మెయన్ ఫీచర్

తైబజార్.. రైతుల పాలిట శాపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడిగిన జీతంబియ్యని
మిడిమేలుపు దొరను గొలిచి మిడుకుట కంటెన్
వడిగల ఎద్దుల గట్టుక
మడి దున్నుక బ్రతకవచ్చు మహిలో సుమతి!
తిరిగి బద్దెన బతికి వస్తే...ఈ కంద పద్యాన్ని తప్పక తిరగరాస్తాడు. మడిదున్నుక బతుకుటకంటే అదే మట్టిలో కలిసిపోవడం మంచిదని ప్రవచిస్తాడు. ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రుల దాకా అందరూ రైతు బాంధవులే! వ్యవసాయ మంత్రులదైతే ఎడతెగని ప్రేమనే! అయినా రైతులు చస్తూనే ఉంటారు. రుణమాఫీ, సబ్సిడీ పథకాలు, ఫసల్ బీమా, వాతావరణ బీమా రైతుకు ఎలాంటి ధీమా ఇవ్వడంలేదు. గిట్టుబాటు ధరలు బతుకునివ్వని బరోసాలే! కూరగాయల ధరలు కొండెక్కితే గుండెబాదుకునే వినియోగదారుడు తనకెంత చౌకగా లభిస్తాయోననే ధ్యాస తప్ప రైతుకెంత ముడుతుందో తెలుసుకోడు. మార్కెట్లో ధర పెరగని వస్తువుండదు- ఒక్క వ్యవసాయ ఉత్పత్తులు తప్ప!
హర్యానా బాబెన్ గ్రామానికి చెందిన సుఖ్‌పాల్‌సింగ్ బంగాళా దుంపల్ని పండించే రైతు. ఆయన పండించిన దుంపల్ని దగ్గరలోని పిప్లి మండికి తీసుకెళ్లి అమ్మగా కిలోకు వచ్చింది కేవలం పదకొండు పైసలే! ఈసారి ఆ పంటపై వచ్చిననష్టం రు.ఆరులక్షలే! ఇలాంటి కథలు, గాథలు దేశవ్యాప్తంగా కనపడుతున్నాయి. ప్రముఖ నటుడు అమీర్‌ఖాన్ రైతుల ఆత్మహత్య నేపథ్యంలో తీసిన పిప్లిలైవ్ సినిమా అందరికీ తెలిసిందే! దాదాపు వెయ్యి రెట్లు ధర పెరిగిన బంగాళా దుంపల్ని మనం కొనేది రూ.20 అని తెలిసిందే! అయినా రు.19.89 పైసల్ని దోచుకునే దొంగలెవరో మాత్రం మనకు అంతుపట్టదు.
ఆరోగ్యానికి ఆకుకూరలు, కూరగాయలు చాలామంచివనేది తెలిసిందే! కళ్లల్లో వత్తులేసుకుని పండించిన వీటిని కడుపులో దాచుకున్నట్టు బుట్టలో మూటల్లో దాచి, ప్రాణానికి మిన్నగా భావించి, తన ఆరోగ్యాన్నికూడా పట్టించుకోకుండా తెలవారకముందే మార్కెట్‌కు తరలిస్తాడు రైతు. గంపెడంత ఆశతో, మాటల్లో చెప్పలేని బాధతో వాటిని అమ్మకానికి పెడతాడు. మూట విప్పకముందే రాబందుల్లా(రాబందులు క్షమించాలి. ఇవి కనుమరుగైపోయాయి) చిలక పలుకులతో దళారీలు మీద పడతారు. ధర ఇంతేనంటూ బేరం చేయకుండానే తన్నుకుపోతారు. చేష్టలుడిగిన రైతు చేతిలో పెట్టింది తీసుకోవాల్సిందే! లేదంటే తాను ఇస్తానన్న రోజు తీసుకోడనే దిగులు. లేదా తాను అమ్ముదామనుకుంటే మార్కెట్లో ఓ చదరపు అడుగు దొరకడం కష్టం. దొరికిన చోట కూర్చుంటే, ‘నీ అబ్బ జాగీరా..అంటూ అక్కడే తిష్టవేసి అమ్ముకునేవారి దబాయింపు. మరోవైపు కూర్చోకముందే తైబజారు పేరున మార్కెట్ సెస్ టికెట్లు మూటలపై పడతాయి! అయ్యా! బేరం కాలేదు. బోణీ కాలేదు అని అంటే ‘నాకనవసరం....తియ్యి’ అంటూ బెదిరింపులు. ‘అమ్మినంక ఇస్తా! యాడికిపోత...’ నంటే ‘నీ దగ్గరే కూర్చుంటానా, అమ్మి దొంగలా పోతావు...’ అంటూ బూతు పదాలతో ఈసడింపులు. చిన్నాపెద్దా మూట అనే తేడా లేకుండా సంఖ్యనుబట్టి పది, ఇరవై వసూలు చేయడం అందరు చూస్తునే ఉంటారు. కనికరం అనే పదమే తెలియని సదరు ఏజెంట్లు, డబ్బులివ్వకపోతే మూటల్ని గుంజడం, తక్కెళ్లను, బాట్లను (తూనికరాళ్లను), ఎత్తుకపోవడం రోజువారి మార్కెట్‌లోని నిత్యకృత్యాలే!
