మెయన్ ఫీచర్

హిందుత్వాన్ని పట్టి పీడిస్తున్న ‘సెక్యులరిజం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వతంత్ర భారతంలో ఎన్నో గందరగోళాలకు కారణమైన ఒకే ఒక్క మాట ‘‘సెక్యులరిజం’’. ఈ మాటకు అవసరాన్నిబట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్థం మార్చేస్తున్నారు. ఎవరికి తోచిన వివరణ వారిది. అయితే ఎట్టకేలకు సెక్యులరిజానికి నిఖార్సయిన నిర్వచనం దొరికింది. అదేమిటో తెలుసా?
‘‘హిందుత్వంపై ద్వేషం వెళ్ళగక్కడానికి భారతీయ కుహనా మేధావులు వంటబట్టించుకున్న పాశ్చాత్యుల భావనయే సెక్యులరిజం అంటే!’’
సెక్యులరిజం అనగానే అదేదో మానవత్వపు విలువలున్న గొప్ప ఆదర్శభావనగా అనిపిస్తుంది ఎవరికైనా. అన్నిరకాల మత విశ్వాసాలూ సమానమేనన్న భావన కలిగిస్తూ ‘సెక్యులరిజం’ అన్నివర్గాల ప్రాంతాల వారినీ ఆకట్టుకుంటుంది. ‘‘మరి మీ దేశంలో కొద్ది శాతమే ఉన్న మత విశ్వాసాలవారికే ఎందుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు? అధిక సంఖ్యాకులైన హిందువుల మనోభావాలకు ఎందుకు విలువనివ్వరు?’’ అని ఎవరైనా ప్రశ్నిస్తే మన మేధావులవద్ద జవాబు లేదు.
అసలు ప్రధాన సమస్య ఎక్కడుందంటే సెక్యులరిజం మూలాలు క్రైస్తవ మతంలో ఉన్నాయన్న వాస్తవాన్ని భారతీయ మేధావులెవరూ గుర్తించటం లేదు. రెండువేల సంవత్సరాలపాటు ఐరోపా దేశాలు క్రైస్తవ మతాధిపతుల గుప్పెట్లో నలిగిపోయాయి. ఆ దేశాలలోని ప్రతి వ్యక్తి యొక్క ప్రతి విషయంపైనా చర్చి ఆధిపత్యం కొనసాగింది. క్రైస్తవ మతాధిపతుల ఆధిపత్య ధోరణికి విసుగెత్తిపోయిన ఐరోపా దేశాల ప్రజలు రోమన్ కేథలిక్ చర్చికి వ్యతిరేకంగా తిరుగుబాటుచేసారు. ఐరోపా చరిత్రలో ఇదొక పునరుజ్జీవనోద్యమం. అయితే ఈ పునరుజ్జీవనోద్యమకారులు తమ దేశాలలో కొత్తగా క్రైస్తవ మత రహిత సమాజానికి బదులు ప్రత్యామ్నాయ క్రైస్తవ సమాజాన్ని కోరుకున్నారు. ఆ కాలంలో దీనిని క్రైస్తవ వ్యతిరేక సామాజిక పరిణామంగానే అందరూ భావించారు. కానీ క్రైస్తవ మతరహిత సమాజానికి బదులు కేథలిక్ చర్చ్ వ్యవస్థకు వ్యతిరేకంగా క్రొత్తరూపంలో ప్రొటెస్టెంట్ క్రైస్తవం వచ్చింది. ఉత్తర ఐరోపా దేశాలను పాలించే రాజులు వాటికన్ చర్చ్ కార్యకలాపాలను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ఈ క్రొత్త క్రైస్తవాన్ని ఉపయోగించుకున్నారు.
