మెయన్ ఫీచర్

వేచి చూసే వైఖరి ఎన్నాళ్లు బాబూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అధికార, విపక్ష పార్టీలు కేంద్రం తమకు అన్యాయం చేసిందని విమర్శలు చేస్తాయి. అసెంబ్లీల్లోనూ బడ్జెట్ హడావుడి ముగిశాక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధికార, విపక్ష శిబిరాల్లో అసలు రాజకీయం రాజుకుంటుంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో పొత్తుల ఎత్తులకు రంగం సిద్ధమవుతుంది. పొత్తులపై ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో దుష్ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. రాజకీయ నాయకులు లోతుపాతుల్లోకి వెళ్లకుండా వెంటనే స్పందిస్తారు. రాజనీతిజ్ఞులు మాత్రం దార్శనికతతో వ్యవహరిస్తారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కచ్చితంగా నిధుల కేటాయింపు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఆంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించలేదనడంలో ఎటువంటి సందేహం లేదు. మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు పాక్షిక వైఖరిని అవలంభిస్తున్నాయి. దీనికి ఏపీ ప్రజాప్రతినిధుల వైఖరి కూడా ఓ కారణమే.
కన్నడిగులు, తమిళులు, మహారాష్ట్రీయులు, బెంగాలీల మాదిరిగా వీరికి సమష్టితత్వం లేకపోవడం, రాష్ట్ర ప్రయోజనాలకు ఏకత్రాటిపైకి రాకపోవడం మరో కారణం. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు పరస్పరం కీచులాడుకోవడం కొత్తేమీ కాదు. ఇదే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు వరం. ఏపీకి అన్యాయం చేశారంటూ తాజా ఎపిసోడ్‌లో బిజెపిని నిందించి ప్రయోజనం లేదు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు మధ్య పెద్ద తేడా ఏమీ లేదు.
1956 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను గంపగుత్తగా తమకు 42 సీట్లు ఇస్తే ఓట్ల ఖజానాగా చూసింది. చివరకు రాష్ట్ర విభజనలో కూడా ఆంధ్రాకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసి ప్రజాగ్రహానికి గురైంది. 1953 నుంచి 1956 వరకు ఆంధ్ర రాష్ట్రంగా, 1956 నుంచి 2014 వరకు తెలంగాణతో కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర ప్రాంతానికి విశాఖ స్టీలు ఫ్యాక్టరీ మినహా ఒరిగిందేమీ లేదు. ఇది కూడా ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అనే ఉద్యమం తీవ్రస్ధాయిలో జరగడం, అనేక మంది అమరులు కావడం వల్ల వచ్చింది. 1956 నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధిని విశే్లషిస్తే ప్రత్యేకంగా ఆంధ్ర ప్రాంతానికి కాంగ్రెస్, టిడిపి చేసిన ప్రయోజనాలు ఏమీ లేవు. కాలక్రమంలో అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందింది. అప్పట్లో కాంగ్రెస్,టిడిపిలు అభివృద్ధిని అంతా హైదరాబాద్ పరిసరాలకు పరిమితం చేశాయి.
ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో కూడా ఆంధ్రాకు అన్యాయం జరిగిందని, బిజెపితో తెగతెంపులు చేసుకుందామని కొంత మంది టిడిపి ఎంపీలు వీరావేశానికి గురై మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోదామంటున్నారు. కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు వచ్చేయడానికి సిద్ధమంటున్నారు. ఒక టిడిపి నేత అయితే యుద్ధతంత్రం గురించి మాట్లాడి టీవీ చానళ్లలో ఫోకస్ అయ్యారు. నిజంగా రాష్ట్రప్రయోజనాలంటే అంత పట్టుదల ఉంటే బడ్జెట్ ప్రసంగం చివరిదశకు చేరుకునే సమయంలోనే పార్లమెంటులో హడావుడి చేయవచ్చు. ఎప్పటిలాగానే బడ్జెట్ ప్రసంగం తర్వాత బయటకు వచ్చి ఎంపీలు మాట్లాడారు. పార్లమెంటులో డిమాండ్ల సాధనకు హల్‌చల్ చేసే సాహసం ఆంధ్ర ఎంపీలకు లేదు. బిజెపి తీరు పట్ల చంద్రబాబు మాత్రం తన అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దేశ రాజకీయాలు, ప్రజల నాడిని ఔపోసన పట్టిన ఇద్దరు ముగ్గురు నేతల్లో చంద్రబాబు ఒకరని చెప్పవచ్చు.
