మెయన్ ఫీచర్

విద్యాశాఖకు ‘వంద శాతం’ అంటువ్యాధి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఓ తప్పుడు విధానాన్ని పదే పదే ప్రచారం చేస్తూ పోతే ఒప్పుగా మారుతుందనే’ది గోబెల్స్ తత్వం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ప్రచారానే్న సాగిస్తున్నాయి. విద్యా విధానంలో ఈ వింత ధోరణి మరీ ఎక్కువైంది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సిఎం చంద్రబాబు అనుసరించిన విధానాలే విద్యా రంగానికి ఉరితాడుగా బిగుస్తున్నాయి. మొన్నటి వరకూ కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు తెలంగాణలో కెసిఆర్ కూడా అవే తప్పుడు విధానాల్ని అనుసరిస్తున్నారు. ఆస్థాన కవులుగా మారిన సలహాదారులెవ్వరికీ విద్యారంగంపై కనీస అవగాహన వున్నట్లు లేదు. వీరంతా ప్రభుత్వాలకు ఎలాంటి సలహాలిస్తున్నారో తెలియదు.
కుక్కను చంపడానికి అది పిచ్చిది అని ప్రచారం చేసినట్లు, ప్రభుత్వ విద్యారంగాన్ని చావుదెబ్బతీయడానికి వీరంతా ఈ నీతినే వాడుతున్నారు. ప్రైవేట్ విద్యారంగ విషప్రచారాన్ని నిలువరించలేని ప్రభుత్వాలు, ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలకు కనీసం వారి పేరు కూడా రాయ రావడం లేదనే ప్రచారాన్ని సాగించడం దారుణం. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ శోధించిన ఓ నగ్నసత్యంగా ఈ వార్త పత్రికల్లో పతాక శీర్షికన రావడం గమనించాలి. ఆయన గతంలో పనిచేసిన నిజామాబాద్, మెదక్ (ఉమ్మడి) జిల్లాలో ప్రస్తుతం ఇంతకన్నా మెరుగైన ప్రభుత్వ విద్య అందుతున్నదా? ఆయన హయాంలో అందిందా? అనేది ఓ ప్రశ్న అయితే- అందుకు కలెక్టరే కారకుడైతే, మహబూబ్‌నగర్‌లో అందకపోవడానికి ముందుగా ప్రశ్నించాల్సింది ఉపాధ్యాయుల్నా? సంబంధిత గత కలెక్టర్‌నా? ఇది ఎన్నటికీ తేలని ప్రశ్న కాబట్టి, ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేసి శభాష్ అనిపించుకున్నాడు కలెక్టర్. ముఖ్యమంత్రి దృష్టిలో పడడానికి ఇలాంటి ట్రిక్కులు ముఖ్యంగా కలెక్టర్లకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. గత విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇదే జిల్లాలోని గట్టు మండలం విద్యార్థులు ఉపాధ్యాయులు లేని విషయాన్ని హైకోర్టుకు లేఖ రూపంలో రాయగా, కోర్టు అక్షింతలు వేసిన సంగతి బహుశా కలెక్టర్‌కి తెలిసి ఉండకపోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలంటే, రాజకీయ నాయకుల, అధికారుల పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చదివించాలన్న అలహాబాద్ హైకోర్టు సూచనలు కలెక్టరుకు గుర్తుకురాకపోగా, కనీసం తమిళనాట ఈరోడ్ కలెక్టర్ తన కూతుర్ని ఓ ప్రభుత్వ పాఠశాలలో చేర్చిన సంఘటన గుర్తొచ్చినా బాగుండేది.
విద్యారంగ దుస్థితికి కారణమైన పాలకుల, యంత్రాగం తప్పిదాల్ని కప్పిపుచ్చుకోవాలంటే ఇలాంటి చర్యలుండాల్సిందే మరి! సరే, ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేశారు. ఏదో రోజు వారిని తిరిగి నియామకం చేస్తారు. అప్పుడు వారు నిక్కచ్చితంగా బోధిస్తారా? అప్పుడు బోధిస్తే ఇప్పుడెందుకు బోధించలేకపోతున్నారు? వీరంతా ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో శిక్షణ పొంది, కృతార్థులై, డిఎస్సీ, టెట్ వంటి పరీక్షలు ప్యాసై ఉద్యోగాల్ని సంపాదించినవారేగా! ఇలాంటి ఉపాధ్యాయులు సరిగా బోధించకపోవడానికి రెండే రెండు కారణాలుంటాయి. ఒకటి- వారికి బోధించడమే బాధగా వుండడం, రెండు- అసలు బోధించడమనే ప్రక్రియ, నైపుణ్యతలు వారికి లేకపోవడం. ఈ రెండు కారణాలు ఉపాధ్యాయుల్లో బలంగా పొడసూపడానికి కారకులెవరు? ఈ విషయాలేవి కలెక్టరుకు తెలియవా? తెలిస్తే చర్యలు ఈ విధంగా వుండేవా? బోధించడం వచ్చి కూడా వృత్తి ధర్మాన్ని మరిచిన ఉపాధ్యాయులు ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాకు పరిమితమై లేరనేది అందరికి తెలిసిందే! దీనికి కాయకల్ప చికిత్స కావాలి.
