మెయన్ ఫీచర్

రెండు మాధ్యమాలుండడం మంచిదేగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానం - 2019 ముసాయిదా బిల్లును తయారుచేసింది. ఇది చట్టంగా రూపుదాల్చక ముందే మన రాష్ట్ర ప్రభుత్వం అనేక వర్గాల వ్యక్తులతో ఉన్నత మరియు పాఠశాల విద్యా నియంత్రణ కమిటీలను ఏర్పాటుచేయడమైనది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగుముందుకు వేసి ఉన్న తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేసి 1నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది. అందుకు సంబంధించిన జీవో 81ను ఇటీవల విడుదల చేయడం గమనార్హం. కేంద్రం అమలు చేయబోయే జాతీయ విద్యావిధానంలో పాఠశాల విద్యను కేవలం మాతృభాషలోనే బోధించాలని సిఫార్సు చేయడం జరిగింది. మరి ఆ సూచనను ఈ రాష్ట్ర ప్రభుత్వం పాటించాల్సిన అవసరం లేదా! అని పలువురు తెలుగు భాషాప్రియులు, ఉపాధ్యాయ వర్గాలు అడుగుతున్నారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేయడం ఘోరంగా వారు భావిస్తున్నారు. ఎటువంటి శాస్ర్తియత లేని విధానాలతో ప్రభుత్వాలు సామాన్య ప్రజలను అక్షరాస్యత వైపు దూరంచేసే పరిస్థితులు నేడు కనపడుతున్నాయి. ప్రజల భాషలోనే పరిపాలన సాగాలని ప్రజలు మరియు భాషాశాస్తవ్రేత్తలు కోరుకుంటున్న తరుణంలో ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాఠశాల స్థాయిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి తెలుగు భాషను మృతభాషగా మార్చేందుకు పాలకులు కంకణం కట్టుకోవడం విడ్డూరమే మరి. ఒక ప్రాంత సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేవి భాషలు. మరీ ముఖ్యంగా మాతృభాష ఆ ప్రాంత ప్రజల జీవనాడి. నిత్యమూ మానవీయ సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో మాతృభాషే కీలకంగా ఉపయోగపడుతుంది. మాతృభాష తప్పితే, మిగతా భాషలు మాట్లాడలేని సమాజమే ఈ దేశంలో మరియు మన రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. మరి అలాంటి సమాజంతో నిత్యమూ సంభాషించవలసిన అవసరం వివిధ వృత్తి నిపుణులకు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారి మనోభావాలను, కష్టసుఖాలను ఆయా వృత్తి నిపుణులు అర్థం చేసుకోవాలంటే ఎలాగు? ప్రపంచంలో ఇంగ్లీష్ మాతృభాషగా గల దేశాలలో మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో బోధనలు జరుగుతున్నాయి. మిగతా అన్ని దేశాల్లో కేవలం వారి మాతృభాషల్లోనే బోధనా మాధ్యమం ఉన్నట్లు వివిధ పరిశోధనల్లో తేలింది. పలు అభివృద్ధిచెందిన దేశాలు సైతం పాఠశాల విద్యను మాతృభాషా మాధ్యమంలో కొనసాగించడం విశేషం. కేవలం తమతమ మాతృభాషల్లోనే భావనలను పూర్తిస్థాయిలో విద్యార్థులు అవగాహన చేసుకొందురని తద్వారా సృజనాత్మకంగా ఆలోచించి అనేక నూతన విషయాలను ఆవిష్కరించుకొందురని వివిధ శాస్తవ్రేత్తల అభిప్రాయాలను చదవడం ద్వారా తెలియుచున్నది. మానసిక శాస్తవ్రేత్తలు కూడా బోధన కేవలం మాతృభాషలో కొనసాగితేనే విద్యార్థి పలు విషయాలను అత్యంత సులువుగా అర్థంచేసుకోగలరని ఘంటాపథంగా చెబుతున్నారు. అందుకే ఓ ఉత్తరాంధ్ర కవి ‘సృజనకు విత్తు సొంత భాష/ రచనకు సత్తువ ప్రజల భాష’ అని చెప్పగలిగారు. అంతేకాకుండా ‘పుట్టుక దగ్గర చావు దగ్గర పరభాషలో నవ్వలేను ఏడ్వలేను’ అని తన బాధను వెలిబుచ్చారు. ఇంగ్లీష్ భాష అంతర్జాతీయ భాష అయినంత మాత్రాన, సామాన్య తెలుగు ప్రజలపై ఇంగ్లీష్ రుద్దడం భావ్యమా! వారు తెలుగు తియ్యందపు రుచులను ఆస్వాదించే అవకాశానికి దూరం చేస్తారా! తెలగు నేలపై తెలుగు బోధనా మాధ్యమాన్ని నడపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు లేదా! విద్యార్థులకు ఐచ్ఛికంగా ఏ భాషా మాధ్యమాన్ని ఎంచుకోవాలోనన్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఈ రాష్ట్రంలో లేవా! రెండు మాధ్యమాలను ఈ రాష్ట్రంలోగల ప్రభుత్వ పాఠశాలల్లో అనివార్యంగా కొనసాగించడం ప్రభుత్వానికి భారమా! తద్వారా ఉపాధ్యాయ నియామకాల అవసరం పెరిగి, నిరుద్యోగ సమస్యకు కొంతవరకైనా దారి దొరుకుతుంది కదా! గిడుగురామ్మూర్తి పంతులుగారు, గురజాడ అప్పారావు, ఏట్స్ దొర మరియు శ్రీనివాస అయ్యంగార్ల వ్యవహారిక భాషా ఉద్యమం ద్వారా సాధించిన ఫలితాలకు నేడు విలువేది? ఆనాడు గ్రాంధిక భాషా సంకెళ్ళలో నలిగిపోయిన సమస్త తెలుగు సారస్వతాన్ని వాడుక భాషలోకి తీసుకువచ్చిన ఘనత వారిది. వీరి పుణ్యమా అని, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు శిష్ట వ్యావహారికంలోనే నేటి వరకు బోధన జరగడం విశేషం. తెలుగు భాషాభిమానులు అలాంటి ఉద్యమాలు మరల చేపట్టవలసిన పరిస్థితి ఈ తెలుగు నేలపై దాపురించిందా! సందిగ్ధావస్థలో మరియు అగమ్యగోచరంలో ఉన్న పలువురు తెలుగు భాషాప్రియులు, కవులు, రచయితలు మరియు మేధావులు స్పందించాల్సిన అవసరం లేదా! కేవలం ఇంగ్లీష్‌తోనే కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయని, తద్వారా ఉద్యోగిత పెరుగుతుందని కొంతమంది వాదించడం విడ్డూరమే. పాత తరం విద్యార్థులు పాఠశాల విద్య తెలుగు మీడియంలో విజయవంతంగా పూర్తిచేసి తర్వాత ఉన్నత విద్యను ఇంగ్లీష్ మీడియంలో చదివిన వారు ఎంతోమంది ఈ రాష్ట్రంలో ఆంగ్లభాషా నిష్ణాతులుగా పేరుప్రఖ్యాతులు సంపాదించలేదా! ఇంగ్లీష్ ప్రొఫెసర్స్‌గా, గ్రూప్ వన్ ఆఫీసర్‌గా మరియు ఎన్నో ఉన్నత పదవులను అలంకరించి వారు దేశ విదేశాలలో కీర్తిని గడించ లేదా! వారు తమ అనర్గళమైన ఆంగ్ల ప్రసంగ పాటవాలతో చదువరులను ఆకట్టుకోలేదా! ఈ దేశంలో అనేక మంది రాజకీయ కోవిదులు ఇంగ్లీష్ భాషలో సమగ్రమైన రచనలు చేపట్టలేదా! కేవలం ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళకే కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి అనడం భ్రమ మాత్రమే. పలువురు భాషా శాస్తవ్రేత్తల అభిప్రాయాల ప్రకారం మాతృభాష బాగా వచ్చివారే, ఇతర భాషలను సులువుగా నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియంను ఏకపక్షంగా నేడు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టడంవల్ల ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్స్ పోస్ట్‌లు దాదాపు 25వేల వరకు మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. గణనీయంగా ఏర్పడే ఈ మిగులు సిబ్బందివలన రాబోయే తరాలలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టే అవకాశాలు కోల్పోతాం. కేవలం కంప్యూటర్ విజ్ఞానం, విదేశీ విద్యలే మానవులకి తిండి పెడుతున్నాయి అనుకుంటే పొరపాటే. సామ్రాజ్యవాద మార్కెట్లో విశృంఖలంగా ఉద్భవిస్తున్న వస్తువులను మార్కెట్ చేసుకోవడానికి మాత్రమే ఇంగ్లీష్ విద్య ఉపయోగపడుతుంది. అంటే కార్పొరేట్ మాయాజాలంలోకి అనివార్యంగా తీసుకుపోయే ఎత్తుగడ మాత్రమేనని పలువురు మేధావులు నవాంచడంలో అర్థం ఉంది. ఈరోజున అఖిల భారత స్థాయిలో నిర్వహించే సివిల్స్ పరీక్షలు సైతం తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా ఎంచుకోవడం జరుగుతున్నది. ఈ క్రమంలో తమ మాతృభాషను ఎంచుకొని అనేకమంది సివిల్స్ అధికారులుగా నియమించబడడం మనం చూడలేదా! సంస్కృతి అంటే భాష, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, విలువలు, మానవీయ సంబంధాలు, మరియు విద్యాప్రణాళికగా చెప్పుకోవచ్చు. అలాంటి తెలుగు సంస్కృతిలో భాగంగా ఉన్న మొట్టమొదటి అంశమైన అమ్మభాష కనుమరుగైతే, ఇంకెక్కడ తెలుగు సంస్కృతి నిలబడుతుంది? తెలుగు సాహితీ ప్రక్రియలైన కథ, కథానిక, వ్యాసం, నవల, నాటిక, నాటకం, పద్యం మరియు గేయం మొదలగు వాటిని చదివేది, రాసేది మరియు ఆదరించేది ఎవరు? ఇదిలా ఉంటే ప్రభుత్వం మాత్రం ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంవల్ల పేద మరియు అణగారిన వర్గాల పిల్లలు ఉపాధిపరంగా దేశీయంగా, విదేశీయంగా అభివృద్ధిచెందుతారని చెప్పడం జరుగుతున్నది. అలాగే నూతన వ్వయస్థను ప్రవేశపెట్టేటప్పుడు తప్పకుండా సవాళ్లు ఎదురవుతాయని, ఆ సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటామని చెప్పడం గమనార్హం. ఈ క్రమంలోనే ఉపాధ్యాయులకు తరచూ వృత్యంతర శిక్షణలు ఇస్తామని, పిల్లలకు బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తామని, పాఠశాలల్లో ఇంగ్లీష్ క్లబ్బులు నిర్వహిస్తామని చెప్పడం విశేషం. అయితే మేధావులు కొంతమంది మాత్రం ప్రభుత్వ వాదనను విభేదించడం జరుగుతున్నది. ఇదిలా వుంటే కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా ప్రవేశపెడుతున్న ఆంగ్ల మాధ్యమాన్ని మాత్రమే కొంతమంది వ్యక్తులు పనిగట్టుకుని వ్యతిరేకిస్తున్నారు తప్ప అనాదిగా ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నదాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడక పోవడం విచారకరమని కొంతమంది మేధావులు అంటున్నారు. వారి వాదన కరెక్ట్ కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ దేశంలో అనేకమంది ప్రజాతంత్ర వాదులు, ప్రజా సంఘాలు ప్రైవేటీకరణకు పూర్తి వ్యతిరేకం. విద్య మరియు వైద్యంలో విచ్చలవిడి కార్పొరేటీకరణపై ఎప్పటినుంచోఉద్యమాలు చేస్తుండడం గమనార్హం. అలాంటప్పుడు వారంతా ఆంగ్ల మాధ్యమాన్ని దానంతటదే వ్యతిరేకించినట్లే అవుతుంది. ఈ రాష్ట్రంలోఉన్న మెజారిటీ ఉపాధ్యాయులు వారి అకడమిక్ మరియు ప్రొఫెషనల్ చదవులలో ఆంగ్ల మాధ్యమ మూలాలు లేకుండా పాఠశాల విధులు నిర్వహిస్తున్నారని, వారు ఒక్కసారిగా ఆంగ్లంలో