మెయన్ ఫీచర్

370 రద్దు కథ ముగిసినట్టేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను కల్పిస్తూ వచ్చిన అధికరణం 370ని రద్దు చేయడం రాజ్యాంగపరంగా చెల్లదని సవాలు చేస్తూ దాఖలైన 22 పిటిషన్లను ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృతస్థాయి రాజ్యాంగ ధర్మాసనానికి పంపించడానికి తగిన కారణాలు కనిపించడం లేదని జస్టిస్ ఎన్ వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ రమణతో పాటు జస్టిస్ ఎన్ కే కౌల్, జస్టిస్ సుభాష్‌రెడ్డి, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యాకాంత్ ఉన్నారు. ఒక ప్రజావాజ్య పిటిషన్‌తో పాటు ఇతర రిట్లను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం జనవరి 23 వరకూ వాదనలు కొనసాగించి తీర్పును రిజర్వు చేసి తీర్పు సారాంశాన్ని ఎట్టకేలకు వెలువరించింది. 370 అధికరణంపై 1959లోనూ, 1970లోనూ వెలువడిన రెండు తీర్పులు పరస్పరం భిన్నంగా ఉన్నందున ప్రత్యేక ధర్మాసనం ఈ అంశాన్ని విచారించకుండా ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృతస్థాయి ధర్మాసనానికి నివేదించాలని ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. మునుపటి రెండు తీర్పుల మధ్య వైరుధ్యాలు ఏమీ లేవంటూ ధర్మాసనం వీరి వాదనలతో విబేధించింది. తామే ఈ పిటిషన్లను విచారిస్తామని జస్టిస్ ఎన్‌వీ రమణ తేల్చి చెప్పారు. పిటిషనర్ల తరఫున రాజు రామచంద్రన్, దినేష్ ద్వివేది, గోపాల్ శంకర్‌నారాయణ, జడ్‌ఏ షా, సంజయ్ పారిక్‌లు వాదనలు వినిపించారు.
సామాజిక, రాజ్యాంగ, ఆర్థిక మార్పు అనివార్యత దర్శనమైతే మినహా ఎపుడూ ఆవిష్కృత సంప్రదాయాలను ఉల్లంఘించినట్టు న్యాయమీమాంస చెప్పలేదని జస్టిస్ ఎన్‌వీ రమణ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనించదగింది. న్యాయమీమాంసను ఏ దశలోనూ విస్మరించబోదని, పూర్వ సిద్ధాంతాన్ని కీలకమైన పడకగది మాదిరి న్యాయస్థానం పరిగణిస్తుందని, అపుడే సరైన న్యాయం అందించగలుగుతామని జస్టిస్ రమణ ఈ పిటిషన్లపై వ్యాఖ్యానించారు. గత సంప్రదాయాలను విస్మరించడం న్యాయవ్యవస్థకు ఒక కుదుపు వంటిదని అమెరికా సెనేట్‌లో ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్టు చేసిన వ్యాఖ్యలను జస్టిస్ రమణ ప్రస్తావించారు.
జమ్మూకశ్మీర్ రాష్ట్ర పునర్విభజన జరిగిపోయింది, గత ఏడాది ఆగస్టు 5న రాజ్యసభలో, మరసటి రోజు లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడం, ఆగస్టు 9న రాష్టప్రతి దానిని ఆమోదించడం వెంటనే గెజిట్ విడుదల కావడం జరిగిపోయాయి. జమ్మూకశ్మీర్ రాష్ట్రాలుగా , లడఖ్ ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా విడిపోయాయి. పాలన ఇపుడిపుడే గాడిలో పడుతోంది. భారతదేశ చట్టాలు అన్నీ వీటికి వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం హుకుం జారీ చేసింది. అసలు చిక్కు ఇక్కడే మొదలైంది.
ప్రేమ్‌నాథ్ కౌల్ వెర్సస్ జమ్మూకశ్మీర్ (ఎఐఆర్ 1959 ఎస్సీ 749), సంపత్ ప్రకాశ్ వెర్సస్ జమ్మూకశ్మీర్ (ఎఐఆర్ 1970 ఎస్సీ 1118), మక్బుల్ దామ్‌నూ వెర్సస్ స్టేట్ ఆఫ్ జమ్మూకశ్మీర్ (ఎఐఆర్ 1972 ఎస్సీ 536) కేసుల్లో సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులు మరోమారు తెరమీదకు వచ్చాయి.
దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే చట్టాన్ని అమలుచేసేందుకు ఆర్టికల్ 370ని రద్దుచేసి జమ్మూ కశ్మీర్ రాష్ట్ర పునర్విభజన చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై న్యాయసమీక్ష ఎంత దూరం వెళ్తుందో చూడాలి. 370 రద్దుపై విస్తృత ధర్మాసనానికి నివేదించాలనే యోచన తమకు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఈ అంశాన్ని విచారణకు స్వీకరిస్తే ఇంత త్వరగా నిర్ణయం వెలువడే అవకాశం ఉండదనేది కేంద్రం వాదన.
