మెయిన్ ఫీచర్

కథాకణ్వుడు మునిపల్లె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1925 - 2018

అక్షరాంజలి
*
కథలను బిడ్డల వలె పెంచిన కణ్వాశ్రమం ఆయనది. కథలకు రాయబార బాధ్యతలు ఇచ్చి, దుష్ట దుష్యంతుల లోకంలోకి సువార్త ప్రచారకులుగా వాటిని పంపించిన ‘‘మునిపల్లె రాజ్యాధికారం’’ వారిది. వీరి కథలన్నీ ఆశాదూతలు. వీరికి తన పెద్దల యెడ గౌరవం సమకాలికులపైన అపార ప్రేమ, ముందు తరాల వారిపై జననీ జనక ఆప్యాయత, ఇవన్నీ తన కథల రాజ్య వైభవంలో మనకు మిగిల్చి వెళ్లారు మునిపల్లె రాజు. నిండు తొంభై మూడేళ్ల జీవితం. అందులో 1942 డిసెంబర్‌లో, ‘‘కథాంజలి’’ పత్రికలో ప్రచురితమైన తొలి కథ ‘‘దరిద్రుడు’తో ఈ 2018 వరకూ కథకుడిగా డెబ్బై అయిదు వీళ్ల జీవితం. తెనాలి సీమ అంటే అమిత ఇష్టం ఆయనకి. రాజుగారి మాటల్లో సంస్కార గంగ, వర్తనలో ఒక సంపన్న భారతీయ చైతన్య ప్రవాహం.
సైన్యంలో ఉద్యోగం వలన, భారతదేశ భిన్న భాషలు, జీవన స్థితిగతులు, సైన్య స్వభావం, చిన్ననాడే ఎరిగిన విశాల భారతదేశ దృఢమైన ఆనవాళ్లు మునిపల్లె రాజు కథల్లో ఉంటాయి. 1934 జూన్‌లో శ్రీశ్రీ రాసిన ‘ఆశాదూతలు’లో ఒక కవిత - ‘‘మానవ కోటి సామ్రాజ్య దూతలు, కళాయజ్ఞాశ్వముల్ గాలులై, తరగలై, తావులై, పుప్పొళ్ళు, కుంకుమలు, పొగలై సాగిరి’’ అని ముగుస్తుంది. మానవజాతి రాయబారులు/దూతల ‘‘కళా యజ్ఞాశ్వములే’’ అని శ్రీశ్రీ తెలిపినట్టే, రాజుగారి కథల్లో కూడా మానవ జీవన చిత్రణ గాలులై, తరగలై, తావులై, పుప్పొళ్ళు, కుంకుమలు, పొగలై సాగిన కోలాహలం కనిపిస్తుంది. ఆయనది సనాతన చింతనతో కూడిన ఆధునిక సంవేదన. కథానిక అనే పాశ్చాత్య ప్రక్రియ, అంతకు వేల ఏళ్ల ముందరే సంస్కృతంలో, తెలుగులో, భిన్న భాషలలో చెప్పబడిన కథన మర్యాదలను ఆకళింపు చేసుకున్న ఒక నిండుదనం, మునిపల్లె కథల్లో ప్రస్ఫుటంగా ఉంటుంది.
తాతగారు బక్కరాజు పేరు, తన పేరుగా, జమ్మలమడుగు మాధవరామశర్మ తన బాల్య స్నేహితునిగా, తెనాలి కథకుడు శారద (ఎస్.నటరాజన్) రచనల పట్ల శ్రద్ధా పూర్వక నిష్టతో, అభ్యుదయ ఉద్యమాలను ఎరిగిన కాలానికి, రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో కన్ను తెరవడమేకాదు, తన తొలికథ ‘‘దరిద్రుడు’’ కూడా అప్పుడే 1942లో తన పదిహేడేళ్లకే రాసిన సీనియర్ కథకులు మునిపల్లె రాజు. భారతి వంటి పత్రికల్లో తొలినాళ్ల కథలు అచ్చు అయినా, అరవై, డెబ్భై దశకాల్లో కొంత తక్కువ రాయడం వల్ల, ఎనభయ్యో దశకంలో కథల లోకం బలంగా మునిపల్లె రాజు పేరు తలుస్తూ ఉంటే, కొత్త తరం కథకులు, సాహిత్యానురక్తులు వెరగు చెందారు. కానీ ఒకసారి వారి కథలతో పరిచయం అయ్యాక, ఈయన ప్రాతినిథ్యం వహించే భారతీయ కథ, రక్తమాంస పరిపుష్టమని తెలుసుకుని, ఆసక్తి సహజంగానే పెంచుకోవడం జరిగింది.
