మెయన్ ఫీచర్

తిట్ల దండకాలతో వేడెక్కిన నవ్యాంధ్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రానున్న 5 సం.ల పాటు ఎండలు ఎక్కువగా వుంటాయని వాతావరణ శాస్తవ్రేత్తలు ముందే ప్రకటించారు. మరి తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే సూర్యుడు తన విశ్వరూపం చూపించడం ఆరంభించాడు. విజయవాడ వాతావరణం హైద్రాబాద్ కన్నా చాలా వేడిగా వుంటుంది. అందుకే విజయవాడను బ్లేజ్‌వాడ అని కూడా అంటుంటారు. ఏప్రిల్, మే మాసాల్లో సూర్యుడు ఇక్కడ భగ్గుమంటాడు. ఉష్ణోగ్రత 50 డిగ్రీలు కూడా చేరుతుంటుంది. మరిప్పుడు విజయవాడలో ‘వేడి’ ఏప్రిల్, మే కన్నా ఎక్కువగా వుంటోంది. కారణం అన్ని రాజకీయ పక్షాలు జగన్‌పై సంధిస్తున్న బాణాలు, మాటల తూటాలు. స్థానిక సంస్థలకు ఎన్నికలు వస్తాయని అన్ని పార్టీ నాయకులు తిట్ల దండకాన్ని అప్పుడే స్టార్ట్ చేసేశారు. విచిత్రం ఏమంటే ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన చేస్తున్న వైఎస్‌ఆర్ పార్టీకి ఏ ఒక్క పార్టీకూడా అండగా వుండడం లేదు. రాజధాని ఇష్యూవరకు వున్నట్టి అన్ని పార్టీలు సమైక్యంగా ఏకత్రాటిపై జగన్‌పై యుద్ధం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నూతనంగా వచ్చిన యోధుడు కూడా పాలనేతర పక్షాల జతన చేరిపోయాడు. మరి రాజధాని కాకుండా స్థానిక ఎన్నికల సమరంలో బీజేపీ, జనసేనతో కలసి పోరాటం చేయబోతుంది. కాంగ్రెస్ ఎలాగూ స్వంత కుంపటితో దిగవచ్చు. మరి రాజధాని విషయంలో బాబుకు వెన్నుదన్నుగా నిలిచిన సీపీఐ రామకృష్ణగారు ఎవరిపక్షాన చేరుతారో చూడాలి. సీపీఎం మాత్రం ఎటూ మొగ్గక తటస్థంగా వుంటోంది. జాతీయస్థాయిలో సీపీఐ కాంగ్రెస్‌తోనే ఎక్కువ సఖ్యతగా వుండడంవల్ల బహుశా రామకృష్ణ, నారాయణగార్ల సీపీఐ పార్టీ కాంగ్రెస్‌తోనే పొత్తుపెట్టుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏవి ఎలావున్నా నేడు తెలుగుదేశం పార్టీ, వైఎస్‌సీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకొంది. వొకర్నొకరు బండబూతులు తిట్టుకుంటున్నారు. అసభ్యకర మాటలు కూడా అందరి నోటినుంచి దొర్లుతున్నాయి. ఈనాటి పేపర్లు, టీవీలు చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో 2019నాటి సార్వత్రిక ఎన్నికలప్పుడున్నంత వేడి మనకు గుర్తుకుతెస్తాయి. వాళ్ళు, వీళ్ళు అని కాకుండా అన్ని పార్టీల నాయకులు కూడా విమర్శలు చేయడంలో శృతిమించిపోతున్నారు. చివరికి విమర్శల పేరున తండ్రుల్ని కూడా బండబూతుల సరసన చేరుస్తున్నారు. ఎంతగా దిగజారారంటే ఆ వార్తలు వినలేక చెవులు మూసుకోవాలన్న పరిస్థితులు దాపరించాయి. దేనికైనా హద్దులుంటాయి. పాలక, ప్రతిపక్షాలు ఇరువురూ కూడా ఈ హద్దులు దాటరాదు. విమర్శలు హుందాగా, నిర్మాణాత్మకంగా వుండాలి. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎలా తిట్టుకొన్నా చివరికి ఎన్నికల్లో రాజకీయ భవిష్యత్ నిర్ణయించేది ఓటర్లు మాత్రమే. ప్రజలిప్పుడు బాగా చైతన్యవంతులయ్యారు. డబ్బుల కోసమో, మద్యం కోసమో లొంగి వోట్లేయడం లేదు. అలాగని డబ్బులు ఎవరూ తీసుకోకుండా వుండడం లేదు. ఎంత డబ్బిచ్చినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఓటు దగ్గరికొచ్చేసరికి ఆత్మప్రబోధానుసారం తమకి నచ్చినవాళ్ళకు ఓట్లేస్తున్నారు. ఒక్కోసారి ఎన్ని సర్వేలు చేసినా, ఎన్ని ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించినా ఖచ్చితమైన ఫలితాల్ని మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఓటర్ల నాడి కనుక్కోవడం చాలా కష్టం. 2019లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ పార్టీ 151 పైగా స్థానాల్లో విజయం సాధించి తెలుగుదేశం పార్టీని మట్టికరిపించి చరిత్ర సృష్టించింది. ఇది ఎవరు కాదన్నా చరిత్రలో నిలిచిపోయే సత్యం. మే 30వ తారీఖున వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిగారు ప్రమాణ స్వీకారం చేశారు. అదే విధంగా 23 స్థానాలలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష స్థానాన్ని సాధించింది. ఎన్నికల్లో హోరెత్తించిన జనసేన పార్టీ ఒక్క స్థానంలో నెగ్గి అందరి ఊహల్ని తలక్రిందులు చేసింది. ఇది గతం.
జగన్ కొలువులోకొచ్చి కేవలం 9 నెలలు మాత్రమే అయింది. మరి ఇంతలోనే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చింది. అన్ని పార్టీలు తమతమ నోళ్ళు అదుపులో పెట్టుకోలేకపోతున్నారు. నారా చంద్రబాబునాయుడు నుంచి, వైఎస్‌ఆర్ పార్టీ నాయకుడు జగన్ వరకు అందర్నీ సమీక్షిద్దాం. అధికారంలో వున్న పార్టీ వైఎస్‌ఆర్ పార్టీ. మరి జగన్‌మోహన్‌రెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రతిపక్షాల్ని వొకటి రెండుసార్లు తప్ప ఎన్నడూ హద్దులు మీరలేదు. వొకసారి అసెంబ్లీలో మాత్రం శృతిమించారు. అది కూడా ఆరంభంలోనే. ఆపై తన భాషను, తన నోటిని చాలా అదుపులో పెట్టుకొని విమర్శిస్తున్నాడు. విమర్శల్లో కూడా చాలా సహేతుక కన్పిస్తుంది. ఆయన ఎక్కువగా తెలుగుదేశపు పచ్చ మీడియాను విమర్శించడమే పనిగా పెట్టుకొన్నాడు. ఆనాడు నంద్యాలలో ఉప ఎన్నికల సందర్భంలో వొక్కసారి మాత్రం ‘చంద్రబాబు లాంటి నాయకుణ్ణి కాల్చి చంపినా పాపం లేదు’ అని చాలా ఘాటుగా విమర్శలు చేశాడు. ఆ తర్వాత అధికార పీఠం బహుశా ఆయన నోటికి తాళం వేసిందేమో అనవచ్చు. చంద్రబాబు ఎంత రెచ్చగొట్టాలని చూసినా జగన్ ఎక్కడా తొణకక, హుందాగా జవాబులిస్తున్నాడు. నూతన కార్యక్రమాల ప్రారంభోత్సవ సందర్భంగా తప్ప ఎక్కడా ఈయన ప్రసంగించడం, విమర్శించడం చేయడం లేదు. చంద్రబాబులా రోజుకు 3సార్లయినా పత్రికా సమావేశాలు