ఎడిట్ పేజీ

ఓట్ల కోసం ఏ మతమైనా సమ్మతమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మిస్సమ్మ’ అనే తెలుగు సినిమా 1954 ప్రాంతంలో వచ్చినట్లు గుర్తు. అందులో ఓ సన్నివేశం ఉంది. ఎన్‌టి రామారావు సావిత్రి ఓ పార్కులో కూర్చుంటారు. ‘యెహోవాకు ఐడియా రాకపోతే ఈ సృష్టి జరిగేదా?’ అని అంటాడు ఎన్‌టిఆర్. ‘ఓహో! మీరు హిందువులు కదా? బైబిలు కూడా చదివారా?’ అని సావిత్రి ప్రశ్నిస్తుంది.
‘బైబిలు ఖురాను భగవద్గీత అన్నీ చదివాను. ముందు ఈ ఉద్యోగ పత్రంపై సంతకం చేయండి’ అంటాడు ఎన్‌టిఆర్. ఆ తర్వాత క్రైస్తవ మతానికి చెందిన సావిత్రి హిందూ మతానికి చెందిన ఎన్‌టిఆర్ భార్యభర్తలుగా నటిస్తారు - ఈ కథ ఆ సినిమా చూసిన వారందరికీ తెలుసు. వారంతా ఎందుకు డ్రామా ఆడవలసి వచ్చింది? అంటే ఓ ఉద్యోగం కోసం. నీది ఏ కులం? అంటే గోకులం - ఏ మతం? సర్వసమ్మతం - అన్నాడొకాయన. ఉమర్‌ఖయాం అనే పెద్దమనిషి తన కవితా సంకలనంలో ‘‘మునుపు మసీదు వాకిటను ముచ్చెలు దొంగిలించిపోతి’’ అని వ్రాశాడు. అంటే పాత చెప్పులు అరిగిపోయినప్పుడు మాత్రమే ఖయ్యూం మసీదుకుపోయి కొత్త చెప్పులు దొంగిలించుకొని వస్తుండేవాడు. మన రాజకీయ నాయకులు సెక్యులరిస్టులు. వాళ్లు గుడి మసీదు చర్చి గురుద్వారా పోచమ్మ మంకాళమ్మ బౌద్ధ విహారం దేనికైనా పోతారు. వాళ్లకు కావలసింది ఓట్లు. 1971లో నేను వరంగల్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు మద్దికాయల ఓంకార్ అనే సిపియం నాయకుడు అక్కడ ఎన్నికలలో పోటీ చేశాడు. ‘‘మద్దికాయలు మారేడు కాయలు శివునికి చాలా ఇష్టం. ఓంకారం అంటే శైవమతానికి చెందిన మంత్రం. అందుకని ఓంకార్‌కు ఓటు వేయండి’ అని తొర్రూర్, మేడారం ప్రాంతాలలోని గిరిజనులకు పార్టీ కార్యకర్తలు చెప్పారు. ఇందుకు నేనే సాక్ష్యం.
2017 డిసెంబరులో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ గుజరాత్‌లోని అక్షరథామ్ స్వామి నారాయణ్ దేవాలయం అంబాజీ దేవాలయం ద్వారకా శ్రీకృష్ణ దేవాలయం ఇలా వరుసపెట్టి కొన్ని డజన్ల దేవాలయాల చుట్టూ తిరిగారు. ఎందుకు? అంటే హిందువుల ఓట్ల కోసం. హైదరాబాద్ ముస్లిముల ఓట్ల కోసం దాదాపు అన్ని పార్టీలూ చిల్లుల టోపీలు నెత్తిమీద పెట్టుకుని ఇఫ్తార్ విందులకు వెళ్లడం అందరికీ తెలిసిందే. ఇలా ఎందుకు చేస్తున్నారంటే ముస్లిముల ఓట్లు హైదరాబాద్‌లో గణనీయంగా ఉన్నాయి. మంచిదేకదా! నాకు షకీల్ అహమద్ అనే మిత్రుడు ఉన్నాడు. ఆయన పాతబస్తీలో ఉంటాడు. రంజాన్ నాడు అతనికి పాయసం వండుకునే నిమిత్తం పాలు పంచదార జీడిపప్పు ఇస్తుంటాను. ఐతే నేను రాజకీయవేత్తను కాదు. ముస్లిం మతస్థుణ్ణి అంతకన్నా కాదు. కేవలం స్నేహం ప్రేమలే కారణం.
