మెయన్ ఫీచర్

‘సోషలిజం’ వైఫల్యం.. అరాచకం వీర విహారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘విప్లవాల పురిటిగడ్డ’గా ప్రఖ్యాతి పొందిన లాటిన్ అమెరికాలోని వెనిజులాలో- ‘21వ శతాబ్దపు ఆధునిక సోషలిజం’ స్థాపిస్తానని 1999లో అధికారంలోకి వచ్చిన హ్యోగోఛావెజ్ ‘ప్రయోగం’ ఇపుడు ఆ దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసింది. అక్కడి ఆర్థిక వ్యవస్థను దివాలా తీసేలా చేసింది. ఫలితంగా అక్కడి ప్రజలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కేవలం 18 సంవత్సరాల కాలంలో అక్కడి ప్రజలు ప్రాథమిక అవసరాలు తీరక, జీవన పోరాటంలో నానా కష్టాలు అనుభవిస్తున్నారు. వెనిజులాలో ఇప్పుడు అక్షరాలా అరాచకం రాజ్యమేలుతోంది. ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో ఆహార పదార్థాలు ఎవరికీ అందుబాటులో లేకుండా పోయాయి. రాజధాని కోరకస్‌లో కనీసం తాగేందుకు మంచి నీళ్లుకూడా సరఫరా కావడం లేదని ప్రజలు రోడ్లమీదకొచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు. చమురు నిల్వలతో, అనేక సహజ వనరులతో సంపన్నమైన వెనిజులా ఇప్పుడు ఎవరూ ఊహించని రీతిలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించని పరిస్థితులు ఆ దేశంలో నెలకొన్నాయి.
హ్యూగోఛావేజ్ రాజకీయ వారసత్వాన్ని తలకెత్తుకున్న అధ్యక్షుడు నికోలస్ యెడురో సైనికులు, పోలీసులపై పూర్తిగా ఆధారపడి ప్రజలను, ప్రతిపక్షాలను అణచివేస్తున్నాడు. వెనిజులాలో ఇప్పుడు ప్రజాస్వామ్య పాలన లేదు, సాయుధ ముఠాలు రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా రాజధాని కోరకస్‌లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. తుపాకీ, గూండాల సంస్కృతి పెరిగిపోయింది. కిడ్నాపులు, దోపిడీలు అక్కడ నిత్యకృత్యమయ్యాయి. పిల్లలకు సరైన ఆహారం ఇవ్వలేక తల్లులు శోకిస్తున్నారు. ఉదయం లేవగానే- ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి సరుకుల కోసం ‘క్యూ’లో గంటల తరబడి నిల్చోవడంతోనే జీవితం నిస్సారంగా గడిచిపోతోందని ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. చాలా సూపర్ మార్కెట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎక్కడైనా సరుకులు కనిపిస్తే చాలు... జనం ఆగ్రహానికి లోనై దాడులు చేసి తిండిగింజలను, ఆహార పదార్థాలను అందినకాడికి దోచుకుంటున్నారు. ఆకలికి తాళలేక జనం రోడ్డెక్కితే సాయుధ పోలీసులు జరిపే లాఠీ చార్జి, కాల్పుల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో ఆందోళనకారులు కన్నుమూసారు. ఈ పరిస్థితి తట్టుకోలేక కొందరు కుక్కలు, పావురాలు, పిల్లులు ఇతర పెంపుడు జంతువులను చంపి తింటున్నారని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు బస్సు డ్రైవర్ స్థాయి నుంచి ఆ దేశ అధ్యక్ష పదవిని చేపట్టిన ఛావెజ్ నమ్మిన బంటు నికోలస్ యెడూరో గత సంవత్సరం డిసెంబర్‌లో ఎమర్జెన్సీ విధించాడు. దీంతో అక్కడి పరిస్థితి ఎలా మారిందో అర్థమవుతుంది. గడచిన ఆరు మాసాల్లో పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. ఈ పరిణామాలకు కారణం- ముందుచూపులేనితనం, పాలనపై పట్టు లేకపోవడం అని విశే్లషకులు చెబుతారు. చమురు ధరలు బాగా ఉన్నప్పుడు పరిస్థితి కొంత నయంగా కనిపించినా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పతనం కావడంతో కేవలం చమురు ఎగుమతిపై ఆధారపడిన వెనిజులా వెన్ను విరిగింది. అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో చమురు బ్యారెల్ ధర ఒకప్పుడు 36 డాలర్లు వుండగా ఆదాయం పెరిగింది. క్రమంగా ఆ ధర 14,13 డాలర్లకు పడిపోడంతో ఆ దేశ ఆదాయం అనూహ్యంగా దిగజారిపోయింది. తొలినుంచి చమురుపైనే ఫోకస్ పెట్టిన ఆ దేశం ఇతర రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దాంతో సరైన ఆదాయ వనరులు లేక పోవడంతో వెనిజులా ‘సోషలిస్టు స్వప్నం’ నిట్టనిలువునా కుప్పకూలింది. చివరికి వ్యవసాయ రంగాన్ని సైతం నిర్లక్ష్యం చేసి ఆహార పదార్థాలను దిగుమతి చేసుకోవడంతో ఇప్పుడు కొనుగోలు చేసేందుకు ద్రవ్యం లేక ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు.
