మెయన్ ఫీచర్

ఐదేళ్లు కాదు.. ఐదు నెలలైనా ఉంటారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశ రాజకీయ చిత్రపటంలో చిత్రవిచిత్రాలకు కొదవలేదు. దేశంలో సంకీర్ణ యుగం ప్రారంభమైన అనంతర కాలంలో రా జకీయ పార్టీల నడుమ శత్రు,మిత్ర బంధాలు చిత్ర విచిత్రంగా మారి పోతున్నాయి. సుమారు ఓ పుష్కర కాలానికి ముందు మధుకోడా ఝార్ఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు. అంత వరకే అయితే అదేమీ చిత్రం కాకపోవచ్చును కానీ, ఆయనో స్వతంత్ర ఎమ్మల్యే.. ఒకే ఒక్కడు .. అయినా- బీజీపీ ప్రభుత్వాన్ని కూల్చే పవిత్ర కార్యంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అవసరార్థం ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెట్టింది. ఆ తర్వాత చాలా కథ నడిచింది. ఆయన మీద కుప్పలు కుప్పలుగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. కేసులు నడిచాయి, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. అయన పై విధించిన అనర్హత గడవు ముగియక పోవడంతో ఎన్నికల సంఘం కుదరదంటే, కోర్టును ఆశ్రయించారు, అయినా అనర్హత తొలగలేదు. ఆయన ఆస్తులు వందల కోట్లను దాటిపోయాయని అప్పట్లో చాలా చాలా కథనాలు వినవచ్చాయి. చివరాఖరుకు ఆయన బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా రుజువై జైలు శిక్షను అనుభ వించారు. నిజానికి ఇలా సొంత బలం లేకున్నా ముఖ్యమంత్రే కాదు, ప్రధాని పీఠాన్ని ఎక్కి దిగిన మహనీయుల కథలు చాలానే ఉన్నాయి. ఇలా అందలం ఎక్కించి అలా అధః పాతాళానికి తొక్కేయడంలో హస్తం పార్టీది అందెవేసిన చెయ్యి. దేవెగౌడ, చంద్రశేఖర్, గుజ్రాల్.. నిన్నకాక మొన్న కర్ణాటకలో కుమార్ స్వామి.. ఇలా కాంగ్రెస్ ఎత్తి కుదేసిన మహా నాయకులు చరిత్రలో చాలామందే ఉన్నారు.
అక్కడి నుంచి ప్రస్తుతానికి వస్తే ఎన్నికలకు ముందు ఒకరితో, ఎన్నికల తర్వాత వేరోకరితో సంసారం చేయడం ఇప్పుడు మూడు ముళ్ళ బంధం అంత పవిత్ర బంధంగా చెలామణి అవుతోంది. మహా రాష్ట్ర విషయానే్న తీసుకుంటే, ఎన్నికల బరిలో బీజేపీ - శివసేన కూటమి ఓపక్క, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ఆ పక్క నిలిచాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలో ఐదేళళు పాలించిన బీజేపీ శివసేన కూటమికి ప్రజలు మరొక అవకాశం ఇచ్చారు. మరో ఐదేళళు పాలించమని తీర్పు ఇచ్చారు. బీజేపీ కూటమిని 163, కాంగ్రెస్ కూటమిని 98 స్థానాల్లో గెలిపించి ఎవరి స్థానం ఏమిటో చక్కగా చెప్పారు. ఆ తర్వాత ఏమి జరిగింది, రాజకీయం ఎలా రంగులు మార్చింది, చివరాఖరికి ఏమి జరిగింది... అదంతా చరిత్ర. ఇప్పుడు మళ్ళీ ఆ కథంతా చెప్పుకోవలసిన అవసరం లేదు.అయితే,ఒకటి మాత్రం నిజం. బీజేపీ లోపల ఏమి మాట్లాడిందో,మిత్రపక్షం శివ సేనకు ఏమి హామీ ఇచ్చిందో ఏమో గానీ, కాషాయ కూటమికి ఓటేసిన ఓటర్లు మాత్రం తమ ఓటు ఫడ్నవీస్‌ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసేందుకు వేస్తున్నామన్న స్పృహతో, విశ్వాసంతోనే వేశారు. ఇది ఎవరూ కాదనలేని నిజం. కానీ, శివసేన ఫలితాలు వెలువడిన అనంతరం అడ్డం తిరగడంతో అంతవరకూ సజావుగా సాగిన కథ కూడా అడ్డం తిరిగింది.
