మెయన్ ఫీచర్

వలువలు లేని రాజకీయాల్లో విలువలకై దేవులాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓసారి అనాట్‌లుక్ ఆంగ్లపత్రిక ఎంపిక చేసిన పది వృత్తులపై ప్రజాభిప్రాయాన్నికోరింది. అందులో వ్యభిచారంతోపాటుగా రాజకీయ వృత్తిని కూడా చేర్చింది. జనాలు వ్యభిచారానికి పదో స్థానాన్ని, రాజకీయాలకు తొమ్మిదో స్థానాన్ని ఇవ్వడం జరిగింది. ఇదే సర్వేను తిరిగి ఇప్పుడు చేపడితే బహశ ఈస్థానాలు తారుమారు కావచ్చు! అందుకే రాజకీయాల్లో విత్తనాలు ఒకరు చల్లితే పంట మరొకరు కోసుకుంటారని అంటారు.
నేటి దేశవ్యాపిత రాజకీయాల్ని చూస్తే పరిస్థితుల ఇందుకు భిన్నంగా కనపడవు. ఒకప్పుడు మెజారిటీ లేని రాజకీయ పాలక పార్టీలు ఎంపీలను, ఎంఎల్‌ఏలను అంగట్లో వస్తువుల్ని కొన్నట్టు కొనేవారు. ఈ విధంగా అమ్ముడుపోయినవారు కొన్నవారికి హుజురులుగా మారి బలప్రదర్శన సందర్భంగా ఉపయోగపడేవారు. ఇది బయకు కనిపించే ఆహార్యం కాగా అంతరంగమంతా ఆర్జించిన అక్రమ ఆస్తుల్ని కాపాడుకోవడానికి, మంత్రి పదవుల్ని దక్కించుకోవడానికై లేదా కాంట్రాక్టుల్ని చేజిక్కించుకోవడానికై ఈ పార్టీ మార్పులకు ఒడిగట్టేవారు. నేటి పాలక పక్షాలకు ఈ పరిస్థితి లేదు. కేంద్రంలో బిజెపికి గానీ, ఆయా రాష్ట్రాల్లో కానీ దాదాపు అన్నింటికీ సరిపోయే మెజార్టీ వుంది. పోతే బిజెపికి తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో తమ ముద్రతో గల ప్రభుత్వాలు వుండాలనేది ఆకాంక్ష కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసలు ప్రతిపక్షమే ఉండకూడదనే ఓ పాడు ధోరణి. అవసరం లేకున్న పార్టీల ఫిరాయింపును ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓ రాజకీయ ఎజెండాగా మార్చుకోవడం జరిగింది. పైగా తాము చేసిన పనికే ఎదుటిపక్షం వారు చేస్తే అనైతికమని, అప్రజాస్వామికమని గోలపెట్టి జనాల దృష్టిలో తామే నిజమైన బుద్ధిమంతులమని ప్రకటించుకుంటున్నారు. ఇలాంటి వారిపై చర్య తీసుకోవాల్సిన సంబంధిత స్పీకర్లు పాలక పార్టీల చెప్పుచేతల్లో కీలుబొమ్మలుగా మారి మిన్నకుంటున్నారు. దీంతో పాలక పక్షం లాభించే చట్టాల్ని, ఆర్డినెన్సుల్ని రూపొందించుకుంటూ ప్రజా వ్యతిరేక చర్యలకు పాలుపడుతున్నది తెలిసిందే! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన 2017 ప్రైవేట్ విద్యా చట్టం ఈ కోవలోనిదే!