కేవలం 18 సంవత్సరాల వ్యవధిలో వెనిజులా ప్రజలు ఘోరమైన పరిస్థితిలోకి నెట్టబడ్డారు. వెనిజులా ‘బంగారు బాతు’ను నిర్దాక్షిణ్యంగా చంపేసారని అక్కడి ప్రజలు వాపోతున్నారు. మందులు లేక, కనీసం టాయిలెట్ పేపర్ దొరక్క రాజధాని ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఈ పరిస్థితులను తట్టుకోలేక చాలామంది యువకులు వలస బాట పట్టారు. కడపు చేత పట్టుకుని ఇరుగు పొరుగు దేశాలకు పయనమవుతున్నారు.
ఈ సరుకుల కొరతను కొందరు ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలుక అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. అలా అమ్మేవారు అటు పాలకులకు, ఇటు సాయుధ ముఠాలకు కొంత శాతం సొమ్ము సమర్పించుకుంటూ మిగతాది తమ జేబుల్లో వేసుకుంటున్నారు. ఈ విధానం విశృంఖలంగా కొనసాగుతోంది. సోషలిస్టు సమాజం పేర ఇప్పుడు వెనిజులాలో అరాచకం, అమానవీయ పరిస్థితి రాజ్యం ఏలుతోంది. ద్రవ్యోల్బణం కారణంగా సంచుల నిండా స్థానిక కరెన్సీని కట్టలు పట్టుకెళ్లినా సరుకులు లభించడం లేదని పౌరులు వాపోతున్నారు. 1999లో అధికారంలోకి వచ్చాక ఛావెజ్ మార్క్సిజంపై మోజుతో సోషలిస్ట్ సమాజ స్వప్నం మత్తులో అప్పటి వరకూ దేశంలో ఉన్న వ్యాపారాలన్నింటినీ జాతీయం చేసాడు. అనేక కంపెనీలను జాతీయం చేయడంతో అవి పోటీలో లేకుండా పోయాయి. ఆ రకంగా ఇప్పుడు ప్రపంచమంతటా గల స్వేచ్ఛా విపణితో సత్సంబంధాలు కొరవడ్డాయి. ఆ స్వేచ్ఛా విపణి నుంచి సరుకులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం దగ్గర విదేశీ నిల్వలు లేవు. ‘అప్పుల కుప్పలు’ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ దశలో అక్కడి ప్రజల పరిస్థితి దారుణంగా పరిణమించింది.
ఒకప్పుడు ఛావెజ్‌ను అభిమానించి, ప్రశంసించి గొప్ప నాయకుడన్న వారు ఇప్పుడు ఆయనపై విమర్శలు చేస్తూ శాపనార్థాలు పెడుతున్నారు. క్యాన్సర్ వ్యాధితో మరణించే ముందు ఛావెజ్ తన రాజకీయ వారసునిగా నికోలస్ యెడూరోను ప్రకటించాడు. ఆయనొక బస్సు డ్రైవర్ వృత్తినుంచి వచ్చాడు. సోషలిస్టు వ్యవస్థలో రాజకీయ విశ్వాసానికి ప్రాధాన్యత ఇస్తారు తప్ప నైపుణ్యాలకు కాదు. ఛావెజ్ రాజకీయ వారసత్వాన్ని కొత్త అధ్యక్షుడు కొనసాగిస్తాడని గట్టిగా ప్రచారం చేసారు. కానీ అంతిమంగా కొత్త అధ్యక్షుడిగా పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవు. చమురు ధరలు క్రమంగా పడిపోవడం, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు లేకపోవడం, గుదిబండగా సోషలిస్టు మార్గం మారడంతో ఆభారంతో దేశం అప్పుల్లో కూరుకుపోవడంతో ఆయన అచేతనంగా మారాడు.
