మెయన్ ఫీచర్

ఉమ్మడి సివిల్ కోడ్ వచ్చేస్తోందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాము అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర శిక్షాస్మృతి (కామన్ సివిల్ కోడ్)ను అమలు చేస్తామని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో పేర్కొని 303 సీట్లు తెచ్చుకుంది. 2019 ఎన్నికల్లో ఊహించని విధంగా మెజారిటీ సీట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు కసరత్తు చేయాలి. 2014 నుంచి అధికారంలో ఉన్నా, ఇంతవరకు ఈ దిశగా బీజేపీ ఎటువంటి ప్రయత్నం చేసినట్లు కనపడడం లేదు. ఎన్నికల ప్రణాళిక అనేది ప్రతి రాజకీయ పార్టీకి భగవద్గీత లాంటిది. ఇందులో పేర్కొన్న అంశాలను తూచా తప్పకుండా అమలు చేయాలి. కొంత మందికి కోపం వస్తుందనో, లేదా ఓటు బ్యాంకుకు చిల్లు పడుతుందనే అనుమానంతో ప్రాధాన్యత కలిగిన చట్టాలను అటకెక్కిస్తే ప్రజల క్షమించరు. రాజ్యాంగంలో 370వ అధికరణ, పౌరసత్వ సవరణ చట్టం, త్రిపుల్ తలాక్ బిల్లులు చట్టరూపం దాల్చాయి. ఇందులో కొన్ని చట్టాలు కొంత మందికి ఆగ్రహం తెప్పించి ఉండవచ్చు. కుహనా లౌకికవాదులు ఈ చట్టాలను తమకు అనుకూలంగా వాడుకునేందుకు చేసిన ప్రయత్నాలను ప్రజలు అంగీకరించరు. బీజేపీ ఎన్నికల ప్రణాళికలో 2019లో చేసిన చట్టాలన్నీ ఉన్నాయి. పౌరసత్వసవరణ చట్టం తెస్తామని బీజేపీ దశాబ్థాలుగా చెబుతూ వస్తోంది. ఆ పార్టీకి 303 సీట్లు ఇచ్చి గెలిపించారు. ఈ రోజు కాంగ్రెస్, వామపక్షపార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలకు పౌరసత్వసవరణ చట్టాన్ని వ్యతిరేకించే హక్కు ఉంది. కాని అభం శుభం తెలియని సాధారణ ప్రజలకు అభూతకల్పనలు చెప్పి రెచ్చగొట్టి వారిని వీధుల్లోకి తెచ్చి శాంతి భద్రతల అంశంగా చేశారు.
బీజేపీ మ్యానిఫెస్టోలో పౌరసత్వసవరణ బిల్లులో పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గాలకు నిర్ణీత నిబంధనలకు లోబడి పౌరసత్వం కల్పిస్తామని విస్పష్టంగా పేర్కొంది. బీజేపీ కూడా ఇటువంటి చట్టాలను చేసే సమయంలో ప్రజలకు ముందుగా అవగాహన కల్పించి, విస్తృతంగా ప్రచారం చేయాలి. మన దేశంలో నిజాలు తెలిసేసరికి, పుకార్లు షికార్లు చేసి విధ్వంసం సృష్టిస్తాయి. మనం ఎంత అభివృద్ధి చెందినా, ఇంకా మధ్యయుగం నాటి మైండ్ సెట్ నుంచి ప్రజలు బయటపడలేదు. ఈ మనస్తత్వం అన్ని వర్గాల ప్రజల్లో ఉంది.