సైనిక జీవితాలు, దేశ స్వాతంత్య్రోద్యమం, రాయలసీమ కరవు కడగండ్ల చిత్రణ, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో మహిళల జీవన సమస్యలు, ఇలా రాజుగారి కథల్లో ఒక స్వప్నం, ఒక సత్యం, ఒక ఆందోళన, ఒక ఆకాంక్ష కలిసి ప్రవహిస్తూ ఉంటాయి. తన కాలానికి విస్తృతంగా వస్తున్న ప్రపంచ సాహిత్యం కూడా రాజుగారు యువకుడిగా బాగా చదివిన దాఖలాలు, వీరి కథా సంపుటికి ‘‘పుష్పాలు - ప్రేమికులు - పశువులు’’ అని పేరు పెట్టడంలో కనిపిస్తుంది. ఇదే ప్రశ్న వారిని ఒకసారి నేను, జగద్ధాత్రిగారు అడగగా, వారు, ఈ పరిశీలన సరైనదే అంటూ ఆ పేరు తాను ఎలా పెట్టానో చెప్పారు. ఆ రోజుల్లో వచ్చే ‘‘ద క్రైటీరియస్’’ పత్రికలో ప్రముఖ కథా నవలా రచయిత డి.హెచ్.లారెన్స్ కవితలు కూడా రాశారని చదివి, ఆ పేరులోని కొత్తదనం తన మనసులో ఉన్నదని తెలిపారు. 1923లో వెలువడిన ఈ కవిత్వ సంపుటి పేరు ‘‘బర్డ్స్, బీస్ట్స్ అండ్ ఫ్లవర్స్’’ అని లారెన్స్ పెట్టడం తనను ఆకర్షించిందంటూ, తాను ఆ పేరులో కొంత మార్పుతో ఒక కథ ‘‘పుష్పాలు - ప్రేమికులు - పశువులు’’ రాయడమే కాకుండా, తన కథల సంపుటికి కూడా అదే పేరు పెట్టాను అని చెప్పారు. ఇలా చురుగ్గా తన కథలను పట్టించుకుని ప్రశ్నలు అడిగినందుకు మెచ్చుకున్నారు కూడా.
జాతీయ స్థాయి కథ రాయగల తక్కువమంది తెలుగు కథకుల్లో మునిపల్లె రాజు ఒకరు. సైనికోద్యోగి దృష్టి నుంచి, తాను కథ చెప్తున్న రీతిన సాగే ‘‘బిచ్చగాళ్ల జెండా’’ - ఒక కరవు కాలానికి చెందిన చిత్రణ, కథా స్థలం పూనా. అక్కడకు చేరే కరవు బాధిత ప్రజల, బిచ్చగాళ్ల సాధికారమైన కథానిక ఇది. కరవు కాలపు భారతదేశం ఎలా ఉంటుందో, వారి దినదిన జీవన సంఘర్షణ క్లుప్తంగా, గుండెకోత కోసే రీతిలో చెప్పిన రచనలో అణచివేతదారుల తరఫున ఉండే భద్రతా దళాల వారి జులం తాళలేక, తిండి గింజలకు, తమకు మధ్య అడ్డుగోడగా ఉన్నా ఒక భద్రతా సిబ్బందిని ఉతికి ఆవలకు నెట్టి, వాడి గాయాల నెత్తుటితో తడిచిన గుడ్డను కర్రకు జెండా చుట్టి, బిచ్చగాళ్లు ఒక జెండా ఎగురేస్తారు. ఆ జెండా పట్టుకుని, తమకు కావలసిన బియ్యం నల్లబజారులో నిలవ ఉంచిన గుజరాతీ సేఠ్ భోగాలాల్ గిడ్డంగి నుంచి తమ వశం చేసుకుంటారు. ఈ కథలో ప్రేమ్‌చంద్ చూపే వాస్తవికత, మాంటో కథల్లో దాగిన పదునూ కలబోతగా ఉంటాయి. ఇలా నడుస్తుంది చిత్రణ ‘హైదరాబాద్ స్టేట్ భారత విలీన కాలపు రచన’ అయిన ఈ కథలో.
