మెయన్ ఫీచర్

సాంత్వనే కుంగుబాటుకు ఔషధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆత్మహత్య కన్నా తీవ్రమైన తాత్త్విక సమస్య మరొకటి లే దు. జీవించడం అవసరమా? అనవసరమా? అనే వి షయం తత్త్వ శాస్త్రానికి సంబంధించిన మూలాధార ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతుంది. మిగతావన్నీ దాని తర్వాత వచ్చే విషయాలు’ అని అంటాడు ప్రపంచ ప్రఖ్యాత రచయిత ఆల్బర్ట్ కేమూ తాను రచించిన ‘మిథ్ ఆఫ్ సిసిఫస్’గ్రంథంలోని ‘ఆత్మహత్య, అసంబద్ధత’ అనే మొదటి అధ్యాయంలో. ఇదే గ్రంథంలో మరొకచోట- ‘నిద్ర లేవడం, ట్రామ్ ఎక్కి ఆఫీసుకు వెళ్లడం, అక్కడ అయిదారుగంటలు పనిచెయ్యడం- భోజనం- నిద్ర- మర్నాడు మళ్లీ ట్రామ్, ఆఫీసు, భోజనం- ఇలా అన్ని రోజులూ ఒకేలా గడిచిపోతూ వుంటాయి. చివరకు ఏదో ఒక రోజున ‘ఎందుకు?’ అన్న ప్రశ్న, విసుగుదల ప్రారంభమవుతాయి’ అంటూ ఆల్బర్ట్ కేమూ ఈ ‘విసుగుదల’ (మొనాటనీ) ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రవృత్తిని ఎలా ప్రేరేపిస్తుందో చెబుతాడు. ఆయన ఆత్మహత్యను ఒక ‘తాత్త్విక సమస్య’గా మాత్రమే చూశాడు.
ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన అనేక మానసిక, తాత్త్విక, ఆర్థిక, సామాజిక కారణాల వల్ల కలుగుతుంది. ప్రేమ వైఫల్యం, దీర్ఘకాల అనారోగ్యం, ఒంటరితనం, కుంగుబాటు (డిప్రెషన్), వ్యాపారంలో వైఫల్యం, రుణబాధలు, ఆటిజమ్, షిజోఫ్రెనియా వంటి మానసిక వ్యాధులు, సమాజంలో అవమానాలు.. ఇలాంటి ఎన్నో కారణాలతో ఎవరైనా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రావడం, అందుకు సాహసించడం, బలవన్మరణం .. అనేవి వేర్వేరు దశలు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారందరూ నిజంగా అందుకు తెగించరు. ఆత్మహత్యకు సిద్ధపడిన వారందరూ చనిపోరు. కుంగుబాటుకు గురైన క్ష ణంలో బంధువులో, మిత్రులో వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళితే పలు సందర్భాలలో బతికి బయటపడే అవకాశం వుంది. భారత శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్ కోడ్) 309 సెక్షన్ ప్రకారం ఆత్మహత్యకు ప్రయత్నించడం నేరం. అలా య్రత్నించిన వ్యక్తి చట్టం ప్రకారం శిక్ష అనుభవించవలసి వుంటుంది. ఈ చర్చ ఎలావున్నా, ఏటా విశ్వవ్యాప్తంగా సుమారు 8,00,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 75 శాతం ఆత్మహత్యలు తక్కువ ఆదాయం, మధ్యతరహా ఆదాయం వున్న దేశాల్లోనే జరుగుతున్నాయి.
