మెయన్ ఫీచర్

వన సంరక్షణలో మహిళలే మహాశక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మన దేశంలో జరిగిన ఉద్యమాల గురించి ఆలోచించేటప్పుడు- సుందర్‌లాల్ బహుగుణ, చండీప్రసాద్ భట్, మహేష్ చంద్ర మెహతా వంటి కొందరు పురుష పర్యావరణ ఉద్యమకారుల పేర్లు కొందరికి జ్ఞాపకం రావొచ్చు. ఎలాంటి చదువుసంధ్యలకు నోచుకోకపోయినా, పర్యావరణ సమస్య గురించి పెద్దపెద్ద విషయాల పట్ల కనీస అవగాహన కూడా లేకపోయినా- కేవలం బతుకుతెరువు కోసం తమ సర్వస్వాన్నీ ఒడ్డి, ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా పోరాటం చేసిన హరిజన, గిరిజన వర్గాల స్ర్తిల గురించి తెలిసినవారు కొందరే. పర్యావరణవాదులమని గొప్పగా చెప్పుకునే వారిలో కూడా- ఈ మహిళామణుల గురించి తెలిసిన వారు చాలా తక్కువమందే ఉంటారు. చాలామందికి మేధా పట్కర్ (నర్మదా బచావ్ ఆందోళన్) వంటి వారి పేర్లు, వారు చేసిన కృషి గురించి తెలిసి ఉండవచ్చు. అది వేరే విషయం.
పర్యావరణ సమస్యలకు పరిష్కారం కావాలంటే ‘చెట్లను నరకకూడదు’ అని చాలామంది సిద్ధాంతాలు వల్లిస్తారు. కానీ, ‘మా తలలు తెగిపడినా చెట్లను నరకడానికి వీలులేదు..’ అంటూ చెట్లను కావలించుకుని, - వృక్షసంపదను కాపాడే ప్రయత్నంలో తన తలను నరికించుకొనడం మాత్రమే కాకుండా- తన ముగ్గురు కుమార్తెలు అను, రత్ని, భాగుల తలలను కూడా జోధ్‌పూర్ మహారాజా పంపిన కరకు సిపాయిల గొడ్డళ్లకు బలిచేసిన సాహసనారి అమృతాదేవి చేసిన మహోన్నత త్యాగం గురించి ఎందరికి తెలుసు? నేటి పర్యావరణ ఉద్యమాలకు నాంది ఆమె రక్తతర్పణంలోనే వుందని ఎందరు గ్రహించగలరు?
మన దేశంలో అతి కొద్దిమందికే తెలిసిన ఈ ఉదంతం జరిగింది 1730లో. ఆనాటికి ఇంకా భారత్‌లో పారిశ్రామిక విప్లవం పుంజుకోలేదు. మేధావులలో కూడా పర్యావరణ సమస్య గురించి ఎలాంటి ఆలోచన లేదు. (అయితే- మనవారు ‘వృక్షములను రక్షిస్తే, అవి మనలను రక్షిస్తాయి’ అని ఏనాడో చెప్పారు. మనం మరిచిపోయిన విషయం ఇది.) అలాంటి రోజులలో ప్రపంచం మొత్తం మీద జరిగిన తొలి పర్యావరణ ఉద్యమమిది. ఈ ఉద్యమంలో పాల్గొన్న స్ర్తి, పురుషులందరూ ‘బిష్నోయ్’ మతస్తులు. ఈ మతస్తులందరూ ‘జఘేశ్వర్’ ప్రతిపాదించిన 29 సూత్రాలనూ చిత్తశుద్ధితో నిరంతరం ఆచరిస్తారు. ఈ 29 సూత్రాలలో ఎనిమిది సూత్రాలు జీవవైవిధ్య పరిరక్షణకు, తద్వారా పర్యావరణ పరిరక్షణకు సంబంధించినవి.
ఈ మతస్ఫూర్తే మహిళలను అంతటి సాహసానికి, త్యాగానికి ప్రేరేపించింది. దీని ప్రేరణతో వచ్చిందే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘చిప్కో’ పర్యావరణ ఉద్యమం. ‘చి ప్కో’ అంటే- ‘చెట్లను కౌగలించుకొనడం’ అని అర్థం. ప్రాణాలు అర్పించి అయినా చెట్లను కాపాడుకోవాలని దాని పరమార్థం.
