మెయన్ ఫీచర్
ఈయూ కూటమికి ‘డచ్’ దెబ్బ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రస్తుతం రష్యా, చైనాల మధ్య సాన్నిహిత్యం బాగా పెరుగుతోంది. పశ్చిమ దేశాలు తమపై విధించిన ఆంక్షలను ఎదుర్కొనడానికి తనకు ప్రత్యామ్నాయం ఉన్నదని, రష్యా ఈవిధంగా నిరూపించడానికి యత్నిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికాపై పూర్తిగా ఆధారపడిన ఐరోపాదేశాలు నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. భవిష్యత్తులో ఈ పరిణామాలు ఏవిధంగా రూపుదిద్దుకుంటాయన్నది చెప్పలేం. కానీ యూరప్ దేశాలు సంక్షోభం దిశగా వెళుతున్నాయన్నది మాత్రం సత్యం. దీనివల్ల ఈయూ సిద్ధాంతమే చీలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ సంక్షోభం ప్రభావం మొత్తం జర్మనీపై పడనున్నది. ఒక్కసారి యూరప్ విడిపోతే ఇక ప్రధాన పాత్ర పోషించే స్థాయిని కోల్పోవడం ఖాయం.
ఐరోపా సమాజం వ్యవస్థాపక సభ్యదేశం నెదర్లాండ్స్! ఉక్రెయిన్‌ను పశ్చి మ దేశాల గ్రూపులో చేర్చుకునే విషయంలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో, దేశ పౌరులు ఇచ్చిన వ్యతిరేక తీర్పు నెదర్లాండ్స్ ప్రభుత్వానికి తిరుగులేని దెబ్బగా పరిణమించింది. ఉక్రెయిన్‌ను తమ గ్రూపులో చేర్చుకునేందుకు వీలుగా పశ్చిమ దేశాలు చేసుకున్న ఒప్పందం, దీన్ని స్వయంగా నెదర్లాండ్ పార్లమెంట్ అమోదించడం అన్నీ ప్రజా తీర్పులో కొట్టుకుపోయాయి. రెఫరెండంలో చాలా తక్కువ అంటే 60 శాతం మంది ప్రజలు మాత్రమే పాల్గొన్నారు. వీరిలో 38 శాతం మంది ఉక్రెయిన్‌ను గ్రూపులో చేర్చుకోవడానికి కుదిరిన ఒప్పందాన్ని వ్యతిరేకించగా. కేవలం 30 శాతం మంది మాత్రమే అందుకు అనుకూలంగా ఓటు చేయడం గమనార్హం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పుపై సంతోషాతిరేకాలు వ్యక్తం చేసినవాడు విపక్ష పార్టీ అయన ‘పార్టీ ఫర్ ఫ్రీడం’ అధినేత గీత్ వీల్డర్స్. ఫలితంపై ఆయన ట్వీట్ చేస్తూ ‘‘ఐరోపా సమాజం పతనానికి ఇది నాంది’’ అంటూ వ్యాఖ్యానించాడు. ఆయనతో పాటు ఐరోపా సమాజంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేసే వారిలో కూడా ఇదే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఫలితంతో డచ్ ప్రధాని మార్ట్ రుట్టె ముఖం వివర్ణమైంది. విషాదవదనంతో ఆయన చాలా జాగ్రత్తగా స్పందించాడు. దీనిపై స్థానిక, యూరప్ దేశాల నేతలతో సంప్రదింపులు జరుపుతానని వెల్లడించాడు. ప్రస్తుత రెఫరెండంలో ప్రజలు వేసిన ఓటుకు విలువ ఉన్నట్లయితే, ఐరోపా దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని పునఃసమీక్షించక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. ఏది ఏమైనప్పటికీ డచ్ రాజకీయాలపై ఈ రెఫరెండం ప్రభావం తీవ్రంగా ఉంటుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఇదిలావుండగా ఈయూ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లౌడీ జంకర్ మాట్లాడుతూ, ప్రజలు ఇచ్చిన ‘‘వ్యతిరేక’’ ఓటు 28 దేశాల సభ్యత్వం కలిగిన ఐరోపా సమాజంపై ఏవిధమైన సంక్షోభం సృష్టించలేదు అంటూ హెచ్చరించారు.
