మెయన్ ఫీచర్

చట్టసభలు గాడిలో పడేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత రాజకీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న అతి పెద్ద జాఢ్యం ఫిరాయింపులు. ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుతో, మ్యానిఫెస్టోతో గెలిచిన తర్వాత ఐదు నిమిషాలు గడవకుండానే మరో పార్టీలోకి ఫిరాయించే రాజకీయ నేతల చరిత్ర భారతీయులకు కొత్త కాదు. భారత రాజ్యాంగం చాలా పటిష్ట నియమ నిబంధనలను, నైతిక విలువలను సూచించినా, వాటన్నింటినీ పక్కన పెట్టి పదవుల కోసమో, డబ్బు కోసమో, ఇతర స్వార్థ ప్రయోజనాల కోసమో.. ఏ పట్టింపూ లేకుండా పార్టీలు మారుతున్న నేతలకు అడ్డుకట్టవేసే ఎన్నో ప్రయత్నాలు జరిగినా అవన్నీ వృథా ప్రయాసే అవుతున్నాయి. దేశంలో కార్యనిర్వాహక వ్యవస్థ, చట్ట సభలు ఎన్ని ఉన్నా అనేక జాఢ్యాలకు చివరికి న్యాయస్థానాలే మందు వేయాల్సిన దుస్థితిని దేశ రాజకీయ వ్యవస్థ తీసుకొచ్చింది. రాజ్యాంగంలోని ఐదో విభాగంలో అధ్యాయం ఒకటిలో ఆర్టికల్ 52 మొదలు ఐదో అధ్యాయం ఆర్టికల్ 151 వరకూ కేంద్రప్రభుత్వ విధి విధానాలనూ, ఇతర సంస్థలు, వ్యవస్థల గురించి వివరించగా, విభాగం ఆరులో అధ్యాయం ఒకటి ఆర్టికల్ 152 నుండి అధ్యాయం ఆరు ఆర్టికల్ 237 వరకూ రాష్ట్రాల వ్యవహారాలను వివరించారు. ఇందులో శాసనసభ గురించి అధ్యాయం మూడులో ఆర్టికల్ 168 నుండి శాసనసభ నిర్మాణం, రద్దు చేయడం, శాసనమండలి నిర్మాణం, కాలపరిమితి, సభ్యత్వానికి అర్హతలు, సమావేశాలు వాయిదా వేయడం, గవర్నర్ సందేశాలు, గవర్నర్ ప్రత్యేక ప్రసంగం, సమావేశాల్లో మంత్రులు, అడ్వకేట్ జనరల్ పాల్గొనడం గురించి పేర్కొనగా, ఆర్టిల్ 178 నుండి సభాపతి, ఉపసభాపతి, సభాపతుల తొలగింపు తొలగింపుతీర్మానాలపై చర్చ, శాసనపరిషత్ చైర్మన్, డిప్యుటీ చైర్మన్, వారి తొలగింపు, జీతభత్యాలు, ఇతర ఉద్యోగులు, అధికారుల గురించి పేర్కొన్నారు. ఆర్టికల్ 188 నుండి సభ్యుల ప్రమాణ స్వీకారం, ఓటింగ్ విధానం, అనర్హతలు, అనర్హుడైన తర్వాత సభాకార్యక్రమాల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకుంటే వేసే శిక్షలు, జీతభత్యాలు గురించి ఆర్టికల్ 212 వరకూ వివరించారు. ఇంత స్పష్టం గా రాజ్యాంగం మార్గ నిర్దేశనం చేసినా చట్టసభల దుర్వినియోగం, రాజకీయ ఫిరాయింపులు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. దీనికి కారణం అడిగేవారే లేరనే ధైర్యం. అడగాల్సిన అధికార పక్షమే అక్రమాలకు పాల్పడుతుంటే నిస్తేజంగా చూడటం మినహా చేయగలిగిందేమీ లేకపోవడం. విపక్షంలో ఉన్న పార్టీలు అధికారంలోకి వచ్చినపుడు అదే తప్పును నిస్సగ్గుగా చేసేస్తుండటంతో ఎట్టకేలకు ఈ అంశంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవల్సి వచ్చింది.
