మెయన్ ఫీచర్

అయినా... హస్తరేఖలు మారలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత సంవత్సరం (2018) పోతూ పోతూ కాంగ్రెస్ పార్టీలో కాసింత, కాదు.. కాదు.. బోలెడు సంతోషాన్ని నింపి వెళ్ళింది. ఐసీయూలోని పేషెంట్ లేచి వస్తే అయిన వాళ్ళకు ఎలాంటి ఆనందం కలుగుతుందో, అదిగో అలాంటి ఆనందం హస్తం పార్టీకి అనుభవంలోకి వచ్చింది. అంతవరకు వరస ఓటములతో కుదేలైపోయిన పార్టీ, 2018 చివర్లో జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి, ఊపిరి తీసుకుంది. ఆశలు పెంచుకుంది. కాంగ్రెస్ పార్టీలోనే కాదు బీజేపీ వ్యతిరేక శక్తుల్లోనూ ఆ ఫలితాలతో కొత్త ఆశలు చిగురించాయి. అయితే, ఆ ఆనందం అట్టే కాలం నిలవలేదు. మూడు రాష్ట్రాల గెలుపు మూడునాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. 2019 ప్రారంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కథ మళ్ళీ మొదటికే వచ్చింది. నరేంద్ర మోడీ ప్రభంజనంలో కాంగ్రెస్ కట్టుకున్న పేక మేడలు, పిచ్చుక గూళ్లు కొట్టుకుపోయాయి. వరసగా రెండవసారి కాంగ్రెస్ రెండంకెల సంఖ్యకే పరిమితం అయింది. రాహుల్‌గాంధీ హద్దులు దాటి, ‘చౌకీదార్ చోర్’అంటూ మోడీ లక్ష్యంగా ఎన్ని విమర్శనాస్త్రాలు సంధించినా ప్రయోజనం లేకుండా పోయింది. కేవలం 52 స్థానాలలో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. అంతేకాదు, చౌకీదార్ చోర్ నినాదం కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఓడించడమే కాదు, న్యాయస్థానం ఎదుటా రాహుల్‌గాంధీని దోషిగా నిలబెట్టింది. ఇందుకు సంబంధించి, సభ్యత మరిచి సంస్కార హీనంగా తానుచేసిన విమర్శలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించిందని, తప్పుడు ప్రచారం చేసినందుకు న్యాయస్థానం ఆయన్ని తప్పుపట్టింది. ఒకటికి రెండుసార్లు క్షమాపణ చెప్పిన తర్వాత ఇంకోసారి, అలాంటి తప్పుచేయవద్దని, తప్పుడు మాటలు మాట్లాడవద్దని హెచ్చరించి, క్షమించి వదిలేసింది.
రాహుల్ సారథ్యంలో జరిగిన తొలి ఎన్నికల్లో, స్వయంగా ఆయనే ఓడిపోయారు. స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో సొంత నియోజకవర్గం అమేథిలో రాహుల్‌గాంధీ ఓడిపోయారు. అంతేకాదు, ఆయన మాత్రమే ఓడిపోవడం కాదు, 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో కాంగ్రెస్ పార్టీనే నామరూపాలు లేకుండాపోయింది. ఒకే ఒక్క స్థానంలో గెలిచింది, రాయబరేలీ నుంచి పోటీచేసిన సోనియాగాంధీ ఒక్కరే, గెలిచారు. ఒక విధంగా ఉత్తరప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీనే కాదు నెహ్రూ, గాంధీ కుటుంబం నాయకత్వానే్న యూపీ ప్రజలు తిరస్కరించారు. రాహుల్ నాయకత్వంతోపాటుగా, కాంగ్రెస్ పార్టీ ఆఖరి అస్త్రంగా ప్రయోగించిన ప్రియాంక వాద్రా చరిష్మా కూడా పనిచేయలేదు. ఓటర్లు కాంగ్రెస్ పార్టీని నాలుగో స్థానానికి నెట్టేశారు.
