మెయన్ ఫీచర్

బాలనేరస్థుల సంస్కరణకు భరోసా ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరం అనేది పెద్దవారు చేసినా, చిన్నవారు చేసినా, ధనికులు చేసినా, పేదలు చేసినా, స్ర్తిలు చేసినా, పురుషులు చేసినా అది నేరమే అవుతుంది. ఆ నేరానికి ఆయా దేశాల్లోని శిక్ష్మాస్మృతిని అనుసరించి శిక్ష ఉంటుంది. న్యాయదేవత దృష్టిలో అందరూ సమానమే. అయితే, గత 150 ఏళ్లలో మేధావులు, మానవతా వాదుల దృష్టిలో, న్యాయ కోవిదులు, మానసిక శాస్తవ్రేత్తల దృష్టిలో గణనీయమైన మార్పు వచ్చింది. మిగతా నేరస్థుల కన్నా- బాల నేరస్థులకు వర్తించే న్యాయంలో తేడా వుండాలనే వాదన బలంగా వినిపిస్తూ వచ్చింది. 1989లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ‘కనె్వన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ చైల్డ్’ తర్వాత- బాలలకు చెందాల్సిన హక్కులు లభిస్తే వారిలో నేరప్రవృత్తి తగ్గుతుందనే ఆలోచనకు బలం చేకూరింది. ఆ తర్వాత ‘యునైటెడ్ నేషన్స్ గైడ్‌లైన్స్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ జువనైల్ డెలిక్వెన్సీ’ (బాలల్లో నేరప్రవృత్తిని నిరోధించడానికి ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన మార్గదర్శక సూత్రాలు- వీటినే ‘రెయిడా గైడ్‌లైన్స్’ అంటారు. ప్రపంచ వ్యాప్తంగా బాల నేరస్థుల సమస్యకు మూల కారణాలు, వాటి నివారణ, శిక్షాస్మృతి, పునరావాసం లాంటి విషయాలను ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సమావేశాల ద్వారా చర్చించాల్సి రావడానికి కారణం- నానాటికీ బాల నేరస్థుల సంఖ్య పెరుగుతుండడమే! 1980-90 మధ్య కాలంలో పశ్చమ యూరపులో బాల నేరస్థుల సంఖ్య 50 శాతం పెరిగింది. తూర్పు యూరోప్, కామన్‌వెల్త్ దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితే వుంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 1992-2000 మధ్య కాలంలో వీరి సంఖ్య 80 మిలియన్ల నుండి 150 మిలియన్లకు, అంటే దాదాపు రెండింతలు పెరిగింది.
‘బాల నేరస్థులు’ అనే మాటలో ‘బాల’ అనే మాటకు సంబంధించిన వయో పరిమితి ఎంత? అనేది ముందుగా తెలుసుకోవాలి. బాల నేరస్థులకు వయోజన నేరస్థులకు మధ్య తేడా ఏమిటి? ఒక బాలుడు నేరస్థుడిగా మారడానికి కారణం ఏమిటి? వీరికి సంబంధించి ప్రత్యేక శిక్షాస్మృతి అవసరం వుందా? వీరి సంఖ్యను ఎలా తగ్గించగలం? ఇలాంటి అంశాలను గురించిన కొంత కనీస అవగాహన అవసరం. 1990లో ఐక్యరాజ్యసమితి ‘బాలల హక్కుల సమావేశం’లో 18 ఏళ్ల లోపు వయసు వారంతా బాలలే అని తీర్మానించింది. దీనిని ఆ సమావేశం ‘మినిమమ్ ఏజ్ ఆఫ్ క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ (ఎమ్‌ఏసిఆర్)గా అభివర్ణించింది. 18 ఏళ్ల లోపు వారు చేసిన నేరాన్ని వయోజనులు చేసిన నేరంగా పరిగణించరు. వారిని వయోజనులను నిర్బంధించే జైళ్లలో ఉంచరు. బాల నేరస్థుల విషయంలో శిక్షకంటే సంస్కరణకు ప్రాధాన్యత వుంటుంది.
