మెయన్ ఫీచర్

ఔన్నత్యాన్ని ఇనుమడించిన సుప్రీంకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత రాజ్యాంగం రూపొందించిన విధానంలోనే భారతీయుల ఔన్నత్యాన్ని, విశిష్టతనూ కాపాడే ప్రయత్నం జరిగింది. రాజ్యాంగంలో తొలి విభాగాల్లో పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక బాధ్యతలను రాజ్యాంగ నిర్మాతలు నిర్వచించారు. ఆ తర్వాతనే కేంద్రప్రభుత్వం, మంత్రిమండలి, పార్లమెంటు, శాసనాలను ఆమోదించడం, రాష్టప్రతి శాసనసంబంధ అధికారాలు పేర్కొన్నారు. అధ్యాయం 4లో 124 నుండి 147 వరకూ సుప్రీంకోర్టు గురించి నిర్వచించారు.
భారతీయుల్లో ఉన్న గొప్ప నమ్మకం కారణంగా ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని రీతిలో న్యాయవ్యవస్థ వేళ్లూనుకుంది. మిగిలిన వ్యవస్థలు చేయాల్సిన పనులను సైతం న్యాయవ్యవస్థ తన భుజాలకు ఎత్తుకుంటోంది. దానికి కారణం న్యాయ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న అచంచల విశ్వాసాన్ని మరింత పాదుగొలిపే ప్రయత్నమే. రాజ్యాంగం సాక్షిగా చట్టాలను అమలుచేయాల్సిన సర్వోన్నత న్యాయస్థానం సైతం ప్రజాకాంక్షలు హెచ్చుమీరి, వారి సహజసిద్ధమైన అభిమతానికి ప్రభావితం అయ్యే దశలో తడబడినపుడు ఆ వ్యవస్థపై అనుమానాలు సన్నగిల్లే ముప్పువాటిల్లకుండా ఎప్పటికపుడు సరిదిద్దుకుంటూ, దేశంలో ప్రజాకాంక్షను సైతం నవీకరిస్తూ సుప్రీంకోర్టు ప్రస్తుతం పెద్దన్నపాత్ర పోషించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. చట్టవ్యవస్థలు, పాలనా వ్యవస్థలూ నిస్తేజమైనపుడు న్యాయవ్యవస్థ వాటిపై కొరడా ఝులిపించి దేశాన్ని ముందుకు నడిపించే ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఎప్పటిపుడు చూస్తూనే ఉన్నాం.
ఈ ఏడాది మరింత విశిష్టమైన తీర్పులకు సుప్రీంకోర్టు కొలువైంది. ముందెన్నడూ లేని రీతిలో అనేక అంశాలపై నిస్సంకోచంగా తన అభిప్రాయాలను వెల్లడించి మరో మారు తనపై మరింత నమ్మకాన్ని పెంచింది. ప్రధానంగా ఈ ఏడాది ప్రారంభంలోనే సీబీఐలో అంతర్గత చిచ్చును చట్టబద్ధంగా గాడిలో తెచ్చే ప్రయత్నంతో మొదలై నిన్న మొన్నటి అయోధ్యపై రివిజన్ పిటిషన్లను కొట్టివేత వరకూ, దిశ హంతకుల పౌరహక్కులపై దాఖలైన పిటిషన్ల విచారణ వరకూ సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు సంచలనాత్మక మార్గంలోనే నడిచింది.
చివరి ఓవర్‌లో అవసరమైన పరుగులు చేసి ఆటను గెలుపుబాట పట్టించినట్టు భారత సర్వోన్నత న్యాయస్థానం 46వ ప్రధాన న్యాయమూర్తిగా తనదైన ముద్ర వేస్తూ జస్టిస్ రంజన్ గొగోయ్ సంచలనాత్మక తీర్పులతో భారత ప్రతిష్టను ఇనుమడింప చేశారు. నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితులను మరింత చక్కదిద్దారు.