కర్నాటక ఎన్నికలు వచ్చే రెండు నెలల్లో జరగనున్నాయి. ఆ తర్వాత ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు వస్తాయి. ఈ రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి తీరును బట్టి చంద్రబాబు ఒక నిర్ణయానికి రావచ్చు, రాకపోవచ్చు. ఈ రాష్ట్రాల్లో బిజెపికి భంగపాటు కలిగితే, కాంగ్రెస్ పునరుజ్జీవమవుతుంది. దీని వల్ల ఆంధ్రాలో కాంగ్రెస్ లేచి కూర్చోదు. కానీ, కోమాలో ఉన్న వ్యక్తిలో కదలికలు వచ్చినట్లు ఆ పార్టీలో కాస్త చలనం వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ వల్ల తమకు జరిగిన అన్యాయాన్ని సులభంగా మర్చిపోయే ప్రమాదం ఉంటుందని, ఈ లెక్కలు చంద్రబాబుకు బాగా తెలుసు.
బిజెపికి ఆంధ్రాలో బలం అంతంత మాత్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఈ పరిస్థితులు ఎదురై ఉంటే, ఈ పాటికి చంద్రబాబు బిజెపికి బై బై చెప్పి ఉండేవారు. కాని ఆంధ్రాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల బిజెపిని దూరం చేసుకునేందుకు చంద్రబాబు ఆసక్తికనపరచరు. బిజెపి సొంతంగా ఎదిగేందుకు తగిన వాతావరణం కూడా ఏపిలో లేదు. కాంగ్రెస్ వ్యతిరేక పునాదిపై పురుడు పోసుకున్న టిడిపి- బిజెపిపై కోపంతో దేశంలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవాలని కలలో కూడా కోరుకోదు. బిజెపి సొంతబలంతో కాకుండా మిత్రపక్షాలపై ఆధారపడి కేంద్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైకాపాను ఎదుర్కొనేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్న తరుణంలో బిజెపితో తెగతెంపులు చేసుకోవడమంటే, తనను తాను బలహీనపరుచుకోవడమే అవుతుందా? బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైకాపా వెనక చేరుతున్న సామాజిక వర్గాలు, టిడిపిని వ్యతిరేకించే శక్తులు, ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని నిలబడాలంటే, అన్ని నియోజకవర్గాల్లోనూ ఉన్న బిజెపి అనుకూల శక్తుల మద్దతు తనకు అవసరమా? అనే అంశంపై చంద్రబాబుకు కచ్చితంగా లెక్క ఉంటుంది. ఈ లెక్కలే చంద్రబాబును 2014 ఎన్నికల్లో గెలిపించాయి. తనకు తాను బిజెపికి రాం రాం చెప్పకుండా, బిజెపినే టిడిపితో జతకట్టమనే ప్రకటన చేసే వరకు చంద్రబాబు ఎదురుచూస్తారు. కొంత మంది బిజెపి నేతలు విమర్శించినా వేచిచూసే ధోరణి అవలంబించాలని, బహిరంగ విమర్శలు వద్దని చంద్రబాబు చెప్పడం వెనక మర్మం ఇదే. సంకీర్ణ ధర్మాలు, పొత్తుల లెక్కలు చంద్రబాబుకు తెలుసు. రాజస్తాన్ దెబ్బతో వాస్తవంలోకి వచ్చిన బిజెపి దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణపై దృష్టిని సారించింది. ఇక్కడ సొంతంగా పోటీ చేసి సీట్లు వస్తాయని కాదు. ఇక్కడ ఉన్న బలమైన ప్రాంతీయ పార్టీలతో సఖ్యతగా ఉండాలని భావిస్తోంది. విశాఖ రైల్వే జోన్, పోలవరం, అమరావతి రాజధానికి తగినన్ని నిధుల విషయంలో బిజెపి తాను చేసిన తప్పును ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా సరిదిద్దుకునే అవకాశాలు కనపడుతున్నాయి. బిజెపి బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా కొంతలో కొంత ఆంధ్రాకు న్యాయం చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంటే ఉంటుందని చంద్రబాబు విశ్వాసం అయి ఉండవచ్చు. తొందరపడి ఇప్పటికిప్పుడు బిజెపికి కటీఫ్ అంటే, వెంటనే బిజెపి పార్లమెంటులో ఏపీకి వరాలు ఇస్తే- ఫలితంగా బిజెపికి వైకాపా దగ్గరయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ పరిస్థితిని నివారించేందుకు చంద్రబాబు వేచి చూసే ధోరణిని చివరి దాకా అవలంభింవచ్చు. వచ్చే ఎన్నికల ముందుగాని చంద్రబాబు బిజెపితో కలిసి పోటీ చేయడం లేదా తెగతెంపులు చేసుకుని ఒంటరిపోటీకి వెళ్లాలనే విషయమై ఒక నిర్ణయానికి రాకపోవచ్చు.
