మెయన్ ఫీచర్

వ్యవసాయ సంక్షోభానికి విరుగుడు ఏది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి కోసం టెక్నాలజీయా? టెక్నాలజీ కోసం మనిషా? అంటే నేడు జరుగుతున్న అభివృద్ధి అంతా టెక్నాలజీ కోసమే అనే అర్థంతో కొనసాగుతోంది. ఒకప్పుడు మనుషులకు పని కల్పిస్తే ఇప్పుడంతా యంత్రాలకు పని కల్పంచడమే! మేధో ఆవిష్కరణలన్నీ అవసరం మేరకే వినియోగించబడితే, ఆరోగ్యకరమైన వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది. కొనసాగుతుంది. కానీ అవసరానికి మించి అనవసరమైన దగ్గర,ప్రత్యామ్నాయ మార్గాల్ని మరిచి, అన్నింటికీ టెక్నాలజీయే పరిష్కారమనే ధోరణి బాగా పెరిగిపోయింది. మనిషి కోసం సెల్‌ఫోన్ అవసరం అనేదానికి భిన్నంగా స్మార్టు ఫోన్ల కోసమే ఈ మనుషులు అనే దిశగా సమాజాన్ని మళ్లించడంలో కార్పొరేట్ శక్తులు విజయవంతమైనాయి.
ఒకప్పుడు అభివృద్ధి అంతా మానవ నిర్మితమే! ఇప్పుడంతా డిజిటల్, టెక్నాలజీ నియంత్రిత, యాంత్రిక నిర్మితాలే! ఇవే మనుషులెక్కడ పనిచేస్తారనే తప్పుడు ఆలోచనకు దారితీసింది. లక్షలాది మానవ శ్రమను వారి రెక్కల్ని నిరుపయోగంగా మారుస్తున్నది. ఈ అభివృద్ధి (విధ్వంసరకర) నమూనాలు వున్న ఉపాధి దెబ్బ తీయడంతో వలసలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఓ ప్రాజెక్టు నిర్మాణం జరగాలంటే గునపాలు, పారలు, తట్టలు అవసరం పడేది. వీటిని వాడుతూ తన శ్రమను జోడించి ఎన్నో అద్భుతాల్ని మానవుడు సృష్టించాడు. వీటి స్థానంలో జెసిబిలు, ప్రొక్లేన్లు, క్రేనులు వచ్చాయి. వీటిని నడిపేది కూడా మానవులేనని మరచి ఈ యంత్రాలే అద్భుతాల్ని కలిగిస్తాయని భ్రమింపచేస్తున్నారు. ఓరోజు వీటిని రోబోలతో, రిమోట్‌లతో నడిపితే మానవుడు నిరర్థకుడుగా మారిపోతాడు. ఇలా మానవ శ్రమను యంత్రాలతో, టెక్నాలజీతో పోల్చేవారు ఏదో ఒక రోజు ఇదే టెక్నాలజీకి బలిపశువులు కాక మానరు. ఇప్పుడు జరిగిన జరుగుతున్న కంప్యూటరీకరణ, యాంత్రీంకరణ ఈ కోవలోనివే, భవిష్యత్తులో ఈ విధానం దేనికి దారితీస్తుందో గుర్తించకపోవడమే మన దౌర్భాగ్యం,
మొన్నటిదాకా ఆత్మహత్యల చుట్టే తిరిగిన రైతులసమస్యలు, ఆందోళన బాటను వెతుకుతున్నాయి. చివరికి సమాజం (నాయకులు కాదు) సిగ్గుపడేలా తమ మూత్రాన్ని తామే తాగి పాలకులు సిగ్గుపడేలా చేద్దామని భావించిన తమిళ రైతులు ఢిల్లీ వీధుల్లో పాలకుల దృష్టిలో పడకపోవడం గమనార్హం! పైగా ఇలాంటి జుగుస్సాకర నిరసనలు తెలపడం ఏమిటని నిరసించిన జనాలున్న సమాజం మనది. ఇది సమసిపోయిందని మర్చిపోకముందే మధ్యప్రదేశ్ రైతులు తిరుగుబాటు చేసి ప్రాణాల్నే బలి ఇచ్చారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఆయా ప్రభుత్వాలకు అల్టిమేటం ఇచ్చారు. విధిలేక ఈ ప్ర భుత్వాలు కొంతమేరకు రుణ మాఫీలను చేయాల్సి వచ్చింది. దాంతో బ్యాంకులు కంగుతింటున్నాయి. రుణ మాఫీ సరైంది కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. పలికింది బ్యాంకులే అయినా, పలికించింది కార్పొరేట్ శక్తులే అనేది తెలిసిందే! ఇవే గొంతులు కార్పొరేటు సంస్థలకి రుణమివ్వద్దని గాని, ఎగవేతదారుల భరతం పట్టాలని గాని నిరసించడంలేదు. పైగా ఎగవేతదారుల ఆస్తుల్ని నిరర్ధక ఆస్తులుగా గుర్తించి వేలం వేయాలని చూసినా ఎవరూ కొనని స్థితి. అయినా వీటిని జాతీయం చేయాలన్న విషయాన్ని గుర్తించడంలేదు.
