మెయన్ ఫీచర్

‘పంచ’తంత్రం ఫలిస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయానుభవం సంపాదించుకోవాలంటే పంచతంత్రం కథలకు మించినది మరొకటుండదు. పంచతంత్రంలో నీతికథలే కాదు, అంతకుమించిన రాజనీతి కూడా ఉంది. అప్పుడంటే ఆ పిచ్చిరోజుల్లో పరవస్తు చిన్నయసూరి ఒక్కడే రాజనీతి గురించి చెప్పేవాడు. ఇప్పుడు గజానికో నాయకుడు చిన్నయసూరిననే అనుకుంటున్నాడు. తాజాగా బాబు-బిజెపి గొడవ, కాపులకు బీసీ రిజర్వేషన్లు, తెలంగాణలో ముస్లింలకు తాయిలాలు చూస్తే పాలకులు పంచతంత్రాన్ని సరిగ్గానే ప్రయోగిస్తున్నారా? లేక బాగా ప్రయోగించామని అనుకుంటున్నారా? అన్నదే చర్చ.
ఏపీలో కాపులను బీసీల్లో చేర్చాలన్నది చిరకాల కోరిక. పాపం ముద్రగడ తెల్లారిలేస్తే నిద్రపోయే వరకూ అదే స్మరణ. దానికోసం ఆయన బాబుకు ప్రేమతో రాసిన లేఖలతో ఒక పే..ద్ద పుస్తకమే అచ్చొత్తవచ్చు. వైసీపీ ప్రాయోజిక కార్యక్రమాలకు దన్నుగా నిలిచినా, కరుణాకర మంతనాల సారమైనా, తునిలో అగ్నికీలల ఆగ్రహమయినా అన్నీ దానికోసమే. కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇస్తే బాబు కాళ్లుకడిగి నెత్తిన చల్లుకుంటానన్న ముద్రగడ, ఇప్పుడు మరో ఎత్తుగడ వేయడంలో వింతేమీలేదు. ఐదు శాతం కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నామని క్యాబినెటు ప్రకటించిన వైనంపై ఎక్కడెక్కడి కాపు సంఘాలు స్పందిస్తే.. అసలు తాను బతుకున్నదే దానికోసమన్న ముద్రగడ మాత్రం వౌనముద్ర పాటించి, ఒకరోజాగి స్పందిస్తాననడం బట్టి, బాబు సర్కారు ముద్రగడను ఏ స్థాయిలో ఆత్మరక్షణలోకి నెట్టిందో అర్థమవుతుంది. అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఎలుగెత్తిన ముద్రగడ, ఇప్పుడు అదే పనిచేస్తే, కుదరదు, పార్లమెంటులో పెట్టాలని అడ్డం తిరగడం వింతేమీకాదు.
కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించడం ద్వారా బాబూజీ పెద్ద ఎత్తే వేశారు. నేనైతే కాపులకు ఇచ్చినమాట నిలబెట్టుకున్నా. ఇక అది చేయాల్సింది కేంద్రంలోని కమలదళమే కాబట్టి, ఆ ఒత్తిడేదో దానిపై చేయమని కాపులు, ప్రతిపక్షాలకు చెప్పకనే చెప్పిన ఆధునిక చిన్నయసూరి చంద్రబాబు పంచతంత్రానికి జోహార్లు.
అంతాబాగానే ఉంది. మరి ఇప్పుడు కేంద్రంపై ఎవరు ఒత్తిడి తీసుకురావాలి? కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీనా? రాష్ట్రంలో ఇద్దరు మంత్రులున్న బీజేపీనా? వీరిద్దరూ కాకుండా, కాపుల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని వైసీపీ ఎలుగెత్తాలి. ఆ రకంగా గళం విప్పి అటు బిజెపి, ఇటు టీడీపీని ఇరికించేంత తెలివి జగన్‌కు ఉందా? బాబు కోరుకున్నట్లు తాజా అసెంబ్లీ తీర్మానాన్ని 9 వ షెడ్యూల్‌లో చేర్చేంత విశాల రాజకీయ హృదయం మోదీకి ఉంటుందా? పటేళ్లు, గుజ్జర్ల విషయంలోనే పొంగని మోదీ ఛాతీ కాపుల విషయంలో పెరుగుతుందా? అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇచ్చిన రిజర్వేషన్లనే కోర్టు కొట్టివేసినప్పుడు, వాటిని 9వ షెడ్యూల్‌లో చేర్పించేందుకు ఇచ్చగించని బీజేపీ రాజకీయ విధానం.. ఏపీలో కాపులు, తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ల విషయంలో మారుతుందా? ఇప్పుడున్న రాజకీయ, వ్యక్తిగత పితలాటకాలతో మా తీర్మానాల సంగతేమిటని కేంద్రంపై కనె్నర్ర చేసి, వాటిని 9 వ షెడ్యూలులో చేర్పించేంత సాహసం ఇద్దరు చంద్రులకు ఉందా? ఇవన్నీ రాజకీయ భేతాళ ప్రశ్నలే. వీటికి జవాబు చెప్పే విక్రమార్కులే కనిపించడం లేదు. తెలంగాణలో కేసీఆర్ కూడా తన తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలని బంతి ఢిల్లీకి నెట్టేశారు. ఒక్కటయితే నిజం. తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేసినట్లు భావిస్తున్న కేసీఆర్‌ను, కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చేశామంటున్న చంద్రబాబును చిన్నయసూరి చూసి ఉంటే మురిసి ముక్కలయ్యేవారేమో?!