అంతవరకు ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనే చేయని శివసేన అధినేత ఉద్దవ్ థాకరే ఏకంగా ముఖ్యంత్రి పీఠం ఎక్కి కూర్చున్నారు. నిజమే ముఖ్యమంత్రో, మంత్రో కావాలంటే ఎమ్మెల్యే కావాల్సిన అవసరం లేదు. ఆరునెలల్లో ఏదో ఒక సభకు ఎన్నిక కావాలనే నిబంధనకి లోబడి ఇంచక్కా ఎవరైనా ముఖ్యమంత్రి, మంత్రి, కాలం ఖర్మం కలిసొస్తే ఏకంగా ప్రధాన మంత్రి అయ్యేందుకు కూడా రాజ్యాంగం అనుమతించింది. ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రి కావడం పెద్ద విషయం, విశేషం కాదు. ఆ పదవి కోసం ఆయన వదులుకున్న విలువలు గురించి కూడా పెద్దగా ‘సూక్తి ముక్తావళి’ వినిపించవలసిన అవసరం లేదు. గొంగళిలో తింటూ వెంట్రుకలు రావద్దంటే కుదరదు. అదే సమయంలో ఇలాంటి అపవిత్ర అక్రమ సంబంధాల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది? ఎక్కడ ఆగుతుంది? అసలు ఆగుతుందా? లేదా? అన్న సందేహం ఎంత కాదన్నా ఎందరో కొందరిని అయినా ఎంతోకొంత ఆందోళనకు గురి చేస్తోంది.
మహారాష్ట్ర వ్యవహారంలో ఎవరు హీరో? ఎవరు విలన్? అని ఆలోచిస్తే, ఏ ఒక్కరూ ఏదీ కాదు, అందరూ అన్నీ. ఎటొచ్చి షరా మాములుగా ఓటరు మాత్రమే నవవుల పాలయ్యాడు.ఒకరికి ఓటేస్తే, ఇంకెవరో వచ్చి కుర్చీలో కూర్చోవడం, కావాలనుకున్న వారు కాకుండా పోవడంతో ఓటరు ప్రజస్వామ్య ప్రహసనంలో పావుగా మిగిలి పోయాడు. ఒక విధంగా ఓటరే ఓడి పోయాడు.
అది అంతటా ఉన్నదే కాబట్టి, అంతగా చింతించవలసిన అవసరం లేదని అనుకున్నా, ఇప్పుడు వ్రతం చెడ్డా శివసేనకు ఫలం అయినా దక్కుతుందా? అంటే అనుమానంగానే ఉంది. దేవ గౌడ,కుమార స్వామి ఇత్యాదుల సరసన ఉద్దవ్ థాకరే పేరు కూడా చేరుతుందా? అనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. నిజానికి ఈ అనుమానాలు మొదటి నుంచి ఉన్నవే అ యినా ఇప్పడు జరుగతున్న పరిణామాలతో అవి మరింత బలపడుతున్నాయి. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే సారధ్యంలో ఏర్పడిన మూడు పార్టీల, ‘మహా వికాస్ అఘాడీ ’ ప్రభుత్వం, ఇంకా పూర్తి స్థాయిలో కొలువు తీరలేదు. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్, మరో ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజులకుగానీ, మంత్రి వర్గాన్ని విస్తరించేలేదు. ఎట్టకేలకు చిట్టచివరకు గత వారంలో మంత్రి వర్గాన్ని అయితే, పూర్తి స్థాయిలో విస్తరించారు, కానీ, ఇంకా శాఖల కేటాయింపు క్రతువు పూర్తి కాలేదు.
నిజానికి, ‘అఘాడీ అడుగులు ఆరంభం నుంచి తడబడుతూనే ఉన్నాయి. అసలు కూటమి ఏర్పాటు అనేది ఒక ‘మహా’ క్రతువుగా సాగింది. శివసేనతో జట్టు కట్ట్టేందుకు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా సోనియా, రాహుల్ అటూ ఇటూ ఊగారు. మతతత్వ శివసేనతో కలిస్తే, తమ లౌకికవాద ‘మడి’ మంటకలిసి పోతుందని సోనియా చాలా చాలా బాధ పడ్డారు, ఆలోచించారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చి శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుపట్టిన నేపథ్యంలో, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని, ప్రతిపక్షంలో కూర్చుంటామని నైతిక నీతులు వల్లించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్, అందుకు విరుద్ధంగా చక్రం తిప్పారు. సోనియాను దారికి తెచ్చేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ద్వారా ఆమెపై వత్తిడి తెచ్చారు.అంతే కాదు, అజిత్ పవార్‌ను పావుగా చేసి అటో ఇటో తేల్చుకోమని కాంగ్రెస్ నాయకత్వానికి అల్టిమేటం ఇచ్చారు. చిన్న పవార్’ ను అటు పంపి కాంగ్రెస్ నాయకత్వాన్ని పోక చెక్కలో పెట్టి వత్తి పట్టి, అఘాడీ వైపు అడుగులు వేయించారు.