ఐతే రాహుల్‌గాంధీ 29-నవంబర్ 2017నాడు గుజరాత్‌లోని సుప్రసిద్ధ సోమనాథ దేవాలయం సందర్శించుకొని శివభక్తుడయినాడు. ఇంతవరకు బాగానే ఉంది. అక్కడి రిజిస్టర్‌లో ‘‘తాను, అహ్మద్ పటేల్ హిందువులం కాము’’ అని వ్రాసి సంతకం చేశారు. దీనితో ఒక్కసారి వివాదం దేశవ్యాప్తంగా చెలరేగింది. హిందువువు కాకపోతే నీవుఎవరివి? అని విమర్శకులు ప్రశ్నించారు. 1994లో న్యూయార్క్ టైమ్స్‌లో (అమెరికా) ప్రచురింపబడిన ఒక వ్యాసంలో రాహుల్‌గాంధీ రోమన్ కాథలిక్ మతస్థుడు అని పేర్కొనబడింది. జవహర్‌లాల్ నెహ్రూ తాను మత విశ్వాసాల దృష్ట్యా ముస్లిమును అని చెప్పుకొన్నాడు. ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ పార్సీ మతస్థుడు. ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్‌గాంధీ జన్మరీత్యా పార్సీ. ఆయన భార్య రోమన్ కాథలిక్. కాబట్టి రాహుల్‌గాంధీ హిందువుకాదు అనే విషయం సుస్పష్టం. మరి ఎన్నికల సమయంలోనే వీరు దేవాలయాల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు?
గజనీ మహమ్మద్ భారతదేశం మీదకి పదిహేడుసార్లు దండయాత్ర చేశాడు. సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. నేను గుజరాత్ వెళ్లినప్పుడు సోమనాథ్ ద్వారకలు చూచాను. ద్వారక నుంచి చూస్తే మనకు పాకిస్తాన్ సరిహద్దులు కన్పడతూ ఉంటాయి. పాక్ అనే మాటకు పవిత్రమైన అని అర్థం. ఇండియా దుర్మార్గపు దేశం. అందుకని తాము పవిత్ర దేశ నిర్మాణం చేసుకుంటాము అని మహమ్మద్ ఆలీ జిన్నా 1947లో భారత దేశాన్ని మూడు ముక్కలు చేశాడు. ఇక సోమనాథ్ దేవాలయం పూర్తిగా ధ్వంసమై పోతే 1947 తర్వాత ఆనాటి కేంద్ర ఆహార శాఖ మంత్రి కె.ఎం.మున్షీ ఒక కమిటీ ఏర్పాటు చేశాడు. ఈ బృహత్ కార్యక్రమానికి సర్దార్ వల్లభ్ భాయి పటేల్ సారథ్యం వహించాడు. అప్పుడు పండిత జవహర్ లాల్ ఇలా అన్నాడు.
‘‘మనం ఇలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఇది హిందూ దేవాలయం. దీనిని ముస్లిములు ధ్వంసం చేశారు. ఇప్పుడు ఈ గుడిని పునరుద్ధరిస్తే ముస్లిములను అవమానించినట్లవుతుంది. అంతేకాక హిందూ నేషనలిస్టులను గౌరవించినట్లు అవుతుంది’’
ఐతే పటేల్, నెహ్రూ మాటలను పట్టించుకోలేదు.