ప్రేమ్‌నాథ్ కౌల్ కేసులో 370 అధికరణం తాత్కాలికమేనని అప్పటి సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొనగా, సంపత్‌ప్రకాశ్ కేసులో రాష్టప్రతికి సంపూర్ణ అధికారాలున్నాయని తీర్పు వెలువరించింది. సంపత్ ప్రకాశ్ కేసులో తీర్పు వెలువరించినపుడు ప్రేమ్‌నాథ్ కౌల్ కేసు తీర్పును సుప్రీంకోర్టు పట్టించుకోలేదన్న వాదనను అటార్నీ జనరల్ కొట్టివేశారు. తీర్పులను ఆయా సమయం సందర్భం దృష్టితో చూడాలని వ్యాఖ్యానించారు. ఒక దశలో జమ్మూ కశ్మీర్ రాజుపాలనలో ఉంది, మరో దశలో శాసనసభ ఏర్పాటైంది, ఇంకో దశలో రాష్టప్రతి పాలనలో కొనసాగింది. రాజు పాలనలో ఉన్నపుడు జరిగిన చర్చలూ, వాటి సారాంశాలూ, నిర్ణయాలు భిన్నమైనవని, వాటిని నేటి పరిస్థితులతో చూడాలేమన్నది అటార్నీ జనరల్ వాదన. అయితే రాష్టప్రతికి 370 ఆర్టికల్‌ను రద్దు చేసే అధికారం లేదని పిటిషనర్లు వాదిస్తున్నారు.
ఆర్టికల్ 370ఏ జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తే ఆర్టికల్ 35 ఏ కింద ఆ ప్రాంతానికి ప్రత్యేక హక్కులు లభించాయి. కశ్మీర్‌లో శాశ్వత నివాసులు ఎవరో నిర్ధారించే అధికారం ఆ రాష్ట్ర అసెంబ్లీకి దక్కింది. 1954 నాటి రాష్టప్రతి ఉత్తర్వులను ఉపసంహరించుకుంటూ 2019 ఆగస్టు 5న రాష్టప్రతి ఆదేశాలు జారీ చేశారు.
ఎటూ తేల్చుకోలేని సంధికాలంలో జమ్మూకశ్మీర్ రాజు హరిసింగ్ భారత్‌లో విలీనం కావాలని నిర్ణయించారు. కశ్మీర్ భారత్‌లో విలీనం అయ్యింది, కానీ విలీనం అయిన తేదీ, ఒప్పందంపై ఎవరు సంతకాలు చేశారనే దానిపై ఇప్పటికీ అస్పష్టమే. ఆర్టికల్ 370 కారణంగా రాజ్యాంగంలోని అన్ని నిబంధనలూ జమ్మూ కశ్మీర్‌కు వర్తించకుండా అడ్డంకి ఏర్పడింది. ఆ తర్వాత ఈ అధికరణంపై ఎంతో చర్చ జరిగింది. పార్లమెంటులో 1963 నవంబర్ 27న పండిట్ నెహ్రూ మాట్లాడుతూ ఆర్టికల్ 370 అనేది మధ్యంతర తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రాజ్యాంగంలో భాగం కాదు, అది కొనసాగినంతకాలమే ఉంటుందని పేర్కొన్నారు.
ఆర్టికల్ 370 భారత దేశ ప్రజల మధ్య కొంత విద్వేషానికి కూడా కారణమైంది. అన్ని మతాల వారినీ సన్నిహితం చేసే బదులు వారి మధ్య మరింత అగాధాన్ని పెంచింది. రాజకీయ స్వార్థపర శక్తులు ఈ అగాధాన్ని మరింత పెంచి పోషించాయి. కాల క్రమంలో జమ్మూ కశ్మీర్ ప్రజలకు, మిగతా భారతభాగంలోని ప్రజలకు మధ్య ఏదో కనిపించని ఎడబాటు ఏర్పడింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే జమ్మూ కశ్మీర్ వేరే దేశం మాదిరి ఉండేది. దేశ రాజ్యాంగంతో సంబంధం లేకుండా సొంత చట్టాలు, సొంత పాలన, చివరికి రక్షణ, విదేశాంగ, కమ్యూనికేషన్ రంగాలు మినహా ఏ చట్టాన్ని ఆ రాష్ట్రానికి వర్తింపచేయాలన్నా ఆ రాష్ట్ర అనుమతిని కేంద్రం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాసనసభ ఆమోదం పొందడమనే సాంకేతిక ఇబ్బందిని అధిగమించేందుకు అక్కడ ఏక్కువకాలం రాష్టప్రతి పాలనే కొనసాగింది.
