మెయన్ ఫీచర్

‘ ఫాస్ట్‌ట్రాక్’తో సత్వర న్యాయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దిశ’, ‘ఉన్నావ్’ తదితర సంచలనాత్మక సంఘటనల్లో సత్వర న్యాయం ఇచ్చే న్యాయవ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. సత్వర న్యాయమంటే నిందితులను ఎన్‌కౌంటర్ పేరిట చంపేయాలని ప్రజలు కోరడం లేదు. ‘దిశ’ ఘటనలో శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల వైఫల్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల డిమాండ్‌కు వక్రభాష్యాలు చెప్పి నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని అంతా కోరుకుంటున్నట్లు ప్రచారం చేయడం వాంఛనీయం కాదు. అత్యాచారం వంటి నేరాల్లో నిందితులను సత్వరమే విచారించి న్యాయాన్ని అందించాలని, ఏళ్లతరబడి విచారణ పేరుతో కేసులను వాయిదా వేయకుండా పరిష్కరించాలని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు నినదించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను నెలకొల్పడం ముఖ్యం కాదు. ఘోరం జరిగిన వెంటనే పాలకులు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు.
సత్వర న్యాయం కోసం 2000లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 11వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు 1,734 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను పెండింగ్ కేసుల పరిష్కారం కోసం నెలకొల్పాలని సిఫార్సు చేశారు. 19 ఏళ్ల తర్వాత చూస్తే ప్రస్తుతం దేశంలో 581 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయి. వీటిల్లో 5.9 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2000-2001 నుంచి తొలి పదేళ్ల పాటు మొత్తం ఈ కోర్టులకు రూ.870 కోట్లను ఖర్చుపెట్టారు. దేశంలో 86 శాతం పెండింగ్ కేసులు దిగువ కోర్టుల్లోనే ఉన్నాయి. 13.8 శాతం కేసులు హైకోర్టుల్లో, 0.2 శాతం కేసులు సుప్రీం కోర్టులో ఉన్నాయి. నేషనల్ జ్యుడీషియల్ డేటాగ్రిడ్ గణాంకాల ప్రకారం దిగువ కోర్టుల నుంచి సుప్రీం కోర్టు వరకు 3 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సబార్డినేట్ కోర్టుల్లో ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు నెలకొల్పాక కొనే్నళ్లు బాగా పనిచేసి అద్భుతమైన తీర్పులు ఇచ్చాయి. 2006 జూన్‌లో బిహార్‌లోని రోహతస్ కోర్టు ఒక రేప్ కేసును రెండు రోజుల్లో విచారించి నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రాజస్థాన్‌లోని జైపూర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అత్యాచారం కేసును ఏడు రోజుల్లో విచారణ పూర్తి చేసి నిందితుడికి జీవిత ఖైదును విధించింది. జోద్‌పూర్‌లో ఒక జర్మన్ టూరిస్టు అత్యాచారం కేసులో నిందితులను రెండు వారాల్లో విచారించి జీవిత ఖైదును విధించింది. హోషియాపూర్‌లో బాలిక అత్యాచారం కేసును తొమ్మిది రోజుల్లో విచారించి నిందితుడికి పదేళ్ల జైలు శిక్షను విధించారు. ఢిల్లీలో ఇదే కోర్టు నిర్భయ కేసును 9 నెలల పాటు విచారించి నలుగురు నిందితులకు ఉరిశిక్షను విధించింది. ముంబయి కోర్టు శక్తి మిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష, ఒక నిందితుడికి జీవిత ఖైదును విధించింది. మణిపూర్‌లోని ఇంఫాల్ కోర్టు ఓ రేప్ కేసును ఎనిమిది నెలల్లో విచారణ పూర్తి చేసి నలుగురు నిందితులకు జీవిత ఖైదును విధించింది.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టులకు ఆయా రాష్ట్రప్రభుత్వాలు లైంగిక నేరాలు, అత్యాచార కేసులే కాకుండా ఇతర కేసులనూ కేటాయిస్తున్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో వౌలిక సదుపాయాల లేమి కొట్టొచ్చినట్లు కనపడుతోంది. బాధితుల ఆడియో, వీడియో రికార్డింగ్ సదుపాయం లేదు. రెగ్యులర్ స్ట్ఫాను నియమించడం లేదు. న్యాయమూర్తులు చెప్పినట్లుగా సుశిక్షితులైన సిబ్బందిని నియమించడం లేదనే అభియోగాలున్నాయి. అత్యవసరమైన కేసులు తప్ప సాధారణ కేసులను ఈ కోర్టులకు అప్పచెప్పరాదు. ఇక్కడ కూడా కేసుల పెండింగ్ పెరిగిపోతోంది. వీటికి ప్రత్యేక భవనాలు లేవు. ప్రస్తుతం ఉన్న కోర్టుల్లోనే అరకొర సదుపాయాలతో కొన్ని గదులను కేటాయిస్తున్నారు. బ్రిజ్ మోహన్ లాల్ కేసు సందర్భంగా సుప్రీం కోర్టు- ‘రాష్ట్రప్రభుత్వాలు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాల’ని ఆదేశించింది. అయినా రాష్ట్రప్రభుత్వాలు ఈ కోర్టులకు నిధుల కేటాయింపులో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో న్యాయమూర్తులు కష్టపడి విచారణ పూర్తి చేసి తీర్పు ఇచ్చినా, అవేమీ ఫైనల్ కాదు. మళ్లీ ఈ తీర్పులను హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో సవాలు చేసేందుకు చట్టం అనుమతించడం ఒక లోపం. నిర్భయ కేసులో నిందితులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించినా, ఏడేళ్లయినా ఇంకా అమలు కాలేదు.