‘సోమనాథ దేవాలయం మా గుజరాతీ సంస్కృతికి గర్వతోరణం’ అన్నాడు పటేల్. 1948లో హైదరాబాద్ మీదికి పటేల్, సైన్యాన్ని పంపితే నెహ్రూ వ్యతిరేకించాడు. ‘నిజాం నవాబుకు కోపం వస్తుంది. అందుకని పోలీసు చర్య తగదు’ అన్నాడు జవహర్‌లాల్ నెహ్రూ. మనకు హిందువులైతే ఏమిటి? ముస్లిములైతే ఏమిటి? తినడానికి తిండి చేసుకునేందుకు ఉద్యోగం కావాలి. అన్నారు సెక్యులరిస్టులు. ఇది కూడా నిజమే మరి? ఐతే రాహుల్ గాంధీ అహ్మద్ పటేల్ కలిసి సోమనాథ దేవాలయంలోకి వెళ్లి ఎందుకు అభిషేకాలు చేసుకున్నట్లు.. మహమ్మద్ గజినీకి వారసుడు ఈ అహ్మద్ పటేల్. ఈయనకు ఇలా శివభక్తి ఎప్పటి నుంచి మొదలయింది??
‘ఇదంతా అబద్ధం. అసలు రాహుల్ బాబు సోమనాథ్ వెళ్లనేలేదు’’
‘వెళ్లాడు. కానీ రిజిష్టరులో సంతకం లేదు’’
‘‘సంతకం ఉంది. కాని దానిని ఎవరో ఫోర్జరీ చేశారు’’
‘‘ఔనయ్యా! రాహుల్ బాబు గుడికిపోతే తప్పేమిటి?’’
ఇలా ఎవరికి తోచినట్లు వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు.
నిజానికి రాహుల్‌బాబు పుట్టిన తేదీ, విద్యార్హత, వివాహితుడా? అవివాహితుడా? ఏ మతస్థుడు? ఇలాంటి అన్ని వివరాలు నేటికీ గోప్యంగానే ఉంచవలసిన అవసరం ఎందుకు వచ్చింది? శ్రీమతి సిగ్నోరాగాంధీ ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకున్నది అని ఆ మధ్య ఓ దొంగ సర్ట్ఫికెట్టు సృష్టించారు. అలాంటి సర్ట్ఫికెట్టు మేము ఇవ్వలేదు అని ఆ విద్యాసంస్థవారు ప్రకటించారు. శ్రీమతి ఇందిరాగాంధీ పార్సీ మతస్థురాలు. అందుకని ఆమెను పూరీ జగన్నాథ్ దేవాలయంలోనికి అనుమతించలేదు. తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎవరైనా అన్య మతస్థులు వస్తే వారు రిజిష్టరులో తాము హైందవేతరులు అని సంతకం చేసి తీరాలి. కానీ అలా సంతకాలు చేస్తున్నారా?? వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సంతకాలు చేసి ‘మేము హిందువులము కాము’ అని డిక్లరేషన్ ఇచ్చారా? ఎన్నికలకు వచ్చాయి కాబట్టి ఇవన్నీ చర్చనీయాంశాలు ఐనాయి. కాకుంటే ఎవడు ఏ మతస్థుడో ఎవడికి కావాలి? ఆమాటకొస్తే హిందువులంతా హిందువులేనా? బ్రాహ్మణులంతా బ్రాహ్మణులేనా? ఎంతమందికి యజ్ఞోపవీతాలున్నాయి. ఎందరు గాయత్రీ జపం చేస్తున్నారు?
కాకుంటే ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణుల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. అందుకని ఉత్తరప్రదేశ్ ఎన్నికల సభలలో రాహుల్‌గాంధీ ‘‘నేను బ్రాహ్మణుణ్ణి. మా పూర్వీకులు కశ్మీరీ పండిట్లు’’ అని చెప్పుకున్నాడు. బ్రాహ్మణుడివి ఐతే యజ్ఞోపవీతం ఉందా? గాయత్రీ జపం చేశావా? అని ఎవరూ ప్రశ్నించలేదు.
