మిర్చిమసాలా

వౌనమేలనోయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకుని తామెందుకు పార్టీ మారుతున్నామో సుదీర్ఘంగా వివరించారు. ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌లతో పాటు నాయకులంతా తమతమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాత్రం ఇప్పుడు తానేమీ మాట్లాడలేనని ఆవేదనతో ఉన్నట్టు చెప్పారు. పాపం కాంగ్రెస్ నుంచి వీడి వెళుతున్నందుకు భాస్కర్‌రావు ఎంత ఆవేదన చెందుతున్నారో అని అంతా అనుకున్నారు. నిజానికి మిగిలిన నాయకులందరి కన్నా ముందు నుంచే భాస్కర్‌రావు టిఆర్‌ఎస్‌తో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. మరి ఈ బాధ ఎందుకూ అంటే ? పార్టీ మారిన వారిపై కోర్టుకు వెళతామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు కదా? తాను పార్టీ మారినట్టు ఆయన మీడియా ముందు చెప్పిన మాటలే ఆయన కేసుకు సాక్షంగా మారే ప్రమాదం ఉందని ముందు జాగ్రత్త చర్యనే తప్ప కాంగ్రెస్‌పై ప్రేమ కాదని కొందరు గుసగుసలాడారు.
- మురళి

జానా ఆత్మ!
నల్లగొండ జిల్లాకు చెందిన ఒక ఎంపి, ఎమ్మెల్యే టిఆర్‌ఎస్‌లో చేరిపోవడంతో సిఎల్‌పి నేత జానారెడ్డి తీవ్ర మనస్తాపం చెంది సిఎల్‌పి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ డిగ్గీరాజాకు తెలియజేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లుగా క్రమం తప్పకుండా ఎవరో ఒకరు ఆ పార్టీలో చేరుతూనే ఉన్నప్పటికీ ఎప్పుడు స్పందించని జానారెడ్డి ఇప్పుడే ఎందుకు రాజీనామాకు సిద్ధపడ్డారని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. తనకు సన్నిహితుడు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకోవడమే వల్లనే జానారెడ్డి మనస్థాపానికి కారణంగా చెబుతున్నారు. జానాకు భాస్కర్‌రావు నిజంగా ఆత్మలాంటోడు అయితే ఆయన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కార్యక్రమానికి హాజరైనప్పుడే టిఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమని తేలిపోయింది. తన ఆత్మను కూడా పసిగట్టలేని జానారెడ్డి రేపటినాడు తెలంగాణ ప్రజల నాడిని ఏమి పసిగడతారని కాంగ్రెస్‌లోనే కొందరు సణుగుతున్నారు.
- వెల్జాల చంద్రశేఖర్

ఉప్పొంగిన ‘ప్రభు’్భక్తి!
రాజకీయాలంటేనే ఓ విచిత్ర వేదిక. ఎప్పుడు ఏ నేత తళుకులీనుతాడో, ఎప్పుడు ఏ నాయకుడు మసకబారతాడో తలపండిన రాజకీయ పండితులు సైతం కచ్చితంగా చెప్పలేరు! నిరంతరం రంగులు మారే రాజకీయాలు ప్రజలకు ఎన్నో ఆశ్చర్యకర పరిణామాలను చవిచూపుతుంటాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రస్తుత కేంద్రస్థానం విజయవాడలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు తాజా పర్యటన నగరవాసులకు ఇలాంటి ఆశ్చర్యానే్న కలిగించింది. మన రాష్ట్రానికే చెందిన బిజెపి సీనియర్ నేత, వెంకయ్య నాయుడు పర్యటన ఎప్పుడూ సాదాసీదాగా సాగుతుంటుంది. కొద్దిమంది బిజెపి నాయకులు, ఇతర పార్టీల్లోని సన్నిహితులు కొందరు కలవటం, పెద్ద హడావుడేమీ లేకుండానే ఆయన తిరిగి వెళ్లటం జరుగుతుంటుంది. ఇక వాణిజ్య శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇక్కడి నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించటంతో ఎన్నోమార్లు నగర పర్యటనకు వచ్చారు. ఆమె పర్యటనలో కూడా హడావుడేమీ కనిపించేది కాదు. అయితే తాజాగా మన రాష్ట్రం నుంచి మిత్రపక్షం టిడిపి మద్దతుతో రాజ్యసభకు ఎన్నికైన రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు నగర పర్యటన హంగామాగా సాగింది. ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయనపై బిజెపి నాయకులు, స్థానిక రైల్వే అధికారులు ఎక్కడలేని ‘ప్రభు’్భక్తి చాటుకున్నారు. అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతూ ఆకాశానికెత్తేశారు. కొత్త మోజులో ఆంధ్రవాసులపై హామీలు కురిపించిన సురేష్ ప్రభు విశాఖకు చిరకాల డిమాండ్ రైల్వేజోన్‌ను మరి ఎప్పటికి మంజూరు చేస్తారో? ఆశగా వేచిచూడాల్సిందేనేమో?!
- నిమ్మరాజు చలపతిరావు

