మెయన్ ఫీచర్

పోలీసుల్లో నిర్వేదం.. దేశానికి ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరిగ్గా 281 సంవత్సరాల క్రితం 1739లో పర్షియా సైన్యాధ్యక్షుడు నాదిర్ షా కందహార్, లాహోర్, సింధ్ ప్రాంతాలను గెలుచుకుని నరమేధం సృష్టిస్తూ, ఢిల్లీకి సమీపంలోని కర్నాల్ వద్ద మొఘలాయి చక్రవర్తి మహమ్మద్ షాతో యుద్ధం చేశారు. మూడు గంటల్లో మహమ్మద్‌షా సైన్యం ఓటమి చెందింది. ఇక ఢిల్లీపై దండయాత్ర చేసిన నాదిర్ షా మార్చి 22వ తేదీన రక్తపాతం సృష్టించాడు. చరిత్రకారుల అంచనా ప్రకారం దాదాపు ఢిల్లీని రక్షించుకునేందుకు ఆనాడు హిందువులు, ముస్లింలు కలిసి పోరాడిన ఘటనలో 20 నుంచి 30 వేల మంది నాదిర్ షా చేతిలో హతమయ్యారు. ఏడు వందల ఏనుగులు, నాలుగు వేల ఒంటెలు, 12 వేల గుర్రాలపై మొఘల్ చక్రవర్తి కోశాగారాన్ని కొల్లగొట్టి బంగారం, ఇతర నగలను నాదిర్‌షా పర్షియాకు తరలించారు. 2020లో ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ మధ్య అదే ఢిల్లీలో ఆధునిక భారతంలో సంఘ వ్యతిరేక శక్తుల స్వార్థ ప్రయోజనాలకు 45 మంది అమాయకులు బలయ్యారు. మనం ఎంతో గొప్పగా చెప్పుకునే ఢిల్లీ చరిత్ర అంతా రక్తపాతమే. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఢిల్లీలో శాంతి భద్రతల పరిరక్షణలో ఢిల్లీ పోలీసులు దేశానికి తలమానికంగా నిలిచారు. కాని కాలానుగుణంగా మారిన పరిస్థితులు ఢిల్లీ పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశాయి.
మానవ హక్కులు, పౌర హక్కుల పేరుతో అంతవరకు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి మారిన రాజకీయ పార్టీలు ఢిల్లీ పోలీసుల జీవితాలతో ఆడుకోవడంతో మనకెందుకు వచ్చిన గొడవ అనే నిర్వేదం ప్రబలింది. ఆ నిర్లక్ష్యమే ఈ రోజు ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో రెక్కాడితే కాని డొక్కాడని జీవులపై అల్లరి మూకలు దాడి చేసి రక్తపాతం సృష్టించాయి. ఈశాన్య ఢిల్లీ అంటే బడుగు వర్గాలకు కోట. అక్కడ ఐశ్వర్యవంతులు, ఉన్నత మధ్యతరగతి వర్గాలు లేవు. 21వ శతాబ్ధంలో కూడా ఈ తరహా దాడులు జరుగుతాయన్న సంఘటనలు తలుచుకుంటే సిగ్గుతో తలవంచుకోవాలి. ఢిల్లీ ఘటనకు ఒక మతం లేదా ఒక రాజకీయ పార్టీని బాధ్యతగా భావించడం అవివేకం. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మొత్తం జవాబుదారీ వహించాల్సి ఉంటుంది.
ప్రపంచంలో శక్తివంతమైన దేశాధినేత డొనాల్ట్ ట్రంప్ భారత్‌కు వచ్చి అహ్మదాబాద్, ఢిల్లీలో పర్యటించే సమయంలో పనికట్టుకుని అల్లర్లకు దిగాలన్న దుర్బుద్ధి ఎవరికి ఉంటుందో అందరికీ తెలిసిందే. ఒక వైపు అల్లర్లు, మరో వైపు ట్రంప్ పర్యటన. కఠిన చర్యలకు దిగితే భారత్‌ను అంతర్జాతీయంగా అప్రతిష్టపాలు చేసేందుకు సిద్ధంగా ఉన్న మతశక్తుల కుట్రలకు భారత్ మరోసారి బలైంది. చరిత్రను చదవడం, లోపాలను సరిదిద్దుకోవడం మనకు ఇష్టం ఉండదు. అందుకే శతాబ్థాలు గడచినా, కొత్త రూపంలో పాత తరహా ఘటనలు పునరావృతమవుతున్నా పట్టించుకోని దుస్థితి నెలకొంది. 1984 సిక్కుల ఊచకోత ఘటన మానవ నాగరికత చరిత్రకే మాయనిమచ్చ.