పునరుజ్జీవనోద్యమం ఫలితంగా వాటికన్ చర్చి ఐరోపా దేశాలపై తన రాజకీయాధిపత్యాన్ని కోల్పోయింది. అదే సమయంలో కేథలిక్ చర్చి బ్రిటన్, ప్రష్యా వంటి ఎన్నో దేశాలపై తన పట్టును కొనసాగిస్తోంది. ఈ దేశాలు తమ వలస రాజ్యవాదంతో ఇతర దేశాలపై తమ ఆక్రమణను కొనసాగించాయి. వీరు ఇప్పటికీ క్రైస్తవేతర దేశాలను అనాగరిక దేశాలుగానే చూస్తారు. వారిని క్రైస్తవీకరణ ద్వారా సంస్కరించాలని చూస్తారు. వారి ప్రయత్నంలో భాగంగా హిందుత్వం, బౌద్ధమతాలలో సహజంగా ఉన్న ఉదార విలువలను అరువుతెచ్చుకున్నారు. ఈ అరువు తెచ్చుకున్న ఉదారస్వభావం ప్రపంచవ్యాప్తంగా చర్చిలను నెలకొల్పడానికి దోహదపడింది. ఫలితంగా వలస రాజ్యాలలో ఏమయ్యింది? ఆ రాజ్యాలలో స్థానిక ప్రజల తరతరాల సంస్కృతిని దూరంచేస్తూ వారిపై ఐరోపా సంస్కృతి బలవంతంగా రుద్దబడింది. ‘‘సహనపరులు మరింత సహనం వహించాలి. అసహనపరులు మరింత అసహనాన్ని వెళ్ళగక్కాలి’’అనే ఆలోచనా వికృతి ప్రబలింది.
పాశ్చాత్యుల సెక్యులరిజం వెనుకనున్న అసలు ఉద్దేశ్యం ఏమిటి? ‘‘హిందుత్వం, బౌద్ధం వంటి మతాలను అనుసరించేవారు తమపై ఎలాంటి దాడులు జరిగినా, ఎవరెన్ని దురాగతాలు జరిపినా సహనంగానే ఉండాలి. అది వాళ్ళ మత విధి. దాన్ని వాళ్ళు అతిక్రమింపకూడదు. అబ్రహామిక్ మతాలు స్వభావరీత్యా అసహనపూరితమైనవి. దౌర్జన్యం వారి సహజ స్వభావం. తమకు విరుద్ధమైన వారిపట్ల ఎలాంటి దౌర్జన్యాన్నైనా చేయవచ్చు. స్వభావరీత్యా అలా చేయడం అబ్రహామిక్ మతాల హక్కు. దౌర్జన్యం ద్వారానే అబ్రహామిక్ మతాలు ఇతరులపై ఆధిపత్యం సాధించాలి. సహనపరుల భారీ మూల్యంవల్లనే అసహనపరులు వారితో కలిసి జీవించడానికి వీలుపడుతుంది’’అన్నది పాశ్చాత్యుల ఆలోచన. ఇటువంటి ధోరణి సహజంగా సహనాన్ని పాటించే సంస్కృతులను నాశనం చేస్తుంది. క్రైస్తవంయొక్క వౌలిక ఉద్దేశ్యం కూడా ఇదే. పైకి నైతికంగా, నాగరికంగా కనిపిస్తూ అన్య మతాలను రూపుమాపడమే వారి అసలు ఉద్దేశ్యం. ఐరోపాలో పునరుజ్జీవనోద్యమం తరువాత అక్కడి పాలకులు అధికార కార్యకలాపాలనుండి వారిని వేరుచేశారే కాని సమాజంనుండి క్రైస్తవాన్ని తొలగించలేదు. పైపెచ్చు వారి అధికార కార్యకలాపాలకు క్రైస్తవం ఒక పావుగా ఉపయోగపడింది.
క్రీ.శ.1900 సంవత్సరంలో విలియం మెక్ కినే్ల అమెరికా అధ్యక్షుడు. అతడి సేనలు కేథలిక్ ఫిలిఫ్పీన్స్‌పై దురాక్రమణ జరిపినప్పుడు పాశ్చాత్య దేశాల సెక్యులరిజం అంటే ఏమిటో అతడు ప్రపంచానికి చూపాడు. దురాక్రమణ సమయంలో కినే్ల బహిరంగ ప్రసంగంచేస్తూ ఫిలిప్పీన్ ప్రజలు అన్యమతస్థులనీ, వారిని క్రైస్తవులుగా మార్చాలనీ అన్నాడు. తరువాత అతడి సేనలు జరిపిన విధ్వంసకాండలో పది లక్షలకు పైగా ఫిలిప్పీన్స్ ప్రజలు హతులయ్యారు. ఫిలిప్పీన్స్ ఆటవిక దేశమనీ, వారిని సంస్కరించడంలో భాగంగానే ఈ విధ్వంసం జరిగిందనీ అమెరికా మీడియా పేర్కొంది. వలస రాజ్యాలలో ఆ సమయంలో వచ్చిన ఎన్నో కామిక్స్ పుస్తకాలలో, నవలల్లో ఫిలిప్పీన్స్ ప్రజలను ఆటవికులుగానూ, శే్వతజాతీయులను వారి సంరక్షకులుగానూ చిత్రిస్తూ కథలు వ్రాసేరు. 1915లో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో మానవ ప్రదర్శన నిర్వహించారు. ఆ ఊరేగింపులో ఆఫ్రికాకు చెందిన వివిధ జాతులవారిని పెద్దపెద్ద ఇనుప పంజరాలలో బంధించి, ఇతర దేశాలకు చెందిన మృగాలుగా వర్ణిస్తూ ఊరేగింపుగా తీసుకెళ్ళారు. ఆధునిక ఐరోపా చరిత్ర పాఠ్యపుస్తకాలలో వీటి గురించిన వివరాలేవీ ఉండవు.
