మెయిన్ ఫీచర్

జ్ఞానార్జనే తరుణోపాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
పరమాత్మ జ్ఞానశక్తికి పరిధులు లేవు. కాని, ప్రకృతి నుండి సంక్రమించిన తామసగుణముయొక్క ఆవరణ శక్తి, జీవాత్మ జ్ఞానశక్తిని కప్పిపుస్తున్నది. ‘‘అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః’’ (ప్రాణుల జ్ఞానము, అజ్ఞానముచే కప్పబడి ఉన్నందువలన వారు మోహితులౌతున్నారు- భ.గీ.5-15).
అజ్ఞానము, జ్ఞానప్రాప్తితో తొలగిపోతుందని స్పష్టముచేయటానికి, దృష్టాంతముగా రాహుగ్రస్త సూర్యబింబము ప్రస్తావించబడింది. గ్రహణ సమయములో రాహుగ్రహము సూర్యునకు అడ్డముగా వచ్చి బాధించినా, కొద్దివ్యవధిలోనే ఆ దుష్టశక్తి అంతవౌను. అట్లే, మానవుని అవివేకము తామసగుణ నివృత్తితో జ్ఞానసాధన ద్వారా నాశనమై పోవును. దృఢ సంకల్పముతో జ్ఞానార్జన తప్ప, అజ్ఞాన నివృత్తికి వేరొక ఉపాయము లేదు.
142. తిరోభూతే స్వాత్మ న్యమలతర తేజోవతి పుమాన్
అనాత్మానం మోహాదహమితి శరీరం కలయతి
తతః కామక్రోధ ప్రభృతిభి రముం బన్ధకగుణైః
పరం విక్షేపాఖ్యా రజస ఉరుశక్తి ర్వ్యథయతి॥
స్వతఃసిద్ధముగా అత్యంత నిర్మలము, తేజోమయ స్వరూపమైనది జీవాత్మ. అయినప్పటికీ తమోగుణము ఆవృతమై ఉండగా అజ్ఞాని, శరీరమే నేను అనే అపోహతో ప్రవర్తించును. అంతేకాక, రాజస గుణముయొక్క విక్షేప శక్తిచే ప్రభావితమైన కారణంగా కామక్రోధాది గుణములు ఆ వ్యక్తిని పునఃపునః సంసారబంధములో పడవేసి, వాని జీవితమును దుర్భరము చేయును. స్మృతి దీనినే ఇలా బోధిస్తున్నది-
‘‘సత్త్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏ వచ
ప్రమాదమోహౌ తమసో భవతో‚ జ్ఞానమేవచ॥
(సత్త్వగుణమువలన జ్ఞానము, రజోగుణమువలన లోభత్వము, తామస గుణమువలన ప్రమాదమోహాదులూ, అజ్ఞానము ఉత్పన్నమగుచున్నవి- భ.గీ.14-17).
143. మహామోహ గ్రాహగ్రసన గలితాత్మావగమనో
ధియో నానావస్థాః స్వయ మభినయం స్తద్గుణతయా
అపారే సంసారే విషయ విషపూరే జలనిధౌ
నిషుజ్జ్యోన్మజ్జ్యాయం భ్రమతి కుమతిః కుత్సితగతిః॥
అవిద్యారూపమైన మోహమనే మొసలి మ్రింగగా, ఆత్మ యథార్థ జ్ఞాన స్వరూపమును పోగొట్టుకొని, ఉపాధి వశమున వచ్చిన తామస రాజస గుణములతో ఆవృతమైన బుద్ధితో, ఇక్కట్లుకుపాలై మానవుడు వ్యవహరించును. మనోనిగ్రహము కోల్పోయి, కుత్సిత బుద్ధికారణంగా హీనకర్మలు చేయుటకు కూడ వెనుకాడడు.
