మెయన్ ఫీచర్

జనహిత బఢ్జెట్.. రాష్ట్రాల్లో అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన 2020 - 21 వార్షిక బడ్జెట్ ప్రజలను తక్కువ అసంతృప్తితో సరిపెట్టుకోవాలని సూచించింది. రాష్ట్రప్రభుత్వాలకు మాత్రం ఈ బడ్జెట్‌లో ఆశించిన స్థాయిలో కేటాయింపులను తగ్గించారు. దీంతో తెలుగు రాష్ట్రాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. సంక్షేమ పథకాలు, రైతుల సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఇతోధికంగా నిధులు కేటాయిస్తారని పెట్టుకున్న నమ్మకాన్ని భగ్నం చేసే విధంగా బడ్జెట్ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ లోటుతో సతమతమవుతున్న ఆంధ్ర రాష్ట్రానికి కూడా బడ్జెట్ వల్ల ఒరిగిందేమీ లేదు. ఎన్నికల సమయంలో రాష్ట్రప్రభుత్వాలు అలివికాని హామీలు ఇచ్చి ఓట్లు దండుకుని అధికారంలోకి వస్తే, ఎడాపెడా నిధులు ఎలా కేటాయిస్తామని కేంద్రం పరోక్షంగా చెప్పింది. ఈ విషయమై నేరుగా కేంద్రం స్పందించకపోయినా, బీజేపీ నేతలు మాత్రం తరచుగా ఈ ప్రకటనలు చేస్తున్నారు. విభజన హామీల అమలులో కేంద్రం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ కోణంలో విశే్లషిస్తే ఈ బడ్జెట్ ఆర్థిక మాంద్యాన్ని, ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించేందుకు వీలుగా మోదీ సర్కార్ రూపొందించింది.
స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యల ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న సంకల్పంతో మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వ్యవసాయం, సాగునీటిపారుదల, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఆరోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, నైపుణ్యాల రంగాలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయం, సాగునీటిపారుదల, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం 16 కార్యాచరణ ప్రణాళికలు అమలు చేస్తామని కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది. ఈ 16 అంశాల ప్రణాళిక అమలు కోసం రూ. 2.83 కోట్లను కేటాయించనున్నారు. ఇందులో వ్యవసాయం, సాగునీటిపారుదలకు రూ. 1.60 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌కు రూ. 1.23లక్షల కోట్లు ఖర్చుపెట్టనున్నారు. వ్యవసాయ రుణం కింద 2020 - 21కి రూ. 15లక్షల కోట్లను లక్ష్యంగా నిర్దేశించారు. పీఎం కిసాన్ లబ్ధిదారులకు కేసీసీ పథకాన్ని వర్తింప చేయాలని ప్రతిపాదించారు. నాబార్డ్ రీఫైనాన్స్ స్కీంను విస్తరించనున్నారు. నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న వంద జిల్లాలకు సమగ్రమైన చర్యలను ప్రతిపాదించారు. నీలి ఆర్థిక వ్యవస్థ (జల సంపద) లో భాగంగా 2024 - 25 నాటికి రూ. 1లక్ష కోట్ల ను మత్స్య రంగ ఎగుమతులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మత్స్య పరిశ్రమ విస్తరణలో యువతను భాగస్తులను చేయడం కోసం 3477 సాగర్ మిత్రాలు, 500 మత్స్య రైతు నిర్మాత సంస్థలను ఏర్పాటు చేస్తారు.
నాచును, సముద్ర కలుపు జాతులను పెంచడంతో పాటు కేజ్ కల్చర్‌లను ప్రోత్సహించనున్నారు. సముద్ర సంబంధ మత్స్య వనరుల సంరక్షణ, నిర్వహణ, అభివృద్ధి కోసం ఫ్రేమ్ వర్క్ నిర్మాణం చేపట్టనున్నారు. భారతీయ రైల్వేలు పీపీపీ ద్వారా కిసాన్ రైల్ వ్యవస్థను నెలకొల్పనున్నారు. త్వరగాపాడైపోయే పదార్థాల కోసం ఒక నిరంతర జాతీయ శీతలీకృత సరఫరా వలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో, ఫ్రైట్ రైళ్లలో శీతలీకరించిన రైలు పెట్టెలను ఏర్పాటు చేస్తారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కృషి ఉడాన్‌లను ప్రారంభించనున్నారు. సోలార్ పంపులను ఏర్పాటు చేసేందుకు 20లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం చేస్తారు. రైతులు బంజరుభూముల్లో సౌర విద్యుత్ ఉత్పాదనకు పథకాన్ని అమలు చేస్తారు. వ్యవసాయ సంబంధిత గిడ్డంగులు, శీతలీకరించిన నిల్వ కేంద్రాలు, రీఫర్ వ్యాన్ సదుపాయాలు వంటి వాటిని నాబార్డ్ మ్యాపింగ్ చేసి, వాటికి జియో ట్యాగ్‌లను సమకూర్చుతారు. ఆరోగ్య సంరక్షణ కోసం రూ. 69వేల కోట్లను కేటాయించారు. పీఎం జన్ ఆరోగ్య యోజన కోసం రూ. 6400 కోట్లను పొందుపరిచారు. క్షయవ్యాధిని 2025 నాటికి నిర్మూలించాలన్న హామీని నెరవేర్చేందుకు టీబీ హరేగా దేశ్ జీతేగా ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారు. జల జీవన్ మిషన్‌కు రూ. 3.60 లక్షల కోట్ల నిధులను వెచ్చించనున్నారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ కోసం 2020 - 21 లో రూ. 12,300 కోట్లను కేటాయించారు.