క్రైస్తవులు ఎప్పటికప్పుడు తమ అవసరాలనుబట్టి కథనాలను మార్చేస్తుంటారు. లేదా గందరగోళ వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఉదాహరణకు సస్సానిడ్ ఇరాన్‌లోగల నెస్టోరియాన్ చర్చి వ్యవహారం చూద్దాం. ఈ చర్చికి చెందిన ఫాదర్‌ల జొరాస్ట్రియన్‌పై రోమన్ చర్చి జరిపిన సైనిక దాడులను సమర్ధించుకోడానికి అసలు జొరాస్ట్రియన్ మతం యొక్క వౌలిక భావనలే అనైతికమైనవని, అందువల్లే వారిపై సైనిక చర్య తీసుకోవలసి వచ్చిందని కల్పిత కథనాలను ప్రచారం చేశారు. అన్యమతస్థులు, విగ్రహారాధకులు అయిన లివోనియన్స్ తెగలవారు నరమాంస భక్షకులని, బందిపోటు దొంగలని, అత్యాచారాలు చేసేవారని వారినుంచి క్రైస్తవ ఐరోపాను రక్షించడానికే తాము దాడులు జరుపుతున్నామని బాల్టిక్ క్రూసేడుల గురించి చెప్తూ లాటిన్ చరిత్రలో క్రైస్తవ మతాధిపతులు తప్పుడు రాతలు రాసేరు. అదే విధంగా హంగరీకి చెందిన చర్చి జరిపిన పాశవిక మారణకాండను అనేకరకాల కల్పిత కథనాలతో క్రైస్తవ మతాధిపతులు సమర్థించుకున్నారు. ఇలా ఐరోపా దేశాలలో మధ్యయుగాలలో అన్యమతాల వారిపై చర్చి అతిహేయమైన పద్ధతులలో జరిపిన మారణకాండను క్రైస్తవ మతాధిపతులు ఎంతో నైపుణ్యంతో వక్రీకరించి తమకు అనుకూలమైన కథనాలతో చరిత్రగా వ్రాసుకున్నారు. ఒకవైపు అసత్య ప్రచారంతో అన్యమతస్తులకు వినిపిస్తూనే, మరోవైపు తమకు అనుకూలంగా నీతులు వల్లిస్తూ కథనాలు రాయడం, ప్రతిపాదనలు చేయటం క్రైస్తవులకు మొదటినుంచి అలవాటే.
మేస్రోప్ మాష్టాట్స్(క్రీ.శ.405), మార్ జాకోబ్ (క్రీ.శ.451), ఉత్తర మెసపొటేమియాలోని ఎడెస్సా పట్టణానికి చెందిన రబ్బులా (క్రీ.శ.411-435 మధ్యకాలంలో బిషప్), బాల్టిక్ సముద్రం తూర్పుతీరంలోని చారిత్రిక ప్రాంతమైన లివోనియాకి చెందిన హెన్రీ మరికొందరిని ఐరోపాలోని క్రైస్తవమత వ్యాప్తికి చెందిన ఘటనలను చరిత్రగా నమోదుచేసినవారిలో ప్రముఖులుగా పేర్కొంటారు. వీరంతా ఏకపక్షంగా, క్రైస్తవ మతానికి అనుకూలంగా అన్యమతస్థులపై జరిగిన దాడుల వివరాలను నమోదుచేసారు. చరిత్రకు సంబంధించి ఏ సమాచారం అయితే లభ్యవౌతోందో దానినే చరిత్రకారులు ప్రామాణికంగా అంగీకరించడం జరుగుతూ వస్తోంది. ఆధునిక చరిత్రకారులు కూడా ఇలా లభ్యవౌతున్న పాక్షిక వివరణలనే ప్రామాణికంగా అంగీకరిస్తున్నారు. ఇది చాలా విచారకరమైన విషయం. అంతేకాదు, ఐరోపాలోని క్రైస్తవేతరుల చారిత్రిక సమాచారం లభ్యమయ్యే గ్రంథాలయాలను, సాహిత్యాన్ని ఎవరికీ అందుబాటులోకి రాకుండా క్రైస్తవ మతస్థులు ధ్వంసం చేసేశారు. మొదటినుంచీ ఐరోపాలోని క్రైస్తవ చరిత్రకారులు వాస్తవాలను తొక్కిపెట్టడమే అలవాటుగా కొనసాగిస్తూ వచ్చారు. అందువల్ల తమపై జరిగే దౌర్జన్యాలను సహనంతో భరిస్తున్నవారు మొదటినుంచీ పిరికివారిగానే ఉండిపోయారు. మరోవైపు సహజంగా అసహనపరులైన క్రైస్తవ మతస్థులు దౌర్జన్యాలను కొనసాగిస్తూ తమకు అనుకూలంగా చరిత్రలు వ్రాసుకున్నారు.