నిజానికవి రోజువారీగా కూరగాయలమ్మే మార్కెట్ మాత్రమే! పట్టణ ప్రాంతాల్లో రేకుల షెడ్లు, దుకాణాల సముదాయాలు ఉంటాయి. పెద్ద గ్రామ పంచాయతీ స్థాయిలోనైతే ఖాళీ స్థలాలుంటాయి. వీటిని కేవలం కూరగాయలు అమ్మేవారే ఉపయోగించుకోవాలి. కానీ ఈ దృశ్యం ఎక్కడా కనపడదు. పట్టణ, మున్సిపల్ ప్రాంతాల్లో అయితే దుకాణాలన్నీ బినామీ పేర్లపై వుంటే షెడ్లన్నీ హోల్‌సేల్ వ్యాపారులే ఆక్రమించుకుంటారు. కూరగాయలే అమ్మాల్సిన ఈ దుకాణాల సముదాయాల్లో కిరాణా, టీకొట్లతోపాటు మటన్, చికెన్ అమ్మేవాటిగా మారిపోతాయి. రోజువారీగా అమ్మకానికి వచ్చే రైతులకు స్థలమే దొరకని పరస్థితి. దాంతో రైతు దళారులకు, వారు ఇచ్చేంత ధరకే అమ్మాల్సి వస్తోంది. లేదా అమ్ముకుందామంటే తైబజారు వసూళ్లు, పశువుల దాడి, పందుల దాడి తప్పదు. ఈ దుకాణాలవారు అటు ఇటు రోడ్డును ఆక్రమించుకోవడం, వున్న ఆ కాస్త దారిలో కూడా సైకిళ్లు, మోటార్లు, ఆటోలు, కూరగాయల్ని తెచ్చే తేలికపాటి వాహనాలతో నరకాన్ని తలపిస్తాయి. వీటన్నింటిని అనుభవిస్తూ అధిగమిస్తూ మనకోసం (ఆయనకు ఎలాగో గిట్టుబాటు కాదు)..అమ్ముతు వుంటాడు. దీనికి తోడు కొనుగోలుదారులు బేరసారాలు, కొసరి కొసరి అడగడం, తూకం తర్వాత ఒకటి, రెండు వేసుకోవడం కొందరు చేస్తే, నివారించే రైతుల్ని శత్రువులు చూసినట్టు చూసేవారు మరికొందరు. ఒక్క రైతు తప్ప అంతా నీతిమంతులే అన్నట్టు మార్కట్ మాయజాలం సాగుతుంది.
ఇక వారాంతపు సంతల్లో కూరగాయలతోపాటు అనేకరకాల వస్తువులు అమ్మకానికి తెస్తుంటారు. దీనికితోడు పశువుల సంత కొనసాగుతుంది. స్థలం పిడికిడైతే సంత మూరెడులా సాగుతుంది. సందులు, గొందులు, మురికి కాలువలు గట్లు కూడా సరిపడవు. ఆ కాస్త స్థలం దొరికినా అమ్ముకుని బయటపడాలనే తపన. ఇక్కడ తైబజార్ తతంగం మరీ ఘోరంగా వుంటుంది. అమ్మకానికి తెచ్చేవాడు నష్టానికైనా అమ్ముకోవడం ఒకటైతే, అమ్మకానికి ముందే ఇరవై ముప్పై తైబజారుకు సమర్పించుకోవాల్సి వుంటుంది. ఇలా అరబ్బులను, పిండారీలను తలపించే వీరు నిస్సహాయుల వస్తువుల్ని చిందర వందర చేయడం, కోళ్లు, చీపుర్లు అనే తేడా లేకుండా లాక్కెళ్లడం జరుగుతుంటుంది. వీటిని నియంత్రించేవారు కానీ, స్థానిక సిబ్బంది కానీ ఎక్కడా కానరారు.