2020 - 21లో విద్యారంగానికి రూ. 99,300 కోట్లను, నైపుణ్యాభివృద్ధికి రూ. 3వేల కోట్లను కేటాయించారు. త్వరలో జాతీయ విద్యావిధానాన్ని ప్రకటించనున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఒక సంవత్సరం వ్యవధితో కూడిన ఇంటర్న్‌షిప్‌ను పట్టణ స్థానిక సంస్థలు అందిస్తాయి. కొత్తగా ఐదు స్మార్ట్ సిటీస్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్ మిషన్‌ను వచ్చే నాలుగేళ్ల పాటు రూ. 1480 కోట్లతో అమలు చేస్తారు. గవర్నమెంట్- ఇ మార్కెట్ ప్లేస్ టర్నోవర్‌ను రూ. 3లక్షల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వౌలిక సదుపాయాల రంగంలో వచ్చే ఐదేళ్లలో రూ. 100 లక్షల కోట్లను పెట్టుబడులను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. త్వరలో జాతీయ లాజిస్టిక్స్ విధానాన్ని ప్రకటించనున్నారు. సింగిల్ విండో ఈ-లాజిస్టిక్ మార్కెట్‌ను నెలకొల్పనున్నారు. ఈ ఏడాది రవాణా సంబంధిత వౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 1.7 లక్షల కోట్ల నిధులను ప్రతిపాదించారు. రైలు మార్గాల పక్కన రైల్వేల యాజమాన్యంలోని భూమిలో భారీ సౌర విద్యుత్ ఉత్పాదక కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఉడాన్ పథకం కింద దేశంలో 2024 నాటికి వంద విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తారు. స్మార్ట్ మీటర్ల వ్యాప్తిని ప్రోత్సహిస్తారు. డిస్కాంలను సంస్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. నేషనల్ గ్యాస్ గ్రిడ్‌ను ఇప్పుడున్న 16,200 కి.మీ స్థాయి నుంచి 27వేల కి.మీకు విస్తరిస్తారు. భారత్ నెట్ ద్వారా ఈ సంవత్సరంలో ఒక లక్ష గ్రామ పంచాయతీలను ఫైబర్ టు హోమ్ కనెక్షన్లతో కలుపుతారు. నేషనల్ మిషన్ ఆఫ క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్స్ కోసం ఐదు సంవత్సరాల కాలంలో రూ. 8వేల కోట్ల నిధులను ఇస్తారు. వచ్చే ఏడాది పోషణ విజ్ఞానం కార్యక్రమాలకు రూ. 35,600 కోట్లను కేటాయించారు. మహిళల కార్యక్రమాలకు రూ. 28,600 కోట్లను విడుదల చేస్తారు. ఎస్సీ, బీసీ వర్గాల సంక్షేమం కోసం రూ. 85వేల కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ. 53,700 కోట్లను కేటాయించారు. ఐదు పురావస్తు క్షేత్రాల వస్తు ప్రదర్శన శాలలతో సహా ప్రముఖ స్థలాలుగా అభివృద్ధి చేయనున్నారు. హర్యానాలో రాఖీగడీ, యూపీలో హస్తినాపూర్, అసోంలో శివ్ సాగర్, గుజరాత్‌లో ఢోలా వీరా, తమిళనాడులో ఆదిచనల్లూర్ ప్రదేశాల పేర్లను కేంద్రం ప్రతిపాదించింది.
