మెయన్ ఫీచర్

ఆంధ్రాలో పరిపాలన వికేంద్రీకరణకు నాంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరిపాలన వికేంద్రీకరణ చేసి మూడు నగరాలకు విస్తరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన సర్వజనుల ఆమోదం పొందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశాలపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం కనపడుతోంది. వికేంద్రీకరణతో మూడు రాజధానుల ఏర్పాటు చేసే ఆర్థిక శక్తి, ప్రజలకు ఈ విధానం ఏ మాత్రం ఉపయోగపడుతుందనేదానిపై అనుమానాలు ఉన్నాయి. ఆంధ్రాకు అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి. మనకు తెలిసినంత వరకు రాజధాని అంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయపరిపాలన కేంద్ర కార్యాలయాలు ఒకే చోట ఉంటాయి. ఈ మూడింటినీ ఒకే చోట ఏర్పాటు వల్ల ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ అసమానతలు సులువుగా తలెత్తే అవకాశం ఉంది. చట్టసభలు ఎక్కడుంటే ఆ ప్రాంతమే రాష్ట్రానికి రాజధాని అవుతుంది. ఏపీ సర్కార్ ప్రజలను సంతృప్తిపరిచేందుకు,లెజిస్లేటివ్, జ్యుడీషియల్, ఎగ్జిక్యూటివ్ రాజధానులను నెలకొల్పినా భారత్ గెజిట్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కొనసాగుతుంది. చట్టసభలు అమరావతిలోనే కొనసాగుతాయని ముఖ్యమంత్రి జగన్ విస్పష్టమైన ప్రకటన చేశారు. అమరావతిని మార్చడం ఎవరి వల్ల కాదు. ఈ విషయమై సందేహం అక్కర్లేదు.
స్వతంత్ర భారతావనిలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు, విలీనం, మళ్లీ విభజనతో 60 ఏళ్లలో మూడు రాజధానులు మద్రాసు, కర్నూలు, హైదరాబాద్‌ను కోల్పోయి నాల్గవ రాజధాని అమరావతిలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణ అవసరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1.50లక్షల చ.కి.మీ విస్తీర్ణంలో భౌగోళికంగా కేరళ తరహాలో పొడువుగా విస్తరించిన రాష్ట్రం. పైగా నాలుగు ప్రాంతాలతో కొలువుతీరి కులాల ఆధిపత్య పోరుతో సతమతమవుతున్న రాష్ట్రం. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కృష్ణా-గుంటూరు జిల్లాలు, రాయలసీమ,ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో సుసంపన్నమైన ఆంధ్ర రాష్ట్రంలో అధికార, పరిపాలన వికేంద్రీకరణ ప్రతిపాదన హర్షణీయం. వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక ఇస్తుందని, దీని ప్రకారం ఇంకా పూర్తి వివరాలు అధ్యయనం చేసి మంత్రివర్గంలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు జగన్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్ చెప్పిన దాని ప్రకారం కర్నూలు న్యాయపరిపాలన రాజధాని, అమరావతి శాసన పరిపాలన రాజధాని, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా తీర్చిదిద్దవచ్చును. సాధారణంగా రాజధాని ఎక్కడ ఉంటే అక్కడే సచివాలయం ఉంటుంది. పరిపాలన సౌలభ్యం దృష్ట్యా హైకోర్టు ప్రధాన కార్యాలయం ఒక నగరంలో, ఇతర చోట్ల బెంచిలను ఏర్పాటు చేసే విధానం మన దేశంలో అమలులో ఉంది. హైకోర్టు సంగతికి వస్తే కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ సీటును ఏర్పాటు చేసి అమరావతిలో హైకోర్టు బెంచిని ఏర్పాటు చేయడం మంచిది. హైకోర్టు బెంచి వల్ల కోస్తా ప్రాంతంలోని ప్రజలకు, న్యాయవాదులకు సౌలభ్యం ఉంటుంది.
