మెయన్ ఫీచర్

చదువులు మరచి సాము గరిడీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాథమిక పాఠశాలల్లో కనీస విద్యార్హత ల్లేని వారితో ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్ని ప్రభుత్వ ఉపాధ్యాయులే ప్రారంభించడం, సంఘాలు చోద్యం చూడడం జరుగుతున్నది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం, ఆంగ్ల పరిజ్ఞానం గల నిష్ణాతులైన ఉపాధ్యాయుల కొరత ఉన్నందునే కెజి టు పిజి ని వాయిదా వేసినట్లు చెబుతుంటే సవాళ్లు విసరాల్సిన ఉపాధ్యాయ సంఘాలు, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించమని మాత్రం కోరుతున్నాయి. అందునా, సిబిఎస్‌సికి అనుబంధంగా అవి ప్రభుత్వం అంటే సరే అని రాష్ట్ర జాబితాలో విద్య అనే నినాదానికి సంఘాలు తిలోదకాలిస్తున్నాయి. ఇలా ప్రభుత్వం కోరుకోవడం, ఉపాధ్యాయ సంఘాలు వంత పాడడంతో ప్రభుత్వానికి రొట్టెవిరిగి నేతిలో పడ్డట్లుగా ఉంది. కాని ఇదే జరిగితే, ఉపాధ్యాయులు ఇంటిదారి పడతారనే విషయం సంఘాలకు పట్టడం లేదు.
--

ఆరునెలలు సహవాసం చేస్తే వారు వీరౌతారన్నట్టు, సమాజం పూర్తిగా పాశ్చాత్యీకరించబడుతున్నది. దశదిశ లేకుండా, ముందుచూపు, ఆలోచనకు తావివ్వకుండా అస్తవ్యస్తంగా మారిపోతున్నది. నిలువరించాల్సిన ప్రభుత్వానికి పట్టింపు లేకపోగా, నియంత్రణకై ఒత్తిడి పెంచాల్సిన పౌర సంస్థలు, వృత్తి సంఘాలు, చతికిలబడుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదగాల్సిన సమాజం కులాలుగా, వర్గాలుగా మరింతగా బలోపేతమవుతున్నది. ఇది అభివృద్ధికరమా, అనారోగ్యకరమా అని గుర్తించే స్థితిలో ప్రజలు లేరు. వీరికి మార్గదర్శనం వహించే రాజకీయ పార్టీలు లేవు. పాలక, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ప్రజావ్యతిరేక ధోరణి బాగా పెరిగిపోతున్నది.
వాకిలిని చూసి ఇంటిగూర్చి చెప్పవచ్చు అన్నట్లు, విద్యారంగాన్ని చూసే ఆ దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితిని అంచనా వేయవచ్చు. రాజకీయం ఎంతగా కలుషితం చెందిందో, విదారంగం అంతే మోతాదులో విషపూరితమైంది. మన విద్యారంగం ఎవరికోసం నడుస్తున్నదో, ఎందుకోసం నడుస్తున్నదో అంతుబట్టకుండా పోయింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) నిర్వాకం, నిర్వహణ గూర్చి బ్రిటీషు, మెడికల్ జర్నల్ వేలెత్తి చూపినా మనం గుర్తించే స్థితిలో లేము. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఐఐటిలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్టస్థ్రాయి విశ్వవిద్యాలయాలు ఎంతగా రాజకీయ ఊబిలోకి కూరుకుపోయాయో చూస్తూనే ఉన్నాం.