ఎవరెన్ని రకాల అభిప్రాయాలను వ్యక్తం చేసినా, నెదర్లాండ్ ప్రజలు ఇచ్చిన ‘‘వ్యతిరేక’’ ఓటు..ఉక్రెయిన్‌ను పశ్చిమ దేశాల గ్రూపులోకి చేర్చుకోవాలని తీసుకున్న నిర్ణయంలో ఔచిత్యంపై ఐరోపా సమాజ దేశాలు మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితిని కల్పించాయి. నిజానికి ఉక్రెయిన్‌లోని 42 మిలియన్ల ప్రజలకు, భాష, సంస్కృతి, కుటుంబ పరంగా రష్యాతోను పక్కనే ఉన్న రష్యన్ సమాఖ్యతోను గాఢమైన సంబంధాలు ఉన్నాయన్నది నిష్టుర సత్యం. ప్రస్తుత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన విదేశాంగ విధానంలో అనుసరిస్తున్న కఠిన వైఖరిని పశ్చిమ దేశాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అయినప్పటికీ మాస్కోలోని అధికార పక్షసభ్యులెవరూ, పశ్చిమదేశాల రెచ్చగొట్టే వ్యవహారశైలికి ఎంతమాత్రం స్పందించడంలేదు. ముఖ్యంగా పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ ప్రజల్లో రష్యా వ్యతిరేకతను రెచ్చగొట్టడానికి తీవ్రంగా యత్నిస్తున్నాయి. ఇప్పటికే క్రిమియాను స్వాధీనం చేసుకోవడం, ఉక్రెయిన్‌లో తనకు అనుకూల తీవ్రవాదులను రెచ్చగొట్టడం వంటి చర్యలకు వ్యతిరేకంగా రష్యాపై, పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక ఇప్పుడు ఐరోపా దేశాలు మిన్‌స్క్‌లో సంతకాలు చేసిన రెండో కాల్పుల విరమణ ఒప్పందం రష్యాను ఇబ్బంది పెడుతోంది.
ఐరోపా సమాజంలో కొనసాగాలా? వద్దా? అనే అంశంపై బ్రిటన్ మరో రెండు నెలల్లో ప్రజాభిప్రాయ సేకరణకు వెళుతోంది. సరీగ్గా దీనికి ముందు డచ్ ప్రజలు ఇచ్చిన తీర్పు యూరోపియన్ యూనియన్‌ను సమర్థించే దేశాలకు, మద్దతు దార్లకు ఎంతమాత్రం మింగుడు పడటం లేదు. ‘బ్రెగ్జిట్’పై యునైటెడ్ కింగ్‌డమ్ నిర్వహించే రెఫరెండంపై నెదర్లాండ్స్ ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రభావం పడతుందన్న భయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక యూరోపియన్ యూనియన్‌ను వ్యతి రేకించే బ్రిటన్‌లోని సంశయాత్మకుల అభి ప్రాయాలకు వారి కారణాలు వారికున్నాయి. వీరు ఎట్టి పరిస్థితుల్లో ఈయూ నుంచి విడిపోవాల్సిందేనని గట్టిగా పట్టుపడుతున్నారు.
ఇన్ని పరిణామాల నేపథ్యంలో యూరోపియన్ ఔత్సాహికులకు మాత్రం శకునాలు ఎంతమాత్రం ప్రోత్సాహజనకంగా లేవు. ఒకరకంగా చెప్పాలంటే ఐరోపా సమాజాన్ని వ్యతిరేకించే వారు సభ్యదేశాల్లో క్రమంగా బలపడుతున్నారు. ముఖ్యంగా గ్రీసు, స్పెయి న్ ప్రత్యేకించి ఫ్రాన్స్‌లో! ఫ్రాన్స్‌లో విపక్ష పార్టీ నేషనల్ ఫ్రంట్ అధినేత మారిన్ లె పెన్ మొదట్నుంచీ యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అక్కడ వచ్చే ఏడాది జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలావుండగా ఇటీవల వెల్లువలా వచ్చిపడుతున్న శరణార్థుల సమస్యను ఎదుర్కొనడంలో యూ రోపియన్ దేశాల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. నిజానికి రెండో ప్రపంచయు ద్ధం తర్వాత ఇంత పెద్దఎత్తున శరణార్ధులు వచ్చిపడటం ఇదే తొలిసారి.