చట్టాలపై పార్లమెంటులోవివరించే సమయంలో కూడా సంయమనంతో వ్యవహరించాలి. దూకుడు ఎటువంటి పరిస్థితుల్లో పనికిరాదు. ప్రధానంగా సున్నితమైన అంశాలపై చట్టాలను రూపొందించేటప్పుడు కచ్చితంగా ప్రజల్లో అపోహలు కలుగుతాయని భావించాలి. ఈ విషయంలో బీజేపీ విఫలమైంది. పార్లమెంటులో ప్రసంగించే నేతల బాడీలాంగ్వేజీ దురుసుగా, అహంకారపూరితంగా ఉండరాదు. వినమ్రతతో మాట్లాడాలి. పౌరసత్వసవరణ చట్టం విషయంలో పార్లమెంటులో అన్ని పార్టీల నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. పౌరసత్వసవరణ చట్టం వల్ల భారతీయ పౌరులకు వచ్చే లాభం, నష్టం ఏమీ లేదు. 1947 దేశ విభజన సమయంలో జరిగిన కొన్ని లోపాలను కొంత మేరకు పూడ్చేందుకు ఉపయోగపడే చట్టమిది. కాని దీనిపై ప్రజల్లో సామాజిక మాధ్యమాల ద్వారా అపోహలను సృష్టించడంలో కుహనా లౌకికవాదులు ప్రయత్నించి రక్తపాతం సృష్టించారు. ప్రజల భావోద్వేగాలతో ఆడుకునేందుకు రాజకీయ పార్టీలు చేసిన దుష్టపన్నాగాలను తిప్పిగొట్టేందుకు వీలుగా ముందుగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. పౌరసత్వ సవరణ చట్టం 1947 దేశ విభజనతో ముడిపడి ఉందనే విషయం ఎంత మందికి తెలుసు. పార్లమెంటు సభ్యుల్లోనే చాలా మందికి తెలియని ఈ అంశం గురించి సాధారణ ప్రజలకు అవగాహన ఉంటుందా ? భవిష్యత్తులో ఈ తరహా చట్టాలు తెచ్చే సమయంలో పాలకులు అప్రమ్తతంతో వ్యవహరించాలి.
కామన్ సివిల్ కోడ్‌పై 2020లో బీజేపీ ముందుడుగు వేయాలి. ఈ బిల్లుపై ఇప్పటి నుంచి చైతన్యం కల్పించాలి. ఈ కోడ్‌ను కుల,మతాలకు అతీతంగా ప్రతి పౌరుడు ఆహ్వానిస్తారు. భారత్‌లో ఒక్క గోవా రాష్ట్రంలోనే అన్ని మతాల ప్రజలకు కలిపి ఒకటే ఉమ్మడి సివిల్ కోడ్ అమలులో ఉంది. అక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాల వారికి ఒకటే పౌర శిక్షాస్మృతి అమలు చేస్తున్నారు. మనకు ప్రస్తుతం హిందూ వివాహ చట్టం 1955, ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ విడాకుల చట్టం, పార్శీ వివాహ, విడాకుల చట్టం అమలులో ఉన్నాయి. హిందువులకు దత్తత, మెయింటెనెన్స్ చట్టాలు ఉన్నాయి. ముస్లింలు, క్రైస్తవులు, పార్శీలకు దత్తత చట్టాలు లేవు. భారత్‌లో క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ 1973, ప్రత్యేక వివాహ చట్టం 1954, యూనిఫార్మ్ సివిల్ కోడ్ గోవా , మాత్రమే సెక్యులర్ చట్టాలుగా పిలుస్తారు. 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం భారత్ లౌకిక దేశం. ఈ దేశంలో ప్రభుత్వానికి మతం ఉండదు. నిజమైన సెక్యులర్ దేశంగా భారత్ అవతరించాలంటే ఉమ్మడి పౌర శిక్షాస్మృతి చట్టాన్ని తప్పనిసరిగా తీసుకురావాలి. ఆదేశిక సూత్రాల్లో 44వ అధికరణలో కూడా పార్లమెంటు ద్వారా ఉమ్మడి పౌర శిక్షాస్మృతి చట్టం చేసి అమలు చేయాలని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఉమ్మడి పౌర శిక్షా స్మృతిని పార్లమెంటు రూపొందించాలని ఆదేశించింది. సరళ ముద్గల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు సంచలమైన వ్యాఖ్యలు చేసింది. హిందువైన వ్యక్తి మతం మారినంత మాత్రాన రెండో పెళ్లి చేసుకునేందుకు వీలులేదని, మొదటి పెళ్లి మాత్రమే నిలుస్తుందని పేర్కొంది. అందుకే 2017లో ముస్లింల వివాహంలో ఉన్న తలాక్ చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చింది. పర్సనల్ లాతో సంబంధం లేకుండా పిల్లలు లేని వారు దత్తత తీసుకోవచ్చని కోర్టు చాలా సార్లు పేర్కొంది. జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ట్రన్ చట్టం 2000పై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భార్య సంపాదిస్తుందనే కారణంతో పిల్లలను చూసే బాధ్యత తనకు లేదని ఒక భర్త భావించడం తగదని ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో పేర్కొంది.