వ్యవసాయం అశేష ప్రజానీకానికి సంబంధించిందే కాక, ఓట్లను కూడా పండించే వ్యవస్థ కాబట్టి తామే వ్యవసాయానికి అండగా నిలుస్తున్నామని అన్ని పాలకపక్షాలు, రాజకీయ పార్టీలు భ్రమల్ని కలిగిస్తున్నాయి. అయినా పరిస్థితిలో మార్పులేదు. గతంలో కాలం కలిసిరాక, పంట దిగుబడులు లేక నష్టపోయిన రైతులు ఈసారి అధిక దిగుబడి సాధించి కుదేలుమంటున్నారు. పంజాబు నుంచి కేరళ దాకా, గుజరాత్‌నుంచి అస్సాందాకా ఏ పంటకు మద్దతు ధర లేకపోగా పండించిన పంటను రోడ్లపాలు చేసి నిరసన తెలుపుతున్నారు. పోనీ కొనేవాడికేమైనా సుఖముందా అంటే అదీలేదు. వీడికి ధరలమంట, వాడికేమో పంటలకే మంట. మధ్య దళారులే అందలమెక్కడం, వీరే రాజకీయాల్ని శాసించడం జరుగుతున్నది. దీన్ని నియంత్రించే వ్యవస్థ ఏనాడూ కానరావడం లేదు. పైగా వీరికే అన్ని వేళలా రక్షణ కలిగిస్తున్నారు. రోగమొకటైతే మందొకటిలా వ్యవసాయ రంగానికి డిజిటల్ టెక్నాలజీతో కాయకల్ప చికిత్స చేయాలని ప్రభుత్వం చూస్తున్నది. అంటువ్యాధిలా వ్యాపించిన సెల్‌ఫోను వినియోగాన్ని అభివృద్ధికరంగా భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవసాయానికి కూడా దీన్ని అనుసంధానం చేయాలని చూస్తున్నది. ఇప్పటికే ఈ కార్యక్రమం ఊపందుకుంది కూడా! దేశవ్యాప్తంగా 180 జిల్లాల్ని ఈ ప్రయోగానికి ఎంపిక చేసారు. శాటిలైట్‌తో పనిచేసే ఈటెక్నాలజీ డ్రోనుల సహాయంతో మంచెపైనుండి రైతుపంటను కాపు కాసినట్టు నియంత్రిస్తారు. దాదాపు 150 అడుగుల ఎత్తులో విహరించే ఈ డ్రోనుల్ని ముందుగా ఫల, పుష్ప కొన్నిరకాల వాణిజ్య పంటల బాగోగులు తెలుసుకోవడానికై వినియోగిస్తారు. మహాలనోబిస్ నేషనల్ క్రాప్ ఫోర్‌కాస్ట్ సెంటర్ (ఎమ్‌ఎన్‌సిఎఫ్‌సి) శాటిలైట్ సహాయంతో డ్రోనుల ద్వారా సేకరించిన సమచారాన్ని విశే్లషించి పంటల విధానాన్ని దిగుబడిని, ప్రకృతి విపత్తుల ద్వారా జరిగే నష్టాల్ని, చీడపురుగుల బెడదను ఇతర నష్టాల్ని అంచనావేస్తారు. పంటల కోతల తర్వాత బ్రిటిషు కాలంనుంచి అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా, ఈ అధునాతన విధానం క్షణాల్లో సమచారాన్ని అందిస్తుందనేది దీని సారాంశం. ఈ యాంత్రిక పరిజ్ఞానంతో రూపొందిన ఆండ్రాయిడ్ యాప్స్ మంచి నుంచి చెడుదాకా నాలుగు రకాల సమాచారాన్ని అందిస్తుంది. ఈ విధమైన శాటిలైట్ సంబంధ జియో పోర్టల్ వేదికను ‘్భవన’ అని పిలుస్తారు. ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని రెవిన్యు అధికారులకు సిసిఇ ఆగ్రి అనే యాప్‌ను ఉపయోగించుటలో శిక్షణ ఇస్తారు. వీరు 12 రాష్ట్రాలలోని 1100 ప్రాంతాలనుంచి పంటల తీరు తెన్నుల్ని, నష్టాల్ని సేకరిస్తారు. ఎందుకంటే, దేశవ్యాప్తంగా వినియోగంలో ఉన్న సెల్‌ఫోన్లలో 150 మిలియన్‌లు గ్రామీణ ప్రాంతాల్లోనేనని, ఇందులో అత్యధికులు వ్యవసాయదారులేననేది ప్రభుత్వ భావన! పైగా వ్యవసాయ సంబంధ సలహాలకై ఎంకిసాన్ యాప్‌ను 90 మిలియన్ రైతులు వినియోగిస్తున్నట్టు రికార్డులు చెపుతున్నాయి.
