మెయన్ ఫీచర్

సంశయాలు.. ధర్మ సందేహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సుప్రీంకోర్టు వివాదం రెండు రోజుల్లో ముగిసిపోతుందని భావించిన వారి సముచిత భావనకు తాజాపరిణామాలు ముకుతాడు వేశాయి. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికి, మరో నలుగురు న్యాయమూర్తులకు మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కారమయ్యాయని వెల్లడించిన అటార్ని జనరల్ కె కె వేణుగోపాల్ తన మాట మార్చారు. సమస్య ఇంకా పరిష్కారమైనట్టు లేదని పేర్కొనడం ద్వారా దాని తీవ్రతను తేటతెల్లం చేశారు.
సుప్రీంకోర్టులో పాలనావ్యవహారాలు గాడి తప్పాయని ఆరోపణలు చేసిన నలుగురు సీనియర్ న్యాయమూర్తులకు, కీలక కేసులను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నియమించిన ప్రత్యేక బెంచ్‌లో స్థానం దక్కలేదు. ఈ పరిణామం వివాదాన్ని మరింత తీవ్రతరం చేసేలా ఉందని న్యాయనిపుణులు భావిస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నియమించిన ప్రత్యేక బెంచ్‌లో తనతోపాటు జస్టిస్ ఎ కె సిక్రీ, జస్టిస్ ఎ ఎం ఖఆన్ విల్కర్, జస్టిస్ డి వై చంద్రచూడ్, జస్టిస్ అశోక్‌భూషణ్‌లు ఉంటారని పేర్కొన్నారు. ఈ బెంచ్‌లో ఇటీవల ప్రధాన న్యాయమూర్తి తీరుపై ఎలుగెత్తిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసఫ్‌లకు చోటు దక్కలేదు. రానున్న కాలంలో సుప్రీంకోర్టు విచారించనున్న అత్యంత కీలక కేసులు అన్నింటినీ ఈ ప్రత్యేక బెంచ్ విచారణ జరపనుంది.
దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోసారి సంశయాత్మక స్థితిలో పడిపోయింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థపై లేని విశ్వాసాన్ని న్యాయవ్యవస్థపై సామాన్యులు పెంచుకున్నారు. తమ పక్షాన నిలిచే ఏకైక సంస్థగా సుప్రీంకోర్టు ప్రజల మన్ననలు పొందింది. ఈ దేశానికి ప్రజాస్వామ్యం పనికిరాదని, రాచరిక వ్యవస్థే దీనిని గాడిలో పెడుతుందనే భావనలు వ్యక్తమవుతున్న ప్రతిసారీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మిగిలిన అన్ని వ్యవస్థలనూ గాడిలోపెట్టి సర్వోన్నత వ్యవస్థగా తమ సత్తాను చూపిస్తూనే ఉంది. ఎంతటి పెద్ద కేసుల్లోనైనా వెరవక ధైర్యంగా తీర్పులను వెలువరిస్తూ ప్రపంచంలోనే భారత సుప్రీంకోర్టు తనదైన ముద్ర వేసుకుంది. అలాంటి న్యాయపాలిక నేడు సవాళ్లను ఎదుర్కోవల్సి వచ్చింది. ప్రస్తుతం అంతర్గతంగా ఉన్న అవ్యవస్థ మలిగిపోయి, ప్రధాన న్యాయమూర్తికి ఉన్న అత్యున్నత నిర్ణయాధికార స్థానంలో పారదర్శకత, జవాబుదారీతనం నెలకొనాలనేది మిగిలిన సీనియర్ న్యాయమూర్తుల వాంఛ అనేది నిర్వివాదాంశం. ప్రజలు పెట్టుకున్న నమ్మకం మరింత సడలిపోకముందే చక్కటి సంస్కరణలతో సుప్రీంకోర్టు తన నీతి, నిజాయితీని నిరూపించుకోవల్సిన తరుణం ఆసన్నమైంది.
