మెయన్ ఫీచర్

సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటేనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమారు మూడేళ్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి వెనుకడుగు వేస్తున్న ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎట్టకేలకు అధ్యక్ష పదవి చేపట్టడానికి రంగం సిద్ధమైంది. త్వరలోనే ‘పట్ట్భాషేకం’ జరగబోతున్నట్టు ఆయన మాతృమూర్తి, పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించడంతో ఈ విషయమై నెలకొన్న అస్పష్టతకు తెరపడినట్టు అయింది. అంతకు ముందే అమెరికా పర్యటన సందర్భంగా తను పార్టీ నాయకత్వం చేపట్టడానికి సిద్ధంగా వున్నట్టు రాహుల్‌గాంధీ ప్రకటించారు. పైగా పార్టీ ఆదేశిస్తే 2019 ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీని ఎదుర్కొని ప్రధాని పదవి చేపట్టడానికి కూడా సిద్ధమే అని స్పష్టం చేసారు.
నాయకత్వ బాధ్యతలు చేపట్టే విషయాన్ని అంత స్పష్టంగా, ధీమాగా రాహుల్ పేర్కొనడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అదే జరిగితే నెహ్రూ-రాహుల్ కుటుంబంలో ఐదవ తరంవారు నాయకత్వ పగ్గాలు చేపట్టినట్టు కాగలదు. 2013లో పార్టీ ఉపాధ్యక్ష పదవి చేపట్టినప్పటినుండీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం గురించి ఊహాగానాలు వెలువడుతునే వున్నాయి. అందుకు ప్రస్తుతం ఒక విధంగా సానుకూల వాతావరణం నెలకొన్నట్టు కనిపిస్తున్నది.
దేశంలో ‘కాంగ్రెస్ ముక్త కాంగ్రెస్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారిగా ఆత్మరక్షణలో పడ్డారు. ఆర్థిక వృద్ధి రేటు ఆందోళనకరంగా వుండడం, జిఎస్టీ అమలు పలు చిక్కులకు దారి తీస్తూ వుండడం, ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన తిరోగమనంలో వుండడం, పలు రాష్ట్రాల్లో బిజెపి పాలిత ప్రభుత్వాలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటు వుండడం కన్నా మంచి అవకాశం కాంగ్రెస్‌కు ఉండబోదు.
మరో వంక జాతీయ రాజకీయాలకు దిక్సూచిగా భావించే ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలలో నాలుగేళ్ల తరువాత కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యుఐ ఘన విజయం సాధించడం, సంప్రదాయంగా బిజెపికి బలమైన ప్రాంతంగా భావించే గురుదాస్‌పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సుమారు 2 లక్షల ఆధిక్యతతో గెలుపొందడం సైతం కాంగ్రెస్‌కు మనోస్థైర్యం కలిగిస్తున్నాయి.
అయితే నెహ్రూ-గాంధీ కుటుంబంలో గతంలో మరే నాయకుడు ఎదుర్కోనన్ని సవాళ్లను రాహుల్ ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇప్పుడున్నంత అధ్వాన్న పరిస్థితుల్లో గతంలో మరెన్నడు కాంగ్రెస్ పార్టీ లేదు. లోక్‌సభలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు. కర్నాటక, పంజాబ్‌లలో మినహాయిస్తే దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. 1977లో ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓటమి చెందినా 154 సీట్లు పొందారు. అత్యధిక రాష్ట్రాలలో నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంది. 1984 తరువాత ఏ పార్టీకీ లభించనన్ని అత్యధిక సీట్లతో మోదీ గెలుపొందడం మరిచిపోలేము.
ఇదివరలో సుదీర్ఘ రాజకీయ అనుభవంతో అన్ని పార్టీల్లో మిత్రులను ఏర్పరచుకున్న వాజపేయి ప్రధాని కాగలిగినా ఆయనకు సంఘ్ పరివార్‌లో మద్దతు అంతంత మాత్రమే. ఇప్పడు మోదీకి కేవలం బిజెపిలోనే కాకుండా మొత్తం సంఘ్‌పరివార్‌లో విస్తృతమైన మద్దతు వుంది. ఒక విధంగా అంత బలమైన రాజకీయ నాయకుడు కాంగ్రెస్ కాకుండా మరో పార్టీలో ఇప్పటివరకు దేశంలో లేరని చెప్పవచ్చు. దేశ ప్రజల దృష్టిలో నేడు మోదీకి సాటి రాగల నాయకుడు మరెవ్వరు లేరు.