70-80వ దశకంలో విద్యాలయాలు, కళాశాలలు, చైతన్యపూరితంగా వుంటూ, విద్యారంగం యొక్క విధివిధానాల గూర్చి చర్చించేవి. అందులోని లోతుపాతుల్ని విడమరచి చెప్పేవి. రాజ్యాంగ బద్ధంగా ఎలా ఉండాలో నిర్దేశించేవి. వీటికోసం విద్యార్థివర్గంతో పాటుగా అధ్యాపక వర్గం కూడా చేతులు కలిపేది. చర్చలు జరిగేవి. సమాజానికి మార్గదర్శకంగా వ్యవహరించేవారు. ఈ చైతన్యంతోనే ఉపాధ్యాయులుగా వచ్చిన యువత పాఠశాల విద్యారంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపారు. ఉపాధ్యాయ సంఘాల్ని నిద్రలేపారు. అప్పటిదాకా ఉపాధ్యాయ హక్కులకై, సంఘాల్ని ఏర్పరచుకునే రాజ్యాంగ బద్ధతకై పోరాటాలు చేసిన సంఘాలు సామాజిక, బాధ్యతవైపు దృష్టి సారించగా, దీనికి ఆయా సందర్భాలలో చెలరేగిన ప్రజాపోరాటాలు తోడయ్యాయి. దీంతో హక్కులకై పోరాడుతూనే బాధ్యతవైపు దృష్టి సారించాలనే నిర్ణయానికి ఉపాధ్యాయ సంఘాలు వచ్చాయి. విద్యారంగం ప్రత్యేక వ్యవస్థ కాదని, సమాజంతో విడదీయరాని బంధం ఉంటుందని, సామాజిక సమస్యలే విద్యారంగ సమస్యలుగా, ఉపాధ్యాయ రంగ సమస్యలుగా ఉంటాయి కాబట్టి వృత్తి నిబద్ధతతో పాటు సామాజిక బాధ్యతను నెరవేరిస్తేనే విద్యారంగ, ఉపాధ్యాయరంగ సమస్యలకు శాస్ర్తియ పరిష్కారాలు లభిస్తాయని, తర్వాతి కాలంలో సంఘాలు గుర్తించి, ఉపాధ్యాయుల్ని కొంత మేరకు ఆ దిశవైపుకు తిప్పాయి. వీటికి అనుగుణంగానే నిబంధనావళిని, విధానపత్రాన్ని కొన్ని ముఖ్యమైన సంఘాలు రాసుకున్నాయ. దాదాపు 2000 సంవత్సరం దాగా ఇదే ఒరవడితో సాగిన ఒకటి రెండు సంఘాలు నిరంతరం సదస్సుల్ని, సమావేశాల్ని, మహాసభల్ని పెట్టి ఉపాధ్యాయుల్ని చైతన్యపరుస్తూ ఎదిగించాయి. ఇలా ఉపాధ్యాయుల్లో వచ్చిన గుణాత్మకమైన మార్పు విద్యారంగంపై, పాఠశాలపై తీవ్ర ప్రభావానే్న చూపాయి. ఒక దశలో ప్రభుత్వాలకు ఈ తీరు కొంత ఇబ్బందిని కూడా కలిగించింది. ఇది ఇలాగే కొనసాగితే, తమ ఉనికికే ప్రమాదమని భావించిన పాలకవర్గాలు నిర్బంధాన్ని కూడా పెంచాయి. అరెస్టుల్ని సాగించినా, వెనకాడకుండా, సంఘాలు ఎదుర్కోవడం జరిగింది.
సరళీకృత నూతన ఆర్థిక విధానాలు అన్నింటా ప్రభావం చూపినట్లే, ప్రజా సంఘాలపై, వృత్తి సంఘాలపై చూపాయి. దాదాపు గత దశాబ్ద కాలంగా, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకాలం నుంచి వీటి ప్రభావం కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. దీంతో అంతా తారుమారైంది. అప్పటి నాయకత్వం లేదు. అప్పటి సంఘ చైతన్యం లేదు. ఉద్యమాలు, పోరాటాలు లేవు. నిజానికి ఉపాధ్యాయ ఉద్యమానికో చరిత్ర, త్యాగనిరతి వుందనే ధ్యాస నేటి నాయకత్వానికి లేకుండా పోయింది. ఒకప్పుడు చర్చలతో, అధ్యయనంతో, ప్రాతినిధ్యాలతో, ఉద్యమాలతో విద్యారంగ మార్పులతో పాటు, ఉపాధ్యాయ హక్కుల్ని సాధించుకున్న ఘనతను నేటి నాయకత్వం గుర్తుంచుకున్నట్లుగా లేదు. పైగా అధ్యయన లేమితో, చర్చలకు తావులేకుండా, సంఘాల ఉనికికై ప్రభుత్వాలతో రాయబారం జరిపే స్థితికి దిగజారారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి, కులాల పరంగా క్యాడర్ పరంగా సంఘాలు పుట్టగొడుగుల్లా లేచాయి. ఇరు రాష్ట్రాల్లో ఓ సంఘనాయకుడు లేని పాఠశాల లేదంటే అతిశయోక్తి కాదు. చంకలో డైరీ పెట్టుకొని సంఘసేవ చేస్తున్నట్టు పాకులాడడం ఎక్కువైంది. దీంతో అటు ప్రభుత్వం దగ్గర, ఇటు సమాజంలో పరపతి లేని పరిస్థితి దాపురించింది. దీన్ని గుర్తించే స్థితిలో కూడా ఈ సంఘాలు ఉన్నట్టు లేదు.