ఇక కాపులకు బీసీ హోదా ఇచ్చారని బీసీలు రోడ్డెక్కినందువల్ల ఆయాసం తప్ప ఉపయోగం లేదు. అసలు ఆ ప్రతిపాదనేమీ అమలుకాదు కాబట్టి వారికి ఆ భయం అనవసరం. ఎలాగూ ఈ బ్లేమ్‌గేమ్ ఢిల్లీలోనే ఆగిపోతుంది. ముందువరసలో గుజ్జర్లు, జాట్లు, పటేళ్లు, మాదిగ అన్నయ్యలున్నారు. వారి కథ తేలిన తర్వాతే ఆంధ్రలో కాపు, తెలంగాణలో ముస్లిం తమ్ముళ్ల కథ తేలేది. అప్పటివరకూ బీసీలు నిశ్చింతగా ఉండవచ్చు. అలాకాదని మీడియా ప్రచారానికి రోడ్డెక్కితే వచ్చేది బీపీలు, షుగర్లు మాత్రమే!
ఈ వ్యవహారం చివరికి ఎలా ముగిసినప్పటికీ చంద్రబాబు మాత్రం కాపుల కథ కంచికి చేర్చడంలో విజయం సాధించారు. 5 శాతం ఇచ్చిన బాబు ‘పంచ’తంత్రం కాపులపై బాగానే పనిచేసినట్లు, కాపుల కృతజ్ఞతపర్వం చెబుతోంది. బాబు వరం అమలవుతుందా లేదా అన్నది కాకుండా.. అసలు బాబు రిజర్వేషనే్ల ఇవ్వరని, కాపులను వాడుకుని వదిలేస్తారంటూ ఇప్పటివరకూ ముద్రగడ అండ్ కో చేసిన ప్రచారానికయితే చంద్రబాబు శాశ్వతంగా తెరదించారు. కాపులయితే తమకు న్యాయం జరిగిందనే భావిస్తున్నారు. బాబుకూ కావలసింది అదే!
* * *
తెలుగుదేశం-బీజేపీ కలహాల కాపురం కథ తెలుగు టీవీ సీరియల్ మాదిరిగా రసవత్తరంగా సాగుతోంది. పోలవరం వ్యవహారం శాంతమూర్తి, సీతమ్మవారి అంత ఓపిక ఉందనుకునే చంద్రబాబును చికాకు పరచడమే ఆశ్చర్యం. అలుగుటయే ఎరుగని వాడన్నట్లు.. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసిన బాబు, ఇటీవలి కాలంలో తరచూ పోలవరంపై రుసరుసలాడటం వెనుక ఉన్న మతలబుపై రకరకాల వార్తలు, వ్యాఖ్యలు, విమర్శలు, విశే్లషణలూ వినిపిస్తున్నాయి.
పోలవరం ఏపీకి జీవనాడి. అందులో ఎవరికీ సందేహం లేదు. దానిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, అన్ని ఖర్చులు తామే భరించి నిర్మిస్తామని కేంద్రం చెప్పిందన్నది నిజంన్నర. అయితే, బాబుగారి ఆలోచనలంత వేగంగా ప్రాజెక్టు సాగటం లేదన్నది కదా తమ్ముళ్ల బాధ! రాష్ట్రం ఏదడిగితే అది వెంటనే ఇవ్వడం లేదని, కావాలనే పోలవరం ప్రాజెక్టుకు కాళ్లూ, చేతులు అడ్డం పెడుతుంటే ఇక నా వల్ల కాదు, మీరే చేసుకోండని దండం పెడతాననే వరకూ బాబు విసిగిపోయారు. తాను ప్రతి సోమవారాన్ని పోలవారంగా చేసుకుని, అమరావతి నుంచే అక్కడ జరిగే పనులను సమీక్షిస్తుంటే, సహకరించాల్సిన కేంద్రం సతాయిస్తోందన్న బాధ బాబుగారికి బాగా ఉందని కనిపిస్తూనే ఉంది.