బోధన చేపట్టలేరని, విద్యార్థులకు తగు న్యాయం చేయలేరని కొంతమంది మేధావులు వాదించడం జరుగుతున్నది. దీనివల్ల పిల్లలు రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతారనీ, అందువల్ల తెలుగు మాధ్యమాన్ని ఒక ప్రక్క నడుపుతూ, సమాంతరంగా ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రవేశపెట్టాలని బలంగా వాదిస్తున్నారు. అందువల్ల ఆంగ్ల మాధ్యమం మూలాలు ఉన్న మానవ వనరులు పూర్తిస్థాయిలో లభ్యమయ్యేవరకూ ఈ ఆంగ్ల మాధ్యమం ప్రవేశాన్ని రాష్ట్రంలో ఆపాలని కోరుతున్నారు. ఒక వ్యవస్థను గాని ఒక విధానంనుగాని నూతనంగా ప్రవేశపెట్టేటప్పుడు, శాస్ర్తియతకు విరుద్ధంగా లేకుండా ఉంటే తప్పక ఆ నిర్ణయాలు విజయవంతంగా నిర్వహించబడతాయి. లేదంటే అవి లోపభూయిష్టంగా మారుతాయని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం జి.ఓ. 85 ద్వారా ప్రతిష్టాత్మకంగా 1 నుండి 6వరకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి పూర్తిగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా రాజకీయ నాయకులు, మేధావులు మరియు ఉపాధ్యాయ వర్గాలలో రెండు విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించం, మరికొంతమంది వ్యతిరేకించడం కూడా జరుగుతున్నది. ఈ గందరగోళ పరిస్థితులను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ నిర్ణయానికి భిన్నంగా అభిప్రాయాల్ని వ్యక్తంచేస్తున్న వారితో చర్చలు జరిపిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందనేది మధ్యేమార్గంగా ఆలోచిస్తున్న వారి అభిప్రాయం. 1964లో వచ్చిన డి.ఎస్.కొఠారి కమీషన్ సూచించిన ‘కామన్ స్కూల్ విధానాన్ని’ ఈ దేశంలో ప్రవేశపెట్టిన యెడల విద్యావ్యవస్థలోని అసంగతాలు మరియు అంతరాలు పోయి వ్యవస్థ బలోపేతం కాగలదని చెప్పవచ్చు. నేడు విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు ‘కామన్ స్కూల్ విధానమే’ పరిష్కారాన్ని అందిస్తుందనడంలో ఏమాత్రం సంశయం లేదు.
ఒకప్పుడు వందల, వేలకొలదీ విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలలు కళకళలాడేవి. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారికి మాత్రమే ప్రభుత్వం అన్ని రాయితీలు వర్తించేటట్లు ప్రవేశపెట్టడం ద్వారా ఆనాటి వైభవాన్ని తిరిగి తీసుకురావచ్చని మేధావి వర్గాలు మరియు ఉపాధ్యాయ వర్గాలు భావించడంలో అర్థం ఉంది. ముఖ్యంగా భావితరాలలో ‘ప్రభుత్వ ఉపాధ్యాయుడు’ అనే వృత్తి నిలబడాలంటే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంతోపాటు సమాంతరంగా తెలుగు మీడియంను కూడా కొనసాగించాలి. ఇలా చేస్తే అనకే మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో విరివిగా ప్రవేశం పొంది, పిల్లలు లేని కారణంగా పాఠశాలలు మూతపడ్డాయనే ఆనవాయితీకి అడ్డుకట్టవేసి, కలకాలం కొనసాగే అవకాశం మెండుగా ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఆంగ్ల మాధ్యమంతోపాటు తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలిస్న అవసరం ఎంతైనా ఉంది.

- పిల్లా తిరుపతిరావు, 7095184846