తాజా పరిణామాలను గమనిస్తే, అఘాడీ ప్రభుత్వం సుస్థిరత మీద సందేహాలు బలపడుతున్నాయి. మంత్రి వర్గంలో స్థానం ఆశించి భంగపడిన వారు మూడు పార్టీలలోనూ ఉన్నారు. కొందరు బయట పడితే ఇంకొందరు వౌనంగా సమయం కోసం వేచిచూస్తున్నారు .చివరకు ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్రను పోషించిన శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తాన్ సోదరుడికి మంత్రి వర్గంలో స్థానం దక్కనందుకు అలక వహించారు. మంత్రి వర్గం ప్రమాణ స్వీకారానికి కొంచెం దూరంగా ఉన్నారు. ఇక శాఖల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉంది. మీరూ మీరూ బానే ఉన్నారు .. మరి మాపరిస్థితి ఏమిటని ఎన్సీపీ, శివసేనను ప్రశ్నిస్తోంది. శివసేనకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది, మరి మాకేమొచ్చింది? అని కాంగ్రెస్ నాయకులు శాఖల కేటాయింపునకు బ్రేకులు వేస్తునారు. వ్యవసాయం లేదా సహకారం కాదంటే గ్రామీణ అభివృద్ధి శాఖల్లో కనీసం రెండు శాఖలు తమకు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ మూడు కీలక శాఖలను ఎన్సీపీ, శివసేన పంచేసుకున్నాయి. గ్రామీణాభివృద్ధి, సహకార శాఖలు ఎన్సీపీ, వ్యవసాయం శివసేన తమ ఖాతాలో వేసుకున్నాయి. వ్యవసాయ శాఖను వదిలిపెట్టం అని శివసేన ‘సామ్నా’ లో స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ జరిగి వారం రోజులు అయినా ఇంతవరకు శాఖల కేటాయింపు పూర్తి కాలేదు.
ఈ వ్యవహారాలు ఇలా ఉంటే అన్నిటినీ మించి, కాంగ్రెస్ - శివసేన మధ్య గల సైద్ధాంతిక విబేధాలు మెల్ల మెల్లగా ముదురు తున్నాయి. పార్లమెంట్’ లో పౌరసత్వ సవరణ బిల్లుకు శివసేన అనుకూలంగా ఓటు వేసింది. దీనిపై కాంగ్రెస్ భగ్గుమంది. శివసేన పిల్లి మొగ్గలు వేసింది. ఆ తర్వాత హిందూ ధర్మానికి, జాతీయ వాదానికి ప్రతీకగా నిలిచిన వినాయక దామోదర్ సావర్కర్‌ను అవమానించే విధంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు శివసేనను చికాకుకు గురి చేసింది. ఈ సమయంలోనే సేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషీ కాంగ్రెస్ తో కలసి సాగడం కుదిరే వ్యవహారంగా కనిపించడం లేదని, మళ్ళీ బీజేపీతో కలిసే అవకాశం లేక పోలేదని బహిరంగంగానే కాంగ్రెస్ వైఖరిని తప్పు పట్టారు. సామ్నా పత్రిక సంపాదకుడు, శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కూడా రాహుల్ గాంధీ, ‘తాను రాహుల్ గాంధీనే గాని, రాహుల్ సావర్కర్’ను కాదంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు. ఆ అగ్గి ఇంకా పూర్తిగా చల్లారక ముందే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ‘సేవాదళ్’ ‘వీర్ సావర్కర్ కిత్నే వీర్?’ పేరిట ప్రచురించిన పుస్తకంలో సావర్కర్, గాడ్సేల మధ్య శారీరక సంబంధం ఉందని అవమానకరంగా మాత్రమే కాదు, అసభ్యకరకరంగానూ వ్యాఖ్యలు చేసింది. ఇందుకు ఎక్కడో ఎవరో ఏదో పుస్తకంలో రాసిన ఎల్లో రాతలను ఆధారంగా చూపింది. ఈ విషయంలో ఇప్పడు పెద్ద దుమారమే చెలరేగుతోంది. సంజయ్ రౌత్- ‘ఈ రాతలు రాసిన కాంగ్రెస్ పార్టీ బుర్రలో మట్టి పేరుకు పోయింది’ అని తీవ్రంగా ఎదురుదాడి చేశారు. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారినా ఆశ్చర్య పోనవసరం లేదని పిస్తోంది.
ఈ పరిణామలన్నిటినీ గమనిస్తే ’మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం నిండు ఐదేళళు కాదు, నిండా ఐదు నెలలు కూడా మనుగడ సాగించడం అయ్యే పని కాదనే అభిప్రాయం బలపడుతోంది. నిజానికి, ఎంత చెడినా వౌలిక సిద్ధాంతాలను వదిలి అధికారం కోసం కోసం అర్రులు చాస్తే, ఆ బంధం అట్టే కాలం నిలవదు. జమ్మూ- కశ్మీర్ లో బీజీపే- పీడీపీ సంకీర్ణం ఎలా కుప్ప కూలిందో చూశాం. అలాగే పెద్ద పార్టీ లేదా కూటమి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపడం అంత ఈజీ వ్యవహారం కాదు. కర్ణాటకలో కుమార్ గౌడ అధికారంలో ఉన్న సంవత్సర కాలంలో ఎన్ని సార్లు కళ్ళ నీళళు పెట్టుకున్నారో.. ఎన్నిసార్లు చెంపలు వేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చివరాఖరులో చెప్పేది ఏమంటే.. శివసేన వ్రతం అయితే చెడింది గానీ, ఫలితం మాత్రం అనుమానమే.. మహా వికాస్ అఘాడీ ..ఘాడీ .. ఏ క్షణంలో అయినా ... పాపం క్షమించుగాక...!

-రాజనాల బాలకృష్ణ 99852 29722