మొదట్లో మన దేశంలో బాలుర విషయంలో గరిష్ఠ వయోపరిమితి (ఎంఏసిఆర్) 16 సంవత్సరాలుగాను, బాలికల విషయంలో 18 సంవత్సరాలుగాను వుండేది. ఆ తరువాత ఐక్యరాజ్యసమితి సూచన ప్రకారం బాలబాలికలందరికీ గరిష్ఠ వయోపరిమితి ఒకే విధంగా 18 సంవత్సరాలు చేయడం జరిగింది. 2000 సంవత్సరంలో రూపొందించిన ‘జువనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్’ (బాల నేరస్థుల పరిరక్షణ, రక్షణ చట్టం)లోని ప్రధాన అంశమిది. మన దేశంలో నిన్న మొన్నటి వరకు బాల నేరస్థుల విషయంలో ‘బాల’ అనే మాటకు వయోపరిమితి విషయంలో ఇది. ఎన్నాళ్లయినా కథ ఇలాగే కొనసాగేదేమో గానీ, దేశ రాజధాని దిల్లీలో 2012 డిసెంబర్ 16న ఒక బస్సులో ‘నిర్భయ’ అనే 23 ఏళ్ల యువతి అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన తర్వాత దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ కేసులో 17 ఏళ్ల మైనర్ యువకుడు కూడా నిందితుడిగా ఉన్నాడు. మహిళల ఆందోళనల ఫలితంగా అత్యాచారాలు, లైంగిక వేధింపుల నివారణకు కేంద్రం ‘నిర్భయ చట్టం’ చేసింది. బాలనేరస్థుల చట్టం ప్రకారం ‘నిర్భయ’ కేసులో మైనర్ యువకుడు మూడేళ్ల జైలుశిక్ష అనుభవించాక విడుదలయ్యాడు. వయసు కారణంగా తీవ్రమైన కేసులో నిందితుడు ఇలా విడుదల కావడంపై మహిళా సంఘాలు చేసిన పోరాటం దేశంలో అలజడి సృష్టించింది. దీని ఫలితంగా బాల నేరస్థుల గరిష్ఠ వయో పరిమితి (ఎమ్‌ఏసిఆర్)ని 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు కేంద్రం తగ్గించింది. అయితే అతిహేయమైన నేరాలను 16-18 ఏళ్ల మధ్య వయసు వారు చేసినప్పుడు (్భరత శిక్షాస్మృతి-ఐపిసి- ప్రకారం హత్య, మానభంగం, దోపిడీ, కిడ్నాప్, వంటి 43 నేరాలు అతి హేయమైన నేరాలు) ప్రత్యేకంగా విచారించి శిక్షలు విధిస్తారు. ఆ నేరాలను అపరిపక్వ మనస్తత్వంతో చేశారా? గుంపులో ఉంటూ ఎవరో ప్రేరేపిస్తే చేశారా? క్షణికావేశంలో చేశారా? అనే అంశాలను ‘జువనైల్ జస్టిస్ బోర్డులు’ విచారించి, వారిని సాధారణ జైళ్లకు పంపాలో, బాలల జైళ్లకు పంపాలో నిర్ణయిస్తాయి. ఈ మార్పులతో చేసిన చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. నేటి ఆధునిక యుగంలో పిల్లలకు త్వరగా పరిపక్వత వస్తున్నదనీ, ఎప్పుడో 1990లో ఐక్యరాజ్యసమితి వారు అభిప్రాయపడినట్టుగా 18 ఏళ్ల వరకు బాల్యంగా పరిగణించాల్సిన అవసరం లేదని చట్టంలో పేర్కొన్నారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో 10 సంవత్సరాలు దాటిన నేరస్థులను వయోజన నేరస్థులుగా పరిగణించడం జరుగుతున్నదనీ, ఫ్రాన్స్‌లో అది 13 సంవత్సరాలనీ, అర్జంటీనాలో 16 సంవత్సరాలనీ-అందుచేత మన దేశంలో 16 సంవత్సరాలు దాటిన వారందరినీ వయోజన నేరస్థులుగా పరిగణించడంలో తప్పులేదనీ కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ పార్లమెంటులో పేర్కొన్నారు.
