మెయన్ ఫీచర్

అమరావతి కింకర్తవ్యం!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి... అయిదున్నర ఏళ్ల క్రితం ఉమ్మడి నుండి వైదొలిగి కొంగొత్త రూపులద్దుకొనేందుకు సాగిన పయనం. ఒడుదుడుకులు ఎదురైనా అలా...అలా... సాగుతున్న తరుణంలో ఉద్విగ్నభరిత వాతావరణం ఆవరించింది. ఇంటా, బయటా హోరెత్తిన ఆ పద చప్పుళ్లు ఒక్కసారిగా మూగబోయాయి. ఆవేదనలు, ఆక్రందనలు తెరపైకొచ్చాయి. సమన్యాయం, సమధర్మం మాటెలా ఉన్నా అంతిమ తీర్పుపైనే ప్రతి ఒక్కరి సందేహం. కారణం ఎవరు? ఎందుకిలా? ఎన్నాళ్లిలా? ఏం జరగనుంది? సమాధానం లేని ప్రశ్నల సమాహారం. అందరిలోనూ నిర్లిప్తత.. ఆందోళన...!
రాష్ట్ర ప్రకటన అనంతర పరిణామాల్లో నూతన ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. ఆ తరుణాన రాజధాని అమరావతిలోను ఎటుచూసినా కొత్తకొత్త ఆవిష్కరణలు, నిర్మాణాలు పెద్దఎత్తున సాగుతున్నాయి. వీటన్నింటికి ఎంత ఖర్చవుతుంది? ఎలా తెస్తారు? రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆమేర నిధులున్నాయా? ఎలా ముందుకెళ్తారు? ఇత్యాది సందేహాల్ని పట్టించుకున్నవారే లేదు. డబ్బుల్లేవంటూ... ఖాళీ చేతులతో ఇల్లు చేరామంటూ గత ప్రభుత్వం ఏకరవుపెట్టినా, పాలనా కాలంలో బోలెడు బిల్డింగులు కట్టినా, టవర్లకు శంకుస్థాపనలు జరిగినా ఇక్కడి చుట్టుపక్కల జనం, బయట ప్రపంచం పెద్దగా పట్టించుకున్న దాఖలాల్లేవు.
గత శాసనసభ ఎన్నికలయ్యాక కొత్త ప్రభుత్వం కొలువు తీరాక, ఎన్నడూ లేని విధంగా వివాదాల సుడిలో రాజధాని చిక్కుకుంది. దాదాపు ఏడు నెలల క్రితం పరిస్థితిని, ఇప్పటి పరిణామాలను పోల్చి చూసుకున్నప్పుడు అంతులేని అగాధం మనకు కళ్లకు కట్టింది. సీన్ రివర్సయింది. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. దీనికి కారణం ఎవరు? ఎందుకిలా? ఎవరివల్ల? ఏమిటిది?... వగైరా సందేహాలకు సమాధానమే కరువైంది. ప్రజల్ని మభ్యపెట్టి రాజ్యాన్ని దునుమాడారని, విచక్షణ లేని దోపిడీ జరిగిందంటూ అక్రమాలు, అవినీతికి ఎన్నో సాక్ష్యాలున్నాయని ప్రస్తుత పాలక పక్షం కొత్త డైరీని తెరిచింది. అప్పటికప్పుడు ఉన్నఫళంగా నిర్మాణాలను ఆపేసింది. ఇప్పుడక్కడ కార్మికుల బూట్ల చప్పుళ్లు లేవు. ఇనుప సమ్మెటలు కానరావు. ప్రొక్లెయిన్‌ల గర్జనలు లేనే లేవు. కొన్ని నిర్మణాలు పూర్తయి, కార్యకలాపాలు సాగిస్తుండగా, మరికొన్ని నేలచూపులు చూస్తున్నాయి. అరకొర పనులు, ఉపాధి ఊసులు కనుమరుగయ్యాయి. అసలు ఈ అమరావతి నగరి ఉంటుందా? ఉండదా? అనే జవాబు దొరకని ప్రశ్నలు అందరి మెదళ్లనూ తొలుస్తున్నాయి. నిజానికి రాష్టమ్రంతటా, ఇరుగుపొరుగుల నోళ్లలోనూ నానుతోంది.