గుజరాత్‌లోని ఆర్చిబిషప్ ‘మన రాహుల్ బాబును గెలిపించండి. హిందూ జాతీయ వాదుల్ని ఓడించండి’ అని ప్రకటన జారీ చేశాడు. ఎన్నికల సమయంలో ఇలా మత ప్రాతిపదికపై ఓట్లు అడగటం భారత రాజ్యాంగ విరుద్ధం - అని గతనెల 29న ఎలక్షన్ కమిషన్ ఆర్చిబిషప్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
ఎన్నికలలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు? అనేది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కులం, మతం, ధన ప్రభావం, మద్యం ఇలా ఎన్నో అంశాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు సమస్య ఏమంటే? ఎవ్వరికైనా తాను ఏ కులస్థుడో ఏ మతస్థుడో బహిరంగంగా ఎన్నికల సమయంలో చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారు. రెడ్డి-చౌదరి-షెపర్డ్-యాదవ్- మంద కృష్ణమాదిగ - మనీష్ తివారీ - ఆనందశర్మ - ఇవన్నీ కుల నామాలు కావా?? ఆనంద్ అంటే చాలుకదా? ‘శర్మ’ అని కూడా తీరాలా?? ఔను. ఉండాలి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో బ్రాహ్మణుల ఓట్లు నిర్ణయాత్మకమైనవి.
బిజెపి బలపడిన తరువాత భారత రాజకీయాలను ‘మతం’ ప్రభావితం చేస్తున్నది - అని ఆరోపణ ఉంది. 1947లో దేశ విభజన ఏ ప్రాతిపదికన జరిగింది?? మతం ప్రాతిపదిక మీద జరిగింది. అప్పుడు బిజెపి లేదు. భారతీయ జనసంఘ్ కూడా పుట్టలేదు. ఒక హిందువు నాటికీ నేటికీ ‘నేను హిందువు’ను అని బహిరంగంగా చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాడు. 1998 ఫిబ్రవర 27వ తేదీనాడు వెలువడిన న్యూయార్క్ టైమ్స్ వ్యాసం జాన్ వ్రాశాడు. ఇప్పుడు పులిట్జర్ ప్రైజ్ విజేత. ఆయన స్పష్టంగా ‘రాహుల్ బాబు రోమన్ కాథలిక్ మతస్థుడు’ అని పేర్కొన్నాడు. ఈ వ్యాసంలోని అంశాలు అసత్యం అని కాంగ్రెసు అధికార ప్రతినిధి ఇన్ని సంవత్సరాలలోను ఒక్కసారి కూడా ఖండించలేదు.
‘‘లష్కరే తోయిబా ఉగ్రవాదం కన్నా హిందూ ఉగ్రవాదం ప్రమాదకరమైనది’’ అని రాహుల్ బాబు ప్రకటించాడు. ఇదే ప్రకటన సుశీల్ కుమార్ షిండే, దిగ్విజయ్ సింగ్ మణిశంకర అయ్యర్ వంటి అగ్రశ్రేణి కాంగ్రెస్ నాయకులు చేశారు. ‘‘హఫీజ్ జీ! ఒసామా జీ’’ అంటూ దిగ్విజయ్ సింగ్ వందిమాగధ స్తోత్రాలు చేస్తూ ఉగ్రవాదులను బహిరంగంగా వత్తాసు పలికాడు. ఇలా ఎందుకు?? ముస్లిముల ఓట్ల కోసం!! ఇదుగో తిరుపతికి ద్వారకా సోమనాథ్ దేవాలయాలకు అందుకే హైందవేతరులు వెళ్తున్నారు. వెంకన్నమీద భక్తితో కాదు. వెర్రివెంగళప్పలైన హిందువులు మూకుమ్మడిగా రాహుల్‌బాబుగారికి ఓట్లు వేస్తారని??
బాట్లా హవుస్ వద్ద జిహాదీ ఉగ్రవాదులను కాల్చి చంపినప్పుడు శ్రీమతి సోనియాగాంధీ ఏడ్చింది. ‘‘నాకు మూడు రాత్రులు నిద్ర పట్టలేదు’’ అని బహిరంగంగా ఫ్రకటించడం ఎందుకు? అంటే ఉత్తరప్రదేశ్‌లోని ముస్లింల ఓట్ల కోసం. ఏప్రిల్ 2014 ఎన్నికల సందర్భంగా ఆమె న్యూఢిల్లీ ఇమాం బుఖారీ వద్దకు వెళ్లి మీరు (ముస్లిములు మేము కాంగ్రెస్, క్రైస్తవులు కలిసి హిందూ బీజెపీని ఓడిద్దాం. ఎందుకంటే అది మతతత్వ పార్టీ అని బహిరంగంగా ఆమె ప్రకటించింది.
