మెయన్ ఫీచర్

కశ్మీర్ పునర్విభజనపై న్యాయసమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోని అన్ని వర్గాల వారినీ గౌరవిస్తూ, దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడేందుకు సాహసోపేతంగా ఆర్టికల్ 370ని రద్దుచేసి జమ్మూ కశ్మీర్ రాష్ట్ర పునర్విభజన చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై న్యాయసమీక్ష మొదలైంది. సర్వోన్నత న్యాయస్థానంలో జస్టిస్ ఎన్ వీ రమణ, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ సుభాష్‌రెడ్డి, జస్టిస్ సూర్యాకాంత్, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఆర్టికల్ 370 రద్దు, 35ఏ రద్దుతో పాటు జమ్మూ కశ్మీర్ పునర్విభజనపై దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోంది. సీనియర్ న్యాయవాదులు రాజీవ్ దావన్, దినేష్ ద్వివేది తమ వాదనలు వినిపిస్తున్నారు. విస్తృత ధర్మాసనానికి నివేదించాలని న్యాయవాదులు కోరుతుండగా, కేంద్రప్రభుత్వం మాత్రం అలాంటి ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేసింది. విస్తృత ధర్మాసనం ఈ అంశాన్ని విచారణకు స్వీకరిస్తే ఇంత త్వరగా నిర్ణయం వెలువడే అవకాశం ఉండదని కేంద్రం ఆలోచన. రాష్టప్రతికి 370 ఆర్టికల్‌ను రద్దు చేసే అధికారం లేదని పిటిషనర్లు వాదిస్తున్నారు. మహారాజా హరిసింగ్ రూపొందించిన చట్టబద్ధమైన డాక్యుమెంట్ (ఇనుస్ట్రుమెంట్ ఆఫ్ ఎసెసన్)పై సుప్రీంకోర్టులో విస్తృతమైన విచారణ జరిగింది.
ఆర్టికల్ 370ఏ జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తే ఆర్టికల్ 35ఏ కింద ఆ ప్రాంతానికి ప్రత్యేక హక్కులు లభించాయి. కశ్మీర్‌లో శాశ్వత నివాసులు ఎవరో నిర్ధారించే అధికారం ఆ రాష్ట్ర అసెంబ్లీకి దక్కింది. తాజా కేంద్ర నిర్ణయంతో 370 రద్దుతో జమ్మూ కశ్మీర్‌లు విడిపోయి భారతదేశ అంతర్భాగంలో కలిసిపోయాయి. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం మూడు ముక్కలు అయ్యింది. జమ్మూ, కశ్మీర్, లడాఖ్‌గా ఉనికిలోకి వచ్చాయి. జమ్మూ, కశ్మీర్‌లు అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉంటాయి. లడాఖ్ మాత్రం కేంద్ర ప్రభుత్వ పాలన మాత్రమే ఉంటుంది. లడాఖ్‌కు అసెంబ్లీ ఉండదు. 1954 నాటి ఉత్తర్వులను ఉపసంహరించుకుంటూ 2019 ఆగస్టు 5న రాష్టప్రతి ఆదేశాలు జారీ చేశారు. రాజ్యాంగంలోని అన్ని నిబంధనలూ జమ్మూ, కశ్మీర్, లడాఖ్ ప్రాంతాలకు వర్తించేలా ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