భావోద్వేగాలు
నిన్నటి దాకా అందరూ కలిసి పని చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఎవరి అజెండాలతో వారు ఉద్యమించారు. విభజన జరిగి రెండేళ్లయింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతికి హైదరాబాద్ నుంచి సచివాలయం, పోలీసు శాఖ, వివిధ శాఖల డైరెక్టరేట్లు, కమిషనరేట్ల ఉద్యోగులు తరలిపోతున్నారు. ఏళ్లతరబడి హైదరాబాద్‌లోనివాసం ఏర్పరచుకుని స్ధిరపడిన ఉద్యోగులు అమరావతికి వెళ్లకతప్పదు. దీంతో ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి ఆంధ్ర ఉద్యోగులను పలుకరించినా భావోద్వేగాలకు లోనవుతున్నారు. సమస్యలు ఎన్ని ఉన్నా, సంవత్సరాల నుంచి ఉన్న నేల ఇది. ఒక్కసారి ఈ మహానగరాన్ని వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది. అయినా మాతృ రాష్ట్రంలో అమరావతికి వెళ్లకతప్పదు. అక్కడికి వెళ్లి కొత్త జీవితం ప్రారంభిస్తాం. ప్రజలకు సేవలందిస్తామంటూ మనసును సముదాయించుకుంటూ ఉద్యోగులు భావోద్వేగాలకు లోనవుతున్నారు.విడిపోయినా మనమందరం అన్నదమ్ములమంటూ తెలంగాణ ఉద్యోగులు ఆంధ్ర ఉద్యోగులను సముదాయిస్తున్నారు.
- శైలేంద్ర

సందట్లో సడేమియా..
కాపు ఉద్యమం పేరుతో నిరసన దీక్షకు ముద్రగడ పద్మనాభం పూనుకోవడంతో ఇంత వరకూ ఎవరికీ తెలియని కాపు నేతలు ఒక్కసారిగా తెరమీదకు వచ్చారు. అకస్మాత్తుగా తెలగా, కాపు , బలిజ, ఒంటరి కులాల నేతలమంటూ ఉపన్యాసాలు మొదలెట్టేసరికి ఆశ్చర్యపోవడం విన్నవారి వంతవుతోంది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీసు అధికారులు అంతా దీక్షకు మద్దతు పలుకుతూ ఈ ఆందోళన కార్యక్రమమే ఆలంబనగా, సందట్లో సడేమియా అన్నట్టు మైలేజీకి పాపులారిటీకి సిద్ధపడుతున్నారు. ఇంతా చేస్తే కాపులను అణిచివేయడం అన్యాయమని చెప్పడం వినా ఉద్యమానికి కార్యాచరణ ఇచ్చిన పాపులర్ నేతలు ఎవరూ లేకపోవడం చూసిన ఆ కులస్థులే అందుకే ఇంత వరకూ వచ్చిందంటూ వాపోతున్నారు.
- బి వి ప్రసాద్