ఫిరాయింపుల జాఢ్యాన్ని మార్చకపోతే ఈ దేశ ప్రజాస్వామ్య పునాదులనే కాదు, వౌలిక సూత్రాలను కూడా చెదపట్టిస్తుందని గుర్తించిన సుప్రీంకోర్టు మూడున్నర దశాబ్దాల నాటి చట్టం రుగ్మతల తీవ్రతను గుర్తుచేసింది. పార్టీ ఫిరాయించిన వారిపై చర్యల బాధ్యత స్వీకర్లకే వదిలిపెట్టడం కంటే స్వతంత్ర ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది.
1967 తర్వాత భారత రాజకీయాల్లో మరీ ముఖ్యంగా రాష్ట్రాల్లో రాజకీయ ఫిరాయింపులు ఎక్కువయ్యాయి. దీనికి పరిష్కారంగా 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పదో షెడ్యూలులో చేర్చింది. ఈ చట్టంలోని లోపాలను సవరిస్తూ 2003లో 91వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. అయినా అనేక రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు జరుగుతూనే ఉన్నాయి. దక్షిణాదిలో ఏ రాష్టమ్రూ ఇందుకు మినహాయింపు కాకపోవడం గమనార్హం. ఎవరైనా ఒక పార్టీ గుర్తుపైనా, ఆ పార్టీ మ్యానిఫెస్టోపైనా గెలిచిన తర్వాత మరోపార్టీకి విధేయత చూపించడం మరో పార్టీలో చేరడం, ఇతర పార్టీలకు అనుకూలంగా ఓటు వేయడం, ఓటు వేయకుండా గైర్హాజరు కావడం లేదా విప్‌ను ధిక్కరించడం పార్టీ ఫిరాయింపు కిందకు వస్తుంది.
స్వతంత్ర సభ్యుడు ఏ పార్టీలోనైనా చేరినా, అలాగే నామినేటెడ్ సభ్యుడు బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల తర్వాత ఫిరాయింపుల కిందకే వస్తుంది. ఈ ఫిరాయింపులకు సుదీర్ఘచరిత్రే ఉంది. స్వాతంత్య్రం రాకముందే ఫిరాయింపులు జరిగాయి. భారత ప్రభుత్వ చట్టం -1935 ప్రకారం జరిగిన ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ మెజార్టీ సాధించడంతో ముస్లిం లీగ్ కింద పోటీచేసిన అనేక మంది పార్టీ ఫిరాయించి మంత్రి పదవులను పొందారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952 నుండి 1967 మధ్యలో ఉత్తర ప్రదేశ్ , అవిభాజ్య మద్రాస్ రాష్ట్రం, కేరళ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఫిరాయింపులు కారణంగా అనేక ప్రభుత్వాలు కుప్పకూలాయి. మరికొన్ని సందర్భాల్లో మెజార్టీ లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తర్వాత మెజార్టీ సాధించిన సందర్భాలున్నాయి. 1952లో మొదటి సాధారణ ఎన్నికల తర్వాత అవిభాజ్య మద్రాస్ రాష్ట్రంలో మెజార్టీ లేకపోయినా గవర్నర్ ఆహ్వానంతో రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. తర్వాత ఫిరాయింపులతో మెజార్టీ సాధించారు. 1967లో లోక్‌సభ ఎన్నికలతో పాటు 16 రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు కూడా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ కేరళ, మద్రాస్, పశ్చిమబంగ, బీహార్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో మెజార్టీ సాధించలేకపోయినా, రాజస్థాన్, యూపీ, పంజాబ్‌లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఫిరాయింపులను ప్రోత్సహించి కావల్సిన మెజార్టీని సాధించుకుంది. 