బ్రిటిష్ పాలన కాలంలోనే ఇండియన్ హైకోర్ట్సు యాక్ట్-1861 అమలులోకి రావడంతో 1862 జూలై 2న కలకత్తా హైకోర్టు ఆవిర్భవించింది. అదే ఏడాది ఆగస్టు 14న ముంబై హైకోర్టు, 1862 ఆగస్టు 15న మద్రాస్ హైకోర్టు ఆవిర్భవించాయి. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అమలులోకి వచ్చిన తర్వాత మిగిలిన హైకోర్టులకు భారతీయ స్వరూపం వచ్చింది. కలకత్తా, బొంబాయి, మద్రాస్ హైకోర్టుల్లో కాలానుగుణంగా అమలులోకి వచ్చిన ఆచారాలు, సంప్రదాయాల నేపథ్యంతోనే సుప్రీంకోర్టు ఆవిర్భవించింది. సుప్రీంకోర్టు ఏర్పాటు, న్యాయమూర్తుల వేతనాలు, నియామకాలు ఇలా అన్ని విషయాలను స్పష్టంగా, ఎటువంటి సందేహాలకు అవకాశం ఇవ్వకుండా నియమనిబంధనలు, అధికారాలను రాజ్యాంగం చాలా స్పష్టంగా నిర్వచించింది. దీని ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విశేష అధికారాలు దక్కాయి. ప్రధానంగా రోస్టర్ నిర్ణయించే అధికారం, లావాదేవీలు జరిపేందుకు కోర్టుల సంఖ్య, కోర్టులను నడిపేందుకు అవసరమైన విధివిధానాలు రూపకల్పన, ధర్మాసనాలు ఏర్పాటు, వ్యాజ్యాలను సభ్యులకు కేటాయించడం కూడా ప్రధాన న్యాయమూర్తి విధిగానే కొనసాగుతోంది. ప్రధాన న్యాయమూర్తికి ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని అంశాలకు సంబంధించి లిఖితపూర్వక అదనపుఅధికారాలు లేవని, కోర్టులావాదేవీలు సక్రమంగా అమలు జరిగేందుకు ఉద్దేశించిన సంప్రదాయాలు మాత్రమేనని, మిగిలిన న్యాయమూర్తుల కంటే ప్రధాన న్యాయమూర్తిని అధికుడిగా గుర్తించడానికి లేదనేది తాజాగా నలుగురు న్యాయమూర్తుల వాదన. ప్రధాన న్యాయమూర్తి సమస్థాయిలో ఉన్నవారిలో ప్రధముడిగా ఉంటారే తప్ప అధికుడు మాత్రం కాదనేది వారి ఉవాచ. బహుళ సభ్యులున్న చట్టబద్ధ వ్యవస్థలో ఒక ప్రత్యేక వ్యాజ్యం కోసం ఏర్పాటైన ధర్మాసనం మీద తమకు తాము ఆధిపత్యం తెచ్చుకోకూడదని, ధర్మాసనం కూర్పులోగాని, సంఖ్య నిర్ధారణ విషయంలో రోస్టర్ ప్రకారం జరిగిన నిర్ణయంపై ప్రధాన న్యాయమూర్తికి ఎలాంటి ఆధిపత్యం ఉండదని మిగిలిన న్యాయమూర్తుల అభిప్రాయం. చాలామార్లు ఉల్లంఘనలు జరిగినా, వ్యవస్థను ఇబ్బందికి గురిచేయరాదని తాము పూర్తివివరాలను బహిరంగంగా ఇవ్వడం లేదని న్యాయమూర్తులు తమను తాము సర్దిచెప్పుకున్నారు.
ఎన్‌జేఏసీ కేసుగా ప్రాచుర్యం పొందిన సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్ట్సు అసోసియేషన్ అండ్ ఏఎన్‌ఆర్ వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టులోని ఐదుగురు జడ్జీల ధర్మాసనం జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ను కొట్టివేసింది. న్యాయమూర్తుల నియామకాలు కొలీజియం పద్ధతిలో జరగాలని చెప్పింది. ఈవిధానంలో సుప్రీంకోర్టులోని ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులు కొలీజియంగా ఏర్పడి ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలు చేపడతారని ఆ సందర్భంగా పేర్కొంది. కేంద్రప్రభుత్వంతో, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో కొలీజియం సంప్రదింపులు మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ -ఎంఓపి రూపొందించే ప్రక్రియ తుది తీర్పు తర్వాత సవరించాల్సి వచ్చింది. దీంతో కేంద్రప్రభుత్వానికి - సుప్రీంకోర్టుకు అగాధం ఏర్పడిందనే చెప్పాలి. ఎంఓపీ సాకుగా చేసుకుని న్యాయమూర్తుల నియామకాలను కేంద్రప్రభుత్వం ఎంతకూ ఖరారు చేయడం లేదని మాజీ ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ కన్నీరు పెట్టుకున్నారు. గత ఏడాది మార్చిలో జస్టిస్ జెఎస్ కేల్కర్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఎంఓపీని ఖరారు చేశారు. 2017 మే నెలలో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఎస్ కర్ణన్‌కు కోర్టు ధిక్కార ఆరోపణల మీద ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం శిక్ష విధించింది. ఈ ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ చలమేశ్వర్ విడిగా రాసిన తీర్పులో ఉన్నత న్యాయమూర్తుల నియామకం, న్యాయమూర్తులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే విధానాలను సమీక్షించాలని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆర్ పీ లూథ్రా వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకు ప్రాధాన్యం ఏర్పడింది. సవరించిన ఎంఓపీ పాటించకుండా ఉన్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తుల నియామకాలు ఎలా చేపడతారని న్యాయవాది ఆర్ పీ లూథ్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ గత ఏడాది అక్టోబర్ 27న ఆదర్శకుమార్ గోయల్, ఉదయ్ లలిత్‌లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ విచారించి కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అంతేగాక, తప్పు చేసిన