కర్నూలు ఆంధ్ర రాష్ట్రానికి 1953 నుంచి 1956 వరకు రాజధానిగా ఉంది. మిగులు హైదరాబాద్ రాష్ట్రంలో 1956లో విలీనమై ఆంధ్రప్రదేశ్‌గా అవతరించడం వల్ల కర్నూలు ప్రాభవాన్ని కోల్పోయింది. హైకోర్టు బెంచిలను నెలకొల్పేందుకు జగన్ సర్కార్ కృషి చేయాల్సి ఉంటుంది. మధ్యప్రదేశ్‌లో జబల్‌పూర్, గ్వాలియర్, ఇండోర్‌లో హైకోర్టులు ఉన్నాయి. జబల్‌పూర్‌లో హైకోర్టుప్రధాన న్యాయమూర్తి ఉంటారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ అయినా హైకోర్టు లేదు. భోపాల్, జబల్‌పూర్ మధ్య 330 కి.మీ దూరం ఉంది. తమిళనాడులో చెన్నైలో హైకోర్టు ప్రధాన కార్యాలయం, మధురై హైకోర్టు బెంచి ఉన్నాయి. చత్తీస్‌గడ్ రాజధాని రాయ్‌పూర్ కాకుండా బిలాస్‌పూర్‌లో హైకోర్టును ఏర్పాటు చేయడం విశేషం. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం. న్యాయపరిపాలన రాజధాని కొచ్చి కావడం విశేషం. కొచ్చిలో హైకోర్టును ఏర్పాటు చేశారు. త్రివేండ్రం నుంచి కొచ్చిన్‌కు 220 కి.మీ దూరం ఉంది. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో హైకోర్టు ప్రిన్సిపల్ సీటును ఏర్పాటు చేశారు. ఔరంగాబాద్, నాగ్‌పూర్‌లో హైకోర్టు బెంచిలు ఉన్నాయి. అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో హైకోర్టు బెంచి ఉంటే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం అలహాబాద్‌లో ఏర్పాటు చేశారు. పొరుగున ఉన్న కర్నాటకలో బెంగళూరులో హైకోర్టు ప్రధాన కార్యాలయం ఉంది. గుల్బర్గా, ధార్వాడలో హైకోర్టు బెంచిలను ఏర్పాటు చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో హైకోర్టు బెంచి ఉంది. హైకోర్టు ప్రధాన కార్యాలయాన్ని జోధ్‌పూర్‌లో ఏర్పాటు చేశారు.
న్యాయపరిపాలన వ్యవస్థను వికేంద్రీకరించడం కొత్తేమీ కాదు. రాజధానిలోనే చట్టసభలు, సచివాలయం, హైకోర్టు అన్నీ మూసపోసినట్లు ఒకే చోట ఉండాలనే నిబంధన ఏమీ లేదు. అన్నీ ఒకే చోట ఉంటే మంచిదే. రాష్ట్ర భౌగోళిక స్వరూపం, ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుంటే పరిపాలన వికేంద్రీకరణ చేయాలన్న సంకల్పం మంచి నిర్ణయం.
మహాత్మాగాంధీ తన జీవితకాలంలో అనేక సంవత్సరాలు గడిపిన దక్షిణాఫ్రికా దేశంలో మూడు రాజథానులు ఉన్నాయి. ప్రిటోరియాలో సచివాలయాన్ని, బయోఎంఫోంటెన్‌లో న్యాయపరిపాలన, కేప్‌టౌన్‌లో లెజిస్లేటివ్ రాజధానిని ఏర్పాటు నెలకొల్పారు. మనకు ఇన్ని రాజధానులు అవసరమమా అని గాంధేయవాది, మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా అన్నారు. మూడు రాజధానులను రెండింటికి కుదించాలని, ఒక అధికారికి, ప్రజాప్రతినిధికి రెండు కార్లు, రెండు బంగ్లాలు కల్పించడం ఖరీదుతోకూడిన వ్యవహారమని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకమ్ జుమా 2016లో ప్రకటించి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
మన పొరుగునే ఉన్న శ్రీలంకలో కొలంబో జ్యుడీషియల్ రాజధాని, శ్రీజయవర్దనేపుర కొట్టే దేశ లెజిస్లేచర్ రాజధానిగా ఉన్నాయి. స్విట్జర్లాండ్‌లోని లొబాంబ పాలనకు రాజధాని. బాబ్నే అనే ప్రాంతాన్ని పరిపాలన రాజధానిగా చేశారు. నెదర్లాండ్స్, బొలీవియా, చీలి, జార్జియా, హొండరస్, మలేషియా, మాంటెనెగ్రో, దక్షిణ కొరియా, టాంజానియా, పశ్చిమసహారా దేశాలకు రెండేసి చొప్పున రాజధానులు ఉన్నాయి.
దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులు ఉండడం వేరు. రెవెన్యూ లోటుతో ఆర్థిక సంక్షోభంతో ఉన్న ఆంధ్ర లాంటి రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. మనకు సింగపూర్, దక్షిణాఫ్రికా తరహా ప్రయోగాలు అవసరం లేదు. మనకు శతాబ్థాల తరబడి చెప్పుకోదగిన రాజధాని నగరం లేదు. చరిత్రలోకి వెళితే శాతవాహనుల కాలంలో అమరావతి, చాళుక్యుల కాలంలో రాజమహేంద్రవరం మాత్రమే రాజధానులుగా ఉన్నాయి. విజయనగరం సామ్రాజ్య పరిధిలో హంపి రాజధానిగా శతాబ్థాల తరబడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ఉంది. ప్రస్తుతం ఆంధ్రాలో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. విభజన వల్ల ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే తీవ్రమైన నష్టాలను చవిచూసి కోలుకోలేని దెబ్బతో విలవిలలాడుతోంది. 1953 వరకు మద్రాసు రాజధానిగా ఉండడంతో చాలా మంది ఆ నగరానికి వలస వెళ్లి స్థిరపడిపోయారు. 1953లో కర్నూలుకు రాజధాని తరలిరావడం, హైదరాబాద్‌కు మళ్లీ మారడంతో తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014లో విభజన జరిగిన తర్వాత 2016లో అమరావతి రాజధాని ఏర్పాటైంది. కాని ఇంకా పూర్తిస్థాయి వౌలిక సదుపాయాలను నెలకొల్పలేదు. పచ్చటి పొలాల్లో రాజధాని ఏర్పాటు చేయడంపై విమర్శలు ఉన్నాయి.
ఏపి సచివాలయాన్ని విశాఖపట్నం, చట్టసభలను అమరావతిలో ఏర్పాటు చేయడం, హైకోర్టును కర్నూలులో నెలకొల్పడం వల్ల పరిపాలన వికేంద్రీకరణ జరిగిందనే సంతోషం ఉన్నా, అధికారులు ఒక చోట నుంచి మరో చోటకు పరుగెత్తాల్సి ఉంటుంది. కర్నూలులో హైకోర్టు ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తే అమరావతితో పాటు విశాఖపట్నంలో హైకోర్టు బెంచిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో హైకోర్టు కోసం ఇచ్చాపురం నుంచి కర్నూలుకు వెళ్లాలంటే హైదరాబాద్‌కు వచ్చి ఒక రోజు బస చేసి రెండవ రోజు చేరుకోవాల్సి ఉంటుంది. అధికార వికేంద్రీకరణ వల్ల ప్రజలు ఇక్కట్లు పడకుండా చూడాలి. ఏ విధంగా చూసినా ఆంధ్ర రాష్ట్రంలో హైకోర్టుకు కర్నాటక తరహాలో రెండు బెంచిలను తక్షణమే ఏర్పాటు చేస్తేనే న్యాయవాదులు, లిటిగెంట్లకు సదుపాయంగా ఉంటుంది. హైకోర్టు విభజన, కొత్త బెంచిలను ఏర్పాటు చేసే విషయమై సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమ్మతి, ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ, న్యాయ శాఖల ఆమోదం లభించాల్సి ఉంటుంది. ఈ అంశాలపై ఆంధ్రప్రభుత్వం కసరత్తు చేయాలి. కొత్త బెంచిల ఏర్పాటు, వాటిని ఎక్కడ ఏర్పాటు చేసే నగరాలను ప్రకటించడం మంచిది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ కూడా ఇప్పటికే జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మద్దతు ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్ కూడా పరిపాలన వికేంద్రీకరణపై ప్రధాని మోదీ, హోంశాఖమంత్రి అమిత్‌షాలకు ఇప్పటికే ఈ విషయాలను పూసగుచ్చినట్లు చెప్పి వారి ఆమోదాన్ని కూడా పొంది ఉంటారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ఏకైక అంతర్జాతీయ నగరం విశాఖపట్నం. విశాఖపట్నం నగరానికి అన్ని హంగులు ఉన్నా, దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు దూరంగా విసిరేసినట్లు ఉండడం వల్ల పాలనాపరంగా ఉన్నత హోదాను పొందలేకపోయింది. 