ఒక్క పోలవరమే కాదు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రాజెక్టుల విషయంలోనూ కాళ్లూ, చేతులూ అడ్డుపెడుతున్న తీరు ఒకప్పుడు చక్రం తిప్పిన చంద్రబాబుకు చిరాకు తెప్పిస్తోంది. గతంలో వాజపేయి సర్కారుకే దిశానిర్దేశం చేసిన తెలుగుదేశాధీశుడు, ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చున్న మోదీని ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడాల్సి వస్తోంది. మూడీ మోదీ ఎప్పుడెలా స్పందిస్తారో తెలియక తెలుగువల్లభుడు ప్రతిసారీ తెల్లబోవాల్సివస్తోంది. అలాగని పోనీ నేరుగా యుద్ధానికి సిద్ధమయ్యే పరిస్థితి లేదాయె. అందుకే తొలిరోజు పోలవరంపై ఉగ్రరూపమెత్తిన బాబు, రెండోరోజుకు శాంతమూర్తి అవతారమెత్తినట్లుంది. సరే ఇదంతా ‘తెలుగు’కోయిలల కోణమైతే ఇక కమలదళాల వాదనలు అందుకు భిన్నం. పోలవరంపై లెక్కలు అడుగుతుంటే దానికి బాబుగారెందుకు బాధపడుతున్నారన్నది బీజేపీ ప్రశ్న. కేవలం 1480 కోట్ల టెండరు గురించి పోలవరం ఎందుకు ఆపాలి? దాని భావమేమి తిరుమలేశా అని లా పాయింట్లు తీస్తున్నారు. అసలు పోలవరంతో టీడీపీకి సంబంధం లేదని, అది బీజేపీ ప్రాజెక్టని సోము వీర్రాజు కుండబద్దలు కొడుతుంటే, పోలవరంపై బాబు ఆవేశానికి కారణమేమిటో కన్నా లక్ష్మీనారాయణ, పురందరేశ్వరి ఢిల్లీకి వెళ్లి రికార్డుల్లో తలబెట్టి మరీ ఆరా తీస్తున్నారు.
వెయ్యేల? సర్కారు చూపించే లెక్కల్లో మాయామర్మం ఉందన్నది కేంద్రం అసలు అనుమానం! పట్టిసీమ నుంచి నిర్వాసితులకు నష్టపరిహారం, సబ్ కాంట్రాక్టర్ల వరకూ బినామీలు, కమిషన్ల పర్వం విజయవంతంగా జరుగుతోందని, ప్రాజెక్టు తామే కడతామన్న సర్కారు కోరిక వెనుక బ్రహ్మరహస్యం అదేనని, మోదీకి అసలు సిసలు కమలదళాలిచ్చిన ఫిర్యాదు. వాటిపై జలవనరుల శాఖతో విచారణ చేయించిన తర్వాతనే పోలవరంపై కేంద్ర ధోరణి మారిందని బీజేపీ నేతల మనసులోమాట. అయితే, ‘తెలుగు’ కమలదళాలు మాత్రం పోలవరం ఆపితే బాగుండదని, తెలుగు సర్కారును అనుమానిస్తే కళ్లుపోతాయన్న భక్తిపారవశ్యం ప్రకటిస్తున్నాయి.
అయితే, పోలవరం సహా రాష్ట్రానికి రావలసిన ప్రాజెక్టులకు మోదీ గండికొడుతున్నారంటూ మీడియా రాజగురువు గారి సారథ్యంలో సాగుతున్న ప్రచారోద్యమ ప్రభావం సంబంధం ఉన్నా, లేకున్నా సహజంగా సర్కారుపైనే పడుతోంది. రెండ్రోజుల క్రితం చంద్రబాబును బీజేపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కలిసినప్పుడు కమలనాధులు ఇదే అనుమానం వ్యక్తం చేశారట. ఆ రెండు పత్రికల్లో మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయన్న బీజేపీ ఫిర్యాదులోని కవిభావనను అర్ధం చేసుకున్న బాబు, వాటితో తమకెలాంటి సంబంధం లేదని చెప్పుకోవలసి వచ్చిందట!
నేను ఇదే విషయంపై చాలాసార్లు ప్రస్తావించా. ఏపీలో రాజగురువుగారి మస్తిష్కం నుంచి జాలువారే ప్రతి మేధోకథనాలు, దృశ్య కదలిక కథనాల వెనుక సర్కారు సౌజన్యం ఉందన్న అనుమానం ఢిల్లీలో బలంగా నాటుకుపోయిందని గతంలోనే చెప్పాను. దానిపై లెక్కలేనన్నిసార్లు కమలనాధులు పుంఖానుపుంఖాలుగా అమిత్‌షాకు ఫిర్యాదు చేసిన వైనం మీడియాలోనూ వచ్చిన తర్వాత, ఇక దానిలో రహస్యమేముంది? ఎందుకంటే మోదీ కూడా బాబు మాదిరిగానే ఆవులించకుండానే పేగులు లెక్కబెట్టగల దిట్ట. ఆయన లెక్కలు ఆయనకుంటాయి మరి! పైగా ఇక్కడ ‘తెలుగు’ బీజేపీ-్ఢల్లీ బీజేపీ వర్గాలున్నాయి. ఆ రెండువర్గాలిచ్చే సమాచారంతో పాటు, నిఘావర్గాలు, సొంత వేగుల సమాచారం ఉండనే ఉంటుంది. సర్కారుకు మార్గదర్శిగా మారాలనుకుంటున్న మిత్రపత్రికలకు మేళ్లు చేయాలనుకుంటే దానికెవరి అభ్యంతరాలూ ఉండవు. కానీ వాటి భుజంపై తుపాకీ వేరేవారికి గురిపెట్టినప్పుడు, అది గురి తప్పితే పరిణామాలు ఇంతకు భిన్నంగా ఎలా ఉంటాయి?

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144