ఇదంతా ఆషామాషీగా జరగలేదు. కశ్మీర్ విషయంలో ఎంతో చరిత్ర ఉంది. భారత్ పాక్‌లు విడిపోయిన సమయంలో కశ్మీర్ సంస్థానం ఎటు వెళ్లాలో తేల్చుకోలేని పరిస్థితిలో మిగిలిపోయింది. కశ్మీర్ తన స్వతంత్ర ప్రతిపత్తిని నిలబెట్టుకోవాలని బలంగా కోరుకున్నా అప్పటి రాజకీయ పరిణామాలు ఎటో ఒక వైపు విలీనం కావల్సిన పరిస్థితిని కల్పించాయి. జమ్మూకశ్మీర్ రాజు హరిసింగ్ మాత్రం చివరికి భారత్‌లో విలీనం కావాలని నిర్ణయించారు. అసలు వివాదం ఇక్కడే ఉంది. కశ్మీర్ భారత్‌లో విలీనం అయిన తేదీ, ఎవరు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారనే దానిపై ఇప్పటికీ వివాదం ఉంది. మహారాజా హరిసింగ్ శ్రీనగర్ నుండి పారిపోయాక జమ్మూలో అక్టోబర్ 26న ఈ ఒప్పందంపై సంతకాలు చేశారని భారత్ చెబుతోంది. కానీ అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అధికార ప్రతినిధి వీకే మీనన్ జమ్మూ చేరింది 1947 అక్టోబర్ 27. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, షేక్ మహమ్మద్ అబ్దుల్లా సుదీర్ఘ చర్చలు జరిపి రాజ్యాంగ రచన సమయంలోనే ఉప కమిటీ సభ్యుడైన షేక్ అబ్దుల్లా ఒత్తిడి మేరకు ఆర్టికల్ 370ని చేర్చారు. తర్వాత షేక్ అబ్దుల్లా కశ్మీర్ ప్రధాని కావడం, కొంతకాలం తర్వాత ఆయన అరెస్టు కావడం జరిగిపోయాయి.
ఆర్టికల్ 370 కారణంగా రాజ్యాంగంలోని అన్ని నిబంధనలూ జమ్మూ కశ్మీర్‌కు వర్తించకుండా అడ్డంకి ఏర్పడింది. ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ - ఫ్రేమింగ్ ఆఫ్ ఇండియన్ కాన్‌స్టిట్యూషన్’ పేరుతో డాక్టర్ ఏఎన్‌ఎస్ బుసి రాసిన పుస్తకంలో కూడా అంబేద్కర్ అభిప్రాయాన్ని జోడించారు. ఆర్టికల్ 370పై అప్పటి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ సైతం తీవ్రమైన నిరసనను వ్యక్తం చేశారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. షేక్ అబ్దుల్లాకు అంబేద్కర్ ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ‘అబ్దుల్లా గారూ కశ్మీర్‌ను భారత్ పరిరక్షించాలని మీరు కోరుకుంటున్నారు, మీ సరిహద్దుల్ని భారత్ కాపాడాలని, మీకు సరిపడా ఆహారధాన్యాలు సరఫరా చేయాలని ఆశిస్తున్నారు. భారత్‌కు కానీ, భారతీయ పౌరుడికిగానీ కశ్మీర్‌లో ఎలాంటి హక్కులు ఉండకూడదని, భారత ప్రభుత్వానికి పరిమిత అధికారాలు మాత్రమే ఉండాలని మీరు భావిస్తున్నారు. మీ ప్రతిపాదనలను అంగీకరించడమంటే భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా మేం ద్రోహం చేసినట్టే, భారతదేశ న్యాయమంత్రిగా నేను ఎప్పుడూ అలా చేయలేను. నా దేశ ప్రయోజనాలకు మోసం తలపెట్టలేను...’ అని అంబేద్కర్ పేర్కొన్నారు.
పార్లమెంటులో 1963 నవంబర్ 27న పండిట్ నెహ్రూ మాట్లాడుతూ ఆర్టికల్ 370 అనేది మధ్యంతర తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రాజ్యాంగంలో భాగం కాదు, అది కొనసాగినంత కాలమే ఉంటుంది అని పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే ఆర్టికల్ 370 భారత దేశ ప్రజల మధ్య కొంత విద్వేషానికి కారణమైంది. భారతీయులందర్నీ సన్నిహితం చేసే బదులు మరింత అగాధాన్ని పెంచింది. స్వార్థపర శక్తులు ఈ అగాధాన్ని మరింత పెంచి పోషించాయి. కాల క్రమంలో జమ్మూ కశ్మీర్ ప్రజలకు, మిగతా భారతభాగంలోని ప్రజలకు మధ్య కనిపించని ఎడబాటు ఏర్పడింది.