‘‘వెలిసిపోయి, మురికి బారిన రంగు రంగుల పాత తుంపుల గుడ్డలతో మా ఇంటి ముందు బిచ్చగాళ్ల డేరాల శిబిరం వెలిసింది. వికలాంగులు, వృద్ధులు, రజాకార్ నరకాన్నుంచి తప్పించుకు వచ్చిన శరణార్థులు, క్షామపీడితులు, ఈ డేరా కాంపులోని పౌరులు. దక్షిణాది భాషలన్నీ అన్ని బాధలనూ, అన్ని ఆశలను, అన్ని నిరాశలనూ భరించి నిశ్శబ్దతనిచ్చే కాళరాత్రుల్లో ఈ నగరంలో, ఈ తమస్సులో కలగాపులగంగా సజీవంగా వినపడుతుంటే. సృష్టి, ప్రకృతీ, లోకమూ, మానవులూ, తిరిగి ప్రాణం పొందే ఉషాకాంతుల్లోనే ఈ అనాథ నగరం నిర్జీవమై పోతుంది. ఈ దృశ్యాలకు నేను బాగా అలవాటు పడిపోయాను. యుద్ధంలో ప్రతి క్షణమూ, ప్రతి వస్తువులో, ప్రాణిలో, జీవిలో ఆత్మలో, మృత్యువూ, అపనమ్మకమూ దర్శించిన నాకు, ఈ బిచ్చగాళ్ల సన్నిధి ఏమంత కష్టమనిపిస్తుంది?’’
‘‘వీరకుంకుమ’’ కథలో, తమ యజమానికి జరిగిన అన్యాయానికి, పాడి పశువు తెగబడి, గాయపడ్డ యజమాని దేహాన్ని తిరిగి ఇంటికి చేరుస్తుంది. పశువులో కనిపించే ఈ నైసర్గిక జ్ఞానం కథే, మరింత విస్తృతించి పశువు పగ తీర్చుకునే కథగా తరువాతి తెలుగు రచయితలు రాశారు కూడా. కరవు కుటుంబాలను అల్లకల్లోలం చేసినప్పుడు, తన శరీరంతో ధనం సంపాయించి భర్త, బిడ్డల ఆకలి తీర్చే ఒక కుటుంబిని గురించి రాజుగారి చిత్రణ, హృదయ విదారకమే కాక, ఆ భర్త చూపే కృతజ్ఞత కూడా, కథను వింధ్య పర్వత శ్రేణి దాటించి, మంచుకొడల ఎత్తుకు తీసుకువెళ్తుంది.