కాంగ్రెస్ నేడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇంకా 20వ శతాబ్దపు రాజకీయాలనుండి బయటపడలేకపోవడం. అత్యాధునిక సాంకేతిక సదుపాయాలను తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడంలో మోదీకి సాటి మరెవ్వరు ఇప్పుడు లేరు. హిందుత్వ ప్రాతిపదికను కొనసాగించుకుంటునే అభివృద్ధిని ప్రధాన రాజకీయ అజెండాగా తీసుకు రాగలిగారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎజెండా లేకపోయింది.
నేడు దేశ రాజకీయ రంగాన్ని ఏలుతున్న మోదీవాదం ఎదుర్కొనే ప్రత్యామ్నాయ ఎత్తుగడలు కాంగ్రెస్‌లో కనపడడంలేదు. నెహ్రూ-గాంధీ వారసత్వాన్ని కాంగ్రెస్‌లో ఇప్పుడు ప్రశ్నించేవారు లేరు. కానీ దేశ ప్రజలు ఇంకా ఆమోదించే స్థితిలో ఉన్నారా? ఇప్పటివరకు రాహుల్ నాయకత్వ సామర్ధ్యం ఆయన పార్టీ వారికే అర్ధం కావడం లేదు. ఎప్పుడూ నాయకత్వం, పదవిపట్ల అనాసక్తితో కనిపిస్తూ వస్తున్న రాహుల్ అసలు రాజకీయాలకే పనికిరాడన్న వాదనలు సొంత పార్టీలోనే బలంగా ప్రారంభం అయ్యాయి. చరిత్రకారుడు రామచంద్రగుహ అయితే ‘రాహుల్‌గాంధీ రాజకీయాలనుండి విరమించుకోవాలి. వెంటనే వివాహం చేసుకుని కుటుంబ జీవనం ప్రారంభించాలి. అదే అతనికి మంచిది. అది భారత దేశానికికూడా మంచిది’ అంటూ సలహా ఇచ్చారు. అందుకనే రాహుల్ ముందున్న మొదటి సవాల్ మొదటగా దేశ ప్రజలను కాకుండా సొంత పార్టీ వారిని తనకు నాయకత్వ సామర్ధ్యం వున్నట్టు నమ్మించగలగాలి. అందుకు అవసరమైన 21వ శతాబ్దపు ఎత్తుగడలు, నినాదాలు ఏర్పరుచుకోవాలి.
రాహుల్ పార్టీ అధ్యక్ష పదవి చేపడితే మొదటగా పార్టీలో నెలకొన్న ద్వంద్వ నాయకత్వ కేంద్రాలు ముగిసిపోగలవు. ఏక నాయకత్వంతో పార్టీ ఎన్నికల్లో పోరాడడానికి సిద్ధపడుతుంది. అందుకు ముందుగా తన సొంత నాయకత్వ బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలి. యువకులకు కీలక స్థానాలు కల్పించడం ద్వారా కాంగ్రెస్‌కు కొత్తరూపు, స్వరూపం అందించగలగాలి. మరోవంక పూర్తి సమయపు రాజకీయ నాయకుడినని రాహుల్ అభిప్రాయం కలిగించాలి. అకస్మాత్తుగా అదృశ్యం అవుతూ, దేశం వదిలి వెడుతున్న ఆయనను ‘పార్ట్‌టైమ్’ రాజకీయ నాయకుడిగా సొంత పార్టీవారే భావిస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికలకు, అవి ముందుకు జరగని పక్షంలో 18 నెలలకు మించి వ్యవధి లేదు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే తన నాయకత్వాన్ని నిరూపించుకోవడానికి రాహుల్‌కు తగు వ్యవధి లభించినట్టు కాగలదు.
బాధ్యతలు స్వీకరించిన వెంటనే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నకలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ తరువాత మరో ఎనిమిది రాష్ట్రాల ఎన్నికలు రాబోతున్నాయి. అన్ని చోట్లా నేరుగా బిజెపికి కాంగ్రెస్‌తో తలపడవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఇతర పార్టీలు, ప్రాంతీయ పార్టీలకి సంబంధించి ఉనికి లేదనే చెప్పవచ్చు. గుజరాత్‌లో అయితే 22 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేదు. పైగా అది నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం. అక్కడ 12 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా సాధించిన అభివృద్ధిని దేశ ప్రజలకు చూపి, గుజరాత్ మోడల్ పేరుతో ప్రధాని కాగలిగారు. గుజరాత్‌లో బిజెపిని ఓడించగలిగితే కాంగ్రెస్ నైతికంగా ఘన విజయం సాధించినట్టు కాగలదు. అయితే అందుకు పార్టీ సిద్ధంగా వున్నదా అన్నదే ప్రశ్న. బిజెపి అంతర్గతంగా ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను వ్యూహాత్మకంగా వ్యవహరించి తమకు అనుకూలంగా మార్చుకోగలిగినా కాంగ్రెస్ చెప్పుకోదగిన విజయం సాధించగలదు. అయితే అందుకు అనువైన నాయకత్వం ప్రస్తుతం గుజరాత్ కాంగ్రెస్‌లో కనిపించడంలేదు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలలో బలహీనతలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడంలో మోదీతోపాటు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా అపార అనుభవం పొందారు.