నేషనల్ క్రయిమ్ రీసెర్చి బ్యూరో(ఎన్.సి.ఆర్.బి) పరిశీలన ప్రకారం 2014లో మనదేశంలో 1,31,666 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రతి లక్ష మందికి మన దేశంలో 10.6 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రతి ఇరవై మందిలో ఒకరు మాత్రమే చనిపోతున్నారు. మిగతావాళ్లు బతికి బట్టకట్టి, తమపై పోలీసు కేసు రాకుండా నానాఅవస్థలు పడడమో, కోర్టుల చుట్టూ తిరగడమో చేస్తున్నారు. ఇలా బతికినవారు అవమానంతో, అపరాధ భావంతో, మళ్లీ ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించి నిజంగానే చనిపోయిన సందర్భాలు చాలానే వున్నాయి. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 15-29 ఏళ్ల వయసువారు గణనీయమైన సంఖ్యలో వుండడం విశేషం. ఆత్మహత్యలకు అనేక కారణాలున్నప్పటికీ వాటిలో ఆర్థిక సంబంధమైన కారణాలు ముఖ్యంగా గమనించదగ్గవి. పంటలు పండక అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల ఆర్థిక సమస్యలు మరింతగా ప్రాధాన్యత గలవి. ఈ పరిస్థితి దేశమంతా ఇంచుమించు ఒకేలా వుంది. భారత్‌లోని వ్యవసాయదారుడు అప్పుల్లో పుట్టి అప్పుల్లో చనిపోతాడని అర్థశాస్త్రంలో ఒక నానుడి వుంది! అతివృష్టి, అనావృష్టి కారణాల వల్ల వర్షాధార సేద్యం చేసే కర్షకులు అప్పుల్లో మునిగిపోతున్నారు. నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్.ఎస్.ఎస్.) గణాంకాల ప్రకారం దేశం మొత్తం మీద 51.9 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలు అప్పుల్లో ఉంటున్నాయి. తెలంగాణలో కన్నా ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల్లో ఉన్న వ్యవసాయదారుల సంఖ్య ఎక్కువ అని ఎన్‌ఎస్‌ఎస్ నివేదికలో పేర్కొన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనూ రైతులు రుణబాధలతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితే వారిని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నది. ఒకప్పుడు భారతదేశపు ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన పంజాబ్‌లో కూడా రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే ఆశ్చర్యంగా వుంటుంది. ఆ రాష్ట్రంలో 54 శాతం మంది రైతులు రుణభారంతో కుంగిపోతున్నారు.
ఈమధ్య ‘ఎగ్రేరియన్ డిస్ట్రెస్ అండ్ ఫార్మర్స్ సూసైడ్స్ ఇన్ నార్త్ ఇండియా’ (వ్యవసాయ సంక్షోభం- ఉత్తర భారతంలో రైతుల ఆత్మహత్యలు) అనే పేరుతో ఒక పుస్తకాన్ని లఖ్వీందర్ సింగ్ మరో ఇద్దరు పరిశోధకులు రాశారు. ఇందులో ప్రధానంగా పంజాబ్‌కి సంబంధించిన సమస్యనే చర్చించినా, వారి పరిశీలనలో పేర్కొన్న అనేక విషయాలు దేశమంతటికీ వర్తిస్తాయి. ‘1960లలో విస్తృత ప్రచారంతో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టినప్పుడు అత్యధిక ఫలితాలను పొంది, కనీవినీ ఎరుగని రీతిలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకుని వ్యవసాయ రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది పంజాబ్. రసాయన ఎరువుల వినియోగం, కొత్త రకం విత్తనాలు, విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం అక్కడ లాభసాటి వ్యాపకం అయింది. 1980 నాటికి పరిస్థితిలో మార్పు కనిపించి, ఈ శతాబ్దం ప్రారంభం సమయానికి కథ తారుమారైంది. వ్యవసాయ రంగంలో ఖర్చులు పెరిగిపోయాయి. సంస్థాగత రుణ సదుపాయం సన్నగిల్లింది. ప్రపంచీకరణ ప్రభావం పరిస్థితిని మరింత దయనీయం చేసింది. వ్యవసాయం పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. సన్నకారు రైతు అప్పుల ఊబిలోకి కూరుకుపోసాగాడు. ప్రపంచీకరణ ప్రభావంతో ప్రభుత్వాల దృష్టి వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక రంగానికి మారింది. ఈ మార్పులన్నింటివల్లా చితికిపోయింది సన్నకారు రైతులే. పెట్టుబడిదారీ వ్యవసాయం, పెద్ద రైతుల పరిస్థితి బాగానే వుంది. ప్రపంచీకరణ ఫలాలను వారు అందిపుచ్చుకోగలిగారు. ఆదాయాలు పెంచుకోగలిగారు. ప్రపంచీకరణ పుణ్యమాని పుట్టుకొచ్చిన మరో విషఫలం- వినియోగ మనస్తత్వం (కన్స్యూమరిజమ్). వినియోగ మనస్తత్వం పెరిగిన కారణంగా కొత్త కోరికలు పుట్టుకొచ్చాయి. దీని కారణంగా ఆడపిల్లల పెళ్లిళ్ల విషయంలో మగ పెళ్లివారు కట్నాలు అధికంగా గుంజడం మాత్రమే కాకుండా, పెళ్లికొడుకుల కోరికల జాబితా లిస్టు పెరిగిపోయింది. పెద్ద రైతులకు ఇది భారం కాకపోవచ్చు గాని, సన్నకారు రైతుకు ఇది తలకుమించిన భారమై, అప్పుల ఊబిలో మరింతగా కూరుకుపోయి ఆత్మహత్యలే శరణ్యమయ్యే పరిస్థితి వస్తున్నది.