జమ్మూ కశ్మీర్‌కు ఓ ప్రత్యేక రాజ్యాంగం కోసం అసెంబ్లీ కోసం 1951లో అనుమతి లభించింది. 1956 నవంబర్‌లో రాష్ట్ర రాజ్యాంగం పని పూర్తవడంతో 1957 జనవరి 26న జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో ప్రత్యేక రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ ప్రత్యేక రాజ్యాంగం కారణంగా అనేక చట్టాలు ఆ రాష్ట్రానికి వర్తించకుండా పోయాయి. 1976 నాటి పట్టణ భూ చట్టం జమ్మూ కశ్మీర్‌కు వర్తించదు. భారతదేశంలో ఎక్కడైనా భూమిని కొనుగోలు చేసే హక్కు భారతీయుడికి ఉంటుంది, కానీ జమ్మూకశ్మీర్‌లో భూమిని కొనుగోలు చేసే హక్కు అందరికీ ఉండదు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 360 ద్వారా దేశంలో అత్యవసర పరిస్థితిని విధించే అవకాశం ఉంది, కానీ ఇది జమ్మూ కశ్మీర్‌కు వర్తించదు. ఇతర దేశాలతో యుద్ధం వచ్చిన ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే 360 వినియోగించే వీలుంటుంది. జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగించాలని 2015 డిసెంబర్‌లో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం వాటిని కొట్టివేస్తూ, స్వయంప్రతిపత్తిని తొలగించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది.
ఆర్టికల్ 370తో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని 1964లోనే ప్రకాశ్ వీర్ శాస్ర్తీ పార్లమెంటులో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. రాం మనోహర్ లోహియా, కే హనుమంతయ్య వంటి నాయకుల మద్దతు కూడా లభించింది. 370 అధికరణం రద్దుకు చట్టం చేయాలని పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల సభ్యులు కోరుకుంటున్నారని హనుమంతయ్య లోక్‌సభలో చెప్పారు. 370 రద్దుకు అనుకూలంగా 12 మంది సభ్యులు మాట్లాడారు. వారిలో ఏడుగురు కాంగ్రెస్ సభ్యులే. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఇందర్ జే మల్హొత్ర మద్దతు పలుకగా , శరణ్ లాల్ సరాఫ్, సోషలిస్టు పార్టీకి చెందిన హెచ్ వీ కామత్, సీపీఐకి చెందిన సరోజ్ పాండే , బీహార్‌కు చెందిన భగవత్ ఝూ అజాద్ మాత్రం 370 రద్దును వ్యతిరేకించారు. రాజ్యాంగంలోని పార్టు 21(ఏ) లో 370 కేవలం తాత్కాలిక నిబంధన అనే శీర్షిక ఉన్నా ఆర్టికల్ 370 ఒక శాశ్వత నిబంధన అని 2015లో జమ్మూ కశ్మీర్ హైకోర్టు స్పష్టం చేసింది. 370ని తొలగించడం సాధ్యం కాదని హైకోర్టు పేర్కొంది. ఆర్టికల్ 35ఏ దానిని సంరక్షిస్తుందని పేర్కొంది. ఆర్టికల్ 370ని మరో అధికరణం 368(1) ద్వారా సవరించుకునే వీలుందన్నది రాజ్యాంగ నిపుణుల వాదన. పార్లమెంటులో ఆర్టికల్ 370 రద్దు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టికల్ 35 ఏ రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు, జమ్మూ కశ్మీర్ రెండో సవరణ బిల్లు 2019కు రాజ్యసభ ఆమోదం దక్కింది. ఇది జమ్మూ కశ్మీర్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 10 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు. ఇంతే కాదు, దాదాపు మరో 106 చట్టాలు జమ్మూ కశ్మీర్ లడాఖ్ ప్రాంతాలకు వర్తించబోతున్నాయి. 35 ఏ రద్దుతో అక్కడ దశాబ్దాలుగా మహిళల పట్ల కొనసాగుతున్న వివక్షను అంతం చేసినట్టయింది. అంతేకాదు, ఆ రాష్ట్రంలో అమలు అయ్యేలా అన్ని చట్టాలనూ కేంద్రం చేసేందుకు వీలు కలుగుతుంది. దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరి జమ్మూకశ్మీర్‌లో ఇపుడు ఎవరైనా ఎక్కడైనా జీవించే హక్కు లభించింది. జమ్మూకశ్మీర్‌లో 360 ఆర్టికల్ ద్వారా ఆర్ధిక అత్యవసర పరిస్థితిని అమలుచేయవచ్చు. అంతేగాక అక్కడి నివాసితులు అంతా సమాన హక్కులు పొందుతారు. రాష్ట్ర సర్వీసుల్లో నియామకాలకు అర్హులు అవుతారు. అలాగే అన్ని ప్రయోజనాలు అర్హులైన అందరికీ అందుతాయి. శరణార్థుల మీద నిర్ణయం తీసుకునే హక్కు కేంద్రానికి లభిస్తుంది.
ఇదంతా ఒక ఎత్తయితే, అసలు 370 అమలు శాశ్వతమా? తాత్కాలికమా? రద్దు చేసే అధికారం రాష్టప్రతికి ఉందా లేదా ? 370 రద్దు రాజ్యాంగ విరుద్ధమా కాదా అనే వౌలిక ప్రశ్నలపై ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తమ వాదనలను కొనసాగించే అవకాశం ఉంది. అంటే అధికరణం 370 రద్దు కథ ముగిసినట్టేనా కాదా? చూడాలి.

- బీవీ ప్రసాద్ 9963345056