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలోజరిగిన చర్చల్లో భాగంగా భారత్‌లో ఉమ్మడి పౌర శిక్షాస్మృతి అవసరమని పేర్కొన్నారు. కాని ఆ రోజుల్లో హిందువులు, ముస్లిం రాజకీయ నాయకులు అంబేద్కర్ ప్రతిపాదనను అంగీకరించలేదు. అందుకే అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలంటే, తప్పనిసరిగా ఉమ్మడి సివిల్ కోడ్‌ను రూపొందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. భారతదేశ రాజకీయాల్లో ఏ రంగంలో సంస్కరణలు తేవాలన్నా మొదట తీవ్రమైన విమర్శలు ఎదురవుతాయి. ఈ విమర్శలు, నిరసనలు రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా ఉండవు. 1956లో మన పార్లమెంటు హిందూ కోడ్ బిల్లును ఆమోదించింది. ఈ కోడ్‌ను చాలా మంది వ్యతిరేకించారు. ఆ నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కూడా ఉమ్మడి సివిల్ కోడ్ అవసరమని నొక్కి వక్కాణించారు. చివరకు వౌనంగా ఉండిపోయారు. బ్రిటీష్ ప్రభుత్వ కాలంలో ఆ నాటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇంయా లార్డ్ విలియం బెంటింక్ సతి సహగమనాన్ని 1829లో నిషేధించారు. దీనిని సతి రెగ్యులేషన్ చట్టమంటారు. అప్పట్లో ఈ చట్టాన్ని ప్రజలు వ్యతిరేకించారు. ఆ తర్వాత దేశమంతా ఈ చట్టాన్ని అమలు చేశారు. ఈ రోజుల్లో బెంగాల్‌లో సంస్కరణ వాదులు ఈశ్వర చంద్ర విద్యాసాగర్, రాజారామ్మోహన్‌రాయ్ లాంటి మహానుభావులు సతి సహగమనాన్ని నిషేధించాలని, వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహించాలని విశేషంగా ప్రచారం చేశారు. హిందూ వితంతువుపునర్వివాహ చట్టం 1856, మహిళా ఆస్తి చట్టం 1923, హిందూ వారసత్వ చట్టం 1928 తదితరమైన విప్లవాత్మక చట్టాలు బ్రిటీష్ వారి కాలంలో వచ్చాయి. మనకు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రత్యేక వివాహ చట్టం 1954కు పునాది 1872లో బ్రిటీష్ ప్రభుత్వం అంకురార్పణ చేసింది. మతాన్ని వదులుకుని వివాహం చేసుకోవాలనే నిబంధన ఉండడం, హిందువులకు మాత్రమే పరిమితం కావడంతో, ఈ చట్టం కాగితాలకే పరిమితమైంది. 1923లో ఇదే చట్టాన్ని సవరించి హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులకు వర్తింప చేశారు. ఈ చట్టం ప్రకారం మతాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. ఈ చట్టం కింద వివాహం చేసుకున్న వారికి వారసత్వంగా హక్కులు కూడా కల్పించారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత విశే్లషిస్తే హిందూ లా కమిటీ పార్లమెంటులో 1948 నుంచి 1951 వరకు, 1951 నుంచి 1954 వరకు హిందూ కోడ్ బిల్లుపై చర్చించింది. తొలి ప్రధాని నెహ్రూ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌లు ఉమ్మడి సివిల్ కోడ్ కోసం పోరాడారు. కాని సనాతన వాదులు తిరస్కరించారు. ఉమ్మడి సివిల్ కోడ్ ఉండాలని, హిందూ చట్టాలు అగ్రకులాల వారికి మాత్రమే ప్రయోజనకరమని, సెక్యులర్ దేశమంటే మతాలకు అతీతంగా ఉమ్మడి సివిల్ కోడ్ ఉండాలని అంబేద్కేర్ వాదించారు. తొలి రాష్టప్రతి డాక్టర్ రాజేంద్రప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో పాటు అనేక హిందూ జాతీయ వాద పార్టీలు, నేతలు ఉమ్మడిసివిల్ కోడ్ ఇప్పుడే అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో హిందూ వివాహ చట్టం, వారసత్వ చట్టం, మైనారిటీ, గార్డియన్ షిప్ చట్టం, దత్తత, మెయింటెనెన్స్ చట్టాలను ఆ నాటి పార్లమెంటు ఆమోదంచింది. 1985లో షాబానో కేసుపై సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. సెక్యులర్ దేశమంటూ పర్సనల్ లా వచ్చేసరికి ప్రతి మతానికి వేరుగా చట్టాలు ఉండడం తగదని కోర్టు పేర్కొంది. ఈ కేసులో షాబానోకు భరణం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాజీవ్ గాంధీ హయాంలోనే ముస్లిం మహిళ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డైవర్స్ 1986 చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది.సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పుల్లో త్రిపుల్ తలాక్ పద్దతి చెల్లదని పార్లమెంటు చట్టం చేయాలని ఆదేశించింది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఈ ఏడాది త్రిపుల్ తలాక్ రద్దు చేస్తూ కొత్త చట్టం చేసింది. ఉమ్మడి సివిల్ కోడ్ ఉన్న గోవాను పాలించిన పోర్చుగీస్ వలస ప్రభుత్వం ఉమ్మడిసివిల్ కోడ్‌ను అమలు చేశారు. ఆ పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది.
