రాష్ట్రీయం

పెళ్లిళ్లు, చదువులూ కారణమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో టి.సర్కార్ అఫిడవిట్
హైదరాబాద్, నవంబర్ 26: రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు ఉన్న కారణాల్లో ప్రధానమైనవి అధిక ఖర్చుతో ఆర్భాటంగా వివాహాలు చేయడం, పిల్లలకు భారీ ఫీజలు చెల్లించి ప్రైవేటు స్కూళ్లలో చదివించడమేనని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వ్యవసాయ జన చైతన్య సమితి దాఖలు చేసిన పిటీషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. గురువారం ఈ కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. దీనిలో రైతుల ఆత్మహత్యలకు పై రెండు కారణాలు ప్రధానమైనవని, వాటితో పాటు ప్రైవేటు వ్యక్తుల నుంచి రుణాలు తీసుకోవడం, వరుసగా పంటలు పండకపోవడం, విచక్షణారహితంగా బోరుబావులు తవ్వడం, కుటుంబ వివాదాలు, దీర్ఘకాలిక రోగాలు, ప్రైవేటు రుణాలతో గల్ఫ్ దేశాలకు వెళ్లడం ఆ రుణ భారం పెరగడం వంటి కారణాలు రైతులను ఆత్మహత్యల దిశగా నడిపిస్తున్నాయని ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది. పిటీషనర్ పేర్కొన్నట్లు గత ఏడాది నుంచి 1347 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పడం వాస్తవం కాదని, 2014 జూన్ 2 నుంచి 2015 అక్టోబర్ 10 వరకు 782 మంది మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారని, వారిలో కేవలం 342 మంది మాత్రమే రైతులు ఉన్నారని తెలిపింది. ఆర్డీఓ చైర్మన్‌గా డిఎస్పీ, వ్యవసాయ శాఖ ఎడిలను సభ్యులుగా చేసుకుని త్రిసభ్య కమిటీని జిల్లా స్థాయిలో ప్రభుత్వం నియమించిందని ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ కమిటీ ప్రతి రైతు ఆత్మహత్యను నిశితంగా పరిశీలించి తగిన ధృవీకరణ చేస్తుందని తెలిపారు. ఆ ప్రకారం రంగారెడ్డి జిల్లా, వరంగల్ జిల్లాలో జరిగిన రెండు ఆత్మహత్యలపై కమిటీ పరిశీలన చేయగా ఒక కేసులో అధికంగా అప్పులు చేసి వివాహం చేయడం,
మరోకేసులో బ్యాంక్ నుంచి పిల్లల చదువుకోసం రుణం తీసుకోవడం అనంతరం తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్థారణ అయ్యిందని ప్రత్యేక న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ జన చైతన్య సమితి తరఫున వాదించిన న్యాయవాది బాలాజీ వదేరా మాట్లాడుతూ ప్రభుత్వ అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని, లెక్కల్లో అన్నీ తేడాలు ఉన్నాయని అన్నారు. రైతు సంక్షేమానికి అమలు చేయాల్సిన స్వామినాధన్ కమిటీ సిఫార్సులను కూడా సక్రమంగా అమలు చేయడం లేదని కోర్టుకు వివరించారు. తమ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు వారిని ఆధునాతన సేద్యం చేపట్టే పద్దతులపై అవగాహన పెద్ద ఎత్తున కల్పిస్తోందని చెప్పారు. ఇందుకు తగిన సాంకేతిక సహకారాన్ని అందించడంతో పాటు వారిలో చైతన్యం తీసుకు వచ్చేందుకు తగిన చర్యలు వ్యవసాయ శాఖ ద్వారా తీసుకుంటున్నట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఇప్పుడు అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు సరిపోవని భావించి మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. సేద్యం కోసం అయ్యే ఖర్చును తగ్గించే పద్దతులను కూడా రైతులకు వివరిస్తున్నట్లు తెలిపారు. రైతు శ్రీ కార్యక్రమం కింద తక్కువ ధరకు రుణాలు ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు చెల్లించే పరిహారం రూ.లక్ష నుంచి 5 లక్షలు పెంచడంతో పాటు రూ.లక్ష వరకు పంట రుణాన్ని మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. రూ.4039.98 కోట్లను తొలిదశగా 35,39,044 రైతులకు రుణ మాఫీ చేయగా, 2015-16లో రెండో దశగా రూ.4086 కోట్లు పంట రుణ మాఫీకి అందించనున్నట్లు ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో తెలిపింది. జాతీయ నేర రికార్డుల బ్యూరో అందించిన వివరాల ప్రకారం 898 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారిలో కేవలం 295 మంది మాత్రమే వ్యవసాయ సంబంధమైనవని ప్రభుత్వం స్పష్టం చేసింది.