న్యాయమూర్తులపై చర్యలు తీసుకునే విషయంలో విధి విధానాలను ఖరారు చేయాలని కూడా సూచించింది. అంతేగాక అప్పట్లో అమలులో ఉన్న ఎంఓపీ ప్రకారం న్యాయమూర్తుల నియామకాలు జరగాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత నవంబర్ 14న ఈ కేసు చేపడతామని ధర్మాసనం పేర్కొన్నా, నవంబర్ 8న ఈ కేసు విచారణను మరో ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌కు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ఈ నూతన బెంచ్ అంతకుముందు ఇద్దరు న్యాయమూర్తులు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. ఈ అంశాన్ని కూడా జస్టిస్ చలమేశ్వర్ ప్రస్తావించారు. ఇదే రీతిన గత కొన్ని నెలలుగా సుప్రీంలో వ్యవహారాలు తప్పటడుగులు పడుతున్నాయని సీనియర్ న్యాయమూర్తులు సామాజిక మాధ్యమాల ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన న్యాయమూర్తితో పరిస్థితులను గాడిలోపెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేసిన తర్వాతనే వారంతా బహిరంగ ప్రకటనకు దిగారనేది విస్మరించలేం. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సమావేశంలో జరిగే చర్చలు ఏవీ నమోదు కాకపోవడంపై 2016 సెప్టెంబర్‌లోనే జస్టిస్ చలమేశ్వర్ ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. అభిప్రాయాలు నమోదు కానపుడు కొలీజియంకు హాజరుకావడంలో అర్ధం లేదన్నది ఆయన వాదన. అలాగే చాలా కీలక కేసులను జూనియర్లకు అప్పగించడం కూడా రోస్టర్‌ను ఉల్లంఘించడమేనని న్యాయమూర్తుల ఆవేదన. 1993లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామస్వామిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయనపై లోక్‌సభలో అభిశంసన తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. కానీ మూడింట రెండొంతుల మెజార్టీ రాకపోవడంతో ఆ తీర్మానం వీగిపోయింది. 2011లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమిత్ర సేన్ ఆర్ధిక అవకతవకలకు పాల్పడినట్టు రాజ్యసభ గుర్తించింది. ఆయనను తొలగించేందుకు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని కూడా ఆమోదించింది. అయితే ఆ తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి ముందే రాజీనామా చేశారు. కొలీజియంతోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలపై పరువునష్టం వ్యాఖ్యలు చేసినందుకు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్‌కు 2016లో ఆరు నెలల జైలు శిక్ష విధించారు. 2015లో వ్యక్తిగత ఆస్తులను వెల్లడించడానికి హైకోర్టుల్లోనూ, సుప్రీంకోర్టులోనూ న్యాయమూర్తులు జంకుతున్నపుడు కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శైలేంద్రకుమార్ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాలకృష్ణన్‌ను విమర్శించారు. 2012లో కర్నాటక హైకోర్టు సిట్టింగ్ జడ్జి జ్ఞాన సుధా మిశ్రా ప్రకటించిన ఆస్తుల్లో తన పెళ్లికాని కుమార్తెలకు అప్పుగా చూపించడం పెద్ద వివాదమే రేపింది. 2012లోనే కర్నాటక హైకోర్టులో విడాకుల కోసం ఓ మహిళ దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన జస్టిస్ భక్తవత్సల గృహహింస ప్రతి ఇంటిలోనూ ఉంటుందని పేర్కొనడంతో అదో పెద్దవివాదంగా మారింది. గత ఏడాది ఒక కేసులో సుప్రీంకోర్టుపై వ్యాఖ్యలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూను ఆదేశించింది. 2015లో హార్దిక్ పటేల్ అరెస్టు కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దీవాలా రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు వ్యతిరేకంగా 58 మంది రాజ్యసభ ఎంపిలు అభిశంసన నోటీసు ఇచ్చారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం, న్యాయమూర్తి జస్టిస్ ఎ కె గంగూలిలు తమ వద్ద శిక్షణ పొందుతున్న న్యాయవిద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. మరికొంచెం వెనక్కు వెళ్తే రాజీవ్ గాంధీ హత్య కేసు(1998) జస్టిస్ కె టి థామస్ కోర్టుకు బదలాయించారు. బోఫోర్సు కేసు (1999) జస్టిస్ ఎం బి షా కోర్టుకు మళ్లించారు. బెస్ట్ బేకరీ కేసు (2004), ఎంపిలు, ఎమ్మెల్యేల అనర్హత కేసు (2005) , షొహ్రాబుద్దీన్ కేసు (2007), రాంజత్మలానీ ఆస్తుల కేసు (2009), స్పెక్ట్రమ్ కేసు (2010), బాబ్రీ కేసులో ఎల్ కె అద్వానీపై ఆరోపణలను కొట్టివేసిన కేసు (2011), ఆధార్ కేసు (2012), బొగ్గు కుంభకోణం కేసు (2012), ఐటి చట్టం 66ఎ చెల్లుబాటు కేసు (2012), బిసిసిఐ కేసు (2013) దారి తప్పాయనేది అందరి వాదన. ఇలా తవ్వుకుంటూ పోతే న్యాయమూర్తులు సహజ న్యాయసూత్రాలకు అతీతం కాదనేది ఎన్నడో తేటతెల్లమైంది. సుప్రీంకోర్టు అస్థిత్వాన్ని కాపాడుకోలేకపోతే దేశంలో ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు తప్పదు.

-బి.వి.ప్రసాద్