పొత్తుల అవసరం లేని తెరాస
ఆంధ్రాలో టిడిపికి బలమైన శత్రువు వైకాపా అయితే, తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ గట్టి ప్రత్యర్ధి పార్టీ. ఎన్డీఏ కూటమిలో లేకపోయినా బిజెపి దిగ్గజాలతో మంచి సంబంధాలను కెసిఆర్ కలిగి ఉన్నారు. తెలంగాణలో ఉన్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో టిఆర్‌ఎస్ ఎటువంటి పరిస్థితుల్లో బిజెపితో పొత్తు పెట్టుకోదు. ఆ అవసరం కూడా టిఆర్‌ఎస్‌కు లేదు. కాని ఎన్నికల తర్వాత తలెత్తే పరిణామాలను బట్టి అవసరమైతే బిజెపికి కేంద్రంలో అంశాల వారీగా షరతుల ప్రాతిపదికను టిఆర్‌ఎస్ మద్దతు ఇచ్చే అవకాశాలను తోసిపుచ్చలేం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ రాష్ట్రంలో, కేంద్రంలో బలపడకుండా చూసినంత కాలమే తెలంగాణలో టిఆర్‌ఎస్ బలంగా ఉంటుంది. ఈ వాస్తవం రాజకీయ చతురుడు కెసిఆర్‌కు బాగా తెలుసు. ప్రస్తుతానికి పొత్తుల వల్ల టిఆర్‌ఎస్ తెలంగాణలో బలహీనపడే అవకాశం ఉంది. పైగా టిఆర్‌ఎస్ పొత్తు పెట్టుకునేందుకు తగిన పార్టీ లేదు. ఎంఐఎం పార్టీ ఒంటరిగానే పోటీ చేసి తనకుబలం ఉన్న చోట్ల ఎటూ గెలుస్తుంది. ఎంఐఎంతో కాంగ్రెస్ మొదటి నుంచి అవలంభించిన వైఖరినే ప్రస్తుతం టిఆర్‌ఎస్ అమలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలపడకుండా చూసేందుకు బిజెపితో అంటకాగాల్సిన అవసరం టిఆర్‌ఎస్‌కు లేదు. ఎందుకంటే తెలంగాణలో మైనార్టీలు కొన్ని నియోజకవర్గాల్లో పదిశాతం, మరి కొన్ని చోట్ల 25 శాతం వరకు ఉన్నారు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో టిఆర్‌ఎస్‌కు పొత్తుల గొడవ తలెత్తదు. తెలంగాణలో ఇప్పటికే బహుజన వామపక్ష ఫ్రంట్ ఆవిర్భవించింది. సామాజిక న్యాయం లక్ష్యంగా అవతరించిన ఈ తరహా పార్టీలను తెలంగాణలో ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఎప్పుడూ ఆహ్వానిస్తారు. ఈ తరహా పార్టీలు ఎన్నికల క్షేత్రంలో నిలదొక్కుకుంటాయా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. టీజాక్ అధినేత కోదండరామ్ కూడా కొత్త పార్టీ ఏర్పాటుకు సమాయత్తమవుతున్నారు. ఈ పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి ఒక వేదికపైకి వస్తాయా? లేదా? అనేది కాలం నిర్ణయిస్తుంది. కోల్పోయిన వస్తువును ఎక్కడ పొగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న ధోరణిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు జవాబు రానున్న ఎన్నికల్లో తెలుస్తుంది.

- కె.విజయ శైలేంద్ర సెల్: 98499 98097