రాహుగ్రస్తమైన సూర్యుడు, తన తేజోరూపమును గ్రహణకాలములో కోల్పోయినట్లు, విషయములనే విషప్రవాహమైన సంసారమనే దాట శక్యముకాని సముద్రములో పడిపోవగా, అవివేకి దానినుండి బయటపడలేక, మునుగుతూ-తేలుతూ, అత్యంత దుఃఖమయ జీవితమును అనుభవించును.
144. భానుప్రభా సంజనితాభ్రపంక్తి
ర్భానుం తిరోధాయ యథా విజృమ్భతే
ఆత్మోదితాహంకృతి రాత్మతత్త్వం
తథా తిరోధాయ విజృమ్భతే స్వయమ్‌॥
సూర్యరశ్ముల ద్వారా ఉత్పన్నమైన మేఘముల పంక్తి (మేఘమాల) సూర్యకాంతిని అడ్డుకొని విజృంభించిన రీతిలో, ఆత్మప్రకాశముతో అహంకారము విజృంభించి, ఆత్మతత్త్వమును కనుమఱుగుచేస్తూ, తానే ఆత్మగా అభాసరూపములో ప్రకటితవౌతున్నది. యథార్థతః అహంకారమునకు ఆత్మగుణములేవి లేనే లేవు. అయినా, ఆత్మను కప్పిపుచ్చి తాను విజృంభించి, ‘నేనుగా’ వ్యవహరిస్తున్నది.
ఆవరణ విక్షేప శక్తులు
145. కబలితదిన నాథే దుర్దినే సాన్ద్రమేఘై
ర్వ్యధయతి హిమఝంఝావాయు రుగ్రో యథైతాన్‌
అవిర తమసాత్మన్యావృతే మూఢబుద్ధిం
క్షపయతి బహుదుఃఖై స్తీవ్ర విక్షేపశక్తిః॥
కారుమబ్బులు సూర్యుని కమ్ముకొనగా, దుర్దినములో తీవ్రమైన మంచుగాలులతో జనులు ఎట్లు క్లేశమును అనుభవింతురో, అట్లే పెరిగిన తామసగుణము ఆవరించగా, మూర్ఖపు బుద్ధిగలవానిని తీవ్ర విక్షేపశక్తి దుర్గతిపాలుచేసి నాశనము చేయును.
‘‘తథా ప్రలీనస్తమనీ మూఢయోనిషు జాయతే’’ (తామస ప్రవృత్తిగల మనిషి మరణానంతరము మరల పశుపక్ష్యాది హీనజన్మనే పొందును- భ.గీ.14-15). వివేకశూన్యుడైన మూర్ఖుడు, జీవితకాలము దుఃఖమును అనుభవిస్తూ, ఏనాడూ జనన మరణవలయమునుండి బయటపడలేడు.
146. ఏతాభ్యా మేవశక్త్భ్యిం
బన్ధః పుంసః సమాగతః
యాభ్యాం విమోహితో దేహం
మత్వాత్మానం భ్రమత్యయమ్‌॥
అజ్ఞానమునకు మూలమైన తామస, రాజస గుణముల ఆవరణ విక్షేపశక్తులు రెండూ చేరగా మనిషి బద్ధుడైపోవును. ఈ రెండు శక్తుల మోహజాలములోపడి, దేహమే ఆత్మ అనే అపోహతో, జనన మరణ చక్రంలో చిక్కుకొని క్రిందకూ-మీదకూ (అధో లోకాలకు- ఊర్ధ్వలోకాలకు) పరిభ్రమిస్తూ ఉంటాడు.నిత్యానిత్య జ్ఞానం లేని అవివేకి జనన మరణములను అధిగమించలేక, పాపకర్మల కారణంగా నరకాది అధోలోకములకు పోవలసి వచ్చును.
పాపక్షయముకాగా మరల ఈ లోకంలో జన్మించి, పుణ్యకర్మల ఫలితంగా స్వర్గాది ఊర్ధ్వలోకాలకుపోయినా మరల పుణ్యఫలము క్షీణించగా తిరిగి ఈ లోకానికి రాకతప్పదనే స్మృతి నిర్ధారిస్తున్నది (్భ.గీ.9-21).
- ఇంకావుంది...