గతనెల 27న సోమనాథ దేవాలయం దర్శించి తాను హిందువునుకాను-అని రిజిష్టర్‌లో పేర్కొన్నాడు. మరి దేవాలయానికి ఎందుకు వెళ్లినట్లు? అ ప్రశ్న వచ్చింది. అక్కడికి రెండు రోజుల తరువాత కాంగ్రెస్ ప్రవక్త కపిల్ సైబల్ మాట్లాడుతూ ‘‘గుడికి వెళ్లిన రాహుల్‌గాంధీ నిజమైన హిందువు. గుడికి వెళ్లని మోదీ హిందువు ఎట్లా అవుతాడు?’’ అని ప్రశ్నించాడు. అంటే ‘‘ఉపాధి -అభివృద్ధి -ఉద్యోగాలు’’ వంటి సామాజికాంశాల నుండి ‘‘హిందూ-నాన్‌హిందూ’’ అనే అంశం ఎన్నికలలో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ఇప్పుడు ఎక్కడ చూచినా ఇదే చర్చ.
2013వ సంవత్సరంలో సుప్రీంకోర్టులో ఒక ఎఫిడవిట్ సమర్పిస్తూ రాహుల్ వర్గం ఏమన్నారు? ‘‘రాముడు ఒక కల్పిత వ్యక్తి (మిథ్)’’. అంటే గంగ గోవు గాయత్రి రాముడు శివుడు కృష్ణుడు వంటి భారతీయ దైవాల మీద గౌరవం లేనివారు హిందువులు అవుతారా? లష్కరీ తోయిబాకన్నా ఈ ‘‘హిందూ ఉగ్రవాదం’’ ప్రమాదకరమైనది అని ప్రకటించిన వారు హిందువులవుతారా? ఒక వ్యక్తి ప్రతి దినమూ దేవాలయానికి పోకపోయినంత మాత్రాన హిందువు కాకుండా పోడు. ఆమాటకొస్తే రాహుల్ గాంధీ ఎన్నికల సీజన్‌లోనే అక్షరథామ్ ద్వారక సోమనాథ దేవాలయాలు దర్శించాడు. కానీ ఆయనకు గంగ - గోవు - గీతల మీద గౌరవం ఉందా?
నరేంద్రమోదీ అమెరికాకు వెళ్లినపుడు ఒబామాకు భగవద్గీతను బహూకరించినప్పుడు ‘సెక్యులరిజం మైలపడిపోయింది’ అని వీరు గోల చేయడం మరచిపోయారా? ఈనెల 3న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇలా అన్నాడు. ‘‘రాహుల్ బాబు దశాబ్దాల పర్యంతం ఢిల్లీలో ఉన్నా ఒక్కనాడూ ఒక్క గుడికి పోలేదు. ఇవ్వాళ గుజరాత్‌లో ఎన్నికల సమయంలో ఈ ఆకస్మిక ప్రదక్షిణలేమిటి?’’
‘‘హిందువులు దేవాలయాలకు ఎందుకు వెళ్తారు? - అంటే ఈవ్ టీజింగ్ ఆడపిల్లలకు కన్నుకొట్టడానకి’’. ఈ మాట అన్నది కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ. గుజరాత్ ఎన్నికల సందర్భంగా రాహుల్‌బాబు 8 వారాలల్లో 20 ప్రముఖ దేవాలయాలు దర్శించి పూజలు చేశాడు. ఎందుకు??
‘‘నేను హిందువును - అమిత్‌షా అరుణ్ జైట్లీలాంటి వాళ్లే హిందువులు కాదు’’ అన్నాడు. ఎందుకని??

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్