ఒక్క యూపీలోనే కాదు, లోక్‌సభ ఎన్నికలకు రెండుమూడు నెలల ముందు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ పార్టీకి రిక్తహస్తమే స్వాగతం పలికింది. ఆ మూడు రాష్ట్రాల్లో ఉన్న 65 స్థానాలకుగానూ కాంగ్రెస్ పార్టీకి దక్కింది కేవలం మూడంటే మూడు స్థానాలు. మధ్యప్రదేశ్‌లో 29కి ఒక్కటి, ఛత్తీస్‌ఘడ్‌లో 11కి రెండు, రాజస్థాన్‌లో 25కి ‘సున్నా’ స్థానాలు, మొత్తం మూడు రాష్ట్రాలలో కలిపి మూడు సీట్లే హస్తం పార్టీకి దక్కాయి. అంతకు కొద్దిగా ముందు అడ్డదారిలో అధికారం అందుకున్న కర్ణాటకలోనూ కాంగ్రెస్ పార్టీ 28కి ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. నిజానికి, కాంగ్రెస్ పార్టీ కేరళ (15), పంజాబ్ (8), తమిళనాడు (8) మినహా మరే రాష్ట్రంలోనూ ఐదంకెను దాటలేదు. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే రాజస్థాన్, ఢిల్లీ సహా సగానికి పైగా రాష్ట్రాలలో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. పార్టీ స్కోర్ ‘సున్నా’ దాటలేదు. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఒకటో రెండో.. స్థానాలతోనే సరిపెట్టుకుంది.
అక్కడితో కథ అయిపోలేదు, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అసలు కథ మొదలైంది. సుమారు మూడు నెలలకు పైగా డైలీ సీరియల్‌గా సాగిన రాహుల్‌గాంధీ రాజీనామా కథ పార్టీ ప్రతిష్టను మరింతగా దెబ్బతీసింది. రాహుల్‌గాంధీ ఓటమికి నైతిక బాధ్యత వహించి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారో లేక పార్టీ సీనియర్ నాయకుల మీద అలిగి పదవినుంచి తప్పుకున్నారో... అదే ఇది కాదంటే, ఇంకెవరో ఆయన చేతకానితనాన్ని ప్రశ్నించకుండా పలాయనం చిత్తగించారో ఏమోగానీ, మొత్తానికి రాహుల్ రాజీనామా ఒక ప్రహసనంగా మారింది. రాహుల్‌గాంధీ తాను బాధ్యతల నుంచి తప్పుకోవడమే కాదు, నెహ్రూ, గాంధీ కుటుంబాన్ని పక్కనపెట్టి, కుటుంబం వెలుపలి వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఆజ్ఞాపించారు. సరే, ఆ తర్వాత ఏమి జరిగింది అనేది అందరెరిగిన చరిత్ర. సుమారు మూడు నెలలపాటు అదనీ, ఇదనీ కిందామీద అయి, చివరాఖరుకి తాత్కాలిక అనే ట్యాగ్‌తో వృద్ధ నేత సోనియాగాంధీ మరోమారు పార్టీ అధ్యక్ష బాధ్యతలను నెత్తికి ఎత్తుకున్నారు. ఇంకా ఈనాటికీ ఆమె ‘తాత్కాలిక’ అధ్యక్షురాలిగా కొనసాగుతూనే ఉన్నారు. అంతటి ఘనచరిత్ర ఉన్న పార్టీకి ఇప్పుడు అధ్యక్ష పదవిని చేపట్టే సమర్థ నాయకులే లేకుండాపోయారు.
ఇప్పుడు మళ్ళీ 2019 పోతూ పోతూ కూడా కాంగ్రెస్ పార్టీకి అంతకాకపోయినా కొంత ఆనందాన్ని అయితే మిగిల్చే వెళుతోంది. అక్టోబర్‌లో జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా సాధించింది ఏమీలేకపోయినా మహారాష్టల్రో సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చిన శివసేన, ఎన్సీపీలతో కలిసి ‘పవిత్ర’ కూటమి ప్రభుత్వంలో జూనియర్ పార్టనర్‌గా అధికారాన్ని పంచుకుంటోంది. అలాగే, డిసెంబర్‌లో జరిగిన ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జేఎంఎం, ఆర్జేడీ కూటమిలో జూనియర్ పార్టనర్‌గా సంతృప్తి చెందే పరిస్థితికి చేరింది. మొత్తం చూస్తే 2019లో కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలకు జూనియర్ పార్టీ హోదాను సుస్థిరం చేసుకుంది.