రక్షణ, విదేశాంగ, కమ్యూనికేషన్ రంగాలు మినహా ఏ చట్టాన్ని ఆ రాష్ట్రానికి వర్తింపచేయాలన్నా ఆ రాష్ట్ర అనుమతిని కేంద్రం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. రక్షణ, విదేశాంగ , కమ్యూనికేషన్ రంగాలకు సంబంధించి కేంద్రం చట్టాలను రూపొందిస్తున్నా, మిగిలిన అవసరాలకు చట్టాలు చేసేందుకు జమ్మూ కశ్మీర్‌కు ఓ ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని, రాజ్యాంగం కోసం అసెంబ్లీ కోసం 1951లో అనుమతి లభించింది. 1956 నవంబర్‌లో రాష్ట్ర రాజ్యాంగం పని పూర్తవడంతో 1957 జనవరి 26న జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో ప్రత్యేక రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ ప్రత్యేక రాజ్యాంగం కారణంగా ఆర్టికల్ 356 జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి వర్తించదు. భారత రాష్టప్రతికి ఆ రాష్ట్ర రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు ఉండదు. 1976 నాటి పట్టణ భూ చట్టం జమ్మూ కశ్మీర్‌కు వర్తించదు. భారతదేశంలో ఎక్కడైనా భూమిని కొనుగోలు చేసే హక్కు భారతీయుడికి ఉంటుంది, కానీ జమ్మూకశ్మీర్‌లో భూమిని కొనుగోలు చేసే హక్కు అందరికీ ఉండదు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 360 ద్వారా దేశంలో అత్యవసర పరిస్థితిని విధించే అవకాశం ఉంది, కానీ ఇది జమ్మూ కశ్మీర్‌కు వర్తించదు. ఇతర దేశాలతో యుద్ధం వచ్చిన ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే 360 వినియోగించే వీలుంటుంది. జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగించాలని 2015 డిసెంబర్‌లో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం వాటిని కొట్టివేస్తూ, స్వయం ప్రతిపత్తిని తొలగించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ‘ఇది కోర్టు పనా... ఈ ఆర్టికల్‌ను ఉంచడం లేదా తొలగించడం చేయమని పార్లమెంటుకు చెప్పండి... ఆ పనిచేయడం కోర్టు పని కాదు...’ అని ఆనాటి ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఆర్టికల్ 370 రద్దు చేయాలనే అంశంపై 1964లోనే పార్లమెంటులో చర్చ జరిగింది. 370 అధికరణ రద్దు కోరుతూ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు ఏకగ్రీవ మద్దతు లభించింది. లోక్‌సభలో ప్రకాశ్ వీర్ శాస్ర్తీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు రాం మనోహర్ లోహియా, కాంగ్రెస్ సభ్యుడు కే హనుమంతయ్య వంటి నాయకుల మద్దతు కూడా లభించింది. 370 అధికరణం రద్దుకు చట్టం చేయాలని పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల సభ్యులు కోరుకుంటున్నారని హనుమంతయ్య లోక్‌సభలో చెప్పారు. 370 రద్దుకు అనుకూలంగా 12 మంది సభ్యులు మాట్లాడారు. వారిలో ఏడుగురు కాంగ్రెస్ సభ్యులే. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఇందర్ జే మల్హోత్ర మద్దతు పలకగా, శరణ్‌లాల్ సరాఫ్, సోషలిస్టు పార్టీకి చెందిన హెచ్‌వీ కామత్, సీపీఐకి చెందిన సరోజ్ పాండే, బీహార్‌కు చెందిన భగవత్ ఝూ అజాద్ మాత్రం 370 రద్దును వ్యతిరేకించారు. రాజ్యాంగంలోని పార్టు 21 ఏలో 370 కేవలం తాత్కాలిక నిబంధన అనే శీర్షిక ఉన్నా ఆర్టికల్ 370 ఒక శాశ్వత నిబంధన అని 2015లో జమ్మూ కశ్మీర్ హైకోర్టు స్పష్టం చేసింది. 