నేరుగా అమిత్ షా కుమారుడిపైనే కొన్ని ఆరోణలు రావడంతో ఎన్నికల సమయంలో గొప్ప అస్త్రం లభించినట్టు. అయినా దానిని సైతం తగురీతిలో కాంగ్రెస్ ఉపయోగించుకుంటున్న దాఖలాలు కనపడడంలేదు. ‘హిందుత్వ’, ‘అభివృద్ధి’లలో దేనిని ప్రధాన ఎన్నికల అంశంగా చేసుకోవాలి అనే విషయంలో మోదీ, అమిత్‌షాల మధ్య బేదాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. యోగి ఆదిత్యనాధ్ వంటి వారిని ఎన్నికల ప్రచారంలోకి తీసుకురావడంపట్ల మోదీ విముఖంగా వున్నట్టు తెలుస్తున్నది. అయితే ‘మోదీ అభివృద్ధి మోడల్’ ప్రజల జీవితాలలో చెప్పుకోదగిన మార్పు తీసుకురాలేకపోవడం, ఆర్థిక అభివృద్ధి తిరోగమనంలో వుండడంతో ‘హిందుత్వ’ లేని పక్షంలో ప్రజలకు దూరం కాగలమని అమిత్‌షా ఆందోళన చెందుతున్నారు. బిజెపికి అధినాయకత్వంలో నెలకొన్న ఇటువంటి గందరగోళ పరిస్థితులను సైతం కాంగ్రెస్ నాయకత్వం తమకు అనుకూలంగా మార్చుకోలేకపోతున్నది.
రాహుల్‌గాంధీకి ఎదురుకాగల మరో కీలకమైన సమస్య బిజెపి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం. బిజెపియేతర రాజకీయ పక్షాల నాయకులు అనేకమంది నేరుగా సోనియాగాంధీతో సంప్రదింపులకు సిద్ధపడుతున్నారు కానీ రాహుల్‌గాంధీతో వ్యవహారం పట్ల ఆసక్తి చూపడంలేదు. ముఖ్యంగా శరద్‌పవార్, మమతా బెనర్జీ, లాలూప్రసాద్ యాదవ్ వంటి సీనియర్ నాయకులతో రాహుల్‌కు ఇంకా మంచి అనుబంధం ఏర్పడం లేదు. సొంత పార్టీ నాయకులతో పాటు ప్రతిపక్ష నాయకులతో సైతం మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.
లాలుప్రసాద్, తేజస్వి యాదవ్‌లపై సిబిఐని ప్రయోగించి వారిని రోజూ తమవెంట తిప్పుకుంటూ వుండడంతో బిజెపి వ్యతిరేక కూటమిలో చేరేందుకు అనేక ప్రతిపక్షాలు వెనుకడుగు వేస్తున్నాయి. తమపై కూడా సిబిఐని ప్రయోగించవచ్చునని భయపడుతున్నాయి. సిబిఐని ప్రయోగించే తమిళనాట అధికార పక్షాన్ని అదుపాజ్ఞల్లో బిజెపి తెచ్చుకోవడం చూస్తునే వున్నాం. నవీన్ పట్నాయక్, కె.చంద్రశేఖరరావు వంటి నాయకులు అటువంటి భయంతోనే చాలావరకు వౌనంగా వుంటున్నారు. శరద్‌పవార్ సహితం ఇదే కారణంతో కాంగ్రెస్‌తో కలసి కూటమిగా ఏర్పడానికి సిద్ధంగా లేరు. ఇటువంటి పరిస్థితుల్లో బిజెపికి వ్యతిరేకంగా ఇతర ప్రతిపక్షాలకు ఆమోదయోగ్యంగా నాయకుడిగా రాహుల్ గాంధీ ఆవిర్భవించడం పెనుసవాల్ కాగలదు.
వీటన్నింటికీ మించి దేశ ప్రజలను ఆకట్టుకోగల రాజకీయ విధానం ఒకటి ఏర్పరుచుకోవాలి. ఇప్పటివరకు మతతత్వం, లౌకికవాదం పేరుతో చేస్తున్న ప్రయత్నాలకు కాలం చెల్లింది. 21వ శతాబ్దంలో ప్రజలు, ముఖ్యంగా యువత ఆశలు, ఆశయాలు, వారి భవిష్యత్‌ను ప్రేరేపించే అంశాలను గుర్తించే నిర్దుష్టమైన విధానాన్ని రాహుల్ రూపొందించుకోవాలి.

-చలసాని నరేంద్ర 9849569050