రాజకీయంగా 70వ దశకం నుంచే ఉపాధ్యాయ సంఘాల్లో చీలికలు కనబడినా, ఒకటి, రెండు లక్ష్యాలు తప్ప అన్నింటినీ ఒకే నినాదంగా వుంటేవి. పోటీపడి పనిచేసేవి. ఎలాంటి భేషజాలకు పోకుండా, ఉపాధ్యాయుల్ని చైతన్య పరుస్తూ, నిబద్ధతతో పనిచేసేలా చూసేవి. ఒకటి రెండు సంఘాలకు ఇవి మినహాయింపుగా ఉండేవి. 90వ దశకం వరకు తర్వాత, రాజకీయ పార్టీలకు ఆయుధంగా, పాలక పార్టీలకు అనుగుణంగా సంఘాలు ఏర్పడడం ప్రారంభించాయి. వీటిని ఆయా కాలాల్లో రాజకీయ పార్టీలే ప్రోత్సహించాయి. మరికొన్ని సంఘాలైతే ఏ పార్టీ అధికారంలో వుంటే, దానికి అనుగుణంగా మాట్లాడడం, ప్రకటనలివ్వడం జరిగేది. ఇక తెలంగాణ ఉద్యమకాలంలో ఏకైక తెలంగాణ నినాదంతో ప్రధాన స్రవంతి సంఘాలనుంచి వేరుపడి తెలంగాణ ఉపాధ్యాయ సంఘాలుగా రూపాంతరం చెంది, దాదాపు పాలక పక్షానికి అనుకూలంగా వ్యవహరించడం ప్రారంభించాయి. ఇలా ఏర్పడిన సంఘాలకు ఓ నిబంధనావళి లేకపోవగా, మాతృ సంస్థకు గల నిబంధనావళిని కూడా ఆచరించని స్థితి. మాతృ సంఘాలు కూడా నలుగురితో నారాయణ అన్నట్లుగా ప్రభుత్వ తలపులనే మీదేసుకొని ప్రచారం సాగించడం గమనించాలి. చివరికి తమకూ నిబంధనావళి ఉన్నదనే విషయం కూడా ఇవి మరచిపోయాయి.
ఒకప్పుడు కామన్ స్కూలు, నైబర్‌హుడ్ స్కూలు కావాలంటూ, శాస్ర్తియ విద్యావిధానమంటూ నినదించడమే కాకుండా, అన్ని స్థాయిల్లో మాతృభాషలోనే విద్యనందించాలని, అవసరం అనుకుంటే లాంగ్వేజ్ సెల్స్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, విద్యారంగాన్ని పూర్తిగా రాష్ట్ర జాబితాలోనే కొనసాగించాలని కోరేవి. కొన్ని సంఘాలైతే ఉపాధ్యాయులకు ట్రేడ్ యూనియన్ హక్కుల్ని కలిగించాలని కూడా డిమాండ్ చేశాయి!