ఈ తైబజారు అనే మాట నైజాం కాలం నాటిది. వివిధ ప్రాంతాలనుంచి అమ్మకానికై సరుకుల్ని తెచ్చే చిన్న వ్యాపారస్థులకు (కూరగాయలు కాదు) కనీస సౌకర్యాలు కల్పించడానికై నాడు ఈ రుసుమును అతి కొద్ది మోతాదులో (ఒక పైసా) వసూలు చేసేవారు. తర్వాత ఇది రూపాయకు, ఐదు రూపాయలకు, ఇప్పుడైతే పది రూపాయలకు పెరిగిపోయింది. గతంలో అమ్మకందార్లకోసం చతురస్రాకారపు గద్దెల్ని నిర్మించి ఇచ్చేవారు. కొనుగోలు దారులు వీటి చుట్టు కొనుగోలు చేసేవారు. వర్షం వచ్చి వరద పారినా వస్తువులకు ఎలాంటి నష్టం ఉండేది కాదు. ఇక పశువులకైతే వరసక్రమంలో రాళ్లతో ఇనుప కొక్కేలు గల రాళ్లను పాతేవారు. చెట్లను పెంచేవారు. నీటి సౌకర్యాన్ని కల్పించేవారు. ఈ సౌకర్యాల కల్పనకై స్వల్ప మొత్తంలో రుసుము వసూలు చేసేవారు. నేడు కొత్త సౌకర్యాలు లేక, ఉన్నవి పోగా, రుసుము మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెంచి వేసారు. దీనికై స్థానిక సంస్థల స్థాయిలో వేలం పాట పాడి దక్కించుకోవడం జరుగుతుంది. ఇలా దక్కించుకున్నవారు కట్టాల్సిన ధరావత్తును, అధికారులకు, రాజకీయ నాయకులకు ఇవ్వాల్సిన లంచాల్ని, గూండారాజ్యానికి చెల్లించాల్సిన మామూళ్లను ముదర (మొత్తం) చూసుకుని ఒకటి రెండింతల లాభాల్ని ఆర్జించడానికి, జులుంతో అమ్మకందారుపై వసూలు చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన వివరాలు తైబజారు ఎంత చెల్లించాలో ఎప్పుడు చెల్లించాలో తెలిపే సూచికలు ఎక్కడా కానరావు. ఇలా చెల్లించిన దానిపై వారికి లభించాల్సిన సౌకర్యాలు ఏంటో తెలిపే బోర్డులు వుండవు. అంటే సౌకర్యాల్ని కల్పించకుండా రక్షణ లేకుండా, కనీసం కూర్చోవడానికి సరైన స్థలాన్ని చూపించకుండానే ఈ వసూళ్లు సాగుతుంటాయి. ఈ విషయం గ్రామ పంచాయతీనుంచి అసెంబ్లీ వరకు తెలిసినా పట్టించుకునే నాథుడు లేడు. ఇలారైతుల్ని, ఇతర అమ్మకందారులను క్షోభకు గురి చేసే వ్యవహారం ఏ రాజకీయ పార్టీకి, ప్రజా సంఘాలకు, సివిల్ సొసైటీలకు పట్టడంలేదు. పోనీ ఇది కనపడని వ్యవహారమా అంటే మార్కెట్లకు వెళ్లేవారి కళ్లముందుగానే జరిగే నాటక రంగమే! కనీస మూత్రశాలలు కూడా కరువవడంతో మహిళల పరిస్థితి వర్ణనాతీతం!