కేంద్రంలోకానీ, ఆయా రాష్ట్రాల్లోకానీ ఓ స్పష్టమైన రాజకీయ ఎజెండా లేకపోగా రాసుకున్న ఎన్నికల మానిఫెస్టో కూడా ఏనాడు తెరవని పాలకపక్షాలు అయిదేండ్లు అతి కష్టంగా పాలన సాగిస్తున్నాయి. ఈ అయిదేళ్ల కాలంలో శతృశేషం లేకుండా అన్నట్టుగా ప్రతిపక్షం లేకుండా చేయడం, అదవ వున్నా నోట్లో నాలుక లేకుండ చేయడం ఓ ప్రధాన ఎజెండాగా మారిపోయింది. పక్షపాతం లేకుండా ప్రజలందరికీ ప్రాతినిధ్యం చేయాల్సిన పాలక పక్షం, ఒకవర్గం ప్రజలకు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్ని మాత్రం పట్టించుకుంటున్నాయి. వీటికి తాజా ఉదాహరణణ ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు బీహారును చూడవచ్చు! 2014 సాధారణ ఎన్నికల్లో ఎంపి సీట్లను సాధించుపెట్టడంలో వైఫల్యం చెందానని భావించిన నితీశ్‌కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన అనుచరుడైన జీతన్‌రామ్ మంజీకి కట్టబెట్టి, తాను ఓ సాధారణ ఎంఎల్‌ఎగా అసెంబ్లీలో కూర్చోవడం పార్లమెంటరీ రాజకీయాల్లో ఏనాడు జరగని విషయమే! అయితే, రాజకీయాల్ని మరిగిన వారికి, కుర్చీ మర్మం తెలిసినవారికి మరొకరి చెప్పుచేతల్లో పని చేయడం ససేమిరా నచ్చదు. దీంతో మంజీ నితీష్‌కు మేకుగా మారి బిజెపి పంచన చేరడం తెలిసింది. తిమ్మిని చేయబోతే బమ్మి అయినట్టుగా స్వంతదారుడే పాలివాడుగా మారడంతో నితీష్ తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాల్సి వచ్చింది. ఆ సందర్భంగా లాలు ప్రసాద్, కాంగీలే నితీష్‌కు అండగా నిలిచాయి. తిరిగి 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీరితోనే మహాకూటమిగా మారి బిజెపిని ఎదుర్కోవడమే ఎజెండాగా పెట్టుకున్న విషయం తెలిసిందే! ఇంత చేసినా, బిజెపి సంఖ్య 53కుపెరిగిందేకానీ తగ్గించలేకపోయారు. పోతే నితీష్ జెడియుకు 71, లాలు ఆర్‌జెడికి 80, కాంగీకి 27 సీట్లు రావడంతో బిజెపి ఎత్తును పారకుండా మాత్రం చేసారు. ఈ పరిస్థితిలో రాజకీయ చతురుడైన లాలు మెజార్టీ సీట్లను సాధించుకున్నా, ఎన్నికల ముందు ఒప్పందం ప్రకారం తక్కువ సీట్లనే పొందిన నితీష్‌నే ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడం పార్లమెంటరీ రాజకీయాల్లో మరో చెప్పుకోదగ్గ అంశమే!
ఈ పితుకులాటలో లాలు తన నూనుగు మీసాల 26 సంవత్సరాల కొడుకైన తేజస్వి యాదవ్‌ను ఉపముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడం జరిగింది. నిజానికి నాడే లాలు కూటమిని, కాంగీతో కలిపి పాలక పగ్గాలు చేపట్టమని నితీష్ కోరాల్సింది. ప్రస్తుతం ఆర్‌జెడిలో ముఖ్యమంత్రి స్థాయి నాయకులు (లాలును, రబ్డిని తప్పిస్తే) లేకపోవడం, నితీష్ చాణక్య రాజకీయాలను ఎదురుండదనే భావన నితీష్‌కు తిరిగి అయిదోసారి ముఖ్యమంత్రి అయ్యేలా చేసాయి. ఇలా పంతొమ్మిది నెలలు, లాలు ప్రసాద్ నుంచి గానీ, ఉపముఖ్యమంత్రినుంచి గానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండానే సాగింది. కాని ఈ కూటమి ఇలాగే కొనసాగితే 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీహార్ చేజారే పరిస్థితి వుంటుందని గ్రహించిన అమిత్‌షా, మోడీ ద్వయం మాయాపాచికల్ని నితీష్‌పై విసిరింది. అతి సూక్ష్మంగా ఆలోచించే కుర్మి గిరిజన తెగకు చెందిన నితీష్ ఆ పాచికలకు పడిపోవడం రాజకీయపండితులకుకూడా అంతుచిక్కని వ్యవహారమే! బయట చెపుతున్న కారణాలు కొత్తగా వచ్చి పడ్డవేమీ కావు. లాలు ప్రసాద్, రైల్వేశాఖ మంత్రిగా వున్నప్పుడు ఇవ్వబడ్డ రాంచీ, పూరి రైల్వేహోటల్ కాంట్రాక్టుల వ్యవహారం అంత సీరియస్‌ది కాకపోయినా, బీహార్‌పై దెబ్బను కేంద్రం కొట్టింది. లాలు ప్రసాద్ అండ్ కుటుంబంపై కొత్తగా వచ్చిన ఆరోపణలేవీ లేవు. ఆరోపణలన్నీ గతంలోనివే! వీటన్నింటిపై వివిధ స్థాయిల్లో కేసులు నడుస్తునే వున్నాయి. అయినా జులై 7న తిరిగి సిబిఐ దాడుల్ని చేయించాల్సిన అవసరం, బహశా కేంద్రానికన్నా నితీష్‌కే ఎక్కువ అవసరం అయి వుంటుంది. మోడీ ద్వయంతో ఏదో ఒప్పందం జరుగుతేనే ఈ దాడికి నితీష్ పచ్చజెండా చూపి వుండాలి. సరే! దాడి జరిగింది.