క్రైస్తవులలో మొదటినుంచీ వస్తున్న అసహనపరమైన, దౌర్జన్యకరమైన వాస్తవాలను తొక్కిపెట్టే ధోరణిని అర్ధంచేసుకున్నట్లయితే ఆధునిక పాశ్చాత్య మీడియా హిందూ వ్యతిరేకులను సమర్థిస్తూ హిందూధర్మంపై ఎందుకు, ఎలా విషం చిమ్ముతూ రకరకాల కథనాలను ప్రచారం చేస్తోందో తెలుసుకోవచ్చు. హిందూధర్మ పరిరక్షకులను ‘విలన్లు’గా చూపడమే ఈ మీడియా ప్రధాన ఉద్దేశం. అన్యమతస్థులైన వారిపై దాడులు చేయడానికి తమకు దొరికిన ప్రతి అవకాశాన్నీ ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటారు క్రైస్తవమత ప్రచారకులు.
ఇక అన్యమతస్థులలో కొందరిని తమవైపు తిప్పుకోడానికి, మరికొందరిని చరిత్రలో విలన్లుగా చూపడానికి క్రైస్తవులు ఎలాంటి కుయుక్తులు పన్నుతారో చూద్దాం. బాల్టిక్ ప్రాంతంలో అన్యమతస్థుల రాజ్యాలపై మంగోలులతో క్రైస్తవ మిషనరీలు దాడులు చేయించారు. మంగోలుల చేతిలో ఓడిపోయి శరణార్థులుగా వచ్చినవారికి తమ శిబిరాలలో ఆశ్రయం ఇచ్చి, తరువాత క్రైస్తవ సైన్యాలతోడు ఇచ్చి మంగోలులపై ఎదురుదాడులు చేయించేవారు. పైకి చూడటానికి ఇది బాల్టిక్ ప్రాంతంలో మంగోలులు, క్రైస్తవేతర రాజ్యాల మధ్య యుద్ధాలుగా కనిపిస్తుంది. కానీ దీనివెనుక చర్చియొక్క పెద్దపెద్ద కుట్రలే ఉన్నాయి. ఈ క్రమంలో శరణార్థులుగా తమవద్దకు వచ్చినవారిని మత మార్పిడులు చేసేవారు క్రైస్తవ మిషనరీలు. అలాగే ఇరానియన్ బలగాలను రెచ్చగొట్టి ఆర్మేనియాపై దాడులు చేయించింది చర్చి. తరువాత సహాయం పేరుతో ఆర్మేనియావారిని క్రైస్తవ సైన్యంలో చేర్చుకున్నారు. అంటే అన్యమతస్థుల మధ్య చిచ్చుపెట్టి, వారిలో కొందరిని తిరుగుబాటుదారులుగా తమతో చేర్చుకుని ఇతర వర్గాలపై దాడులుచేసేవారు క్రైస్తవ మిషనరీలు. రోమన్ సామ్రాజ్యం తన చర్చి నెట్వర్క్ ఉపయోగించి మెసపొటేమియాలోని తిరుగుబాటుదారులు ఇరాన్‌లోని జొరాస్ట్రియన్ నాయకత్వంపై శతాబ్దాల తరబడి పోరాటాలు జరిపేటట్లు చేసింది.