ఒకప్పుడు సైకిల్‌కు స్థానిక సంస్థలు వార్షిక టాక్సును తీసుకునేవారు. దీన్ని గుర్తించిన నాటి ఎన్టీఆర్, సామాన్యుడి సాధనమని (తెదేపా ఎన్నికల గుర్తు కావడంతో) ఈ టాక్సును రద్దుచేయడం జరిగింది. కానీ నాడు, నేడు ఎందరు ముఖ్యమంత్రులు మారినా తైబజారు విషయంగా ఆలోచించకపోవడం శోచనీయం. ఈ విధంగా రైతు ఉసురును అన్ని రాజకీయపార్టీలు తీస్తున్నాయి. ప్రతిపక్ష, చిన్నా, చితక రాజకీయపార్టీలది ఎత్తుగడ రాజకీయాలే తప్ప నిజాయితీతో ప్రజల పక్షం వహించడం ఏనాడూ కానరాదు. వీరెవ్వరికీ ఈ దారుణమైన తైబజారును ఎత్తివేయించాలనే ఆలోచన రాదు. ఫసలుకు రు.4వేలు చొప్పున ఇస్తామంటున్న కెసిఆర్‌కు ఈచిన్న అంశం కనపడదు. పైగా ఇలాంటి వ్యవస్థ ఒకటి ఉందనే విషయం ఆ ప్రజానాయకుడికి తెలుసా అనేది అనుమానం! రైతులకు తామే ఒరగబెడుతున్నామని ప్రకటనల్ని గుప్పించే ప్రభుత్వాలు వెంటనే తైబజారు రుసుముల్ని రద్దు చేయాలి. తాను పస్తులుంటూ సమాజం కోసం పండిస్తూ మన ఆరోగ్యాల్ని కాపాడుతున్న రైతులకు సమాజం అండగా నిలవాలి. వారికి జరుగుతున్న అన్యాయాలపై గొంతువిప్పాలి. రైతు కుటుంబాల నుంచి వచ్చి, ఉద్యోగాలు వెలగబెడుతూ, పట్టణాల్లో మకాం వేసిన వారు కూడా రైతు అవస్థల్ని గుర్తించకపోవడం బాధాకరం.
తైబజారును రద్దు చేయడమే కాక, మార్కెట్ యార్డులను సక్రమంగా నడపాల్సిన బాధ్యతను స్థానిక సంస్థలే చేపట్టాలి. స్థలాన్ని విధిగా కేటాయించాలి. ఎండా, వానలనుంచి రక్షణ పొందేలా షెడ్లను నిర్మించాలి. పశువుల్ని, వాహనాల్ని నియంత్రించాలి. మార్కెట్ సమయంలో కూరగాయల్ని తెచ్చే వాహనాల్ని లోనికి అనుమతించవద్దు. మార్కెట్‌లోకి వెళ్లే రోడ్డులకు బార్స్‌ను బిగించాలి. వాహనాలు లోనికి వచ్చే (రాత్రిపూట మాత్రమే) దారిలో పశువులు రాకుండా పైపుల్ని ఏర్పాటు చేయాలి. మూత్రశాలలు, మరుగుదొడ్లను, తాగునీటి సౌకర్యాన్ని విధిగా ఏర్పాటు చేయాలి. రాత్రుల్లో వచ్చేవారికి నామినల్ రుసుము వసూలు చేసి వసతి సౌకర్యాల్ని కల్పించాలి. వారు తెచ్చిన కూరగాయలకు రక్షణ ఏర్పాటు చేయాలి. ఏర్పరిచిన సౌకర్యాల్ని, ధరల సూచిక పట్టికల్ని ఏర్పాటు చేయాలి. ఇలా కలిగించడం స్థానిక సంస్థల కనీస విధి. ఇలాంటి సౌకర్యాల్ని కలిగించిన ఘనత నైజాం ప్రభువుల హయాంలో కనపడుతుంది. మోజంజాహి మార్కెట్‌ను, పత్తరఘట్టి మార్కెట్‌ను చూస్తే తెలుస్తుంది. మైసూరు మహారాజాలు చేసిన మార్కెట్ యార్డుల్ని మైసూరులో కూడా చూడవచ్చు. ఇప్పటికీ ఇవి నేటి అవసరాల్ని తీరుస్తున్నాయి. విదేశాల్లో జరుగుతున్న అభివృద్ధిని, వివిధ విషయాల్ని తెలుసుకోవడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రతినిధులు (సర్పంచ్, మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్లు, వార్డు సభ్యులు) వెళ్లి రావడం చూస్తుంటాం. ప్రజాధనాన్ని అప్పనంగా తగలేసే ఈ నాయకులు, విదేశాల్లో కొనసాగుతున్న మంచి విషయాల్ని ఆకళింపు చేసుకున్నట్టు ఏనాడు కనపడదు. ఎందుకంటే వీటి పేరుమీద విదేశీ టూర్లు చేయడం వారికో సరదా! స్మార్ట్ సిటీల పేరున మోడీ చేపట్టిన పనిని ముందుగా మార్కెట్ యార్డునుంచి మొదలైతే అభినందనీయమే! వ్యక్తిగత లబ్ధిని పొందాలనే ఆలోచన తప్ప, సామాజిక సంక్షేమాల్ని కాంక్షించని, నాయకులున్నంత కాలం ఈ దేశ గతి ఇంతే!
*

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162