1967 మార్చి నుండి డిసెంబర్ మధ్య 314 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. 1972-77 మధ్యకాలంలో ఫిరాయింపులు కారణంగా పది రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోయాయి. హర్యానా లాంటి రాష్ట్రాల్లో పక్షం రోజుల్లో మూడు పార్టీలు మారిన సభ్యులున్నారు. దాంతో రాజకీయ అస్థిరత ఏర్పడింది. 1990- 1995 మధ్య కేంద్ర ప్రభుత్వంలోనూ ఫిరాయింపులు జోరుగా సాగాయి. 1990లో పి. చంద్రశేఖర్ ప్రధాని కావడానికి, 1991లో పీవీ నరసింహరావు ప్రధానిగా మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, 1995 నాటికి మెజార్టీ సాధించినా, అది కేవలం పార్టీ ఫిరాయింపుల కారణంగానే అన్నది నిర్వివాదాంశం. ఇలాంటి పరిస్థితులను ముందే ఊహించిన కేంద్ర హోం మంత్రిత్వశాఖ 1967లోనే పార్లమెంటు సభ్యులతో వైబీ చవాన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 1973లో కేంద్ర ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల నిరోధానికి ప్రతిపాదనలు తీసుకొచ్చినా, అది చట్టంగా ఆమోదం పొందకముందే 1977లో లోక్‌సభ రద్దయింది. 1977లో జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సబ్ కమిటీని నియమించింది. 1978లో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినా అది చట్టంగా రూపం దాల్చలేదు. పార్టీ ఫిరాయింపుల నిరోధానికి 1985లో గట్టి ప్రయత్నమే జరిగింది. 52వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. రాజ్యాంగంలోని 102(2) నిబంధన ద్వారా పార్లమెంటు సభ్యులు, 191(2) నిబంధనల ద్వారా శాసనసభల సభ్యులు అనర్హత వివరాలను 10వ షెడ్యూలులో చేర్చారు. ఇది 1985 మార్చి 1 నుండి అమలులోకి వచ్చింది. దీనికి కొన్ని మినహాయింపులు ఇస్తూ నిర్ణయాధికారంపై కూడా స్పష్టత ఇచ్చారు. స్పీకర్‌కు నిర్ణయాధికారం ఉన్నా స్పీకర్ నిర్ణయాన్ని సమీక్షించే న్యాయాధికారం ఉన్నత స్థాయి కోర్టులకు ఉంటుందని కిలోటో హులాహాన్ వెర్సస్ జచిల్లు కేసులోనూ, రవినాయక్ వెర్సస్ భారత ప్రభుత్వం కేసులోనూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కులదీప్ నయ్యర్ వెర్సస్ భారత ప్రభుత్వం కేసులో రాజ్యసభ ఎన్నికల సమయంలో రాష్ట్ర శాసనసభ్యుడు తమ పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేసినా అనర్హత వర్తించదని తీర్పు చెప్పింది. అందుకే రాజ్యసభ ఎన్నికల్లోనూ, రాష్టప్రతి ఎన్నికలోనూ పార్టీలకు విప్ జారీ చేసే అధికారం లేకుండాపోయింది. ఫిరాయింపు చట్టంలోని లోపాలను సవరించడానికి 2003లో కేంద్రప్రభుత్వం 91వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకువచ్చింది. రాజ్యాంగంలో 71(1)(బీ)ని చేర్చడం ద్వారా పార్టీ ఫిరాయింపులు చట్టం కింద అనర్హులైన పార్లమెంటు సభ్యులను సభాకాలం ముగిసే వరకూ మంత్రులుగా నియమించరాదు. అదేవిధంగా 164(బీ)లో రాష్ట్ర శాసనసభ్యులు అనర్హత పొందితే సభాకాలం ముగిసే వరకూ వారిని మంత్రులుగా నియమించడానికి వీలులేదు. 