ఎడిట్ పేజీ

భాషాప్రయుక్త రాష్ట్రాలు ఇప్పుడు అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడును పూర్వం మద్రాసు రాష్ట్రం అని పిలిచేవారు. దీని పరిధి చాలా ఎక్కువగా ఉండేది. నిజానికి తమిళనాడును నాయక రాజులు చాలాకాలం పరిపాలించారు. వారు ఆంధ్ర ప్రభువులు. శ్రీకృష్ణదేవరాయలు వారసులు. వీరి రాజధాని తంజావూరు మద్రాసు తెలుగు భాషీయుల ప్రాంతం. కరుణానిధి తెలుగువాడు. సర్వేపల్లి రాధాకృష్ణ పండిట్ తెలుగువాడు. తమిళనాడులో ఉన్న కారణంగా రాధాకృష్ణన్ అని పిలవబడ్డాడు. నేటికీ తమిళనాడులోని తిరుత్తణి, హోసూరు, కృష్ణగిరి వంటి ప్రాంతాలల్లో నూటికి తొంబది శాతం ప్రజలు తెలుగునే మాట్లాడతారు.
తమిళనాడులో తెలుగు భాషీయులకు న్యాయం జరగడం లేదనే బాధలో తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని ఆంధ్రులు 1940వ దశకంలో ఆందోళన మొదలుపెట్టారు. శ్రీబాగ్ ఒడంబడిక - పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం, జవహర్‌లాల్ నెహ్రూ రాత్రికి రాత్రి రేడియోలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ప్రకటించడం ఇవన్నీ 20వ శతాబ్దంలోని చారిత్రకాంశాలు. భాషాప్రయుక్త రాష్ట్రాల విభజనను గట్టిగా వ్యతిరేకించిన మొదటివ్యక్తి చక్రవర్తుల రాజగోపాలాచారి. ఆయన మేధావి వర్గానికి చెందిన దూరదర్శి. భారతదేశానికి ఇంగ్లీషు అనుసంధాన భాషగా ఉండాలని భావించాడు. ఆయనను అర్థం చేసుకున్నవారు తక్కువ. ఎవరి మూర్ఖత్వాలు స్వార్థాలు వారివి. విశాలాంధ్ర అవతరణ జరిగిన తరువాత నిజాం పాలన నుండి విముక్తమైన తెలంగాణను కలిపి 1956 నవంబర్ 1 నాడు ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం కొద్దికాలంలోనే విఫలమయింది. ఇందుకు అనేక చారిత్రక ఆర్థిక రాజకీయ కారణాలున్నాయి - ఇదంతా ఇటీవల చరిత్రయే. ఉత్తర భారతంలో ఒకే హిందీ భాష మాట్లాడేవారికి నాలుగు రాష్ట్రాలున్నప్పుడు ఒకే తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేమిటి? అని వాదించారు. రెండుకాదు మూడు ఉంటే మాత్రం తప్పేమిటి?? భాషాప్రయుక్త రాష్ట్రం అనే కల్పన చెదిరిపోయినప్పుడు ఇక ‘‘పరిపాలనా సౌకర్యం’’ కోసం ఎన్ని రాష్ట్రాలైనా ఉండవచ్చు. ఇండియాలోని జనాభాలో నాల్గవ వంతు కూడా లేని అమెరికాలో యాభై ఆరు రాష్ట్రాలున్నాయికదా మరి ఇండియాలో యాభై రాష్ట్రాలుంటే తప్పేమిటి? కోటిమందికి పైగా జనాభాగల హైదరాబాద్ నగరాన్ని ఒక స్వయం పాలిత రాష్ట్రం (అటానమస్)గా గుర్తిస్తే తప్పేమిటి? అనే వాదం ఉంది. తమిళనాడులో మధురై ముఖ్యపట్టణంగా దక్షిణ తమిళనాడు రాష్ట్రాన్ని ఏర్పరచాలనే కోరిక చాలాకాలంగా ఉంది. ‘‘అలాంటి దుర్మార్గపు ఆలోచనలను మొగ్గలోనే తుంచివేయాలి’’ అని పి.చిదంబరం ఒక ప్రకటన విడుదల చేశారు. డార్జిలింగ్‌లో ప్రత్యేక గూర్ఖాలాండ్ ఉద్యమానికి దాదాపు నూరు సంవత్సరాల చరిత్ర ఉంది. ఐతే ఇటీవలి కాలంలో అది హింసాత్మకంగా మారడానికి ప్రధాన కారణం ఆ ఉద్యమం వెనుక చైనీయుల హస్తం ఉండటమేనని నిఘావర్గాలు తెలిపాయి. ఇక నాగపూరు ముఖ్య పట్టణంగా మహారాష్టన్రు రెండుగా విభజించాలనే మరొక ప్రతిపాదన ఉంది. 2019 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఆయన ప్రత్యేక రాయలసీమ జెండాతో ముందుకు వచ్చినా ఆశ్చర్యపడనక్కరలేదు. ఇక బుందేల్‌ఖండ్ అనే ప్రత్యేక రాష్ట్రం కావాలని కేంద్రమంత్రిణి ఉమాభారతి లోగడ ఆందోళన చేసింది. ఈ ప్రాంతం కొంత మధ్యప్రదేశ్‌లోను, మరికొంత యూపీలోనూ ఉంది. రాజా ఛత్రసాలో బుందేల్‌ఖండ్‌ను పరిపాలించిన మధ్యయుగాల నాటి చక్రవర్తి. అతడు ఔరంగజేబు సైన్యాలను నిలువరించడంలో కీలకపాత్ర పోషించాడు. కర్ణాటకలో ‘కొడగు’ అనే ప్రాంతాన్ని స్వతంత్ర రాష్ట్రంగా ప్రకటించాలని చాలాకాలంగా ఆందోళన కొనసాగుతూ ఉంది. రాజకీయ అవసరాల దృష్ట్యా ఇలాంటి ఉద్యమాలు ఎప్పుడైనా తెరపైకి రావచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో బొమ్మాబొరుసు రెండూ ఉన్నాయి. అంటే