మొన్నటికి మొన్న కొత్త సంవత్సర కానుకగా ఎపిలోని 2,118 మున్సిపల్ పాఠశాలల్ని తొమ్మిదో తరగతివరకు ఆంగ్ల మాధ్యమంలోకి మార్చాలని ఆ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ జీవో 14ను జారీ చేశారు. స్వయాన ఓ ప్రైవేట్ విద్యాసంస్థల నేతకు ప్రభుత్వ పాఠశాలల్ని బాగుచేయడానికి ఇంతకన్నా వేరే దారి కనపడలేదు. విద్యార్థుల స్థాయిని బట్టి తరగతులుగా విభజించి బోధించే ఈయన మార్కు పెడగాజీని ఇప్పటికే విజయవాడ, నెల్లూరుల్లో అమలు చేస్తున్నాడు. ఈ విధానాల పర్యవేక్షణకై ఇద్దరు కన్సలెట్టంట్లను కూడా నియమించడం గమనార్హం. గతంలో ఇలాంటి ప్రయోగానే్న నవీన్ మిట్టల్ అనే కలెక్టర్ విశాఖలో చేసి చేయి కాల్చుకున్నాడు. బడిమానిన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు ఉన్నత వర్గాల (రాజకీయ + బ్యూరోక్రాట్ల) ఇళ్ళల్లో పనిమనుషులుగా కుదిరితే కనీసం ఆంగ్ల పరిజ్ఞానమన్నా వుండాలనేది కలెక్టర్ ధోరణి అని విశాఖ జాలర్లు ఆరోపించడం ఈ సందర్భంగా గుర్తుకుతెచ్చుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మండలానికో ఆంగ్ల మాథ్యమం ప్రాథమిక పాఠశాలని చంద్రబాబు ప్రవేశపెట్టినా, తెలుగు మాథ్యమం పాఠశాలల్లా అవి వెలవెలపోయాయి.
తిరిగి వైఎస్‌ఆర్ ఇదే బాటన నడిచి ఆరువేల పాఠశాలల్ని ‘సక్సెస్’ పేరున ఆరో తరగతి నుంచి ప్రారంభించి, 13 రోజులు ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇందులో కొన్ని మూతపడగా, మరికొన్ని అపసవ్య దిశలో నడుస్తున్నాయి. ఇందులోనుంచి బయటపడినవారు డిగ్రీలను, వివిధ వృత్తి కోర్సులను చేస్తున్నారు. వీరి విషయ పరిజ్ఞానం, ఆంగ్ల ప్రావీణ్యత ఎంతగా పెరిగిందో బోధించిన ఉపాధ్యాయులకు ఎలాగో తెలియదు గానీ, ఏ ఒక్క సర్వే చేసి తేల్చింది లేదు. అసలు విద్యా శాఖలో ఓ పునఃసమీక్ష లేదా శాస్ర్తియ పరిశోధనగాని ఏ పథకంపైనా జరిగిన దాఖలాలు లేవు. మన విశ్వవిద్యాలయాల పరిశోధనలు కూడా పరిశోధకుల అనుకూల అంశాల చుట్టే తిరుగుతాయి తప్ప, ఇతర సమస్యలు ఏనాడు పట్టవు. అధవా ఎవరైనా చేసి, వాస్తవాల్ని బయటపెడితే, పట్టించుకునే ప్రభుత్వం, విద్యాశాఖ దేశవ్యాప్తంగా వెతికినా కానరాదు. తిరుపతిలో జరిగిన సైన్సు కాంగ్రెస్ ముగింపు సందర్భంగా మహారాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ, సైన్సును మాతృభాషలోనే బోధించాలని సూచించడం గమనార్హం.
ప్రజలు ఆంగ్ల మాధ్యమం కావాలంటున్నారని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సామర్థ్యాల్ని పెంచకుండానే ఆంగ్ల మాథ్యమంగా మార్చడం, ఉపాధ్యాయులకు ఏ మాధ్యమంలో బోధన రాదనే తప్పుడు సంకేతాల్ని ఇస్తూ, ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేయాలనే ప్రపంచ బ్యాంకు కుట్రను పాలకులు తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారు. విద్యా శిక్షణా సంస్థల్ని చూస్తే ఈ కఠోర వాస్తవం బయటపడుతుంది. ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లా విద్యా శిక్షణా సంస్థలతోపాటు, ప్రభుత్వ పరంగా వున్న ఏడు బి.ఇడి కాలేజీల్లోని అధ్యాపకుల ఖాళీలను చూస్తేనే ఈ డొల్లతనం తెలుస్తుంది. ఇక 550పైగా గల ప్రైవేట్ బి.ఇడి కాలేజీల బోధనా సిబ్బంది అంతా బినామీలే. ఈమధ్యన వీటి సరసన రెండు వందలకుపైగా డి.ఇడి ప్రైవేట్ కాలేజీలు చేరాయి. వీటిల్లో బోధించాలంటే ఎం.ఎడ్ అర్హత వున్నవారు కావాలి. వీరిని తయారుచేసే ఎం.ఎడ్ కళాశాలలు, వీటిలో సీట్ల సంఖ్య ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు శే్వతపత్రం ద్వారా తెలుపుతే బాగుంటుంది.