బిజెపి లలిత్ మోడీ ఆరోపించిన 26 ఆస్తుల చిట్టాలపై కేసులు బనాయించవచ్చు. ఈ విషయంగా వివరణకై కొంత సమయం కావాలన్న తేజస్వి (తండ్రి చాటుబిడ్డ కాబట్టి)కి నితీష్ అవకాశం ఇస్తే, నితీష్ కోరిన విధంగా కూటమి కుప్పకూలవద్దని లాలు కొడుకుచే రాజీనామా చేయించి వుండేవాడు. అలాగే, బిజెపికి వ్యతిరేకంగా లాలు తలపెట్టిన ఆగస్టు 27 ర్యాలీ తర్వాత మాట్లాడుదామన్న మాటను నితీష్ విన్నా పరిస్థితి ఇలా చేజారేది కాదు. ఎలాంటి అవకాశానికి, చర్చకు తావు లేకుండా స్వయానా జెడియు పార్టీతోకానీ,సీనియర్ సభ్యులైన రాజ్యసభ సభ్యుడు శరద్‌యాదవ్‌తోగానీ, మరో ఎంపి అయిన అన్వర్ అలీతో గానీ సంప్రదించకుండా జులై 26న రాజకీయ నాటకాన్ని, రాజీనామా డ్రామాని ఆడి మోదీకి మోకరిల్లడం, మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వానే్న వ్యతిరేకించి, తిరిగి ఆయనకే లొంగిపోవడం పార్లమెంటరీ రాజకీయాల్లో నితీష్ ఆడిన మూడో వింత!
గత 19 నెలల కాలంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా లాలు నుంచి గాని, కాంగీ నుంచి గానీ ఎలాంటి వత్తిడులు లేకుండ సాగిన సాగుతున్న పాలన వరదలతో అంతలాకుతలమై దాదాపు 300పైగా మరణించి లక్షలాది మంది వరదల్లో చిక్కుకుని సహాయానికై ఆర్ధిస్తుంటే రాష్ట్రాన్ని పట్టించుకోవాల్సిన నితీష్ తానే బిజెపి వరదలో చిక్కుకోవడం గమనార్హం! బీమారు రాష్టమ్రైన బీహారును ఆరోగ్య రాష్ట్రంగా తీర్చి దిద్దుతాడన్న ఆశల్ని అడియాశలు చేసాడు.తిరిగి ముచ్చటగా ఆరవసారి జులై 22న ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన నితీష్ బీహార్‌ను మార్చి 2000నుంచి ఏలుతునే ఉన్నాడు. మధ్యన జీతన్‌రామ్ మాంజీ 9 నెలల పాలన తప్పిస్తే బీహార్‌ను సుదీర్ఘ కాలంగా ఏలిన ముఖ్యమంత్రిగా నితీష్‌పేరు తెచ్చుకోవడమే కాదు జార్ఖండ్ రాష్ట్ర ఆవిర్భావానికి సహకరించిన వ్యక్తిగా కూడా పేరుంది. ఇలాంటి వ్యక్తి జయప్రకాశ్ నారాయణ శిష్యుడిగా ఆయన వారసత్వాన్ని కొనసాగించి బిజెపి కాంగీలకు ఓ ప్రత్యామ్నాయ పార్టీని (ఫ్రంట్ కాకుండా ) ఏర్పాటు చేసి 2019లో ముందుకు వస్తే పాలనలోకి రాకున్నా, భారత రాజకీయాలకు ఓ మార్గదర్శకుడయ్యేవాడు. ఈ కాలాన్ని దీనికై వినియోగిస్తే ప్రధానమంత్రికి ఓ ప్రత్యామ్నాయ అభ్యర్థిగా కూడా గుర్తుంపు వచ్చేది. ఏమి ఆశించి ఈ దుస్సాహసానికి నితీష్ పాల్పడ్డాడో తెలియదు కానీ, భవిష్యత్ చిత్రపటాన్ని చేజేతులా పగలగొట్టుకున్నాడు.