ఇది ప్రజాస్వామ్యానికి మరొక పార్శ్వం. ముంబయి నగరం కాస్మోపాలిటన్‌గా ఉంది. ఇక్కడ మరాఠా ప్రజలు ఎందరో ఉన్నారు. హిందీ భాషీయులు ఉన్నారు. తెలుగు (తెలంగాణ), గుజరాతీ భాషీయులు అక్కడ పెద్దసంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు శివసేన వారు, మహారాష్ట్రులు కానివారు ముంబయిలో ఉండకూడదని అంటున్నారు. కర్ణాటకలో కన్నడం రానివారు ఉద్యోగాలలో చేరకూడదు అనే నిబంధనను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెరపైకి తెచ్చారు. దీనివెనుక తన రాజకీయ ప్రయోజనం (2018 ఎన్నికలలో లాభం) ఉన్నదనే విషయం జగద్విదితం. ఈ సంఘటనలన్నీ దేనిని తెలియజేస్తున్నాయి?? భాషాప్రయుక్త రాష్ట్రాల విభజన వెర్రితలలు వేసిందని తెలియజేయడం లేదా?? తమిళనాడు హిందీ - హిందూ-సంస్కృతం వంటి పదాలను ద్వేషించడం వెనుక ఈ రాజకీయ దురుద్దేశమే ఉంది. నిజానికి కరుణానిధి అనేది సంస్కృత పదం. ఉదయన్ టి.వి. అనేది సంస్కృత పదం. రామస్వామి నాయకర్ అనేది సంస్కృత పదం. భాషాప్రయుక్త రాష్ట్రాలను రద్దు చేసి పరిపాలనా సౌకర్యం కోసం జోనల్ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది. తమిళనాడును కేరళలో కలిపివేస్తే నష్టం ఏమిటి? ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కలిపి ఒకే రాష్ట్రం చేయవచ్చు. ఛత్తీస్‌గఢ్‌ను తెలంగాణను కలిపివేయవచ్చు. మహారాష్ట్ర, గుజరాత్‌లను మొదటినుంచి కవలపిల్లలుగా అభివర్ణిస్తారు. సప్తకన్యలు అని పిలవబడే ఈశాన్య రాష్ట్రాలను ఒక యూనిట్‌గా మార్చవచ్చు. ‘‘పరిపాలనా సౌకర్యం కోసం చిన్నరాష్ట్రాలు’’ అనే బిజెపి విధానం పండిత దీనదయాల్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన యూనిటరీ విధానానికి వ్యతిరేకమైనది. ముఖ్యంగా భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రయోగం విఫలమయింది. పోతన ఆంధ్ర మహాభాగవతమును రచించెను అనడాన్ని ఇవ్వాళ కొందరు ఒప్పుకోవడం లేదు. విజయవాడలో ఒక పత్రికలో సినారాయణరెడ్డి జ్ఞానపీఠ పురస్కారము పొందెను - అనడానికి బదులు ‘‘నీళ్లయ్య రట్టోడి ఎరుక పీట ఎక్కెను’’ - అంటే ఎందిరికి అర్థం అవుతుంది? తెలుగును తమిళాన్ని కన్నడాన్ని రక్షించుకోవడం అంటే హిందీని సంస్కృతాన్ని ఆంగ్లాన్ని ద్వేషించాలా? ఇంగ్లీషు రాకపోతే అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియాలల్లో ఉద్యోగాలు రావు. మరో ముఖ్యాంశం ఏమంటే తమిళనాడులో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా హిందీ నేర్చుకొని ఉత్తర భారతంలో ఉద్యోగాలు సంపాదించుకుంటున్నవారు ‘‘వీర తమిళవాదులే’’. దీనిని అవకాశవాదం అంటారా? హిపోక్రసీ అంటారా? ఏ విధంగా చూసినా భారతదేశంలో 1956లో ఏర్పడిన భాషాప్రయుక్త రాష్ట్రాల విభజన ప్రయోగం విఫలమయింది. రాజకీయ లబ్దికోసం ఓట్లను దండుకునే నిమిత్తం కులం, మతం, భాష ప్రాంతీయ దురాభిమానంవంటి వాటిని రెచ్చగొట్టి నాయకులు లబ్ది పొందుతున్నారు. భారతదేశంలో ఎన్నో భాషలున్నాయి. కేంద్రప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ఓ ముప్పై భాషలున్నాయి. కాశ్మీరులో కాశ్మీరీ భాషను ఉర్దూ మింగివేసింది. జమ్మూకశ్మీరుకు ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంది. అంటే అంబేద్కర్ భారత రాజ్యాంగం జమ్మూకశ్మీర్‌కు వర్తించదు. ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాము. జమ్మూకశ్మీరు రాష్ట్రాన్ని రద్దుచేసి దానిని పక్క రాష్ట్రాలతో కలసివేయడం శ్రేయస్కరం.
సారాంశం ఏమంటే: నరేంద్రమోదీ ధైర్యంగా భాషాప్రయుక్త రాష్ట్రాల విషయంలో పునరాలోచన చేసేందుకు వెంటనే ఒక కమిటీని నియమించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దక్షిణ భారతంలోని భాషోన్మాద రాష్ట్రాలను రద్దు చేసి ‘‘యూనిటరీ’’ సిస్టం ఏర్పాటు చేయాలి. భారతజాతి సమగ్రతకు ఇంతకన్నా మార్గం లేదు.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్