మనదేశంలోని ‘జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ’ (ఎన్‌సిఆర్‌బి) వెలువరించిన గణాంకాల ప్రకారం- బాల నేరస్థులు చేసిన నేరాలలో 7 నుండి 12 ఏళ్లలోపు వారు చేసిన నేరాలు 1.6 శాతం ఉంటే, 16 నుండి 18 ఏళ్ల వయసు వారు చేసిన నేరాలు 73.7 శాతం ఉన్నాయి. 12నుండి 16 ఏళ్లలోపు వయసు వారు చేసిన నేరాలు 24.7 శాతంగా ఉన్నాయి. అంటే దాదాపు మూడు వంతుల నేరాలు 16-18 ఏళ్ల వయసు వారు చేసినవే. బాల నేరస్థుల్లో ఎక్కువమంది ప్రాథమిక స్థాయి దాటి విద్యాగంథం లేనివారే. కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి రు. 25,000 లోపు వున్నవారే. తల్లిదండ్రులు లేనందున బాలలు అనాథలుగా రోడ్లమీద పెరగడం వలన గానీ, తల్లిదండ్రులున్నా ఆర్థిక కారణాల వల్లనో, తాగుడు వంటి వ్యసనాల వల్లనో వారి పెంపకాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల గానీ, కుటుంబంలో ఆదరణ లోపించి బాలలు ఇంటినుండి పారిపోవడం గానీ పిల్లలు నేరప్రవృత్తికి అలవాటు పడుతున్నారు.
2003లో ఐక్యరాజ్యసమితి వెలువరించిన ‘ప్రపంచ యువజనుల నివేదిక’ (వరల్డ్ యూత్ రిపోర్ట్)లో బాలల్లో నేర ప్రవృత్తికి సంబంధించిన ఒక అధ్యాయం ఉంది. బాలలలో నేర ప్రవృత్తి పెరగడానికి పది కారణాలను అందులో చెప్పారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, మానసిక, అంశాలతోపాటు నగరీకరణ (అర్బనైజేషన్), ఇతర ప్రాంతాల నుండి వలసలు, ప్రసార మాధ్యమాల ప్రభావం మొదలైన కారణాలను పేర్కొన్నారు. ఏ దిక్కూ లేని పిల్లలను, అశాంతితో అలమటిస్తున్న పిల్లలను, ఆకలి బాధతో పరితపిస్తున్న బాలలను నేరాలు చేసే ముఠాలు ఆకర్షిస్తాయి. వారిచేత మాదక ద్రవ్యాల రవాణా, దొంగతనాలు, హత్యలు వంటి పలురకాల నేరాలు చేసేలా ప్రేరేపించే ముఠాలు పెరిగాయి. ఆ తర్వాత ఆ బాలలు నేరాలను వృత్తిగా ఎంచుకుంటారు. శ్రీలంకలో ‘ఈలం’ కార్యక్రమాలు ముమ్మరంగా సాగే రోజుల్లో పిల్లలకు తుపాకులు ఇచ్చి యుద్ధం చేయించేవారన్నా, ఆమధ్య పోలీసులకు దొరికిన ఒక బాల నేరస్థుడ్ని మానసిక వైద్యుడు ‘ఎందుకు ఇలాంటి ముఠాల్లో చేరావు?’ అని అడిగితే ‘హజీ మస్తాన్‌లా పెద్ద స్మగ్లర్‌గా ఎదగాలని ఉంది’ అన్నాడన్నా- వారిని లోబరుచుకుంటున్న ముఠాల ప్రభావం బాలల అపరిపక్వ మనస్సులపై ఎంతగా వుంటుందో తెలుస్తుంది. పరిపక్వమైన మనసుతో విచక్షణతో ఆలోచించడానికి 21 సంవత్సరాలు నిండాలని మనస్తత్వ శాస్తవ్రేత్తలు విశే్లషణలు చేస్తున్నప్పటికీ బాల నేరస్థుల వయసును తగ్గించడం మంచిదా? కాదా? అన్నదానిని మరింత లోతుగా పరిశీలించాల్సి వుంది. గ్రామాల్లో ఉన్న బాలల కన్నా నగరాల్లో ఉంటున్న పిల్లల్లో నేర ప్రవృత్తి అధికంగా కనబడుతోంది. వ్యవసాయ రంగం కుంగిపోవడం, ఉపాధి వెతుక్కుంటూ పేదలు నగరాలకు రావడం, మురికివాడల్లో ఉండడం, వేధించే పేదరికం, చదువుకునే అవకాశాలు లేకపోవడం.. ఇవన్నీ బాలలలో నేర ప్రవృత్తి పెరగడానికి కారణాలుగా గుర్తించాలి.
ఇక శిక్షపడిన బాల నేరస్థులకు తగిన సంఖ్యలో ‘సంస్కరణ గృహాలు’ లేవు. బాలనేరస్థులను సంస్కరించడానికి ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జివో) ఎన్నివున్నా వాటిలో సరిగ్గా పనిచేస్తున్నవి కొన్ని మాత్రమే. నిబంధనలకు మించి ఎక్కువ సంఖ్యలో బాలనేరస్థులను జైళ్లలో ఒకేచోట ఉంచుతున్నారు. మనదేశంలో ‘బోరస్టల్ స్కూలు’ విధానం ఘోరంగా విఫలమైంది. ఇందుకోసం ప్రభుత్వ గ్రాంట్లు నానాటికీ తగ్గిపోతున్నాయి. బాల నేరస్థులను వయోజన నేరస్థులుండే జైళ్లకు పంపితే పరిస్థితులు మరింత దారుణంగా వుంటాయి. బాల్యంలోని చేదు అనుభవాలు వారి లేత గుండెలను బండబారిస్తాయి.
ప్రపంచంలోని అనేక నగరాల్లో వందల మిలియన్ల బాలలు చెత్తను ఏరుకుంటూ రోడ్డుమీదే పడుకుంటున్నారని యునిసెఫ్ ప్రకటించిన ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ చిల్డ్రన్’లో వివరంగా పేర్కొన్నారు. ఇలాంటి వారిలో మగపిల్లలు మాదక ద్రవ్యాలను రవాణా చేసేవారుగా, వాటికి అలవాటుపడి ఘరానా నేరస్థుల గుప్పిట్లో చిక్కి అలమటిస్తున్నారు. ఇక ఆడపిల్లలు వ్యభిచారిణులుగా ఇతర దేశాలకు రవాణా అవుతున్నారు. దారిద్య్రాన్ని నిర్మూలించడం, విద్యా సౌకర్యాలను అందించడం, తల్లిదండ్రుల్లో అవగాహన పెంచడం వంటి చర్యలు తీసుకుంటే ఈ సమస్యకు కొంతైనా పరిష్కారం లభిస్తుంది. బాల నేరస్థులను సంస్కరించేలా చర్యలు తీసుకొనడం అన్నింటికన్నా ప్రధానం. ఇవి జరగని నాడు బాల నేరస్థులను అరికట్టలేకపోవడం, వారిని జైళ్లకు పంపడం వంటి సమస్యలు తప్పవు.
*

-కోడూరి శ్రీరామమూర్తి 93469 68969