కామన్ స్కూల్ అనేది ఓ క్షేత్రస్థాయి ప్రక్రియ. దాదాపు 80వ దశకం దాగా ఇది ఆచరణలో ఉండేది. నాణ్యమైన విద్యతోపాటు, ఆంగ్ల పరిజ్ఞానాన్ని ఈ పాఠశాలలు చక్కగా అందించాయి. ఆవాస ప్రాంత పిల్లలందరూ అదే పాఠశాలలో చదువుకునేవారు. ఉపాధ్యాయుల, అధికారుల, రాజకీయ నాయకుల పిల్లలు కూడా అక్కడే చదువుకోవడంతో నైబర్‌హుడ్ అనే కానె్సప్ట్ అమలయ్యేది. కాని ఉపాధ్యాయుల్లో రానురాను లోపించిన జవాబుదారీతనం, పెరిగిన రాజకీయ వాతావరణం, పాలక పార్టీతో ఏర్పరచుకున్న సంబంధాలు, ఉపాధ్యాయుల్ని నైతికంగా దిగజార్చాయి. దీంతో ప్రైవేటు విద్య ఊపందుకోవడం, ఉపాధ్యాయులే సిండికేట్‌గా ఏర్పడి ముందు మాతృభాషలో, తర్వాత ఆంగ్లమాధ్యమంలో పాఠశాలల్ని స్థాపించడం, వీరికి అధికార్లు, రాజకీయ నాయకుల అండదండలు లభించడంతో ప్రభుత్వ రంగ విద్య నిరాదరణకు గురికావడం మొదలైంది. దీనికి ప్రపంచీకరణ తోడైంది.
ఈవిధంగా కామన్ స్కూలు విధానం, నైబర్‌హుడ్ విధానం దెబ్బతిని, సుదూర ప్రాంత విద్య, భారమైన చదువు, ఆంగ్ల మాధ్యమం ఊపందుకున్నది. బట్టీల్లో బాలకార్మికుల్లా, చదువనే బందిలిదొడ్డిలో పిల్లలు విద్యా కార్మికుల్లా మారిపోయారు. పని వద్దు-బడి ముద్దు అనే నినాదం, బడిని ఒక పీడకలగా మార్చివేసింది. ఒకప్పుడు సంప్రదాయ ఉపాధ్యాయులు కూడా లౌకికవాద దృక్పథంతో హేతువాదంతో బోధన సాగించేవారు. ఈ వాతావరణం వెతికినా కానరాక పోగా, సైన్సు బోధించే ఉపాధ్యాయులకే శాస్ర్తియ, లౌకికవాద దృక్పధం లేకుండా పోయింది. కులాల వారిగా, మతాల వారిగా, వర్గాల వారిగా, ఆర్థిక స్థోమతకు అనుగుణంగా పాఠశాలలు మారిపోయి, వసుదైక కుటుంబం అనే నానుడిని దెబ్బతీశాయి. ఇక మాతృభాషలో బోధన అన్న సంఘాలు, నేడు ఆంగ్లభాషలో బోధన అని స్వరం మార్చాయి. పైగా, సమాంతరగా ప్రాథమిక పాఠశాలల్లో కనీస విద్యార్హత ల్లేని వారితో ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్ని ప్రభుత్వ ఉపాధ్యాయులే ప్రారంభించడం, సంఘాలు చోద్యం చూడడం జరుగుతున్నది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం, ఆంగ్ల పరిజ్ఞానం గల నిష్ణాతులైన ఉపాధ్యాయుల కొరత ఉన్నందునే కెజి టు పిజి ని వాయిదా వేసినట్లు చెబుతుంటే సవాళ్లు విసరాల్సిన ఉపాధ్యాయ సంఘాలు, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించమని మాత్రం కోరుతున్నాయి. అందునా, సిబిఎస్‌సికి అనుబంధంగా అవి ప్రభుత్వం అంటే సరే అని రాష్ట్ర జాబితాలో విద్య అనే నినాదానికి సంఘాలు తిలోదకాలిస్తున్నాయి.
ఇలా ప్రభుత్వం కోరుకోవడం, ఉపాధ్యాయ సంఘాలు వంత పాడడంతో ప్రభుత్వానికి రొట్టెవిరిగి నేతిలో పడ్డట్లుగా ఉంది. కాని ఇదే జరిగితే, ఉపాధ్యాయులు ఇంటిదారి పడతారనే విషయం సంఘాలకు పట్టడం లేదు. ఉపాధ్యాయులకు పట్టడం లేదు. ఇలాంటప్పుడు నిబంధనావళ్లు, అజెండాలు, ఎందుకు? మార్చుకోవడమే శరణ్యం కదా! అలాంటప్పుడు విద్యాహక్కు చట్టం గూర్చి చర్చలెందుకు? 2005 విద్యా ప్రణాళికా చట్రమెందుకు? గిజుబాయి బోధనలెందుకు? పాలకుల అజెండానే రాజకీయ అజెండా అంటే సరిపోతుందిగా..!

- డా.జి.లచ్చయ్య 9440116162