361(బి) ప్రకారం ఫిరాయింపులకు పాల్పడి అనర్హత పొందిన సభ్యులకు లాభదాయక పదవుల్లో నియమించడానికి కూడా వీలు లేదు. అసలు కిటుకు ఇక్కడే ఉంది. ఫిరాయింపులకు పాల్పడినా ఆయా సభ్యులపై అనర్హత వేటు వేయకుండా వారు ఫిరాయింపులకు పాల్పడలేదని స్పీకర్ స్థానంలో ఉన్న వారు నిర్ణయం తీసుకోవడం వల్లనో,లేదా వారి ఫిరాయింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సుప్తచేతనావస్థను పాటించడం ద్వారానో ఆయా సభ్యులకు ప్రయోజనాన్ని కలిగించడం ద్వారా రాజకీయ పార్టీలు క్విడ్‌ప్రోకోకు పాల్పడుతున్నాయి. కొన్ని మార్లు ఆయా రాజకీయపార్టీలకు సంపూర్ణ మెజార్టీ ఉన్నా, విపక్షాలు లేకుండా చేయాలనే దురాశతో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి. అలాంటి సంఘటనలు ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ, కర్నాటక, మహారాష్టల్రో సైతం ఇటీవలి కాలంలోనే జరిగాయి. అంత వరకూ ఎందుకు కేంద్రంలో నలుగురు తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరలేదా? ఇదేమీ ఆ పార్టీకి కొత్త కాదు, 1992 మార్చి 2 తేదీనే తెలుగుదేశం సభ్యులు విలీనం కాదల్చుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీకి లేఖ ఇచ్చారు. పీవీ నరసింహరావు ప్రభుత్వ ఓటింగ్ సమయంలో 13 మంది తెలుగుదేశం సభ్యుల్లో 8 మంది సభలో మాయమయ్యారు. వీరంతా తర్వాత భూపతిరాజు విజయకుమార్‌రాజు నేతృత్వంలో ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని స్పీకర్ శివరాజ్ పాటిల్‌ను కోరారు. 2016లో తెలంగాణలో టీడీపీ శాసనసభా పక్షం టీఆర్‌ఎస్‌లో విలీనం అయ్యింది. 2019లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ టీఆర్‌ఎస్‌లో విలీనం అయ్యింది. 2014-2018 మధ్య వైసీపీ సభ్యులు విలీనం అయినట్టు టీడీపీ ప్రకటించుకోలేదా? అందులో కొంత మంది మంత్రులు కాలేదా? ఈ పరిస్థితులు ఎక్కడికో తీసుకుపోతుండటంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ అంశాన్ని తీవ్రమైనదిగా గుర్తించాలని పేర్కొంది.
ఫిరాయింపులను ఓటర్లు ఎన్నడూ పట్టించుకున్నట్టు అనిపించదు. దానికి కారణం ఏమంటే ఫిరాయించిన నేతలు తర్వాత వచ్చిన ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నారు. అందుకు ప్రోత్సహించిన పార్టీలు కూడా గెలుస్తున్నాయి. కానీ విలువలు పతనమవుతున్నాయి. సమాజానికి రాజకీయ జబ్బు పట్టి అస్వస్థతకు గురవుతోంది. ఆ జబ్బు రూపమే ఎన్నికల్లో హామీలు, ధనప్రవాహం, మద్యం ఏరులై పారడం, అవాంఛనీయ బహుమతులు. ఇది మరో కొత్త రూపాన్ని తీసుకుని ఇపుడు ఆన్‌లైన్‌లో చెల్లింపులు, ఆన్‌లైన్‌లో షాపింగ్, అడ్వాన్స్ పేమెంట్‌లు, ప్రీ పెయిడ్ ఓచర్ల రూపాన్ని సంతరించుకున్నాయి. అంటే ఎన్నికలు రాబోతున్నాయనగానే ఏడాది ముందే చెల్లింపుల ప్రక్రియ నేరుగా జరిగిపోతోంది. ఎన్నికల నెలరోజులు ఏ ఆంక్షలు పెడితే ఏం? అంతా గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరిస్తున్నారు. ఈ రుగ్మత మారాలంటే స్వార్థ రహితంగా ఓటరు వ్యవహరించాలి. అపుడే పార్టీలు మారతాయి, రాజకీయాలు బాగుపడతాయి.

- బీవీ ప్రసాద్ 9963345056