ఇస్రో ద్వారా నడపబడే ఈ శాటిలైట్‌ను ఛమన్, ఫసల్, నాడమ్స్ లాంటి పేర్లకింద నిర్వహిస్తారు. ఛమన్ (chaman-coordinated programme on horticulture assessment and management using geo informatics) 12 రాష్ట్రాల్లోని హార్టికల్చర్ పంటల తీరును పర్యవేక్షిస్తుంది. ఫసల్(Fasal-forecasting agricultural output using space, agro-meteorology and land observations) 8రకాల తృణ ధాన్యాల పంటల్ని పర్యవేక్షిస్తుంది. నాడమ్స్ (nadams-national agricultural drought assessment and monitoring system) 14 రాష్ట్రాల్లోని వాతావరణ కరవు ఫరిస్థితుల్ని అంచనావేస్తుంది. బంగాళాదుంపలు ఎక్కువగా పండించే బీహార్, గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో వాణిజ్య పంటల్ని పర్యవేక్షిస్తే ఈసారి కరువు రాష్ట్రాలుగా గుర్తించబడిన ఆంధ్రఫ్రదేశ్, జార్కండ్, కర్నాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్‌ల స్థితిగతుల్ని తెలుపుతుంది. మహారాష్ట్ర, హిమాచల్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఇతర పంటల సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. ఇప్పటికే గ్రౌండ్ ట్రూత్ సంబంధిత యాప్స్‌తో 18 రాష్ట్రాల్లో పంటల స్థితగతుల్ని రికార్డు చేస్తున్నారు. టెక్నాలజీని నమ్ముకున్నవారు ప్రభుత్వ సలహాదారులుగా చలామణి అవుతున్నవారు ఈ డిజిటల్ టెక్నాలజీతో పంటల తీరుతెన్నుల్ని తెలుసుకుని క్షణాల్లో రైతులకు అండగా నిలవవచ్చునని సూచిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా, ఇలా సేకరించిన సమాచారం అసలైన రైతులకు చేరుతుందా అనేది సందేహం! చేనుగట్టు చూడని వ్యవసాయ అధికారులు రైతుల్నే తమ చుట్టు తిప్పుకుంటున్నారు. పదిసార్లకు ఒకసారి అందుబాటులో వుండే ఈ అధికారులు రైతులకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారో! పంట నష్టం జరిగిన సమాచారం బాగానే సేకరించారని అనుకుందాం! పరిహారం లెక్కవేయడం ప్రభుత్వాల చేతుల్లోనే వుంటుంది. నష్టాల్ని గుర్తించినా నష్టపరిహారం అందించడం శాటిలైట్ పని కాదు. తిరిగి సాచివేత యంత్రాంగం చుట్టే రైతు తిరగాల్సిందే! వరి ధాన్యానే్న తీసుకుందాం. దేశవ్యాప్తంగా ఎన్నిలక్షల హెక్టార్లలో పంట సాగు జరిగిందో తెలుసుకోవడంతోపాటు దిగుబడినికూడా అంచనా వేస్తారు. అధిక దిగుబడి వచ్చిందని లెక్కలు తేలితే ధరలు అమాంతంగా దిగజారుతాయి. రైతు బజారున పడడం జరుగుతుంది. పప్పుదినుసులు, కూరగాయల పరిస్థితీ ఇంతే!