భారత్‌లో ఉమ్మడి సివిల్ కోడ్ అమలు అనుకున్నంత సులభం కాదు. 130 కోట్ల జనాభాలో 110 కోట్ల మంది హిందువులు, మిగిలిన జనాభాలో ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు. హిందూ వ్యవస్థలో అనేక కులాలు, జాతులు ఉన్నాయి. మన సంస్కృతిలో వివిధ సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. వీటికి అనుగుణంగా ఆయా ప్రాంతాల ప్రజలు జీవనం సాగిస్తుంటారు. కర్నాటకలో వీర శైవ విధానాన్ని ఆచరించే లింగాయత వర్గం తాము హిందువులు కామని, ప్రత్యేక మతంగా గుర్తించాలని కోరుతోంది. బ్రహ్మసమాజం పద్ధతులు పాటించే వారు కూడా తాము హిందువులు కామని చెబుతారు. సిక్కులు, పార్శీమతస్థుల్లో కూడా వివాహ సంప్రదాయాలు, పద్ధతులు వేరుగా ఉంటాయి. ముస్లింలు తమ పర్సనల్ లా షరియత్‌ను అనుసరిస్తారు. అన్ని వర్షాలను సంతృప్తిపరిచే విధంగా ఏ చట్టం ఉండదు. కాని వివిధ మతాలు, వర్గాలతో విలసిల్లుతున్న భారత్‌లో ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. పౌరసత్వసవరణ చట్టంపై భారతీయులకు వచ్చే నష్టం ఏమీ లేకపోయినా, కుహనా లౌకిక శక్తులు నానాయాగీ చేశాయి. కాని ఉమ్మడి సివిల్ కోడ్ విషయంలో ముందుగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్రం సమాయత్తం కావాలి. కనీసం ఏడాది పాటు ఉమ్మడి సివిల్ కోడ్‌పై ప్రజలకు సదస్సులు, సమావేశాల ద్వారా వివరించాలి. లేడికి లేచిందే పరుగు మాదిరిగా ఉమ్మడి సివిల్ కోడ్‌ను సిద్ధం చేసి రోజుల వ్యవధిలో పార్లమెంటులో ఆమోదించి చేతులు దులుపుకునే ప్రక్రియ మంచిది కాదు. ఉమ్మడి సివిల్ కోడ్‌పై ముందుగా పార్లమెంటు సభ్యులకు, రాష్ట్రప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించాలి. హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, ముస్లింలు, క్రైస్తవులకు చెందిన మత పెద్దలతో చర్చించాలి. వారిని గౌరవించి సూచనలు, సలహాలు వినాలి. హిందువులకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే పేటెంట్ హక్కులు తమకు ఉన్నట్లుగా బీజేపీ భావించడం తగదు. ప్రజల అభిప్రాయాలను స్వీకరించి, ప్రజాస్వామ్య బద్ధంగా ఉమ్మడి సివిల్ కోడ్‌ను రూపొందించి అమలు చేస్తే భారతావని లౌకిక సుగంధ పరిమళాలను వెదజల్లుతూ వికసిస్తుంది.

- కె. విజయశైలేంద్ర 98499 98097