ఇప్పుడొక ప్రధానమైన ప్రశ్న ఒకటి ఉంది : యూరప్ ఉపఖండ వ్యవహారాల్లో సరికొత్త శకాన్ని ప్రారంభించేందుకు యూరోపియన్ యూనియన్ నాయకత్వం డచ్ ప్రజలు ఇచ్చిన తీర్పును తమకు అనుకూలంగా ఉపయోగించుకోగలుగుతుందా? అన్నదే ఆ ప్రశ్న. ఒక్కసారి చరిత్ర స్మృతులను నెమరు వేసుకున్నట్టయితే.. ఈయూ, బాల్టిక్ రాజ్యా లు, పోలెండ్, చెక్స్, స్లొవాక్స్‌లల్లో ఛాందస వాదులు ఇంకా ఉన్నారు. యూరోపియన్ దేశాలు నాయకత్వం వహిస్తున్న జర్మనీ ఛాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్ శరణార్థుల విషయంలో అనుసరించిన ఉదార శైలి, దేశీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. ఇదే సమయంలో టర్కీతో కుదుర్చుకున్న ఒప్పందం కూడా ఆమెకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతున్నది.
ఇదిలావుంటే, ఇతర కారకాలు కూడా పశ్చిమ దేశాలపై ప్రభావం చూపుతున్నాయి. నార్త్ అంట్లాంటిక్ ట్రీటీ (నాటో) దేశాల్లోకి, రష్యా చుట్టుపక్కల దేశాలను సభ్యులుగా చేర్చుకోవాలని అమెరికా యత్నిస్తోంది. ఇదే సమయంలో పోలెండ్, బాల్టిక్ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా సహాయాన్ని అర్థించినప్పుడు నాటో దేశాల రక్షణ దళాలను వాటికి మద్దతుగా పంపాలని కూడా కోరుతోంది. ఇదే సమయంలో సిరియా అంతర్యుద్ధ సమస్యను పరిష్కరించడంలో రష్యా సహాయన్నీ తీసుకోవడానికి వెనుకాడటం లేదు. అమెరికా వ్యవహారశైలి ఇక్కడ ఒక విరోధాభాసగా మారింది. మొత్తం మీద అమెరికా ‘రాజకీయ పదకోశం’లో మాత్రం రష్యాను శత్రువుగానే పరిగణించడం గమనార్హం.
ఇక నెదర్లాండ్స్ విషయానికి వద్దాం. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్‌కు నేతృత్వం వహిస్తున్న నెదర్లాండ్స్ ముందు ఐచ్ఛికాలు ఏమి ఉన్నాయనేది ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న. నిపుణులు మాత్రం ఈయు-ఉక్రెయిన్ ఒప్పందంవైపుకే మొగ్గుచూపాలని డచ్ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. కానీ రెఫరెండంలో వ్యక్తమైన అభిప్రాయం ఇప్పుడు ఉక్రెయిన్‌కు ఆశనిపాతంగా మారింది. ‘‘మేం ఇంకా యూరోపియన్ యూనియన్ వైపు ప్రయాణిస్తాం’’ అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పెరిషెంకో చేసిన ప్రకటన ప్రజలకు పుండుమీద కారం చల్లినట్లయి, ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. నిజానికి ఉక్రెయిన్‌లో అవినీతి తారస్థాయిలో కొనసాగుతోంది. అంతే కాకుండా దేశంలో అధికార్లు-వాణిజ్య వేత్తల మధ్య కొనసాగుతున్న అవినాభావ సంబంధాలు పశ్చిమ యూరోపియన్లకు అవకాశాలు లేకుండా చేశాయి. దేశంలో సంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న అవినీతి వ్యవస్థలో సంస్కరణలు తీసుకొని రావాలన్న ఉద్దేశం పెట్రో పెరిషెంకోలో కనిపించడం లేదు. అది తనవల్ల అయ్యే పనికాదని మిన్నకుండిపోవడమో లేక అందుకు ఇష్టం లేకపోవడమో లేక ఈ రెండూ కావచ్చు. ఇదిలావుండగా ఉక్రెయిన్ ప్రస్తుతం రాజకీయ అస్థిరత్వంతో సతమతమవుతోంది. దేశ ప్రధాని అర్సెనీ యత్సెయుక్ రాజకీయ భవితవ్యం ప్రస్తుతం ఊగిసలాటలో కొనసాగుతోంది.