గత రెండు దశాబ్దాలుగా విద్యా శాఖకు పట్టుకున్న మరో అంటువ్యాధి పదో తరగతిలో ‘వంద శాతం’ ఫలితాల సాధన. విద్యా శాఖమంత్రులకు, విద్యా శాఖా అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఇదో మంత్రదండంగా మారింది. ఇప్పుడంతా పరీక్షల సీజను కాబట్టి, వందశాతం ఫలితాలు సాధించాలని, లక్ష్యంగా బోధన జరగాలని కలెక్టరు నుంచి డిఇవోకు, సంబంధిత ప్రధానోపాధ్యాయులకు తాఖీదులు అందుతాయి. పత్రికా ప్రకటనల ద్వారా అదరగొడుతూనే వుంటారు. చివరికి మిగిలేది ఉపాధ్యాయులు. దిక్కుతోచని వీరు విద్యార్థుల్ని రుద్దడం చేస్తారు. ఉదయం, సాయంత్రం వంతులవారీగా కాపలా కాస్తూ అధికారుల ఆదేశాల్ని ఆచరిస్తున్నట్టు నటిస్తారు. ఒకే ఆర్థిక, సాంఘిక స్థాయిలో వుండే ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో- ఆర్థిక, సామాజిక అసమానతలతో వుండే ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పోలికేంటనే ప్రశ్న ఎవరికీ ఎక్కడా ఉదయించదు. ఇదో అశాస్ర్తియ ఆలోచన అనేది పాలకులకు, అధికారులకు పట్టకపోగా, ప్రశ్నించే స్థాయి ఉపాధ్యాయులకు లేకుండా పోయింది. ప్రపంచ స్థాయి పెడగాజీలో వందశాతం ఫలితాల సాధన అనే ప్రస్తావన లేకపోగా, ఇంటర్, డిగ్రీ, వివిధ వృత్తి (మెడిసిన్/ఇంజనీరింగ్) విద్యా కోర్సులలో ఫేల్ అయ్యేవారుంటుండగా, ఐఐటిలలో వందల సంఖ్యలో (ప్రతిష్ఠాత్మక పరీక్షల ద్వారా ఎంపికైనా) తప్పుతుండగా, సివిల్ సర్వీస్ మెయిన్ పరీక్ష సహా, అర్హత పరీక్షల్లోనే వేలాదిమంది అర్హత సాధించలేని వ్యవస్థలో పాఠశాల విద్యలో మాత్రం వందశాతం నినాదంగా మారడం పాఠశాల విద్యను, ముఖ్యంగా ప్రభుత్వ విద్యను భ్రష్టుపట్టించడానికే! ప్రపంచ ప్రఖ్యాత శాస్తజ్ఞ్రులు, మేధావులు, ఆర్థిక, సామాజిక వేత్తలు చదువుకున్న పాఠశాల స్థాయినిగాని, వివిధ సబ్జెక్టులలో సాధించిన మార్కులుగాని, ఇంకా చెప్పాలంటే, ఎంతమేరకు వీరు పాఠశాలకు హాజరయ్యారో చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. ఏదో అంశంలో ప్రావీణ్యత, ఐచ్ఛికం వుండి, సక్రమంగా పాఠశాలకు పోనివారు, అసలు పాఠశాల ముఖం చూడని వారే ప్రాపంచిక జ్ఞానాన్ని పొందినవారంటే వింతకాదు. ఇదో వాస్తవం. చారిత్రక సత్యం. ఈ విధంగా ప్రైవేటుకు ఉన్న రోగాన్ని ప్రభుత్వ పాఠశాలలకు అంటించి వీటిని భూస్థాపితం చేయడమే ప్రభుత్వ లక్ష్యం కాబట్టి వందశాతం నినాదంతో పిల్లల్ని చదువనే బట్టిలో ఉడికించి నిర్వీర్యుల్నిగా చేయాలనే ప్రక్రియ నిరంతరం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నది. ఈ కుట్రను ఛేదించి విశే్లషించి, విడమరిచి సమాజానికి చెప్పే ఉపాధ్యాయ వర్గం లేకపోవడమే పిల్లలకు ఓ శాపంగా మారింది.
*

- జి.లచ్చయ్య సెల్: 94401 16162