కొత్త రాజధాని ఆవిష్కరణతోపాటు తమ ప్రాంతాన్ని అభివృద్ధిలో అందనంత ఎత్తుకు తీసుకెళుతుందని రాజధాని ప్రాంత రైతులు భారీగా భూసమీకరణకు తలూపారు. గత పాలకులకు సహకరించారు. ఇంతలో ఎన్నికల దరిమిలా కొత్త సర్కారు వచ్చాక సీన్ రివర్స్‌లో పడింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి... వికేంద్రీకరణతో భవిష్యత్తులో అభివృద్ధిని కొత్త పుంతల్లోకి తీసుకెళ్లేందుకు ఇదే తరుణమంటూ 3 రాజధానుల ప్రక్రియను తెరపైకి తెచ్చారు. జరుగుతోన్న తతంగంపై అధ్యయనాలు, కమిటీలు, చర్చలు మాటెలా ఉన్నా.. ఇప్పటికిప్పటికైతే రాష్ట్రంలో గందరగోళం, అయోమయం నెలకొన్నాయని చెప్పుకోక తప్పదు. మరోవైపు ప్రధానంగా రాజధాని ప్రాంత కీలక జిల్లాలైన గుంటూరు, కృష్ణా చుట్టుప్రక్కల చాలాచోట్ల నిశ్శబ్ద వాతావరణమే నెలకొని ఉంది. అప్పట్లో ఇసుక కొరత లాంటి ఇబ్బందికర పరిస్థితులున్నా, ప్రస్తుతం సీన్ మారడంతో, అసలు రాజధాని ఎక్కడ? అనే సందేహంతో పలుచోట్ల అమలు చేయాలనుకున్న నిర్మాణాలను కూడా ఆపేస్తున్నారు. ఇక నివాస యోగ్యమైన ఇళ్లు, ఫ్లాట్లు, షాపులు, మాల్స్‌ల అద్దెలు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. వ్యాపారాల్లో సైతం తిరోగమనం చోటుచేసుకున్నట్లు ఆ వర్గాలనుంచి వినవస్తోంది. పెట్టుబడులు పెట్టి తమ సంపదను వృద్ధిచేసుకోవాలనుకున్నవారు సైతం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితి ఎన్నాళ్లో అనుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఇక రాజధాని రైతుల విషయానికొస్తే... వారిది అంతులేని ఆవేదన. దాదాపు 20రోజులు పైగా రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. చిన్నా, పెద్దా, రైతులుసైతం తమ భవిష్యత్తుపై క్షోభను అనుభవిస్తున్నారు. కారణం...గత పాలకుల మాటలు నమ్మి భూములిచ్చేందుకు ముందుకు కదిలారు. ఈ రాజధానుల యోచన రావడంతో సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ భూములపై ఏదొక పరిష్కారం చూపుతామని పాలక ప్రభుత్వం పేర్కొంటున్నా, డబ్బుల్లేవంటూ ఇప్పుడు చెబుతున్న మాటలు ఎలా నమ్మాలి! ఇది అయ్యేపనేనా? అంటూ ఇవతలి పక్షం నుంచి రైతులు గర్జిస్తున్నారు. ఒకవేళ వెనక్కిస్తే... ఆ భూములు ఇప్పుడు సాగుకు పనికొస్తాయా? మామూలు సాగు రోజుల్లోనే ఏడాదికేడాది భూమి చదును, గట్లు, కలుపులు తీయడం వగైరా పనుల నిరంతరం చేస్తేనే సాగుకు ఉపకరిస్తాయన్నది తెలియదా? ఇలాంటివెన్నో అంశాలు రైతుల దృక్కోణంనుంచి పెల్లుబుకుతున్నాయి. ఏడు నెలలుగా ఏమీచేయకపోవడంతో అక్కడి ప్రజల్లో అనుమానం బాగా బలపడింది. రాజధాని తరలింపు ఊహించలేదు. ప్రభుత్వాన్ని నమ్మి భూములిస్తే, ఇప్పుడు మేమేం కావాలి? రైతులకు అన్యాయం జరగదని అంటున్నారే తప్ప, ఎలా న్యాయంచేస్తారన్నది చెప్పడం లేదు. అదే మహిళలకు ఆవేదన కలిగిస్తోంది.