భారత్‌కు 1947లో స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశ విస్తీర్ణంలో 22.74 శాతం మేరకు అటవీ ప్రాంతం ఉండేది. కానీ, 1989 వచ్చేనాటికే- అది 18.34 శాతంగా తగ్గిపోయింది. ఇప్పటి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ధనార్జనే ధ్యే యంగా గల కాంట్రాక్టర్లు ప్రభుత్వ అండదండలతో చేసే అకృత్యాలు, అభివృద్ధి పేరుతో ఫ్యాక్టరీల నిర్మాణానికి, నిర్వహణకు, బహుళార్థ సాధక భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి, థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాపనకు ఇలా ఏవేవో కారణాలతో పచ్చని అడవులను, వ్యవసాయ భూములను కొల్లగొట్టడం జరుగుతున్నది. పచ్చటి వనాలను బడా కాంట్రాక్టర్లకు, పారిశ్రామికవేత్తలకు అభివృద్ధి ముసుగులో ప్రభుత్వం తన ఇష్టారాజ్యంగా ధారాదత్తం చేస్తున్నది. అభివృద్ధి కార్యకలాపాలకు, పర్యావరణ సంరక్షణకు, బడుగు వర్గాల జీవనోపాధికి మధ్య జరుగుతున్న నిరంతర సంఘర్షణ ఇది.
‘బిష్నోయ్’ మతస్తులు చేసిన త్యాగాల ప్రేరణగా 1974లో వచ్చిన మరో గొప్ప పర్యావరణ ఉద్యమం ‘చిప్కో’ ఉద్యమం. ఉత్తరాఖండ్‌లోని ‘రేణి’ గ్రామంలో కలప కోసం కాంట్రాక్టర్లు 2,500 చెట్లను నరకడానికి పూనుకున్నప్పుడు- ప్రభుత్వానికి, గ్రామసభకు మధ్య వివాదం తలెత్తింది. ప్రభుత్వం ఆ ప్రాంతవాసుల వాదాన్ని వినే స్థితిలో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామంలో పురుషులెవరూ లేని సమయంలో- చెట్లను నరకడానికి కాంట్రాక్టర్లకు చెందిన కూలీలు గొడ్డళ్లతో వచ్చారు. చెట్లను నరికే సమయంలో గ్రామంలో ఎవరైనా ప్రతిఘటిస్తే కాల్చెయ్యడానికి తుపాకులతో పాటు కాంట్రాక్టర్ల అనుచరులు అటవీ ప్రాంతంలోకి జొరబడ్డారు. అప్పుడు పరిస్థితి తీవ్రతను గమనించిన గౌరాదేవి అనే గిరిజన మహిళ అప్పటికప్పుడు 27 మంది మహిళలను సమాయత్తం చేసి ప్రతిఘటన ఉద్యమానికి నాయకత్వం వహించింది. ఒక్కొక్క మహిళ ఒక్కొక్క చెట్టును కావలించుకుని- ‘మమ్మల్ని నరికిన తర్వాతే చెట్లను నరకండి’ నినాదాలు చేశారు. తమ నిరసనను ఎలుగెత్తి చాటారు. కాంట్రాక్టర్ల మనుషులు తమను అసభ్యకరమైన పదజాలంతో నిందించినా, కాల్చివేస్తామని బెదిరించినా ఆ మహిళలంతా ఎంతో ఓర్పుగా వ్యవహరించారు. తమకు ఎదురైన అవమానాలను సహించారు. మన దేశం ‘ప్రజాస్వామ్య దేశం’ (ఏ మేరకు అన్న ప్రశ్నలు ఎలా ఉన్నా) ఆ సమయంలో దుండగులు వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే, ఏ క్షణంలోనయినా వారు తిరిగి రావచ్చుననే ఉద్దేశంతో గౌరాదేవి నాయకత్వంలోని