్టివేస్తే ఉరిశిక్షను వెంటనే అమలు చేసేలా ఐపీసీ, సీఆర్‌పీసీకి సవరణలు తేవాలి. అత్యాచారం కేసుల్లో దోషులకు మరణ శిక్షను మూడు నెలల్లోగా విధించేలా చట్టాలు రూపొందించి అమలు చేయని పక్షంలో ప్రజాగ్రహానికి ప్రభుత్వాలు గురికాక తప్పదు.

-కె.విజయ శైలేంద్ర 98499 98097