ప్రాథమికంగా మన దేశం వ్యవసాయ ఆధారిత రాజ్యం. అగ్రభాగం వ్యవసాయాధారిత కుటుంబాలే. పట్టణీకరణ కొత్తపుంతలు సంతరించుకున్నా వ్యవసాయమే నేటికీ మన వ్యవస్థలో భాగమై ఉంది. రైతే రాజన్నది నానుడి. రైతు సుభిక్షంగా ఉంటేనే ఎవరికైనా సుఖఃసంతోషం... ఇలాంటి పరిస్థితుల్లో జనహితాన్నికోరి కొంతమేర స్వలాభంఉన్నా రాష్ట్రంకోసం భూములిస్తే... మాకీ దుర్గతి ఏమిటన్నది... ఎదురు ప్రశ్న. తమ జీవన పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతోందని వారంటున్నారు. కారుణ్య మరణాలను కోరుకుంటూ రైతులు లేఖలు రాస్తున్నారంటే వారి గుండె కోత ఏపాటిదో చెప్పకనే చెబుతోంది. రాజధాని నిర్మాణాలను నమ్ముకుని సంబంధిత పనులకోసం పెట్టుబడులు పెట్టి రంగంలోకి దిగిన వ్యాపారులు సైతం తాము తీసుకొన్న రుణాలు, వాయిదాలు చెల్లించలేక సతమతవౌతున్నారు. అనుబంధ రంగాల ఉత్పత్తుల విక్రయాలు, వ్యాపారులపై తీవ్ర ప్రభావాన్ని పరిశీలకులు ప్రత్యేకిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే... అమరావతి అంతటా ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’ పదం ప్రతిధ్వనిస్తోంది. చంద్రబాబు హయాంలో భూముల్ని లెక్కకుమించి ఆక్రమించారని, తమవద్ద నివేదిక ఉందని సీఎం జగన్ పేర్కొంటున్నారు. నిజాల సంగతేమోగానీ... దీని చుట్టూనే ప్రస్తుత రాజకీయం పరుగులు పెడుతోంది. అదే వాస్తవమైతే సంబంధితులను శిక్షిస్తే సరి లేకుంటే తప్పుల్ని సరిదిద్ది జరిమానాలు విధించాలి, కాకుంటే జైళ్లకు పంపించాలి, న్యాయస్థానాలకు అప్పగించాలి అంతేకానీ ఇలాచేయడం ఎంతవరకు సమంజసం? భూముల వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని అసలు రాజధాని మార్పునకే పూనుకోవడమేమిటి? ఏ ఒక్కరిపైనో కక్షతో, వ్యతిరేకతతోనో ఇలాచేయడం కరక్టేనా? నష్టపోతున్నది/ నష్టపోయేది ఎవరు?... తదితర ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఆనాడు అందరి సమ్మతితోనే, అసెంబ్లీ తీర్మానం ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని లిఖించబడింది కదా! అప్పటి, ఇప్పటి పాలక పక్షాలు, విపక్షాలు సరేనంటేనే నవ్యాంధ్ర రాజధాని నగరికి అడుగులు పడిందంటూ రాజకీయ విశే్లషకులు వక్కాణిస్తున్నారు.