స్ర్తిలు తెల్లవార్లూ నిద్రకు దూరమై అడవిలో కాపలా కాశారు. ఈలోగా పురుషులు కూడా అక్కడికి రావడంతో గ్రామస్థుల ప్రతిఘటన మరో నాలుగురోజులు కొనసాగింది. కాంట్రాక్టర్లు తోక ముడిచి వెళ్లక తప్పలేదు! ఇక్కడ మనం గుర్తుంచుకోవలసింది ఏమిటంటే- అప్పటికప్పుడు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన గౌరాదేవి విద్యాధికురాలు కాదు, ధనవంతురాలు కాదు. ఆమె నిరక్షరాస్యురాలు. నిర్ధనురాలు. ఆమె నిర్వహించిన ఉద్యమం వెనుక స్ఫూర్తి ఒక్కటే- అటవీ ప్రాంతంలో గిరిజనులకు మనుగడ యిచ్చేది వనాలే. అవే లేకపోతే వారికి జీవిక లేదు. ఈ ఒక్క అంశమే వారు ఎంతకయినా తెగించేలా చేసింది. ఇక్కడ మరొక విషయం ప్రస్తావించాలి. ఉత్తరాఖండ్‌లోని గిరిజన, ఆదివాసీ మహిళలకు అడవుల ఆవశ్యకతను గురించి 1961 ప్రాంతాల నుంచీ జాతిపిత గాంధీజీ పాశ్చాత్య శిష్యురాళ్లు సరళాబహెన్, మీరాబహెన్, (ఇవి వారి అసలు పేర్లు కావు. సరళాబహెన్ అసలు పేరు కేథరిన్, మీరాబహెన్ అసలు పేరు మెడెయిన్ స్లేడ్. గాంధీజీయే వారికి ఇలా నామకరణాలు చేశారు.) ఆ ప్రాంతవాసులకు తరుచూ చెప్పిన విషయాలే- వారు ఈ శాంతియుత పర్యావరణోద్యమానికి నడుంకట్టేలా చేశాయి. సరళ, మీరా ఆరోజులలో అక్కడ ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని గిరిజనులతో కలసి జీవించేవారు.
ఈ విధంగా అడవుల విధ్వంసాన్ని అడ్డుకునే విషయంలోనే కాదు, పెట్టుబడిదారులు గనులు తవ్వుకునేందుకు ప్రభుత్వం బీద ప్రజల భూములను స్వాధీనం చెయ్యదలిచినప్పుడు అడ్డుకోవడంలో కూడా మహిళలు ప్రాణాలకు తెగించి చారిత్రాత్మక పోరాటాలు చేశారు. ఒడిశాలోని ఏజెన్సీ ప్రాంతంలో బాక్సయిట్ నిక్షేపాలను తవ్వుకోడానికి ఒక ప్రయివేటు కంపెనీకి ప్రజల భూములను ధారాదత్తం చెయ్యడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే- ముక్తాజోడియా, సుమనీ జోడియా అనే సామాన్య మహిళలు ఉద్యమానికి నాయకత్వం వహించి, సైకిళ్లమీద గ్రామ గ్రామాలకూ తిరిగి (వీరు సైకిల్ వెనుక భర్తనో, కుమారుడినో కూర్చోబెట్టుకోవడం విశేషం!) ప్రజలను చైతన్యవంతం చేయడాన్ని ఎవరూ మరచిపోలేనిది. అయితే, పర్యావరణ ఉద్యమాల చరిత్రలో ఇలాంటి మహిళల పేర్లు ఎక్కువగా ప్రచారానికి నోచుకోలేదు. ఈ ఉద్యమాలకు విశేష త్యాగం చేసింది స్ర్తిలే అయినా, పురుషాధిక్య సమాజం ఆ ఖ్యాతిని వారికి దక్కకుండా చేసింది. గురిచూసి పెట్టిన పోలీసుల తుపాకులకు- ముందు వరసలో స్ర్తిలను నిలబెట్టి.. వెనుక వరుసలో పురుషులు వుండే విధానం మనది!- ఈ తీరు మారేదెన్నడో?

-కోడూరి శ్రీరామమూర్తి 93469 68969