పెట్టడం లేదు. చంద్రబాబుగారు పగలూ, రేయా పత్రికా విలేఖర్లతో అనగా తనకున్న మీడియా వారితో మాట్లాడ్తుంటాడు. ఒక్కోసారి సలహాలు కూడా అడుగుతుంటాడు. వాస్తవంగా చెప్పాలంటే ఎందుకనో పత్రికా విలేఖర్లు చంద్రబాబు అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా ‘ఈగల్లా’ ముసిరిపోతుంటారు. ఆయన దగరున్న తాయిలం ఏంటో విలేఖర్లే చెప్పాలి. ఇక వైఎస్‌ఆర్‌సిపిలో వున్న నాయకులు, మంత్రుల విషయానికొద్దాం.. వీళ్ళలో కూడా చాలామంది చంద్రబాబును విమర్శించడంలో అదుపు తప్పుతుంటారు. తెలుగుదేశం, జనసేన పార్టీల విమర్శలకు ధీటైన సమాధానాలు చెప్తూ రాజకీయ వేడికి ఆజ్యంపోస్తూ వుంటారు. చెప్పుకోదగ్గ వారిలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజేంద్రనాథరెడ్డి, కన్నబాబు, అంబటి రాంబాబు, శ్రీకాంతరెడ్డి, జోగి రమేష్, సజ్జల రామకృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి (ఆర్‌కె), బాబూరావ్, నాగార్జున, విడుదల రజని లాంటి వారిని ప్రముఖంగా చెప్పవచ్చు. మరి జగన్‌గారి భయమో, పాలకపక్షంలో వున్నామన్న జ్ఞానమోకానీ వీళ్ళు మాత్రం నోటిని అదుపులో పెట్టుకొనే మాటాడతారు. మరో మంత్రి కొడాలి నాని మాత్రం విమర్శించేటప్పుడు ముఖ్యంగా చంద్రబాబును విమర్శించేటప్పుడు చాలావరకు కట్టుతప్పుతుంటాడు. ఆ జడివానలో చంద్రబాబు తండ్రిని, కొడుకుని, భార్య ను కూడా తిట్లతో తడిపేస్తుంటాడు. ఏమైనా మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటివాడు ఎంత రెచ్చగొట్టినా, సంయమనంతో ప్రశాంతంగా జవాబివ్వాల్సి వుంటుంది. కొద్దికాలం అసెంబ్లీలో టీడీపీ వాళ్లను వైసీపీ శాసనసభ్యులే ఎక్కువగా రెచ్చగొట్టడం చూశాం. అది కరెక్ట్‌కాదు. తర్వాత తర్వాత టీడీపీ వాళ్ళే రెచ్చిపోయారనుకోండి. ఏదిఏమైనా వైసీపీ సభ్యులు కేవలం టీడీపీవాళ్ళ విమర్శల్ని త్రిప్పికొట్టడంతోనే ఎక్కువ గడిపేస్తున్నారు. మీడియా మొత్తం వైసీపీకి వ్యతిరేకం అయినందున వాళ్ళు వీలైనప్పుడల్లా తాము ప్రవేశపెట్టిన పథకాల గూర్చి ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి. విమర్శల్ని కౌంటర్ చేయడమే లక్ష్యంగా సాగరాదు. రాష్ట్రంలో ఎన్నికల వేడి ఎక్కించేందుకు వైసీపీది తక్కువ బాధ్యతే.
ఇక ప్రధాన ప్రతిపక్షం ‘తెలుగుదేశం’. ఈ పార్టీకి మూడు దశాబ్దాల చరిత్ర వుంది. రాష్ట్ర రాజకీయాల్లో దీనికో ప్రత్యేకస్థానం వుంది. దీని నాయకుడు చంద్రబాబునాయుడుగారు ఈ పార్టీని గ్రామస్థాయ నుండి పునాదులు వేసి పటిష్ఠపరిచారు. మూడుసార్లు చంద్రబాబు ఓటమి చెందినా రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకొన్నాడు. ఈయనకు 7 పదుల వయసుకు దగ్గర్లో వున్నాడు. రాజకీయ అనుభవమే నాలుగు దశాబ్దాలుగా చెపుతారు. దురదృష్టం ఈయన్ని వైసీపీ రూపంలో వెంటాడి, వేటాడి చిత్తుచిత్తుగా ఓడించి 23 స్థానాలకు పరిమితం చేసింది. చాలామటుకు ఈయన జీవితమంతా కాంగ్రెస్‌పై పోరాటం చేస్తూ వచ్చాడు. 