మెయన్ ఫీచర్

‘ఎన్నికల రుగ్మత’లకు సంస్కరణల మందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో సంస్కరణల పరంపర కొనసాగుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణప్రదమైన ఎన్నికల ప్రక్రియను సంస్కరించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. రెండు వేల రూపాయలకు మించి విరాళాలిచ్చే దాతల వివరాలను ప్రకటించాలని, గత పదేళ్లలో ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీచేయని పార్టీల గుర్తింపును రద్దుచేయాలని ఎన్నికల సంఘం సూచించింది. లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే క్రియాశీల రాజకీయ పార్టీలకు మాత్రమే ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది. రాజకీయ పార్టీల జమా ఖర్చుల్లో పారదర్శకత లేకపోతే ఎన్నికల ప్రక్రియ అవినీతి కూపంలా మారిపోతుంది. సమర్ధవంతమైన రాజకీయ నాయకత్వం ఏర్పడాలంటే ఎన్నికల్లో ధన ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ స్థానాలకు 28 లక్షలు, పార్లమెంట్ స్థానాలకు 70 లక్షల రూపాయలకు లోబడి మాత్రమే అభ్యర్థులు ఖర్చుచేయాలన్న ఎన్నికల సంఘం సిఫార్సులను అపహాస్యం పాలుచేస్తూ మన రాజకీయ పార్టీలు, నాయకులు ప్రవర్తిస్తున్నారు. వివిధ రకాలుగా ఓటర్లను ప్రలోభపెడుతూ ఎన్నికల ప్రక్రియను ఇప్పటికే కలుషితం చేశారు. ఎన్నికల ఖర్చును తట్టుకోలేరన్న సాకుతో సమర్ధవంతమైన, నిజాయితీపరులైన నాయకులకు రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇవ్వలేని పరిస్థితులు దాపురించాయి. ఎన్నికల్లో ఖర్చుపెట్టిన డబ్బును తిరిగి సంపాదించుకునేందుకు నాయకులు అవినీతికి పాల్పడుతున్నారన్నది జగమెరిగిన సత్యం.
ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సిఫార్సులు సంస్కరణల దిశగా అడుగులు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ‘ప్రజాప్రాతినిధ్య చట్టం 1951’ లోని సెక్షన్ ‘29సి’ ప్రకారం ఇరవై వేల రూపాయలకు మించిన విరాళాలకు మాత్రమే రాజకీయ పార్టీలు ఆదాయపు పన్ను శాఖకు సమర్పించాలి. 20 వేల రూపాయల లోపు విరాళాలకు ఎలాంటి వివరాలను ప్రకటించాల్సిన అవసరం లేదు. దీన్ని సాకుగా తీసుకుని రాజకీయ పార్టీలు తమ ఆదాయంలో అధిక శాతాన్ని 20 వేలకు తక్కువగా వివరాలు చూపించి లెక్కలను తారుమారు చేస్తున్నాయి. ఎన్నికల సంఘంతోపాటు ‘లా కమిషన్’ కూడా తన నివేదికలో ఒక రాజకీయ పార్టీకి వచ్చే విరాళాలలో 20 కోట్లకు మించి గానీ, 20 శాతానికి మించి గానీ అనధికృత వ్యక్తులు, సంస్థల నుంచి దాటకూడదని సూచించింది.
ఎన్నికల సంఘం తాజా సిఫార్సులను ప్రధాని మోదీ స్వాగతించడమే కాదు, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత ఉండేలా రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఎన్నికల్లో నల్లధనం తగ్గిపోవాలన్న మోదీ- ఇటీవల పార్లమెంట్ సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో- ‘రాజకీయాల్లో విలువల పతనానికి అడ్డుకట్ట వేసేందుకు’ తగు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా కోరారు. ఎన్నికల్లో అక్రమాలను నియంత్రించేలా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ పేరిట మోదీ ఇచ్చిన పిలుపుతో దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. ఈ దిశగా మంచి చెడ్డలను బేరీజు వేసే పనిలో మేధావివర్గం నిమగ్నమైంది.