ప్రముఖ న్యాయ కోవిదుడు జస్టిస్ కృష్ణయ్యర్- ‘బాబూ సింగ్ వర్సెస్ యూపీ స్టేట్ కేసు’పై మాట్లాడుతూ, తీవ్రమైన కేసుల్లోనూ న్యాయ వ్యవస్థ నత్తనడక తీరుతో వ్యవహరిస్తోంది. సత్వరమే విచారణ జరిపించాలన్న న్యాయప్రక్రియకు ఇది మరణ శాసనం లాంటిది. ఈ కేసులో తీర్పు ఎలా అయినా రానివ్వండి. వేగవంతంగా విచారణ జరగపోవడం మంచి పరిణామం కాదు’ అని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణయ్యర్ చెప్పినట్లు వేగంగా కేసుల విచారణ విధానాలను అలవరుచుకోవాలి. ఒకే ఒక విచారణతో ముగిసే క్రిమినల్ కేసులు పెద్దసంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయని పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లో ఒక సెషన్స్ జడ్జి ఎనిమిది రోజుల్లో హత్య కేసు విచారణను పూర్తి చేశారు. ఇదే సెక్షన్ కింద నమోదైన కేసులను విచారించేందుకు రెండేళ్లు సమయం తీసుకునే కోర్టులు కూడా ఉన్నాయి. న్యాయవాదులు తరచుగా వాయిదాలు అడిగితే తిరస్కరించాలి. ఈ తరహా పద్ధతులను న్యాయమూర్తులు ప్రోత్సహించరాదు. ఇష్టం వచ్చినట్లు న్యాయవాదులు వాయిదాలు అడిగితే న్యాయమూర్తులు మందలించాలి. సత్వర న్యాయానికి వాయిదాలే గొడ్డలిపెట్టు. అర్థవంతమైన కారణం ఉంటే తప్ప వాయిదాలు ఇచ్చే పద్ధతిని దిగువ కోర్టులు అనుమతించరాదని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు పలుసార్లు కోరినా ఆశించిన ఫలితాలు రావడం లేదు.
ప్రతి కోర్టు నెలకు రెండు హత్య కేసుల్లో విచారణ పూర్తి చేయాలి. సాక్షులను ప్రవేశపెట్టి వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యతను జిల్లా ఎస్పీలు స్వీకరించాలి. ప్రాసిక్యూషన్ సాక్షులను ప్రవేశపెట్టడం విఫలమైతే, దీనికి పోలీసు యంత్రాంగాన్ని బాధ్యులుగా చేయాలి. క్రిమినల్ కేసుల్లో అధికారులు సాక్ష్యం ఇవ్వడానికి హాజరుకాకుంటే వారి వేతనాలను అటాచ్ చేసేందుకు కోర్టులకు అధికారాలు ఉన్నాయి. చాలీ చాలని సిబ్బంది, ఫోరెన్సిక్ ల్యాబ్‌లపై పెరుగుతున్న వత్తిడి, సకాలంలో నివేదికలు రాకపోవడం, తగినన్ని కంప్యూటర్లు లేకపోవడం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులకు శాపంగా మారాయి.