ఈ సమయంలోనే ప్రతిపక్షాలు తమ స్వరాన్ని పెంచాయి. ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ స్వేచ్ఛా మార్కెట్ కోసం పట్టుబడుతున్నాయి. అధ్యక్షుడు తక్షణం పదవి నుంచి తప్పుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. లాటిన్ అమెరికాలోని ఇతర దేశాల్లో మాదిరి ప్రజాస్వామ్యా విధానం కొనసాగాలని సోషలిస్టు వ్యవస్థ ముసుగులో నియంతృత్వం, దాష్టీకం సహించమని నినదిస్తున్నాయి. ప్రభుత్వం విపక్షాల నేతలను కటకటాల పాల్జేస్తున్నది. ఆర్థిక, సామాజిక, రాజకీయ అసంతృప్తి గరిష్ట స్థాయికి చేరుకుంది. సైనికుల సాయంతో అధ్యక్షుడు ఎలాగోలా నెట్టుకొస్తున్నాడు.
ఇదంతా అమెరికా గూఢచారి సంస్థ సిఐఏ పన్నిన కుట్ర అని యథాప్రకారం తమ అసమర్ధతను పాలకులు కప్పిపుచ్చుకుంటున్నారు. లాటిన్ అమెరికాలోని క్యూబా గాని ఇతర దేశాలు గాని వెనిజులాకు స్నేహహస్తం అందించడానికి ఏ మాత్రం ముందుకు రావడం లేదు. గతంలో మాదిరి ‘సోషలిస్టు బ్లాక్’ సుసంపన్నంగా లేదు. అసలు ఆ బ్లాక్ లేకుండా పోయింది. అయినా ఛావెజ్ వీరావేశంతో విప్లవ వీరుడన్న పేరుకోసం మార్క్స్ సిద్ధాంతం ఒట్టిపోయిందని ప్రపంచమతటా పరిగణిస్తున్న వేళ, ప్రపంచీకరణ ఫలితాలు అన్ని దేశాల్లో అందుకుంటున్న తరుణంలో ముఖ్యంగా చైనా స్వేచ్ఛా విపణిలోకి వచ్చి, పాత సిద్ధాంతానికి తిలోదకాలు ఇచ్చి దూకుడుగా అమెరికాకే రుణాలు ఇస్తున్న సమయాన అకారణంగా అమెరికాపై ద్వేషంతో అమెరికా అధ్యక్షుడిని నిందిస్తూ, అంతర్జాతీయ వేదికపై దూషిస్తూ 21వ శతాబ్దపు గొప్ప విప్లవకారునిగా వెలగాలని ఆశపడి ఆఖరికి తన దేశాన్ని కోలుకోని విధంగా ఊబిలోకి తనకు తెలియకుండానే దింపేశాడు. ఆయుధ బలంతో, అశాస్ర్తియ పద్ధతిలో ఏమాత్రం ముందు చూపు లేని తనంతో వెనిజులా ప్రజలను ఆయన వారసుసలు మలమల మాడుస్తున్నారు. చైనా, రష్యా దేశాలు భేషజాలకు పోకుండా సిద్ధాంత పరివర్తనకు పూనుకుని తమ ప్రజల గౌరవాన్ని కాపాడుతూ , కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెడుతున్న వేళ వెనిజులా మాత్రం సోషలిజాన్ని కాలం చెల్లిన పద్ధతిలో ప్రయోగం పేరిట, 21వ శతాబ్దపు సోషలిజం ముసుగులో గొప్పలకు పోతే ఇప్పుడు అక్కడి ప్రజలు అరాచకాన్ని చవిచూసే రోజులొచ్చాయి. నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఆధునిక సోషలిజమంటే ఇదేనా? ‘అన్నమో రామచంద్రా..!’ అని అలమటించడమేనా?

చిత్రం.. వెనిజులా వీధుల్లో హింస నిత్యకృత్యం

-వుప్పల నరసింహం