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నాన్ గెజిటెడ్ ఉద్యోగాల నియామకంలో ప్రధాన సంస్కరణలను ప్రవేశపెట్టారు. నియామకం కోసం కంప్యూటర్ ఆధారంగా ఆన్‌లైన్‌లో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సంస్కరణలు, పది బ్యాంకుల్లో నాలుగు బ్యాంకుల ఏకీకరణ, దీని కోసం రూ. 3.50లక్షల కోట్ల మూలధనాన్ని అందించినట్లు కేంద్రం పేర్కొంది. ప్రతి ఒక్క డిపాజిటర్‌కు డిపాజిట్ బీమా రక్షణ మొత్తాన్ని రూ. 1లక్ష నుండి రూ. 5లక్షల వరకు పెంచేందుకు డిపాజిట్ బీమా అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్‌కు అనుమతి ఇస్తారు. ఐపీవో జారీ ద్వారా జీవితబీమా సంస్థలో ఉన్న వాటాను కొంత విక్రయించాలని కేంద్రం ప్రతిపాదించింది.వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ పదిశాతం మేర ఉండవచ్చని కేంద్రం అంచనావేసింది. రూ. 22.46 లక్షల కోట్ల వసూళ్లు, వ్యయం రూ. 30.42 లక్షల కోట్లు ఉండవచ్చని కేంద్రం అంచనా వేసింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రబడ్జెట్ వల్ల తెలంగాణ ప్రగతిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా రాజ్యాంగ పరమైన హక్కు అని, 2019 - 20లో రూ. 19,718 కోట్లు రావాల్సి ఉండగా, సవరించిన అంచనాల్లో రూ. 15,987 కోట్లకు తగ్గించారని పేర్కొన్నారు. దీని వల్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ. 3731 కోట్లు తగ్గాయి. కేంద్రం నిధుల్లో కోతలను విధించడం వల్ల రాష్ట్ర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై తీవ్రప్రభావం పడుతుందని కేసీఆర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు వచ్చే వాటాను తగ్గించడం కేంద్రం ఆర్థిక వ్యవహారాల నిర్వహణ లోపానికి నిదర్శమని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. తాజాగా కేంద్రం రాష్ట్రానికి వచ్చే ఏడాది రూ. 16,726 కోట్లను ఇస్తామని ప్రతిపాదించింది. ఇందులో ఏ మేర తగ్గిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. తెలంగాణకు పట్టణాల అభివృద్ధికి 2019 - 20లో రూ. 1037 కోట్లు కేటాయించారని, వచ్చే ఏడాది రూ. 148 కోట్లు తగ్గించి రూ. 889 కోట్లను ఇస్తామని 14.3 శాతం కోత పెట్టారని టీఆర్‌ఎస్ సర్కార్ పేర్కొంది. ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు కేంద్రం ఎటువంటి పటిష్టమైన నిర్ణయాలు తీసుకోలేదని విస్పష్టంగా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర బడ్జెట్‌పై లేఖ ద్వారా స్పందించారు. ప్రత్యేక హోదా కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. కానీ పార్టీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ ఏపీకి నిరుపయోగమని, ద్రవ్యోల్బణం పెరగడం మంచి పరిణామం కాదని, వ్యవసాయ కేటాయింపుల్లో ఏపీకి రావాల్సిన వాటాను కచ్చితంగా ఇవ్వాలని కోరారు. చార్టెర్డ్ అకౌంటెంట్, ఆర్థిక నిపుణుడైన విజయసాయి రెడ్డి బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో విమర్శించకపోయినా, కొన్ని చక్కటి సూచనలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని, వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని, ఏపీ పట్ల పక్షపాత వైఖరి పనికిరాదని, ఒక్క రైల్వే ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని, ప్రత్యేక హోదా అంశం ప్రస్తావన లేదన్నారు. బ్యాంకుల్లో డీజీసీసీని లక్ష నుంచి ఐదులక్షల రూపాయలకు పెంచడాన్ని వైకాపా స్వాగతించింది.
ఏపీ ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ జీడీపీ పదిశాతం పెరుగుదల అనుమానమేనన్నారు. రాష్ట్రానికి పన్నుల వాటాను తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో ప్రధానప్రతిపక్షమైన టీడీపీ కేంద్రబడ్జెట్‌పై పెద్దగా విమర్శలు చేయలేదు. ప్రస్తుతం, భవిష్యత్తులో బీజేపీ లేదా బీజేపీయేతర కూటమిలో ఎటువైపు ఉండాలన్న అంశంపై తేల్చుకోలేక టీడీపీ సతమతమవుతోంది. ఆంధ్రాకు ప్రత్యేక హోదా తెస్తామన్న హామీని ఎందుకు నెరవేర్చలేకపోయారని టీడీపీ వైకాపాను ప్రశ్నించడం సహజమే. ప్రత్యేక హోదా ఇక ముగిసిన అధ్యాయమని చెప్పవచ్చును. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చాలా హామీలు అపరిష్కృతంగానే ఉన్నాయి. కొత్త నౌకాశ్రయం ఏర్పాటుపై ప్రకటన లేదు. విభజన జరిగి ఆరేళ్లవుతుంది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో ఆంధ్రాకు ప్రత్యేక హోదా ప్రకటిస్తారన్న ఆశను ప్రజలు వదులుకున్నారు. విశాఖలో రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలన్న ఏపీ ప్రజల ఆకాంక్ష గత ఏడాది నెరవేరింది. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేలోపల కేంద్రం తాజా ప్రతిపాదనలతో రాష్ట్రాలకు కేంద్రం పన్నుల వాటా నుంచి నిధులను పెంపుదల చేసే అవకాశాలు లేకపోలేదు. కేంద్రం నిధులపై ఆశలుపెట్టుకుని రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలను అమలు చేయాలన్న రోజులకు కాలం చెల్లింది. కేంద్రం కూడా రాష్ట్రాల ఆకాంక్షలకు తగ్గట్టుగా పన్నుల ఆదాయం పంపిణీలో రాష్ట్రాల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని నిధులను ఇతోధికంగా ఇచ్చే విధానాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది.

- కె. విజయశైలేంద్ర, 9849998097