అన్యమతస్థుల మధ్య చిచ్చుపెట్టి, వారిని పడగొట్టేందుకు శతాబ్దాలుగా క్రైస్తవులు అవలంబించిన కుయుక్తులనే నేడు చర్చి వ్యవస్థ ఎంచుకుంది. ఇప్పుడు ప్రపంచంలో చర్చి వ్యవస్థముందు ఉన్న అతిపెద్ద అన్యమత వర్గం ‘‘హిందూ సమాజం’’.
నిజానికి హిందూ సమాజం మహనీయులైన సన్యాసులకు, సాధుసంతులకు ఎంతో ఋణపడి ఉంది. ఎందుకంటే మన దేశంపై దాడులు జరిపి, దురాక్రమణలుచేసిన మహమ్మదీయులకు ఎదురొడ్డి నిలిచి పోరాడేందుకు భక్తిఉద్యమం ద్వారా హిందువులను ఒక బలమైన శక్తిగా ఏకంచేసింది ఆ సన్యాసులే కదా. మరి క్రైస్తవుల తరఫున పోరాడేందుకు హిందూ సమాజంలోని తిరుగుబాటుదారులు ఎవరు? ఇంకెవరు!? లిబరల్స్, కమ్యూనిస్టులు, మన దేశంలోని క్రైస్తవులు, ముస్లింలు, నాస్తికులుగా చెలామణీ అయ్యే హిందువులు, ద్రవిడియన్లు, ఇంకా ఎందరో!! వీరి ద్వారానే 1991నుంచి మన దేశంలో హిందూ జాతీయవాద శక్తులను దుష్టశక్తులుగా ప్రచారం జరుగుతోంది. హిందుత్వ వ్యతిరేకుల కుతంత్రాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తుండటంతో పాశ్చాత్యులచే మనపై రుద్దబడిన ‘‘సెక్యులరిజం’’్భవనలపై ప్రజలలో క్రమంగా భ్రమలు తొలగుతున్నాయి. సెక్యులరిజం యొక్క నిజస్వరూపం అందరికీ అవగతవౌతోంది.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మనమందరం పాశ్చాత్య మీడియాను చాలా తక్కువగా అంచనావేస్తున్నాం. దానికిగల శక్తి మన ఊహకు అందనిది. ఇటీవలి కాలంలో భారతీయ మీడియాపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం బాగా పెరిగింది. నేడు భారతీయ మీడియా ముందున్న ఒకే ఒక కర్తవ్యం హిందూ సమాజంపై, హిందూ సంస్కృతిపై బురదజల్లుతూ పెద్దఎత్తున దుష్ప్రచారం చేయడం.
ఇటీవలి కాలంలో హిందూ వ్యతిరేకత అన్నది ఒక కార్పొరేట్ వ్యవస్థగా మారింది. పైకి మేధావులుగా చెలామణి అయ్యే శశిథరూర్, అమిష్ త్రిపాఠీ, దేవదత్ పట్నాయక్ వంటివారు హిందూ సంస్కృతిపై ఒక పథకంద్వారా దాడి చేయడానికి పనిచేస్తున్న ఈ హిందూ వ్యతిరేక కార్పొరేట్ శక్తుల పావులే! వీళ్ళు చేసే పని హిందూధర్మంపై విషం చిమ్మడమే.
మరోప్రక్క ఇంటర్నెట్‌పై క్రైస్తవ శక్తుల నియంత్రణ పెరుగుతోంది. ఫేస్‌బుక్ వంటి సంస్థలు అయితే హిందుత్వవాణి వినబడకుండా తొక్కేస్తున్నాయి. జాకీర్‌జాయాక్ వంటి ఉన్మాదశక్తులకు ప్రచారం కల్పిస్తున్నాయి. మరి ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ఇలాంటి నియంత్రణలను అన్నింటినీ తట్టుకుని హిందుత్వం ఎలా నిలబడుతుంది?

ఒకవైపు భారతదేశం ఒక సెక్యులర్ దేశం అంటూ హిందువుల నోళ్ళు మూయిస్తూనే మరోవైపు హిందూ సమాజ విధ్వంసం కోసం క్రైస్తవ, ఇస్లామిక్ శక్తులు నిరంతరం పనిచేస్తున్నాయి. వీరికి సమాధానం చెప్పడానికి హిందువులు ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు అన్న దానిపై హిందూ సమాజం యొక్క మనుగడ ఆధారపడి ఉంది.

-ప్రొ. దుగ్గిరాల రాజకిశోర్ 8008264690