2019లో కాస్తా కాంగ్రెస్‌తో కలసి నడిచాడు. ప్రస్తుత అసెంబ్లీలో ఈయన జగన్‌కు ప్రత్యక్ష ఏకైక ప్రత్యర్థి. చెప్పాల్సిన అంశం ఏమంటే 2019లో జగన్ నెగ్గిన నాటినుండి కూడా ఆయన్ని రెచ్చగొట్టడం, కాలు దువ్వడంలోనే వున్నాడు. తాను ఓడిపోయానన్న బాధో, జగన్ గెలిచాడన్న కడుపులోమంటో గాని ఉదయంనుండి రాత్రి పడుకొనేవరకు జగన్‌ని తిట్టడమే ధ్యేయంగా, ఆయన్ని పదవినుండి దించడమే లక్ష్యంగా సాగిపోతున్నాడు. జూన్ 2019న చంద్రబాబు ఎంతో ముచ్చటగా 10 కోట్లు వెచ్చించి ఇంటిదగ్గర నిర్మించుకొన్న ప్రజావేదికను కూల్చిన రాత్రి నుండి జగన్‌పై యుద్ధం సాగిపోతూనే వుంది. ఈ దూషణ పర్వం కొద్దికొద్దిగా ఆరంభమయినా, స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడడంతో పతాకస్థాయికి చేరుకొన్నాయి. ప్రజాచైతన్య యాత్రల పేరున ఎన్నికల ప్రచారాన్ని ఫిబ్రవరి 19న ఒంగోలులో ఆరంభించాడు. ఈ యాత్ర దాదాపు 45 రోజులపాటు సాగుతుందని ప్రకటించారు. ఇప్పటివరకు జరిగిన ఒంగోలు, కుప్పం యాత్రల్లో కూడా జగన్‌ని తిట్టడమే అజెండాగా నిర్ణయించుకొన్నాడు. అసలు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి రగిల్చిందే చంద్రబాబు అని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ శిక్షణలో ప్రతి ఒక్కరూ రాటుతేలినవారు, వాగ్ధాటి కల్గినవారు. నందిని పందిగా, పందిని నందిగా చూపించగల బ్రహ్మర్షులు వారు. ఎదుటివారిపై తట్టెడు మట్టివేసినా, వాళ్ళే తమపై బురద చల్లుతున్నారని ఎలుగెత్తిచాటే మహానాయకులు వారు. అవతల ఏ కులంవాడు విమర్శిస్తే, తమలో అదే కులానికి చెందిన వారితో ఘర్జింపచేయడం తెలుగుదేశం టెక్నిక్. ఏ పార్టీలో లేనంత వినయ విధేయతలు ఇందులోని నాయకులకు చంద్రబాబుపై వుండడం నిజంగా చంద్రబాబు అదృష్టమే. చంద్రబాబునుండి మండలస్థాయి నాయకుల వరకు ఒకే శిక్షణ, ఒకే వాగ్ధాటి.
9 నెలల కాలంలో చంద్రబాబు ప్రతిరోజు జగన్‌ని అనరాని మాటలు అంటున్నాడు. కొన్నయితే తఠస్థులైన వారికి కూడా బాధ అన్పిస్తాయి. ఆనాడు సోనియాగాంధీ తెరవెనుక వుండి శంకరరావు, తెలుగుదేశం నాయకుడు ఎర్రన్నాయుడుతో కలసి ఆడిన నాటకంలో జగన్‌ను కేసుల్లో ఇరికించి జైలుకు పంపడం రాష్ట్రంలో విజ్ఞులైన అందరికీ తెలిసిందే. శిక్ష పడకపోయినా, దర్యాప్తు పూర్తికాకున్నా ‘జైలుకెళ్ళి’ రావడంతో చంద్రబాబు జగన్‌ని నానా మాటలు అనగల్గుతున్నాడు. 9 నెలల కాలంలో చంద్రబాబు జగన్‌ని అన్న మాటల్ని వొకసారి పరిశీలిద్దాం. అక్టోబర్ 2న ‘జగన్ తోక కత్తిరించి, పులివెందులకు పంపిస్తాం’, అక్టోబర్ 11న ‘జగన్‌కు అధికారం పిచ్చోడి చేతిలో రాయి’. మద్యంపై జగన్ పేరున ‘జె’ టాక్స్ వేసి ధరలు పెంచి దోచుకొంటున్నారు. అక్టోబర్ 12న ‘జగన్ చేసిన తప్పులకు ఆయన్ని శాశ్వతంగా జైల్లోపెట్టాలి.’ ఆంధ్రప్రదేశ్‌ను బీహార్ చేస్తున్నాడు, ఆగస్టు 7న సత్తెనపల్లి కార్యకర్తల సమావేశంలో ‘ప్రజలు పాలిచ్చే గోవును కాదని దున్నపోతును తెచ్చుకొన్నారు’, ‘నా పట్టిసీమ నీళ్ళు త్రాగి నాకు వోటేయలేదు’, ఆగస్టు 22 ‘జగన్ ఈ రాష్ట్రానికి పట్టిన శని’, అక్టోబర్ 14 నెల్లూరులో ‘చేసిన తప్పులకు జగన్‌ని ఉరితీయాలి’, ‘జగన్ నీతి గూర్చి చెప్పడం దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంది’, అక్టోబర్ 15న ‘వైసీపీ ఆంబోతుల్ని అదుపుచేసే శక్తి మాకుంది.’ ‘నా ఇంటికి వేసిన త్రాళ్ళే రేపు పోలీసులకు ఉరిత్రాళ్ళు అవుతాయి’, అక్టోబర్ 21న శ్రీకాకుళం ‘జగన్ అదేమన్నా నీ అబ్బ సొత్తా! నువ్వు ఓ చిల్లర రౌడీ. రానున్న రోజుల్లో నీ లెక్క తేలుస్తా ఖబడ్దార్’, డిసెంబర్ 17న ‘తుగ్లక్ కూడా జగన్‌లా చేసి వుండడేమో’, ఫిబ్రవరి 19న ‘చివరికి ఎలుక బొచ్చు కూడా పీక్కోలేకపోయారు’, ‘ఈ సైతాన్‌ను చూసి పెట్టుబడిదారులు ఎవరూ ముందుకు రావడం లేదు’, ఫిబ్రవరి 24, 25 కుప్పం పర్యటనలో ‘మీ గుండెల్లో నిద్రపోతా’, మీ అమ్మానాన్నా గడించిన డబ్బుతో జగన్ కటౌట్‌లు పెట్టారా?’, ‘జగన్ ఆర్థిక నేరగాడు కనుకే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ విందుకు ఆహ్వానించలేదు’, ‘జగన్ అజ్ఞానం, సైకో ప్రవర్తనవల్ల పోలవరం ఇబ్బందుల్లో పడింది’. మద్యం ధరలు పెంచి త్రాగుబోతుల పొట్టకొట్టి పైశాచిక ఆనందం పొందుతున్నాడు, ‘పిచ్చితో రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నాడు’, ‘సాక్షి పనికిమాలిన చెత్త పేపర్. సాక్షి టీవీ అవినీతిది’, ‘అప్పుడు ముద్దులు పెట్టాడు. ఇప్పుడేమో ఉన్మాదిలా పిడిగుద్దులు గుద్దుతున్నాడు.’ ఇవి కేవలం కొన్ని మచ్చుకు మాత్రమే. చంద్రబాబు రాజధాని పర్యటనల్లో అయితే వినరాని, రాయలేని తిట్లు కూడా తిట్టాడు.
ఇక తెలుగుదేశం లీడర్లు కూడా తమ నాయకుడికి ఏమాత్రం తగ్గకుండా ప్రతిరోజు తిడుతున్నారు. సృష్టించిన పేపర్ లీక్ వ్యవహారంలో ఈ నాయకులు, చంద్రబాబుతో కలసి ‘జగన్‌ను రాజీనామా చేయాలంటూ’ ఉత్తరం కూడా రాశారు. నిన్నమొన్న దేవినేని ఉమ అయితే ‘నాపై విచారణ చేయండి ఏం పీక్కుంటారో పీక్కోండి’ అని విమర్శించాడు. పంచుమర్తి అనురాధ అనే మహిళ అయితే జగన్‌ను హీనాతి హీనంగా విమర్శిస్తుంటుంది.
వేడెక్కిన రాష్ట్రంలో నిత్యమూ విమర్శల ఇంధనం పోస్తూ తెలుగుదేశం నాయకులు ఆనందిస్తుంటారు. బుద్దా వెంకన్న, బుచ్చయ్యచౌదరి, వర్ల రామయ్య, రామానాయుడు, అచ్చెన్నాయుడు, ఎనమల, అనిత, నక్కా ఆనందబాబు లాంటి పెద్దలైతే జగన్‌ను వినలేని మాటలతో విమర్శిస్తుంటారు. ఇంత హీట్‌కు వీరే కారకులు. ఎన్నికల్ని తలపింపచేస్తున్నారు.