బాలలపై అత్యాచారాలని అరికట్టే చట్టం (పోక్సో) కింద నమోదైన కేసులను, మహిళలపై అత్యాచారాల కేసులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టులకు అప్పగిస్తున్నారు. ఈ రెండు చట్టాల కింద ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు 1.60లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2729 కేసులు, తెలంగాణలో 4922, అరుణాచల్ ప్రదేశ్‌లో 164, అసోంలో 3201, బిహార్‌లో 8169, చండీగఢ్‌లో 59, ఛత్తీస్‌గఢ్‌లో 2611, గోవాలో 28, గుజరాత్‌లో 6335, హర్యానాలో 2256, హిమాచల్ ప్రదేశ్‌లో 733, జమ్మూ కశ్మీర్‌లో 83, ఝార్ఖండ్‌లో 1987, కర్నాటకలో 5042, కేరళలో 6649, మధ్యప్రదేశ్‌లో 10141, మహారాష్టల్రో 19968, మణిపూర్‌లో 181, మేఘాలయలో 792, మిజోరంలో 336, నాగాలాండ్‌లో 41, ఢిల్లీలో 7277, ఒడిశాలో 8731, పంజాబ్‌లో 1112, రాజస్థాన్‌లో 6312, తమిళనాడులో 3827, త్రిపురలో 407, ఉత్తరాఖండ్‌లో 1089, ఉత్తరప్రదేశ్‌లో 42,379, పశ్చిమబెంగాల్‌లో 12,748, పుదుచ్చేరిలో 97, అండమాన్ నికోబర్‌లో 278, సిక్కింలో 139 కేసులు కలిపి మొత్తం 1,60,989 కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. పోక్సో చట్టం కింద కేసులను విచారించేందుకు ప్రత్యేకంగా 389 కోర్టులు, పోక్సో లేదా రేప్ చట్టాల కింద నమోదైన కేసుల విచారణకు 634 కేసులను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. వచ్చే రెండేళ్లలో రూ.767.25 కోట్లను ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఖర్చుపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో కేంద్రం వాటా రూ.474 కోట్లు, మిగిలిన నిధులను రాష్ట్రప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. మొత్తం 1.66 లక్షల కేసుల పరిష్కారానికి, సత్వర న్యాయం అందించేందుకు 1023 కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ఇటీవల పార్లమెంటులో ప్రకటించింది. ప్రతి త్రైమాసికంలో 41 కేసులను ప్రతి కోర్టు విచారించి తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు సాలీనా రూ.75 లక్షల నిధులు ఇస్తారు. ఇందులోనే న్యాయమూర్తి, ఏడుగురు సిబ్బంది, కోర్టు అద్దె, ఇతర ఖర్చులకు వినియోగించాల్సి ఉంటుంది.
ఉన్నావ్ అత్యాచారం కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ దాస్ ప్రకటించారు. కొన్ని కేసుల్లో ప్రజల నుంచి వత్తిడి పెరిగితే, రాజకీయంగా తమ పీఠం కదులుతున్నట్లు అనుమానం వచ్చినా, వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులకు శిక్షలు పడేటట్లు చర్యలు తీసుకుంటామని చెప్పడం పాలకులకు అలవాటైంది. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ కూడా క్షమాభిక్షలపై సమీక్ష జరగాలని సూచించారు. న్యాయవ్యవస్థను వేలెత్తి చూపేముందు పోలీసు, శాసన వ్యవస్థల్లో సంస్కరణలు మార్పులు రావాలి. న్యాయ వ్యవస్థలో మార్పుల విషయమై నిర్దిష్ట ప్రతిపాదనలను సుప్రీం కోర్టు ముందు ఉంచాలి. తగినన్ని నిధులను న్యాయ వ్యవస్థకు అందుబాటులో ఉంచాలి. ఇందులో జైళ్లశాఖకూ భాగస్వామ్యం కల్పించాలి. మన దేశంలో చాలామంది ప్రాసిక్యూషన్, న్యాయవాదులు, జైళ్ల వ్యవస్థ, సాక్షులను పట్టించుకోరు. ఒక కేసును త్వరితగతిన విచారించి పరిష్కరించేందుకు వీరి భాగస్వామ్యం చాలా ముఖ్యం. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడంతో పాటు, కేసుల విచారణకు అవసరమైన అన్ని విభాగాల మధ్య సమన్వయం ఎంతో అవసరం.

-కె.విజయ శైలేంద్ర 98499 98097