సిబిఐ దాడులు, లాలు ర్యాలీ లాలు ప్రసాద్‌కు మరింత బలాన్ని చేకూరిస్తే 2019లో బీహార్ రాజకీయాలు మారే అవకాశం మెండే! ఇదే జరిగి నితీష్‌కు కాలం కలసి రాకపోవచ్చు. బహుశా ఈ దృష్టితోనే తిరిగి 2020లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తానే ముఖ్యమంత్రి కావాలంటే బిజెపితో చేతులు కలపడం తప్ప మరో ప్రత్యామ్నాం నితీష్‌కు లేకుండా పోయిందని అనుకుంటే, నితీష్ అంత స్వార్ధపరుడు పార్లమెంటరీ రాజకీయాల్లో మరొకరు కనపడని నాల్గో వింతనే! పార్లమెంటరీ రాజకీయాల గురించి బాగా మాట్లాడేవారు కుటుంబ రాజకీయ వారసత్వానికి ఊతమిస్తున్న ఈ విధానం గురించి కూడా మాట్లాడాల్సి వుంది. మొన్నటికి మొన్న అఖిలేష్, ములాయం ద్వయ పోరాటాన్ని చూసాం! దీన్ని అయిదో వింత అనుకుంటే పోటాపోటీగా అమెరికాలో చదువుకుంటున్న పుత్ర రత్నాలకు ఐటి స్థాయి మంత్రి పదవుల్ని ఇచ్చి, విదేశీ వ్యవహారాల్ని చక్కబెట్టే అవకాశాన్ని కలిగిస్తూ, భవిష్యత్తు ముఖ్యమంత్రుల్నిగా ఎదిగిస్తున్న ఇరు తెలుగు రాష్ట్రాలది ప్రపంచస్థాయి ఆరు, ఏడు వింతలే! ఈ వింతల్ని జనాలకు చూపించాలంటే ఇలాంటి రాజకీయ నాటకాలు వుండాల్సిందే! దాదాపు మాయావతిది ఇదే నటన! తొమ్మిది నెలల్లో పదవీ కాలం ముగుస్తుందనగా రాజ్యసభలో రాజీనామా నాటకాన్ని ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించింది. తిరిగి అదే రాజ్యసభకు పంపడానికి లాలు ప్రసాద్ మాయావతికి ఆహ్వానానే్న పంపడం గమనార్హం! తరాలు మారినా తలరాత మారని జనాలకు, తరతరాలు తిన్నా తరగని ఆస్తుల్ని కూడగట్టుకున కుటుంబ రాజకీయాలే దిక్కుమొక్కుగా మారితే, అసెంబ్లీనుంచి పార్లమెంటుదాకా కనిపించే మొఖాలు ఎల్లకాలం ఒకటిగానే వుంటాయి. ఇలాంటి వారు జనాలకు కాదు ప్రాతినిధ్యం వహించేది, వారి వారి కుటుంబాల ఆస్తులకు, వారి కుటుంబాల ఉప, యువ నాయకులకు, నాయకురాండ్రకే! ఈ దుస్థితి, దురవ్యవస్థ, రాజకీయ దుర్నీతి మారనంత కాలం ఈ వ్యక్తుల్ని నియంత్రించనంత కాలం, నిలదీయనంత కాలం వీరి ఆటలు ఇలా సాగుతునే వుంటాయి. చదరంగంలో పావుల్లా జనాల్ని వాడుకుంటునే వుంటారు. అందుకే ముందు జాగ్రత్తగా విద్యార్థుల్ని రాజకీయాకు దూరంగా వుంచే ఓ కుట్ర ఈ దేశంలో దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్నది. చాలారాష్ట్రాల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు లేకుండా చేస్తున్నారు. ఇక పెట్టుబడి అనే విద్యావ్యాపారంలో విద్యార్థుల్ని సమిధలుగా మార్చి, దేశానికి పనికిరాకుండా రాజకీయంగా, ఎదగకుండా నిర్వీర్యుల్ని చేస్తున్నారు. విద్యార్థులు, యువకులు అప్రమత్తమైతే తప్ప చుక్కాని లేని దేశ రాజకీయాల్ని మార్చలేము. ఈ దిశగా ఆలోచించాల్సింది ఈ వర్గమే!

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162