‘‘జర్నలిజంలో సృజన రాగాలు’’ వంటి పుస్తకం, బహుశా, తన జ్ఞాపకాల ధారగా, ఇటీవల దశాబ్దాల్లో ఇలా వెలువరించిన తెలుగు రచయిత లేరు. విశాఖ కవయిత్రి, రాజుగారికి ఇష్టురాలు కీ.శే. ఆదూరి సత్యవతీదేవితో మొదలుపెట్టి, తనకు ప్రాణప్రదమైన వారిని, నచ్చిన రచనల ధోరణులను స్మృతిపథం నుంచి, సృజనరాగంగా మలిచి, మునిపల్లె రాజుగారి వలె రాసిన వారు లేరనే చెప్పవచ్చు. ఎందరి గూర్చో జ్ఞాపకాలు, తనకు నచ్చిన విశేషాలూ నమోదు చేసిన ఈ రచన గురించి చెప్తూ, ‘‘మీ గురించి రాశాను రామతీర్థ గారూ’’ అంటూ చెప్పిన సమ్మోహన శైశవ శిఖరం రాజుగారు. జగద్ధాత్రి కవిత్వ సంపుటి ‘‘సహచరణం’’కు తన ముందు మాటలో, మొదటి వాక్యంగా రాజుగారు ఎంతో ప్రేమాభిమానాలతో కవిత్వ పరీక్ష చేసి చెప్పారిలా- ‘‘సహచరణం, జగద్ధాత్రి వేద యుగం నాటి గంభీర శబ్ద ద్వయం వినిపిస్తున్నది ఈ కవితా సంపుటిని స్పర్శించినంతనే’’
వారి విచికిత్సలో భారతీయ గవేషణ ఒక స్పష్ట మూర్తిమత్వంతో నిలబడి ఉంటుంది. ‘‘అస్తిత్వ నదం ఆవలి తీరాన’’ అనే కథల్లో మేజికల్ రియలిజం ఉందని రాజుగారు అన్నారు. అది భారతీయ చింతనలో, ఆధునిక కాలంలో, మేళవిస్తే, ఎటువంటి కథలు వస్తాయో, ఆ కథలను కేవలం ఒక భాషీయులో, ప్రాంతీయులో కాక భారతీయత మూర్త్భీవించిన వారే ఎలా రాయగలరో, మంచి ఉదాహరణ, అదే పేరిట ఉన్న కథానిక.
ఈ కథలో, ‘‘నేను ఎవరిని?’’ అనే ప్రశ్న ఎలా భారతీయ జ్ఞాన స్రోతస్వినిలో, మరల మరల లేచే ఒక అల వంటిదో, అది బహుళ సంస్కృతీభరితమైన భిన్న మతాల దర్శనంలోంచి ఆవిష్కరించే మునిపల్లె రాజు, మరొక మహిమాన్విత వచనం రాసిన జ్ఞాని కుర్రతులైస్ హైదర్ రచన ‘‘అగ్నిధార’’ (ఆగ్ కి దరియా)లో కనిపించే విచికిత్సకు ఒక సూక్ష్మ రూపం ఇస్తారు. రాజుగారు ఇవాళ అస్తిత్వ నదాన్ని దాటి ఆవలి తీరాన నిల్చున్నారు. కణ్వస ప్రచురణలు అని వారి పుస్తకాలు ప్రచురించేవారు. కథానికల మెరుగు, మెరుపు, నాణ్యత, బహుళార్థ సాధిక ప్రయోజనశీలత ఎలా వారి కథల్లో భాసిస్తున్నదో విపుల పరిశీలనకు ముందు ముందు సందర్భాలు వస్తాయి. కానీ ఈ కథలో వారి వచనం మళ్లా- ఒక కాస్మాపాలిటన్, విద్యా విజ్ఞాన విస్తృతితో భారత ఉపఖండ ప్రమాణాలతో విలసిల్లుతుంది - ఇలా-
‘‘ఇంకేదో వాక్యం వినిపిస్తున్నది. ఈ అవధూతలు, అద్వైతులు, కమండల ధారులు, కౌపీన మాత్రులు, అర్ధనగ్నులు, విభూతి భస్మీ కాంతులు, ఊర్ధ్వపుండ్ర భూషితులు, భౌతిక విసర్జితులు, నిస్సంగులు, నిరాడంబరులు, ఈ నిరంతర పథకుల మధ్య తనకేమైనా అర్హత ఉన్నదా? వీరినే చారిత్రక పవనాలూ అంటావు కాబోలు, వీరి పరమ గమ్యంలో ఏ మలినమైన గత జీవిత పశ్చాత్తాపాల పంకిల వాయు పవనాలు అడ్డురావు కాబోలు. ఏ సంవేదనల ఊబినీ ఈ జ్ఞాన ధనులు తొక్కరు కాబోలు’’. వేలాది జీవన విశ్వాసాల విశే్వశ్వర అవగాహన స్పష్టపరచుకోవడంలో ఈ అస్తిత్వ నాదం ఏమిటో తెలుసుకుందామని చేసే నిరంతర ప్రయత్నం. ఈ కథలో వేద ఘోష, కబీర్ పంత్, వీరబ్రహ్మంగారి కాలజ్ఞానం, నిరంకారీ ఎరుక, జైన దర్శన ఫలాలు, షిర్డీ బైరాగులు, గురుదత్త శిష్య పరంపర, గోసాయిలు, మృణ్మయమ్ నుంచి చిన్మయమ్ దాకా మానవ అస్తిత్వ నద ప్రయాణ ప్రవాహ ప్రయాస - ఆవలి తీరం కోసం - ఇటువంటి కథలకి మునిపల్లె రాజుగారు పెట్టిన పేరు - ఐంద్రజాలిక వాస్తవికతా ధోరణి కథలని.