చట్టసభలూ, పరిపాలనా వ్యవస్థలూ ఎన్ని ఆటుపోట్లకు గురైనా సంయమనం కోల్పోకుండా సర్వోన్నత న్యాయస్థానం తన నిజాయితీని, ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది. అయోధ్య భూ వివాదంపై స్పష్టమైన తీర్పు, సమాచార హక్కు చట్టం పరిధిలోకి న్యాయవ్యవస్థను తీసుకురావడంతో ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనేందుకు తాను సైతం సిద్ధమే అన్నట్టు న్యాయవ్యవస్థ ప్రకటించుకుంది. కీలక కేసుల ప్రత్యక్ష ప్రసారం , ఏ రోజుకా రోజు తీర్పుల పాఠాలను దేశ ప్రజలకు భారతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలతో తాజాగా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తనకు తానుగా చేరింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే 2021 ఏప్రిల్ 23వ తేదీ వరకూ ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం 59, 867 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పరిష్కరించడం తక్షణ కర్తవ్యంగా సుప్రీంకోర్టు భావిస్తోంది. మరో పక్క దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులు, మహిళలపై అకృత్యాలకు సంబంధించిన కేసులను సైతం త్వరగా పరిష్కరించడంతో పాటు ఆర్ధిక నేరాల కేసుల విచారణపై దృష్టిసారించింది.
రామజన్మభూమి వ్యవహారంలో దాఖలైన అన్ని రివిజన్ పిటిషన్లను కొట్టి వేయడం ద్వారా దానికి భరతవాక్యం పలికినా, శబరిమల కేసులో మహిళల ప్రవేశంపై ఏడుగురు సభ్యుల ధర్మాసనం విచారణ కొనసాగాల్సి ఉంది. ఆధార్ కేసు, వ్యక్తిగత గోప్యత హక్కు కేసు, న్యాయమూర్తుల నియకామకాలకు ఉద్ధేశించిన జ్యుడిషియల్ కమిషన్ ఉనికి ఎటూ తేలలేదు. రాఫెల్‌పై సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా ఆ తీర్పును సమీక్షించాల్సిందేనని పిటిషన్లు దాఖలయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టం, భారత పౌరుల పట్టిక పై కూడా కొత్తగా పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ ఏడాది ఆసక్తి కలిగించిన మరో కేసు ఐఎన్‌ఎక్స్ మీడియా వ్యవహారంలో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి కె. చిదంబరం అరెస్టు కావడం. సీబీఐ దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినా, ఐఎన్‌ఎక్స్ మీడియా లొగుట్టు చాలా విస్తృతమైనదని సీబీఐ భావిస్తోంది.
సీబీఐలో ముసలం అల్లుకున్నపుడు అలోక్‌వర్మను రాత్రికి రాత్రి కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టాలని చూస్తే సాంకేతిక అంశాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆనాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసఫ్‌లతో కూడిన ధర్మాసనం సీబీఐ స్వతంత్రను దెబ్బతీస్తూ, ఎంపిక కమిటీ భేటీ కాకుండా కొత్త డైరెక్టర్ నియామకం చెల్లదని తేల్చిచెప్పింది. ఆ తర్వాత సీబీఐపై దాఖలైన మరో పిటిషన్‌లో అప్పటి సీబీఐ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు కోర్టు ఆదేశాల ఉల్లంఘనకు పాల్పడ్డారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ బెంచ్ తేల్చి చెప్పింది.
మహారాష్టల్రో డాన్సు బార్ల నిషేధాన్ని జస్టిస్ ఎకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ కొట్టివేసింది. అయితే మహారాష్ట్ర రూపొందించిన చట్టంలోని కొన్ని అంశాలను సమర్ధించింది. యూనివర్శిటీల్లో బోధన సిబ్బంది రిజర్వేషన్లకు సంబంధించి యూనివర్శిటీని ఒక యూనిట్‌గా కాకుండా సబ్జెక్టులను యూనిట్‌గా తీసుకోవాలని జస్టిస్ యు లలిత్, జస్టిస్ ఇందిరాబెనర్జీలతోకూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఈ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
సబ్జెక్టు వారీ రిజర్వేషన్లు అమలుచేయడం కష్టమని భావించిన కేంద్రప్రభుత్వం యూనివర్శిటీని ఒక యూనిట్‌గా తీసుకోవాలని పేర్కొంటూ చట్టసవరణ చేసింది. దివాలా నిరోధక స్మృతి 2016(ఐబీసీ) రాజ్యాంగ బద్ధతపై దాఖలైన మరో పిటిషన్‌ను జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ నవీన్ సిన్హాలతో కూడిన డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఐబీసీకి రాజ్యాంగబద్ధత ఉందని తెల్చిచెప్పింది.