సమాచారానే్న నమ్ముకునే ప్రభుత్వాలు సమస్యను పరిష్కరించపోగా మరింత జటిలం చేయవచ్చు! ఈ దేశంలో ప్రజల పక్షాన పనిచేసే యంత్రాంగం నేటికీ రూపుదిద్దుకోలేదు. పాలకుల గూటికి చేరే ప్రతిపక్ష రాజకీయ వాదుల్లా, ప్రభుత్వ యంత్రాంగం ఎల్లవేళలా పాలక భక్తినే ప్రదర్శిస్తూ వుంటుంది. అందుకే అధికారులు పాలకుల చేతనే శభాష్ అనిపించుకుంటారు గానీ ప్రజల చేతకాదు! డ్రోనులు వాతావరణ, పంటల వివరాల్ని సేకరించుచవచ్చు కానీ పంటల్ని కాపు కాయలేవు. నష్టాల్ని తెలపవచ్చు కానీ పరిహారాన్ని ఇప్పించలేవు. దిగుబడిని తెలపవచ్చు గానీ కనీస మద్దతు ధర ప్రకటించలేవు. ఇదంతా తిరిగి ఆయా ప్రభుత్వాల చేతి వాటం మాటనే! ఇలాంటప్పుడు ఈ అధునాతన టెక్నాలజీతో వ్యవసాయ రంగానికి ఒనగూరే ప్రయోజనం ఏమిటి అనేది కొందరి ఆలోచనా పరుల సందేహం. కోట్లాది రూపాయల్ని ఈ శాటిలైట్లకు, డ్రోనులకు యాప్స్‌ల తయారీకి వాడే టాబ్‌లెట్స్‌కు, స్మార్ట్ ఫోన్లకు ఖర్చు చేయడం తప్ప వాస్తవంగా రైతుకు ఒరిగిందేమిటి? అనేదే వీరి వాదన.
2015లో దేశవ్యాప్తంగా సేకరించిన సాంఘిక, ఆర్థిక, కుల జనాభా లెక్కల ప్రకారం 4 శాతం వ్యవసాయంమాత్రమే యాంత్రీకరణతో నడుస్తున్నట్టు తేలింది. అమ్మిన ట్రాక్టర్లతో, వ్యవసాయ సంబంధ పరికరాలతో తేల్చిన గణాంకాలివి. ఈ మాత్రం యాంత్రీకరణనే, నాగటినుంచి ఎద్దుల్ని దూరంచేసింది. రైతు చేతులనుంచి పలుగు, పారను లాక్కున్నది. నలుగురికి ఉపాధి కలిగించే రైతు తానే ఉపాధిని వెతుక్కోవాల్సి వస్తున్నది. ఇలా పరాధీనతకు, నిరాదరణకు గురవుతున్న రైతు బాగుపడే సూచనలు దరిదాపుల్లో కానరావడంలేదు. రేడియోలో, టీవీల్లో రైతు సంక్షేమంతోనే ప్రభుత్వాలన్నీ పనిచేస్తున్నట్టు కథనాలుంటాయి. పత్రికల్లో ప్రకటనలుంటాయి. కోట్లాది రూపాయల్ని రుణ మాఫీకై, సబ్సిడీలకై వినియోగిస్తున్నట్టు కనపడుతుంది. బడ్జెట్‌లో గణాంకాలుంటాయి. అయితే వీటిని అనుభవించే రైతువర్గం వేరేననేది ఓ నగ్న సత్యం. వీరే వ్యవసాయపరమైన రుణాల్ని పొంది పాలీ హౌసుల్ని, డ్రిప్ ఇరిగేషన్‌ని, వ్యవసాయ సంబంధ యంత్రాల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. మొత్తం వ్యవసాయ రంగంలో వీరిది 5 శాతానికి మించదు. వీరి అభివృద్ధే వ్యవసాయిక అభివృద్ధిగా ప్రభుత్వం భావిస్తూ పథక రచనల్ని చేస్తున్నది. సన్న, చిన్నకారు రైతుల గురించి ఏ ప్రభుత్వం దృష్టి సారించడంలేదు. వీరంతా వ్యవసాయాన్ని వదులుకునే విధానానే్న రూపొందడంతో విశాల వ్యవసాయ క్షేత్రాల ఆవిర్భావానికి మార్గం సుగమవౌతోంది. అభివృద్ధి చెందిన దేశాలల్లోగా, వ్యవసాయ క్షేత్రాలు నడవాలంటే, శాటిలైట్లే శరణ్యం కాబట్టి, ఈ దిశగా ప్రభుత్వం ప్రయాణం మొదలుపెట్టింది. ఈ చిన్న కమతాల వ్యవసాయదారులు, ఈ విశాల కమతాల క్షేత్రాల్లో కూలీలుగా మారడమే రేపటి విధానం! దొండకాయ, బెండకాయలతోపాటు పప్పుదినుసులు, ధాన్యాల ధరల్ని ఈ విధానం ఎలా ఎత్తిపడుతుందో వేచి చూడాల్సిందే!

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162