మరో వ్యక్తికూడా జనసేన పార్టీ పేరున ఎన్నికల నిప్పును రాజేస్తుంటాడు. ఆయనే పవన్ కళ్యాణ్‌గారు. యావత్ రాష్ట్రానికి ఈయనే ఏకైక నాయకుడిలా జగన్‌పై విమర్శలు చేస్తుంటాడు. తాను జగన్‌రెడ్డిని సీఎంగానే గుర్తించనని, అతనొక ఉన్మాది, జైలుపక్షి అని ఇంకా చాలా తీవ్ర విమర్శలే చేస్తుంటాడు. తానొక్కడు చాలనని, తలచుకొంటే 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కొట్టుకుపోతారని కూడా రెచ్చగొడుతుంటాడు. ఇటీవలి కాలంలో బీజేపీ పార్టీకూడా పవన్‌తో జతకట్టి ‘జగన్‌ని’ ఉమ్మడిగా విమర్శిస్తున్నారు.
మరి ఇంతమంది, ఇన్ని పార్టీల నాయకులు జగన్‌ను రోజూ విమర్శిస్తుంటే రాజకీయ వాతావరణం వేడెక్కకన్నా ఎలా వుంటుంది. వేడి వరకైతే ఫర్లేదు కానీ ఈ విమర్శలు మరో మలుపు తిరిగి, అహింసకు చోటిస్తే వచ్చే నష్టం ఎవరికి? సామాన్య ప్రజానీకానికేగా! కావున అన్ని పార్టీలవారు, ఇప్పటికైనా సంయమనం పాటించి, నిర్మాణాత్మక విమర్శలు చేయండి. ట్విట్టర్‌లో అయితే విజయసాయిరెడ్డిగానీ లోకేష్‌గాని చేయరాని విమర్శలు చేసుకొంటుంటారు. ఇవన్నీ కూడా కరెక్టుకాదు, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్తకొత్త స్కీంలు ప్రజలకు చేరకపోతేనో లేక అందులో లోపాలుంటేనో విమర్శలు చేయండి. అంతేకాని ‘దున్నపోతు ఈనిందంటే గాటని కట్టెయ’ అన్న చందంగా విమర్శలు చేయరాదు. ప్రభుత్వం కూడా ఏ పార్టీ వారైనా నిర్మాణాత్మక సూచనలిస్తే స్వీకరించే మనస్తత్వం అలవరచుకోవాలి. పాలక వర్గం, ప్రతిపక్షం రెండూ రెండు కళ్ళు లాంటివే. ఒకర్నొకరు గౌరవించుకోవాలి. సిద్ధాంతపరంగా వ్యతిరేకించాలే గానీ స్వార్థప్రయోజనాలతో వ్యతిరేకించకూడదు. వ్యక్తిగత విమర్శలకు అన్ని పార్టీలు స్వస్తివచనం చెప్పాలి. కక్షలు, క్రోధాలు విడచిపెట్టాలి. మన చెడు ప్రవర్తన ముందుతరాల వారికి మార్గదర్శకత్వం కాకూడదు. 40 సం.ల అనుభవమున్న చంద్రబాబు కూడా 40 ఏళ్ళున్న జగన్‌పై మాటిమాటికి కత్తులు దువ్వడం సరికాదు. చంద్రబాబు లాంటి స్టేచర్ వున్న వ్యక్తి వ్యక్తిత్వానికి ఇలాంటి చౌకబారు ఆరోపణలు మచ్చతెస్తాయి. ఆఖరు దశలో చంద్రబాబు తన చరిత్రను మలినం చేసుకునే ప్రయత్నం చేయకూడదు. తిట్లతో, అసత్య ఆరోపణలతో ఓట్లు రాలవని 2014లో జగన్, 2019లో చంద్రబాబు గ్రహించే వుంటారుగా! సో రాజకీయ నాయకులూ తిట్టుకోకండి ప్లీజ్!

- డా. విజయకుమార్, 93907 45775