ఈ విషయాలన్నింటినీ లోతుగా చర్చించిన ‘మిథ్ ఆఫ్ సిసిఫస్’ గ్రంథ రచయితలు ప్రపంచీకరణ ప్రభావం, హరిత విప్లవంతో ప్రారంభమైన ఆధునిక సేద్య పద్ధతులు సన్నకారు రైతుల ఆత్మహత్యలకు ఎలా కారణమైందీ సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు రైతులకు మేలుచేయగలవని వివరించారు. ఈ విషయాలన్నీ మన సన్నకారు రైతులందరి విషయంలో సత్యం. ఆమధ్య ఒక ఆంగ్ల పత్రిక ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా , మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలలో రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ సంక్షోభాన్ని సుదీర్ఘంగా విశే్లషించింది. సాగునీరు లభించకపోవడం, పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం , రుణ సహాయం సకాలంలో అందకపోవడం వంటి కారణాలతో రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని తేలింది. గత సెప్టెంబరులో ఒడిశాలోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం, రాజస్థాన్‌లో ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఢిల్లీలో పెద్ద ఊరేగింపు జరగడం వంటి విషయాలన్నీ ఇందులో ప్రస్తావించారు.
ప్రేమ వైఫల్యం, వైవాహిక జీవితంలో ఒడుదుడుకులు, ఆర్థిక సమస్యలు ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి ఎనిమిది లక్షల మందికి పైగా ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకర విషయం. చనిపోయిన వారి సంగతి సరే, ఆత్మహత్యకు యత్నించి విఫలమైనవారు ఇండియన్ పీనల్‌కోడ్ 309 ప్రకారం శిక్షార్హులు కావడం పెద్ద సమస్య. మణిపూర్‌కు చెందిన ‘ఉక్కు మహిళ’ షర్మిల ‘సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టా’న్ని తొలగించాలంటూ నిరాహారదీక్షను చేపట్టినప్పుడు పదహారేళ్లు జైలులో ఉంచాలని శిక్ష విధించారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా, ఆత్మహత్యకు తెగించిన నిర్భాగ్యులకు ఊరట కలిగించేందుకు, ఇటీవలి కొన్ని సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు ప్రతిపాదించింది. ఆత్మహత్య నేరమని చట్టం చెబుతోంది. ప్రతి మనిషికీ జీవించే హక్కు ఎలావుందో మరణించే హక్కు కూడా వుందని మరొక వాదన వినిపిస్తోంది. ఈ చర్చ ఎలావున్నా, 1972లోనే ‘లా కమిషన్’ తన 42వ నివేదికలో ఐపిసిలోని 309వ సెక్షన్‌ను ఉపసంహరించవలసిందిగా సూచించింది. 1978లో ఇందుకు సంబంధించిన బిల్లును ఆమోదించడానికి ముందే లోక్‌సభ రద్దుకావడంతో అది వీలుకాలేదు.
ఇప్పుడు ప్రభుత్వం హత్యాప్రయత్నానికి, ఆత్మహత్యాప్రయత్నానికి తేడాను గుర్తిస్తూ బిల్లును ప్రతిపాదించదలచింది. మానసిక రోగులకు సంబంధించిన బిల్లులు దీనిని అనుసంధానం చేస్తూ- ఆత్మహత్యా ప్రయత్నాన్ని కేవలం మానసిక కారణాలతో తాత్కాలిక ఆవేశంతో తీసుకున్న నిర్ణయంగా భావించాలని చట్టంలో మార్పులు చేయదలచింది. ఆత్మహత్యకు పాల్పడదలచిన వ్యక్తికి తక్షణ వైద్య సదుపాయం కల్పించడం మాత్రమేగాక, మానవతా దృక్పథంతో పునరావాసానికి తగిన ఏర్పాట్లుచెయ్యాలని కూడా ఈ బిల్లు నిర్దేశిస్తున్నది. రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదించబడవలసి వుంది. చట్టాలకు ఎన్ని సవరణలు చేసినా, అన్నింటికన్నా ముందు ఆత్మహత్యలకు మూలకారణాలుగా వున్న అంశాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సి ఉంది.
*

కోడూరి శ్రీరామమూర్తి - 93469 68969