ఇక విశాఖ ప్రతిపాదిత రాజధానిపై భిన్న స్వరాలున్నాయి. ప్రాంతాల వారీగా మిశ్రమ స్పందనలు వెల్లడవుతున్నాయి. రైతులు, ఉద్యోగులు, స్థానికులు, వ్యాపారులు, సాధారణ ప్రజానీకం రాజధాని అంశంపై ఇంకా ఇంకా సందిగ్ధతనే ఎదుర్కొంటున్నారు. రాజధానులపై పూర్తి స్పష్టత వచ్చేదాకా సంక్లిష్టత వీడేవరకూ ఈ పరిస్థితే ఉండొచ్చనే వాదనా వినిపిస్తోంది. అన్నీ సర్దుకునేందుకు కొన్నిరోజులు, కొన్ని నెలలైనా పట్టొచ్చని నిపుణుల అంచనాగా ఉంది.
వివిధ రాజకీయ పక్షాలు, ప్రజలమధ్య ఏకాభిప్రాయంకోసం ప్రయత్నం చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటే మేలన్న వాదనకూడా ఉంది. వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి ప్రాజెక్టులను తరలించడం, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యతనివ్వడం, స్థానిక సంస్థలకు ఎక్కువ అధికారాలు, నిధులిచ్చి బలోపేతం చేయడం ఇప్పటి తక్షణ కర్తవ్యంగా పేర్కొనవచ్చు. అన్నింటికి మించి అసెంబ్లీ ఓచోట, సచివాలయం ఓ చోట, హైకోర్టు మరోచోట ఇది పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా కష్టతరవౌతుందా? అనేది వేచి చూడాల్సి ఉంది.
చివరగా.. రాజధానుల నిర్ణయాలపై పలు సూచనలు ఆవిష్కృతవౌతున్నాయి.
* సమస్యను సజీవంగా ఉంచి, పరిష్కార మార్గాలను వెల్లడించకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, నిధులు ఇవ్వకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్న కేంద్రంపై ఒత్తిడి పెంచడం.
* ప్రజలు, ప్రజాసంఘాలతో చర్చలు జరపడం.
* అఖిల పక్షం నిర్వహించి సాధ్యాసాధ్యాలపై చర్చించడం.
* రాజధానిపై ఎవరికి తోచిన విధంగావారు మాట్లాడడాన్ని నిరోధించడం.
* నిపుణులు, కమిటీలు సమర్పించిన నివేదికలను ప్రజలముందు బయటపెట్టడం
* అమరావతి, ఉత్తరాంధ్రలో జరిగిన/ జరుగుతున్న భూముల వ్యవహారాలపై నిగ్గుతేల్చడం
* ఈపాటికే నిర్మాణాలు పూర్తయిన అమరావతి టవర్లు, బిల్డింగులను సంపూర్ణంగా వినియోగించుకోవడం, అసంపూర్తిగా మిగిలిన వాటినీ త్వరితంగా అందుబాటులోకి తేవడం.
* వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడం.
* భూములిచ్చిన అమరావతి
... ఇవన్నీ ప్రస్తుత సమస్యకు పరిష్కార మార్గాలుగా ఎంతోమంది పరిశీలకులు, మేధావులు, రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు.
అన్నివిధాల నష్టపోయిన/ నష్టపోతున్న రాష్ట్రానికి అన్నింటా న్యాయం జరగాలని కోరుకుందాం అన్నపూర్ణగా వెలుగొందిన ఆంధ్ర రాష్ట్రం అగ్ర భాగానే ఉండాలని ఉబలాట పడతాం. భవిష్యత్తు తరాలకు, విలువలకు, ప్రామాణికత పుణికిపుచ్చుకునేలా రాష్ట్రం ఉంటుందని ఆశిద్దాం! ఆంధ్రం అద్వితీయం!!

- చెన్నుపాటి రామారావు 9959021483