అటవీ హక్కుల చట్టాన్ని సమర్ధిస్తూ అటవీ ప్రాంతాల్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న గిరిజనేతరులను ఖాళీ చేయించాలనే కేంద్రప్రతిపాదనలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ నవీన్ సిన్హాలతో కూడిన బెంచ్ ఈ ఆదేశాలను ఇచ్చింది. రిలయన్స్ ఎరిక్‌సన్ కేసులో అనిల్ అంబానీని దోషిగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. టీచర్లు గ్రాట్యూటీకి అర్హులని కూడా ఇంకో కేసులో తేల్చింది. ప్రమాదాలు జరిగినపుడు బీమాకు సంబంధించి ఉన్న అనుమానాలను కూడా సుప్రీంకోర్టు నివృత్తి చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హేమంత్‌గుప్తలతో కూడిన ధర్మాసనం ఈ వివరణ ఇచ్చింది. అంతర్గత ధృవపత్రాలను న్యాయస్థానం ముందుంచడం అధీకృత పత్రాల రహస్య చట్టానికి వ్యతిరేకం కాదని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కె.ఎం. జోసఫ్‌లతో కూడిన బెంచ్ ఆదేశించింది. ఆనాటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ లైంగిక వేధింపుల ఆరోపణలపై సుప్రీంకోర్టు జస్టిస్ అరుణ మిశ్రా, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్‌లతో కూడిన బెంచ్‌ను నియమించి, ఆ ఆరోపణలు అవాస్తవాలని తేల్చింది. ఎస్సీ, ఎస్టీల పదోన్నతులపై కర్నాటక రూపొందించిన చట్టాన్ని సమర్ధించింది. కోచిలోని బహుళ అంతస్తుల భవనాల నిర్మాణంలో ఉన్న లోపాల దృష్ట్యా వాటిని కూల్చివేయాలని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ నవీన్ సిన్హాలతో కూడిన బెంచ్ ఆదేశించింది. నెగోషియబుల్ ఇనుస్ట్రుమెంట్ యాక్టు- ఎన్‌ఐ చట్టంలోని సెక్షన్ 148ను సమర్థించింది. అలాగే 143ఏ సెక్షన్ మాత్రం వర్తమానినికే వర్తిస్తుందని, పూర్వకాలం నుండి వర్తింపచేయడం తగదని తేల్చింది. హరీన్ పాండ్యా హత్య కేసు, కర్నాటక అసెంబ్లీ కేసు , తర్వాత మహారాష్టల్రో మెజార్టీ రుజువు చేసుకునే విషయంలోనూ స్పష్టమైన తీర్పులను ఇచ్చింది. ఆమ్రాపాలి రేరా గుర్తింపును రద్దు చేస్తూ ఆదేశించింది. మైనర్ బాలిక హత్యాచారం కేసులో నిందితులకు ఉరిశిక్షను నిర్ధారించింది. కర్నాటకకు చెందిన 17 మంది ఎమ్మెల్యేల అనర్హతను ఖరారు చేసింది. అయితే వారు తిరిగి ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హులేనని పేర్కొంది. రాఫెల్ కేసులో దాఖలైన అన్ని పిటిషన్లను జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ కే కౌల్ బెంచ్ కొట్టివేసింది. తద్వారా రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు మార్గాన్ని సుగమం చేసింది. ఎస్సార్ దివాలా కేసులో ఎన్ క్లాట్ ఇచ్చిన ఆదేశాలను రద్దుచేసింది. పరిష్కారమార్గాన్ని కనుగొనేందుకు ఆమోదం తెలిపింది. మెమోరీ కార్డుల్లో ఉన్న డాటాను సైతం ఒక ధృవపత్రంగా పరిగణించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో లక్షలాది కేసుల్లో ఉన్న చిన్న లోపాన్ని సవరించినట్టయింది. ఈమేరకు జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరిలతో కూడిన బెంచ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సీల్డు కవర్‌లో దర్యాప్తు అధికారులు ఇచ్చిన పత్రాల ఆధారంగా నిందితుడికి బెయిల్ నిరాకరించడం ఆయన హక్కులను కాలరాయడమేనని జస్టిస్ ఆర్ భానుమతి, ఏఎస్ బాపన్న, హృషికేశ్ రాయ్‌లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు పరిధిని ఉల్లంఘించేలా రాష్ట్రాలు చట్టాల్లో ఎలాంటి సవరణలు చేయవద్దని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరాబెనర్జీలతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. తద్వారా హద్దులను దాటుతున్న రాష్ట్రాలకు ముకుతాడు వేసింది.

- బి.వి.ప్రసాద్ 9963345056