నిజం, 2019లో బీజేపీ కూడా వరస ఓటములు చవిచూసింది. గత రెండు సంవత్సరాల కాలంలో కమల దళం ఐదు కీలక, పెద్ద రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. ఇప్పటికీ బీజేపీ మిత్రపక్షాలతో కలిసి పదహారు రాష్ట్రాల్లో అధికారంలోఉన్నా అందులో చెప్పుకోదగ్గ రాష్ట్రాలు ఐదారుకంటే లేవు. ఒకప్పుడు కాషాయ మయంగా కనిపించిన ఇండియా మ్యాప్‌లో ఇప్పుడు కాషాయ శోభ సగానికి సగం మేర కుదించుకుపోయింది. అంతే కాదు, మిత్రపక్షాలు దూరమవుతున్నాయి. శివసేన లాంటి సైద్ధాంతిక సారూప్యత, సుదీర్ఘబంధం ఉన్న పార్టీ దూరమైంది. అలాగే, అకాలీదళ్ కూడా కమల దళానికి దూరమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఝార్ఖండ్‌లోనూ మిత్రపక్షం ‘ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్’తో పొత్తు కుదరకపోవడం కూడా ఆ రాష్ట్రంలో బీజేపీ ఓటమికి ఒక ప్రధాన కారణం. నిజానికి ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం పెరిగింది. అయినా, పార్టీ అధికారం కోల్పోయింది. అందుకు ప్రధాన కారణం మిత్రపక్షంతో పొత్తు కుదరకపోవడమే అని ఎన్నికల ఫలితాలు ప్రస్ఫుటం చేస్తున్నాయి. సరే, తెలుగు రాష్ట్రాలలోని తెలుగుదేశం లాంటి పార్టీల గురించి అంతగా పట్టించుకోవలసిన అవసరం లేకున్నా, ఎంతోకొంత భావసారూప్యం ఉండే జాతీయ వాదంవైపు మొగ్గుచూపే ఇతర మిత్రపక్షాల విషయంలో బీజేపీ ఇప్పటికైనా జాగ్రత్త పడవలసిన అవసరం కనిపిస్తోంది.
అదలా ఉంటే, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా, జాతీయస్థాయిలో ప్రస్తుతానికి అయితే బీజేపీకి ప్రత్యామ్నాయం కనిపించడం లేదనే రాజకీయ పార్టీలే కాదు, రాజకీయ విశే్లషకులు కూడా భావిస్తున్నారు. జాతీయస్థాయిలో బీజేపీకి ఎదురు నిలిచే జాతీయ పార్టీ ఇప్పటికైతే లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ జాతీయస్థాయిలో సరైన నాయకత్వం లేదు. లేదంటే, సమర్థ నాయకులు కాంగ్రెస్ పార్టీలో లేరని కాదు, ఉన్నారు. అయితే, అడ్డుగా నిలిచిన రాహుల్‌గాంధీని దాటుకుని వచ్చే పరిస్థితి లేదు. మరోవంక బీజేపీ ఓడినా కొత్తకొత్త రాష్ట్రాలలోకి విస్తరిస్తోంది. ఓడిన రాష్ట్రాలలోనూ పట్టు పూర్తిగా కోల్పోలేదు. కర్ణాటకలో ఏమిజరిగిందో చూశాం. అందులో కొంత అనైతికత ఉన్నా, ఇటీవల 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు 12స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించారు. గెలిచి ఓడిన బీజేపీని ప్రజలు మళ్ళీ గెలిపించారు. అలాగే, కనీసం కాలుమోపే చోటుకూడా లేని పశ్చిమ బెంగాల్‌ల్లో ఇప్పుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీనే ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది. లోక్‌సభ ఎన్నికల్లో అనుహ్యంగా 13 స్థానాలను సొంతంచేసుకుని తృణమూల్‌కు సమఉజ్జీగా నిలిచింది. మరో రెండు సంవత్సరాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ తృణమూల్, బీజేపీ మధ్యనే ఉంటుందని రాష్ట్ర రాజకీయ పరిణామాలు సూచిస్తున్నాయి. అస్సాం, త్రిపుర సహా ఈశాన్య భారతంలో పూర్తిస్థాయిలో పట్టును పెంచుకుంది. సో, బీజేపీ శాసనసభ ఎన్నికల్లో ఓడినా కాంగ్రెస్ గెలవలేదు. ప్రాంతీయ పార్టీల కొంగు పట్టుకుని ఆ పార్టీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడక తప్పని పరిస్థితినుంచి ఇప్పట్లో బయటపడే అవకాశం కనిపించడం లేదు. జాతీయస్థాయిలో బీజేపీని ఓడించే పరిస్థితి ప్రాంతీయ పార్టీలకు లేదు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం 2020లో హస్తరేఖలు ఎలా ఉంటాయో, ఎలా మారతాయో, ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.
ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ మనుగడ పోరాటం చేస్తోంది. ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే దయనీయ స్థితికి చేరుకుంది. మరోవంక సైద్ధాంతిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిజమే, కాంగ్రెస్ పార్టీకి, ఆమాటకొస్తే చాలావరకు మధ్యేవాద, ప్రాంతీయ, కుటుంబ పార్టీలకు ‘అధికారమే’ సిద్ధాంతం. అధికారం కోసం ఎలాంటి ‘త్యాగాలు’ చేయడానికి అయినా సిద్ధమవుతారు. మహారాష్టల్రో అదేకదా జరిగింది. ఈ అన్నింటినీమించి కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఒక విధంగా తమ గోతిని తామే తీసుకుంటున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో విపక్షాలు సాగిస్తున్న అసత్య ప్రచారం, ముఖ్యంగా రాహుల్‌గాంధీ, (బహుశ: మళ్ళీ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు కావచ్చు) సావర్కర్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరకు అందరిపైనా చేస్తున్న అడ్డగోలు విమర్శలు, ఈ విమర్శలు ‘చౌకీదార్ చోర్’కంటే చాలాచాలా బలంగా ‘బూమ్రాంగ్’ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. సహజంగా, ఒకసారి, తప్పుచేసి దెబ్బతిన్న వ్యక్తీ లేదా పార్టీ మళ్ళీ అదే తప్పుచేయదు. కానీ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అందుకు భిన్నంగా, చేసిన తప్పునే మళ్ళీ చేస్తున్నారు. ఒకదానితో ఒక దానికి సంబంధం లేని పౌరసత్వ సవరణ చట్టాన్ని, జాతీయ పౌర పట్టికను, కలగా పులగంచేసి దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆందోళనలు సాగిస్తున్నారు. దేశంలో అరాచకాన్ని, హింసను ప్రోత్సహిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టంతో ఈ దేశంలో ముస్లింలకు, ఆమాటకొస్తే ఈ దేశ పౌరులు ఎవరికి కూడా, ప్రభావం సంగతి పక్కన పెట్టండి, అసలు ఎలాంటి సంబంధమే లేదు. పొరుగున ఉన్న ఇస్లామిక్ దేశాలు పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లలో మతపరమైన హింసకు గురవుతున్న హిందువులు సహా ఆ దేశాల్లోని బౌద్ధులు, సిక్కులు, జైనులు క్రైస్తవులు, ఇతర మైనారిటీలకు మన దేశంలో అదికూడా వారు కోరితే, పౌరసత్వం కల్పించేందుకు గల నిబంధనలను సడలించేందుకు మాత్రమే ఉద్దేశించిన చట్టం అది. అయినా, పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన, సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు, స్టే ఇవ్వడానికి నిరాకరించిన చట్టానికి వ్యితిరేకంగా హింసను ప్రేరేపించే విధంగా కాంగ్రెస్ ముస్లిం మతోన్మాద సంస్థలతో కలిసి ఆందోళనలు చేస్తోంది. అందుకు రాహుల్‌గాంధీ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాలను లక్ష్యంగా చేసుకుని ఎనార్సీ, నిర్బంధ శిబిరాల వంటి నిరాధార నిందారోపణలు చేయడం ద్వారా అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే, ఒకటొకటిగా వాస్తవాలు వెలుగులోకి రావడంతో కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి కుడితిలో పడిన ఎలుక లాగ మారింది. ఇదే పౌరసత్వ సవరణ చట్టం, సిఎఎ, ఇదే జాతీయ పౌర పట్టిక. ఎన్నార్సీ గురించి, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, మాజీ కేంద్ర హోంమంత్రి చిదంబరం పార్లమెంట్ లోపల వెలుపల చెప్పిన మాటలు, చేసిన వ్యాఖ్యలు సొంత గొంతులతో వైరల్ కావడంతో రాహుల్‌గాంధీ కొత్త అబద్ధాలు వెతుక్కుంటున్నారు. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జనగణన విషయంలోనూ అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. అయితే, అందరినీ అన్ని సందర్భాలలో మోసంచేయడం రాహుల్‌గాంధీకి అయినా, జాతీయ విలువలను పణంగా పెట్టి మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా, రాజకీయ ప్రయోజనాలు ఆశించే శక్తులకు అయినా అయ్యే పని కాదు. ధర్మోరక్షిత రక్షితః సత్యమేవ జయతే... ఈ దేశం, ఈ జాతి విశ్వసించే ధర్మనాడులు... చివరకు సత్యమే జయిస్తుంది. ధర్మమే విజయం సాధిస్తుంది.

- రాజనాల బాలకృష్ణ 9985229722