పోలీసుల్లో నిర్వేదం, నిస్తేజం, అసంతృప్తి, అసహనం, విధి నిర్వహణ పట్ల నిర్లిప్తత సమాజానికి, దేశానికి ప్రమాదకరం. సరిగ్గా ఈశాన్య ఢిల్లీలో అదే జరిగింది. దుండగుల కాల్పులకు, దాడులకు రతన్ లాల్ అనే పోలీసు జవాను, ఐబీ పోలీసు అధికారి అంకిత్ శర్మ బలయ్యారు. విధి నిర్వహణలో ఉన్న వీరు నిస్సహాయ స్థితిలో అల్లరిమూకల దాడులకు నేలకొరిగారు. మన దేశంలో ఈశాన్య ఢిల్లీ కంటే మించి పెద్ద ఎత్తున మారణహోమాల సంఘటనలు గతంలో జరిగాయి. ఢిల్లీ ఘర్షణలు నివారించదగినవే. ఇవేమీ పోలీసులు అదుపు చేయలేనంత స్థాయివి కావు. పోలీసులు అదుపు చేయకపోవడానికి కారణాలేమిటి అనే వాటిని విశే్లషించుకోవాలి. పౌరసత్వ సవరణ వ్యతిరేక ఉద్యమంలో అన్ని వర్గాల అల్లరి మూకలు ప్రవేశించి విధ్వంసం సృష్టిస్తే పోలీసులు విఫలమయ్యారు.
పోలీసు వ్యవస్థను దూషించాలంటే రాజకీయ పార్టీలకు విందు లాంటిదని చెప్పవచ్చు. గత మూడు నెలలుగా ఢిల్లీ పోలీసులను రాజకీయ వ్యవస్థలు టార్గెట్ చేశాయి. పోలీస్ అండ్ పొలిటిక్స్ అనే పుస్తకంలో కృపాల్ సింగ్ థిల్లాన్ అనే విశిష్టమైన పోలీసు అధికారి రాస్తూ, పోలీసులకు అటానమీ లేదు. ప్రజాజీవితంలో శాంతి భద్రతలను పరిరక్షించే పోలీసు బలగాలు ఇంకా బ్రిటీష్ వలస పాలన నాటి తన రూపం నుంచి బయట పడలేదు. అధికారంలో ఉండే ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునే పరిస్థితి కొనసాగుతోంది అని విస్పష్టంగా చెప్పారు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలను చిత్తశుద్ధిగా అమలు చేస్తే తప్ప ఈ నిర్వేదం నుంచి ఈ వ్యవస్థ బయటపడదు. 1977లో జనతా ప్రభుత్వం నేషనల్ పోలీసు కమిషన్‌ను ఏర్పాటు చేసింది. పోలీసు వ్యవస్థపైన అధికారంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఆధిపత్యం కొనసాగినంత వరకు సంస్కరణలు అమలు కావుఅని ఈ కమిషన్ పేర్కొంది. ఇందిరాగాందీ 1980 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ కమిషన్ ఇచ్చిన నివేదికలను రాష్ట్రాల అభిప్రాయాల కోసం పంపారు. ఆ తర్వాత వీటిని పట్టించుకున్న దాఖలాలు లేవు.
