మెయిన్ ఫీచర్

చైతన్య స్వరూపమే ఆత్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
పరిపూర్ణ జ్ఞానముతో శాశ్వత సుఖమును ప్రసాదించే ఆత్మసాక్షాత్కారమును చేసికొని, అతను అంతులేని ఆనందానుభూతిని పొందును.
155. ముంజాదిషీకా మివ దృశ్యవర్గాత్
ప్రత్యంచమాత్మాన మసంగ మక్రియమ్‌
వివిచ్య తత్ర ప్రవిలాష్య సర్వం
తదాత్మానా తిష్ఠతి యః ముక్తః॥
ముంజగడ్డినుంచి మొవ్వ (నారను) వేరుచేసినట్లు, దృశ్యవర్గము నుంచి నిత్యము, సంగరహితము, క్రియారహితమైన ప్రత్యగాత్మను వేరుచేసి, స్వస్వరూపమైన ఆత్మలో అనిత్యమైన యావత్ప్రపంచమును విలీనము ఎవడు చేయునో అతడే ముక్తుడు.
శ్రుతి దీనినే ఇలా నిర్ధారిస్తున్నది. ‘‘అంగుష్టమాత్రః పురుషో‚ స్తరాత్మా సదా జనానాం హృదయే సన్నివిష్టః, తన స్వాచ్ఛరీతాత్ ప్రవృహేత్ ముంజాది వేషీకాం ధైర్యేణ తం విద్యాచ్ఛుక్రమమృతమ్’’
(ముంజగడ్డి నుండి సూక్ష్మమైన నారను వేరుచేసినట్లు, జ్ఞానముతో హృదయగుహలోనున్న ఆత్మను శరీరముతో వేరుపరచి, ఆత్మశుద్ధమైన బ్రహ్మస్వరూపమని తెలిసికొనవలెను- క. ఉ.2- 6- 17).
అన్నమయకోశము

156. దేహో‚ యమన్నభవనో‚ న్నమయస్తు కోశో
హ్యనే్నన జీవతి వినశ్యతి తద్విహీనః
త్వక్చర్మమాంస రుధిరాస్థిపురీషరాశిః
నాయం స్వయం భవితు మర్హతి నిత్యశుద్ధః॥
ఈ శరీరము అన్నపానాదులతో ఏఎర్పడుతున్నది మరియు అన్నముతోనే వృద్ధిచెంది నిలుస్తున్నది. అన్నము (ఆహారము) లేనిచో అది నశించిపోవును. త్వక్, చర్మం, మాంసము, రక్తము, ఎముకలు, మలముతో కూడుకొనిన శరీరము క్షయమగుట నిశ్చితము. కల్మష పూరితము, అశాశ్వతమైన శరీరమునకు, నిత్యనిర్మలమైన ఆత్మ అయే అర్హత లేదు.
‘‘అన్నాద్ధ్వేవ ఖల్విమాని భూతాని జాయంతే అనే్నన జాతాని జీవంతి’’ అని శ్రుతి వచనం (అన్నము తినుటవలనే సమస్త ప్రాణులు జన్మిస్తున్నవి. దాని కారణముగానే జీవిస్తున్నవి- తై.ఉ.3-2).శరీరము వృద్ధిక్షయములనే వికారములను పొందును. ఆత్మకు ఎటువంటి వికారములు లేవు. ‘‘అంతవస్త ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః’’ అని స్మృతి బోధన. (ఈ శరీరములన్నీ నశించును, కాని జీవాత్మ ఎన్నడూ నశించడు- భ.గీ.2-18).
157. పూర్వం జనేరపి మృతేరధ నాయమస్తి
జాతక్షణక్షణగుణో‚ నియతస్వభావః
నైకో జడశ్చ ఘటవత్పరి దృశ్యమాన
స్వాత్మా కథం భవతి భావవికారవేత్తా॥
ఈ శరీరము ఉత్పత్తికి ముందులేనిది, మరణానంతరము ఉండనిది, క్షణక్షణము మార్పులను పొందేది, అనిశ్చిత స్వభావముగలది, ఇంకా అనేకావస్థలలో వికారములకు స్థానమైనది. ఘటాది జడ పదార్థములవలె ప్రత్యక్షముగా కన్పిస్తున్న ఈ శరీరము, భావ వికారములను గ్రహించే చైతన్యవంతమైన ఆత్మ ఎట్లగును?
158. పాణిపాదాదిమాన్ దేహో నాత్మా వ్యంగే‚ పి జీవనాత్‌
తత్తచ్ఛక్తే రనాశాచ్చ న నియమ్యో నియామకః॥
చేతులు, కాళ్లు మొదలైన అంగములతోనున్న దేహధారుడు, ఆ అంగములు లేకపోయినా మరణించడు, జీవించే ఉండును. ఆత్మ ప్రాణ వ్యాపారమునకు కావలసిన శక్తిని ప్రసాదిస్తున్నందువలన, పాణిపాదాది శరీరాంగములు నశించక ఉన్ననూ, లేకపోయిననూ వ్యక్తి జీవనయాత్ర కొనసాగును. దేహము నియమించబడేది, ఆత్మ నియామకము. నియమించబడేది, నియమించేది కాజాలదు.
‘‘ప్రాణస్య ప్రాణం’’అని ఆత్మను శ్రుతి నిర్దేశిస్తున్నది. (ప్రాణమునకు ఆధారమైనది ఆత్మ-బృ .ఉ.4-4-18).
159. దేహ తద్ధర్మ తత్కర్మ తదవస్థాది సాక్షిణః
సత ఏవ స్వతః సిద్ధం తద్వైలక్షణ్య మాత్మనః॥
దేహధర్మములు అన్ని ప్రాణులకు సామాన్యము. శబ్దాదుల గ్రహణతో, క్షుత్పిపాసలను తీర్చుకొనుటకు, విసర్జనాదులు చేయుటకు, సంతానోత్పత్తివంటి కార్యములను నిర్వర్తించుకొనుటకు అనుకూలముగా వివిధ ప్రాణుల దేహములు వివిధ రకములుగా నిర్మితమైనవి. అయిననూ వృద్ధిక్షయాది వికారములు దేహధర్మములు. బాల్యకౌమార వార్ధక్యావస్థలలో కాలానుగుణముగా వచ్చే మార్పులు అన్ని ప్రాణులలోను స్పష్టముగా ప్రకటితవౌతాయి.
స్వతఃసిద్ధ శరీర ధర్మములకు విలక్షణమైనది ఆత్మ. ఆత్మసాక్షి, శయనాది వికారములు లేనిది, క్షుత్పిపాసలులేనిది మరియు ఏవిధమైన కర్మసంబంధములేనిది. ఉపాధినాశ్రయించి ఉన్న శరీరధారుని సమస్త కార్యములను వీక్షిస్తూ సర్వస్వతంత్రముగా వ్యవహరించే ఆత్మ చైతన్యవంతమైన జ్ఞానస్వరూపము.
160. శల్యరాశి ర్మాంసలిప్తో మలపూర్ణో‚ తికశ్మలః
కథం భవేదయం వేత్తా స్వయ మేతద్విలక్షణః॥
ఎముకల రాశి, మాంసముతో కలసి ఉన్నది, మలాదులతో నిండి ఉన్నది, నానారకములైన దుర్గంధ పదార్థములతోను, ఇంకనూ అత్యంత కలుషిత పదార్థములతోను కూడుకొన్న ఈ దేహము, నిత్యనిర్మలమైన ఆత్మ ఎట్లగును?
- ఇంకావుంది...