370ని తొలగించడం సాధ్యం కాదని హైకోర్టు పేర్కొంది. ఆర్టికల్ 35ఏ దానిని సంరక్షిస్తుంది. ఆర్టికల్ 370ని మరో అధికరణం 368(1) ద్వారా సవరించుకునే వీలుందన్నది రాజ్యాంగ నిపుణుల వాదన. జమ్మూ కశ్మీర్ మిగతా రాష్ట్రాల్లా భారత్‌లో కలిసి లేవు. అది భారత్‌తో ఒప్పంద పత్రంపై సంతకాలు చేసినపుడే ఒక పరిధి వరకూ తమ సార్వభౌమాధికారాన్ని చెక్కు చెదరకుండా ఉంచుకుంది అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే మున్ముందు మరిన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా అనేక చర్యలు, జాగ్రత్తలు పాటిస్తూ కేంద్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తిని రద్దు చేసింది. ఆర్టికల్ 370ని రద్దు చేయబోతున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గత ఏడాది ఆగస్టు 5వ తేదీనే రాజ్యసభలో వెల్లడించారు. 370 బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఉభయ సభల్లో బిల్లులు ఆమోదం పొందడంతో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో జమ్మూ కశ్మీర్‌లో భారత రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చింది. కశ్మీర్‌పై కేంద్రానికి పూర్తి అధికారాలు లభించాయి. ఆర్టికల్ 370 రద్దు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టికల్ 35 ఏ రద్దు ,జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు, జమ్మూ కశ్మీర్ రెండో సవరణ బిల్లు 2019కు రాజ్యసభ ఆమోదం దక్కింది. ఇది జమ్మూ కశ్మీర్‌లో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల వారికి 10 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు. ఇంతే కాదు, దాదాపు మరో 106 చట్టాలు జమ్మూ కశ్మీర్ లడాఖ్ ప్రాంతాలకు వర్తించబోతున్నాయి. 35 ఏ రద్దుతో అక్కడ దశాబ్దాలుగా మహిళల పట్ల కొనసాగుతున్న వివక్షను అంతం చేసినట్టయింది. ఇపుడు వారు స్థానికేతరులను వివాహం చేసుకుంటే తమ ఆస్తులను బదిలీ చేసుకునే వీలుకలుగుతుంది.
భారత యూనియన్‌లో జమ్మూ కశ్మీర్‌ను పూర్తిగా విలీనం చేయడంతో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో ప్రారంభమైన వేలాదిమంది బలిదానానికి గౌరవం దక్కిందని, యావత్ దేశం కోరుకున్న ఏడు దశాబ్దాల కోరిక కళ్లముందే నెరవేరిందని దేశవ్యాప్తంగా వేనోళ్ల అభినందనలు దక్కాయి. కానీ శ్రీనగర్‌లో గృహనిర్బంధంలో ఉన్న ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ మాత్రం భారతదేశ చరిత్రలో ఇది చీకటిరోజని వ్యాఖ్యానించారు. 1947లోనే రెండు దేశాల సిద్ధాంతాన్ని కశ్మీర్ నేతలు తిరస్కరించి భారత్‌తో పొత్తుపెట్టుకున్నారని, 370 రద్దు ఏకపక్ష నిర్ణయమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు ఆమె చెబుతున్నా ఇక మూడు కేంద్ర పాలిత ప్రాంతాల మెరుగైన నాణ్యమైన జీవన ప్రమాణాల తోడ్పాటుకు ముందడుగు పడటం ఖాయం

- బీవీ ప్రసాద్ 9963345056