2006లో ప్రకాశ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చారిత్రకమైన తీర్పు ఇచ్చింది. పోలీసు వ్యవస్థలో సంస్కరణల కోసం ఆరు మార్గదర్శకాలను నిర్దేశించారు. పోలీసు వ్యవస్థను ప్రభావితం చేసే విధంగా అధికార పార్టీ ఉండరాదని కోర్టు పేర్కొంది. స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా అనే నివేదికను కామన్ కాజ్ అనే సంస్థ రూపొందించింది. దీని ప్రకారం పోలీసు వ్యవస్థలో ఎటువంటి సంస్కరణలు అమలు కాలేదని ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉందని తేలింది. రాజకీయ వత్తిళ్లకు లొంగకుండా పనిచేసే అధికారిని కచ్చితంగా బదిలీ చేయడమో లేదా సస్పెండ్ చేయడం తథ్యం. హిమాచల్ ప్రదేశ్‌లో చాలా మంది పోలీసు అధికారులను గత ఏడాది బదిలీ చేశారు. స్థానిక రాజకీయ నాయకులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు చలానాలు రాశారు. దీంతో వారి ఆగ్రహానికి పోలీసులు గురయ్యారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ పర్యటించిన తర్వాత శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయి. ట్రంప్ వెళ్లిన 24 గంటల తర్వాత పోలీసుల దెబ్బకు సంఘవిద్రోహశక్తులు తోకముడిచాయి.
ఇటీవల కాలంలో పోలీసుల ఆత్మగౌరవం, మనో నిబ్బరం దెబ్బతిన్న ఘటనలు ఢిల్లీలో జరిగాయని పోలీసు నిపుణులంటున్నారు. టిస్ హజారి కోర్టులో పోలీసులు, న్యాయవాదులకు మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత సీఏఏ వ్యతిరేక ఉద్యమంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు. ఈ ఘటనల్లో పోలీసు ప్రతి చర్యను మీడియా, రాజకీయ పార్టీలు స్క్రూటినీ చేసి పీల్చి పిప్పి చేశాయి. అవే మీడియా సంస్థలు ఢిల్లీ తగలబడుతుంటే పోలీసులు ఏమి చేస్తున్నారంటూ కడిగిపారేశాయి. అల్లర్లను అణచివేసే సమయంలో పోలీసులకు సరైన నాయకత్వంలో దిశ, దశ మార్గనిర్దేశనం ఉండాలి. కాని అల్లర్లను అణచివేసే ప్రక్రియ ప్రారంభించినా, వాటి ముగింపు ఎవరి చేతిలో ఉండదు.
మీడియా కూడా ఒక్కోసారి పనికిమాలిన దేశ విద్రోహ కామెంట్లు చేస్తూ అగ్నికి ఆజ్యం పోస్తుంటుంది. జమ్మూకాశ్మీర్‌లో 370ను రద్దు చేసి హింసను అదుపు చేసిన కేంద్రం, ఈశాన్య ఢిల్లీలో తక్కువ చదరపు కి.మీ పరిధిలో జరుగుతున్న అల్లర్లను ఎందుకు నియంత్రించలేకపోలేకపోతున్నారంటూ ఒక ఆంగ్ల చానల్ విలేఖరి ఆవేశంగా ప్రశ్నించారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగం చేసినా, గాలిలో కాల్పులు జరిపినా, హింస ప్రజ్వరిల్లితే, కాల్పులు జరిపినా, పక్కనే ఉండి వీడియోలో ఆ దృశ్యాలు బంధించి, ఆ పోలీసుల ముఖాలు కనపడేటట్లు గంటల కొద్దీ విజువల్స్‌ను ప్రసారం చేస్తున్నారు. పోలీసుల్లో కూడా పై అధికారుల పట్ల విధేయత తగ్గింది. న్యాయవాదులతో వివాదం కేసులో ఆందోళనకు దిగిన పోలీసులును సముదాయించేందుకు వచ్చిన అప్పటి పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్‌ను అవమానించారు. అప్పుడే ఈ విధంగా వ్యవహరించిన పోలీసుల పట్ల కేంద్రహోంశాఖ కఠిన చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది. పోలీసులే పై అధికారి పట్ల తిరుగుబాటుతత్వంతో వ్యవహరిస్తే ఇది పోలీసు వ్యవస్థలో చోటు చేసుకున్న దుర్లక్షణానికి చిహ్నం . పై అధికారుల ఆదేశాలను పాటించడమే పోలీసుల విధి. ఫండమెంటల్ రూల్ దెబ్బతింటే ప్రభుత్వం ఏమి చేస్తోంది ?.