1953లోనే విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చినా, అప్పట్లో కూడా సామాజికవర్గాలు, రాజకీయ సిద్ధాంతాల వివాదాల వల్ల విశాఖకు రాజధాని హోదా దక్కలేదు. ఇప్పటికైనా విశాఖపటాన్ని ఎగ్జిక్యూటివ్ కేపిటల్ హోదాను కల్పిస్తామని జగన్ సూత్రపాయంగా చెప్పినా సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అమరావతిలోనే చట్టసభలు, సచివాలయాన్ని కొనసాగించి, విశాఖలో శీతాకాల సమావేశాల నిర్వహణకు రెండవ రాజధానిని ఏర్పాటు చేస్తే సరిపోతుంది. కర్నాటక ప్రభుత్వం బెల్గాంలో, మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో, జమ్ముకాశ్మీర్ జమ్మూలో రెండవ రాజధానిని ఏర్పాటు చేసి సాలీనా ఒకసారి అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నాయి. సచివాలయం, చట్టసభలను ఒకే చోట కాకుండా వేరు చేయడం వల్ల రాష్ట్ర ఖజానాపై ఆర్థిక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిని చేస్తే, హైదరాబాద్ నుంచి తరలిన సచివాలయం ఉద్యోగులు వచ్చే మూడేళ్లలో విశాఖపట్నంకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు స్థాన చలనం వల్ల తీవ్ర ఇక్కట్లకు లోనయ్యారు. ఈ విషయమై సచివాలయం ఉద్యోగులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. సచివాలయం పనిమీద రాయలసీమ వాసులు విశాఖపట్నంకు వెళ్లాలంటే అష్టకష్టాలు పడాల్సి ఉంటుంది. వికేంద్రీకరణ వల్ల కొత్త కష్టాలు తలెత్తకుండా పాలకులు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. విశాఖపట్నంలో హైకోర్టు బెంచితో పాటు వివిధ ఎన్‌సీఎల్‌టీ, ఆదాయంపన్ను శాఖ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయడం మంచిది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని గ్రాఫిక్స్‌లో చూపిస్తే ఆనందపడడంతో ఐదేళ్లు గడిచిపోయింది. తాజాగా మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రస్తుత సీఎం జగన్ తెరపైకి తెచ్చారు. ఇందులో ప్రజలకు ఉపయోగపడే విధమైన అంశాలపై కచ్చితమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆకర్షణీయమైన ప్రకటనలు, ఉత్సాహం కలిగించే మాటలను కట్టిపెట్టి ఆచరణయోగ్యమైన ప్రణాళికలను అమలు చేయాలి. పరిపాలన వికేంద్రీకరణ వల్ల ప్రజలకు, ఉద్యోగులకు నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది. ఏపీ సర్కార్ ప్రతిపాదనలను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. రాజకీయంగా రానున్న రోజుల్లో దుమారం చెలరేగే అవకాశాలు ఉన్నాయి. పరిపాలన వికేంద్రీకరణ కోసం ఏమి చేసినా ఫర్వాలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ ప్రాంతాలు అడ్డాలుగా మారి ప్రజలు ఆర్థికంగా నష్టపోకుండా చూడాలి. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కొత్త ప్రాంతాలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఏపీ సర్కార్‌పై ఉంది. వైకాపా, టీడీపీ అధినేతల వ్యక్తిగత కక్షలకు ఆంధ్ర రాష్ట్రం బలికారాదు.

- కె. విజయశైలేంద్ర 98499 98097