అయితే రష్యా పట్ల అమెరికా వ్యవహారశైలి క్రమంగా కఠినంగా మారడం ఇక్కడ అత్యంత కీలకం. ప్రస్తుతం అమెరికా ఉపయోగిస్తున్న పదజాలం, అనుసరిస్తున్న వ్యవహారశైలి చూస్తుంటే ప్రచ్ఛన్న యుద్ధకాలాన్ని తలపుకు తెస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒబామా యంత్రాంగం రష్యా పొరుగు దేశాలను సైనికపరంగా సంసిద్ధం చేసేందుకు అవసరమైన నిధులను సమకూరుస్తోంది. అయితే దేశాధ్యక్షుడిగా ఒబామా పదవీకాలం కొద్ది రోజుల్లో ముగిసిపోనుంది. ఇదే సమయంలో ప్రస్తుతం దేశాధ్యక్ష ఎన్నికల ప్రచారం పరాకాష్ఠకు చేరుకొంది. దేశాధ్యక్ష రేసులో ఉన్న అభ్యర్థుల మధ్య పరస్పర విమర్శల దాడులు అడ్డూ అదుపూ లేని స్థాయిలో కొనసాగుతున్నాయి. మొత్తంమీద ఈ ఎన్నికల ప్రచారం దేశ విధాన రూపకల్పనకు పెద్ద అడ్డంకిగా మారిందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రచారహోరులో పడి కొట్టుకుపోతూ, దేశ గతి నిర్దేశాన్ని గాలికి వదిలేసింది.
ఇక ఉక్రెయిన్ విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభన కారణంగా విశాల భౌగోళిక దృశ్యం ఇంకా అపరిష్కృతంగానే ఉండిపోయింది. ప్రస్తుతం రష్యా, చైనాల మధ్య సాన్నిహిత్యం బాగా పెరుగుతోంది. పశ్చిమ దేశాలు తమపై విధించిన ఆంక్షలను ఎదుర్కొనడానికి తనకు ప్రత్యామ్నాయం ఉన్నదని, రష్యా ఈవిధంగా నిరూపించడానికి యత్నిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికాపై పూర్తిగా ఆధారపడిన ఐరోపాదేశాలు నిస్సహాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. భవిష్యత్తులో ఈ పరిణామాలు ఏవిధంగా రూపుదిద్దుకుంటాయన్నది చెప్పలేం. కానీ యూరప్ దేశాలు సంక్షోభం దిశగా వెళుతున్నాయన్నది మాత్రం సత్యం. దీనివల్ల ఈయూ సిద్ధాంతమే చీలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ సంక్షోభం ప్రభావం మొత్తం జర్మనీపై పడనున్నది. ప్రస్తుతం ఈయూ దేశాలకు నేతృత్వం వహిస్తున్న జర్మనీకి వ్యతిరేకత క్రమంగా బలం పుంజుకోవడం తాజా పరిణామం. నిజం చెప్పాలంటే, ఎంజెలా మెర్కెల్ రాజకీయ భవితవ్యంపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారి యూరప్ విడిపోతే ఇక ప్రధాన పాత్ర పోషించే స్థాయిని కోల్పోవడం ఖాయం. ఈ పరిణామాలన్నీ అమెరికాకు అనుకూలమే. ఐరోపా సమాజం తన తప్పిదాలను నెమరువేసుకుంటున్న తరుణంలోనే అమెరికా మరింత బలోపేతమవుతుంది.