దేశంలో మరే పోలీసులకు లేని అద్భుతమైన వౌలిక సదుపాయాలు, అత్యంత ఆధునిక ఆయుధాలు, శిక్షణ, వసతి సదుపాయాలు ఢిల్లీ పోలీసులకు ఉంది. ఢిల్లీ కేంద్రపాలిత రాష్ట్రం. ఇక్కడ 80వేల మంది పోలీసులు ఉన్నారు. ఢిల్లీ పోలీసు వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఢిల్లీ పోలీసుల్లో 25 శాతం మంది వీవీఐపీల భద్రతలో ఉన్నారు. హైదరాబాద్ మహానగరం కూడా తీవ్రమైన అలజడికి 1981-1999 మధ్య లోనైంది. ఆ రోజుల్లో మతకల్లోలాల వల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లకు లోనయ్యారు. దీనికి తోడు వామపక్ష తీవ్రవాదం విజృంభించింది.
నక్సలైట్ల అణచివేతకు గ్రేహౌండ్స్‌ను ఏర్పాటు చేయాలని దివంగత ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ నివేదిక ఇవ్వగా, ఆ నాటి ప్రభుత్వం సమ్మతించింది. ఆ తర్వాత మూడు దశాబ్థాలుగా గ్రేహౌండ్స్ కమాండోల త్యాగం, రాజీలేని పోరు, వీరోచిత పోరాటం వల్ల నక్సలైట్ల ఉనికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాయమైంది. ఎంతో మంది గ్రేహౌండ్స్ జవాన్లు అసువులు భాసారు. అదే విధంగా హైదరాబాద్ మతకల్లోలాలను అణచివేసేందుకు పోలీసు వ్యవస్థను ఆధునీకరించారు. ప్రభుత్వాలు మారినా, రాష్ట్ర విభజన జరిగినా, పోలీసు వ్యవస్థ ఆధునీకరణకు, సంఘ విద్రోహ శక్తులను తుదముట్టడించేందుకు పాలకులు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ విషయంలో ఉమ్మడి ఆంధ్రాలో, ప్రస్తుతం తెలంగాణలో పాలకులు రాజీపడకుండా సంఘ విద్రోహశక్తుల ఏరివేతలో పోలీసులకు విశేషాధికారాలు ఇచ్చి, వారి విధుల్లో జోక్యంచేసుకోకపోవడం స్వాగతించాల్సిన అంశం. 2014లో తెలంగాణ అవతరించిన తర్వాత ఉగ్రవాదుల దాడిలో పోలీసులు ఎస్సై సిద్దయ్య, పోలీసు జవాన్లు నాగరాజు, లింగయ్య, హోంగార్డు మహేష్ నేలకొరిగారు. ఈ ఘటనకు కారణమైన ఉగ్రవాదులను పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో హతమయ్యారు. ముగ్గురు పోలీసులను తుపాకీతో కాల్చి హత్య చేసిన వికార్ అహ్మద్ అనే ఉగ్రవాదిని కూడా పోలీసుల చేతలో హతమయ్యారు. హైదరాబాద్‌లో చీమ చిటుక్కుమన్నా పసిగట్టే ఆధునిక టెక్నాలజీని ప్రభుత్వాలు సమకూర్చాయి. దేశంలోనే అత్యంత సున్నితమైన హైదరాబాద్‌లో శాంతి భద్రతల నియంత్రణ కత్తిమీద సవాలు. హైదరాబాద్ పోలీసు పనితీరును ఢిల్లీ పోలీసు ఆదర్శంగా తీసుకుని సంఘ విద్రోహక్తులపై ఉక్కుపాదం మోపాలి. కేంద్రం కూడా ఢిల్లీ పోలీసు పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పాలి. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు సంస్కరణలను అమలు పర్చడమే పోలీసు శాఖకు పట్టిన అన్ని జబ్బులకు దివ్యౌషధం.

- కె. విజయశైలేంద్ర, 9849998097