కణ్వాశ్రమ శకుంతలలుగా సౌమ్యకథా మూర్తులే కాదు రాజుగారి కథలు, అవి భరతమాతలు కూడా - ఇతిహాస త్రయంలో ఎందరో ఋషులున్నా తనను కణ్వుడితో పోల్చుకున్నారు ఈ మునిపల్లె రాజు. మునిపల్లె అనేమాటను, నన్నయభట్టు తన ఆదిపర్వం, చతుర్థ అశ్వాసం యాభై నాలుగో పద్యంలో వాడారు. మునిపల్లె రాజు కథలు, భరత పుత్రుల వంటివి - మనకి ఏ కాలంలోనైనా అవి బిడ్డల వంటివి- తీరైన కొడుకుల వలె అవి బాధ్యతాభరితాలు. వాటిని ఆలింగనం చేసుకుంటే ఏ ప్రభావం కలుగుతుందో, అది అతి ప్రాచీనం. శకుంతల ముఖతా, దుష్ట దుష్యంతుడితో ఆయన చెప్పించిన ఒక పద్యంలో, కొడుకుని దగ్గరకు తీసుకున్నప్పుడు కలిగే హాయి, చల్లదనాన్ని ఇంకేవీ అంటే ‘‘ముత్యాల హారాలు, పచ్చకర్పూరపు దట్టమైన పొడి ప్రసారం, మంచి గంథమూ, వెనె్నలయూ, జీవులకు పుత్రుని కౌగిలి వలె మనసుకు సుఖాన్నీ, మంచి చల్లదనాన్ని కలిగించలేవు’’. రాజుగారి ఆస్తి, మన సంపద అయిన బిడ్డల వంటి కథలను చేరదీయడం అంటే ఇదే.
ఈ కథాపుత్ర పరిష్వంగం కోసం మనకి తన పక్షిగానాలను వదిలి వెళ్లిన కణ్వ సమానుడు మునిపల్లె రాజు. కొందరు మరణించరు. స్వర్గాలను చేరరు. సదా స్మరణంలో ఉంటారు. (ఇదే మాట సరిగా పలకలేక ఉత్తర భారతంలో ‘‘సిమ్రస్’’ అంటూ ఉంటారు). మునిపల్లె రాజు అలా స్వయంప్రకాశంగా వెలిసే సృజన చింతామణి. వారు ఇక్కడ వెలుగుతూనే, మరెక్కడో కూడా వెలుగులను పంచేందుకు వెళ్లారు. వారి విహంగ యాత్రలో, మానవుడి హృదయమే వారికి ఇష్టమైన గూడు, మునిపల్లెలు, మునివాకిళ్లు, ముగ్ధ మందారాలు, సమ్మోహన శకుంతలలు, దిటవైన భరత పుత్ర పౌత్ర సంతతి, ఒక భరత దేశం, వారి విహార భూమి. ఆవలి తీరాన కూడా అస్తిత్వ యాత్ర విస్తరించి సలిపే రాజరికం ఆయనది. మృగయా వినోదం వలె రాజుగారు ఖగయా వినోదానికి బయలుదేరారు. ఎక్కడికి వెళ్లినా వారందించిన కథల చిటికెన వేలు ఇక్కడే ఉన్నది ఆ వేలు పట్టుకుని మనమూ మన స్థూల సూక్ష్మ యాత్రలు చేసేందుకు, మృణ్మయ యాత్ర ఇంతసేపూ చేశారు మీరు- ఇప్పుడిక చిన్మయయాత్ర- రాజుగారూ! ఆవలి తీరపు సంతులెపుడు చెప్తారు?

- రామతీర్థ, 98492 00385