ఎన్నికల సంస్కరణల కోసం గతంలోనూ అనేక సిఫార్సులు వచ్చాయి. 1990లో గోస్వామి కమిటీ తన నివేదికలో గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులకు ప్రభుత్వమే ‘్ధన రహిత’ సహాయాలు అందించాలని సూచించింది. అభ్యర్థులు వినియోగించే వాహనాలకు ఇంధనం, ఓటర్ల జాబితాలు, మైకులు తదితర సాధనాలు సమకూర్చాలని సూచించింది. ఇంద్రజీత్ గుప్తా కమిటీ 1998లో సమర్పించిన నివేదికలో దాదాపుగా ఇవే సూచనలు చేస్తూ అభ్యర్థుల ఖర్చును క్రమంగా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. లా కమిషన్ 1999లో విడుదల చేసిన తన 170వ నివేదికలో అభ్యర్థుల ఖర్చును పూర్తిగా ప్రస్తుతమే భరించాలని, రాజకీయ పార్టీలు ఒక్క పైసా కూడా విరాళాలు సేకరించరాదన్న నిబంధనను పెట్టింది. వెంకటాచలయ్య కమిటీ 2002లో ఇచ్చిన నివేదికలో అభ్యర్థుల ఖర్చును ప్రభుత్వం భరించే ముందు పార్టీలపై కొన్ని నియంత్రణలు విధించి అవి అమలు జరిగేలా చూడాలని సూచించింది. 2007లో రెండవ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ జారీచేసిన నివేదికలో అభ్యర్థుల ఖర్చులో కొంత భాగాన్ని ప్రభుత్వమే భరించాలని సూచించింది. ఎన్నికలలో అనధికృత, అనవసరమైన వసూళ్లను, ఖర్చును నిరోధించేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని సూచించింది.
రాజకీయ పార్టీలు వసూలుచేస్తున్న విరాళాలను భరించలేని స్థితిలో ఉన్నందున ‘కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (్ళ్యశచిళజూళ్ఘూఆజ్యశ యచి నిశజూజ్ఘశ నిశజూఖఒఆజళఒ) ఒక టాస్క్ఫోర్స్ కమిటీని వేసుకుంది. ఈ కమిటీ 2002లో ఒక వినూత్న పథకంతో ముందుకు వచ్చింది. ఆదాయపు పన్ను చెల్లింపుదారుల నుంచి ‘డెమోక్రసీ నెస్’ పేరిట 0.2% పన్ను వసూలుచేసి రాజకీయ పార్టీలకు అందించాలని సూచించింది. ఆదాయపు పన్ను చెల్లింపుదారుడు ఈ మొత్తాన్ని తనకు నచ్చిన పార్టీకి చెక్కు రూపంలో ఇవ్వవచ్చునని, సెస్సు రూపంలో మిగిలిపోయే మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమచేసి ఎన్నికల నిర్వహణకు వాడుకోవచ్చని సూచించింది. కంపెనీల చట్టంలోని సెక్షన్ 182(3) ప్రకారం కంపెనీలు ఏయే పార్టీలకు విరాళాలు ఇచ్చాయో చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వమే 5,000 కోట్లతో ఎన్నికల నిధిని ఏర్పాటుచేసి అన్ని రాజకీయ పార్టీలకు అందించాలని, లావాదేవీలన్నింటినీ సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని 2014లో అసోచామ్ సంస్థ సూచించింది. రాజకీయ పార్టీలకు అనధికృత వ్యక్తుల ద్వారా లభించే విరాళాలను 30% పన్ను పరిధిలోకి తీసుకురావాలని, సకాలంలో ఆదాయపుపన్ను రిటర్న్స్ దాఖలు చేయకుంటే భారీగా జరిమానా విధించాలని సూచించింది. 2015లో లా కమిషన్ తన 255వ నివేదికలో అభ్యర్థులకు కొన్ని సదుపాయాలు కల్పిస్తూ, రాజకీయాలలో నేర చరితులను, అవినీతిని నిరోధించేందుకు, పారదర్శకంగా ఆర్థిక వ్యవహారాలు జరిగేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
గతంలో ఎన్నికల సంఘం చేసిన సిఫార్సులపై అప్పటి ప్రభుత్వాలు స్పందించలేదు. ఎన్నికల సంఘం తాజా సిఫార్సులను ప్రధాని మోదీ వెంటనే స్వాగతించి, వీటి అమలుకు తగిన విధి విధానాలను రూపొందించవల్సిందిగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎన్నికల వేళ ధన ప్రవాహాన్ని ఆపాల్సిన అవసరం ఉందని భావించి ఆ దిశగా మోదీ సర్కారు అడుగులు వేయడం శుభ పరిణామం. గత పదేళ్లలో ఒక్కసారి కూడా పోటీ చేయని రాజకీయ పార్టీల జమాఖర్చులను పరిశీలించాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖ అధికారులను ఎన్నికల సంఘం కోరనున్నది. ఇప్పటికే 260 రాజకీయ పార్టీలను గుర్తించారు కూడా. రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలలో అధిక శాతం పార్టీలు కాగితాలకు మాత్రమే పరిమితమయ్యాయి. నల్లధనం వ్యాప్తికి, ఇతర ఆర్థిక అక్రమాలకు ఈ ‘కాగితం పార్టీలు’ ఉపయోగపడుతున్నాయి. దేశంలో ఏడు జాతీయ పార్టీలు, 58 ప్రాంతీయ పార్టీలు ఉండగా దాదాపు 1,785 రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయ్యాయి. రికార్డులకే పరిమితమైన పార్టీలు హవాలా వ్యాపారానికీ, నల్లధనాన్ని మరో రూపంలోకి మార్చేందుకు ఉపయోగపడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఎన్నికల సంఘం ఆర్టికల్ 324 ప్రకారం ఇలాంటి పార్టీల గుర్తింపును రద్దుచేయాలన్న ప్రతిపాదన కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ పరిశీలనలో ఉన్నది. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 13ఏ ప్రకారం రాజకీయ పార్టీలకు అనేక రకాల మినహాయింపులున్నాయి. వీటికోసం కొంతమంది వ్యక్తులు కుటీర పరిశ్రమలు పెట్టనట్లుగా రాజకీయ పార్టీలను రిజిస్టర్ చేస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 29 ఏ ప్రకారం కేవలం 10వేల రూపాయలు చెల్లించి ఎవరైనా సరే రాజకీయ పార్టీని రిజిస్టర్ చేసుకోవచ్చు. దీన్ని ఒక వ్యాపార మాధ్యమంగా మార్చుకుని దేశంలో అవినీతిని, నల్లధనాన్ని వ్యాపింప చేస్తున్నారు. ఎన్నికల్లో అధిక ధన వ్యయం, అవినీతి ఒకదానితో మరొకటి గాఢంగా పెనవేసుకుపోయాయి. ఎన్నికలలో గెలిచిన వ్యక్తులు తమకు పెట్టుబడి పెట్టిన వారి గుప్పిట్లో ఇరుక్కుపోతున్నారు. ఈ దుర్మార్గపు పద్ధతులను రూపుమాపడానికి కేంద్ర న్యాయశాఖ, ఎన్నికల సంఘం కలిసి ఇపుడు ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. వీటికి లా కమిషన్ నివేదిక కూడా జత కలిసింది.
ఇప్పటివరకూ ప్రభుత్వం ఎన్నికల్లో అభ్యర్థులకు ప్రత్యక్షంగా ఎలాంటి ధన సహాయం అందించలేదు. ప్రభుత్వ ప్రసార మాధ్యమాలలో తగిన సమయం కేటాయించడం, కార్యాలయాల ఏర్పాటుకు స్థలాలు కేటాయించడం, పన్నుల నుంచి మినహాయింపులు వంటివి కొనసాగుతున్నాయి. ఈ సౌకర్యాలు వాడుకుంటూనే కొన్ని రాజకీయ పార్టీలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. చట్టాలలోని లొసుగులు ఇందుకు సహకరిస్తున్నాయి. 1968లో రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థల నుంచి విరాళాలను నిషేధించారు. 1985లో కంపెనీల చట్టాన్ని సవరించి కొన్ని షరతులకు లోబడి కార్పొరేట్ విరాళాలను అనుమతించారు. కంపెనీలు తమ లాభాల్లో 5 శాతం విరాళాలు ఇవ్వవచ్చునని ప్రకటించి, ఆ తరువాత దాన్ని 7.5 శాతానికి పెంచారు. 2010లో ఆదాయపు పన్ను చట్టాన్ని సవరించి రాజకీయ విరాళాలపై పన్ను మినహాయింపు ఇచ్చారు. అయితే, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించనందున పార్టీలు తమకు విరాళాలు ఎక్కడినుంచి ఎలా వచ్చాయో చెప్పాల్సిన అవసరం లేకుండాపోయింది.
విప్లవాత్మకమైన మార్పులు వస్తే తప్ప ఎన్నికల వ్యవస్థ బాగుపడదు. ఇప్పటికే పెద్దనోట్ల రద్దుతో ఆర్థికరంగ ప్రక్షాళన ప్రారంభమైంది. ఇదే సమయంలో ఎన్నికల వ్యవస్థ మారితేనే దేశం ముందుకు పోగలుగుతుంది. హవాలా లావాదేవీలకు పరిమితమైన ‘కాగితం పార్టీల’ను నిర్మూలించాలి. రాజకీయ పార్టీలు పొందుతున్న ప్రతి పైసాకు లెక్క చెప్పాలి. ధన బలంతో కాకుండా సిద్ధాంత బలంతో పార్టీలు ఎన్నికల బరిలో నిలవాలంటే ప్రతి రూపాయికీ ఆడిటింగ్ జరగాలి. ఇందుకు ఎన్నికల సంఘం నడుం బిగించగా, మోదీ ప్రభుత్వం సహకరిస్తోంది. 2019లో సార్వత్రిక ఎన్నికలు ధనబలానికి అతీతంగా సిద్ధాంత బలంపై జరుగుతాయన్న ఆశ కనిపిస్తున్నది. *

కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113