మిర్చిమసాలా

పాడిందే పాడరా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు మీడియా పవర్ ఫుల్‌గా మారుతోంది. ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల కోసం చెప్పిందే ఒకటికి పదిసార్లు చెప్పాల్సిరావటమే కాదు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ స్టిల్స్ కూడా ఇవ్వాల్సి వస్తోందంటున్నారు శాసనమండలి వైస్ ఛైర్మన్ సతీష్ రెడ్డి. అంతెందుకు ..? చివరకు.. పదిసార్లు మంగళసూత్రం కూడా కట్టాల్సి వస్తోందని ఆయన అన్నపుడు నవ్వులు విరిశాయి. ఇంతకీ ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే- ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఎపి సచివాలయం వెలగపూడికి తరలివచ్చిన రోజే శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, వైస్ ఛైర్మన్ సతీష్ రెడ్డి, మంత్రులు, డిజిపితో కలిసి నిర్మాణంలో వున్న శాసనసభ భవనాలను పరిశీలించారు. ఆనక ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. త్వరగా రావాలంటూ మీడియాకు పదేపదే సమాచారం అందించినా ఆలస్యంగా ఒకరి వెంట మరొకరుగా వస్తుండగా చూసిన సతీష్ రెడ్డి ఈ సరదా మాటలతో అందర్నీ నవ్వించారు.
-నిమ్మరాజు చలపతిరావు

మంత్రిగారూ.. ఏమంటారు..?
పరిపాలనలో భాగంగా మంత్రులకు సహజంగా అన్ని విషయాలూ తెలుస్తుంటాయి. తాము నిర్వహించే శాఖలోనే కాకుండా మిగిలిన శాఖల్లో సైతం తీసుకునే కీలక నిర్ణయాలు తెలుస్తుంటాయి. ఎప్పటికపుడు జరిగే మంత్రివర్గ భేటీల సందర్భంగా ఆ నిర్ణయాలపై చర్చ జరగడం, వెంటనే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఒక మంత్రి తన శాఖలోనే ఏం జరుగుతుందో తెలియదని చెబుతున్నారంటే దానికి రెండే కారణాలు. ఆ శాఖపై సంబంధిత మంత్రికి పట్టు లేకపోవడం కావచ్చు లేదా ఆ శాఖకు సంబంధించి అన్ని నిర్ణయాలనూ ఆయనకు తెలియకుండానే ముఖ్యమంత్రి అయినా తీసుకోవాలి. వారం రోజులుగా జరుగుతున్నది ఇదే. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖా మంత్రి మాణిక్యాలరావు తన మంత్రిత్వశాఖ పరిధిలో కొన్ని నిర్ణయాలు తాను సైతం పేపర్లలో చదివి తెలుసుకున్నానని చెబుతున్నారు. దానికి కార్యకర్తలు- ఇక మంత్రి పదవి ఎందుకు? రిజైన్ చేసేసి అన్ని పేపర్లు చదువుకుంటే మరింత సమగ్రంగా అర్ధం అవుతుంది కదా! అని అంటున్నారు. చూద్దాం.. మంత్రిగారు ఏమంటారో..?
-బివి ప్రసాద్

ఎపిలో కొత్త జిల్లాల సంగతేంటి?
ఎవరెన్ని చెప్పినా కొన్ని విషయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను చూసి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నేర్చుకోవాల్సిందేనని జనం మనోగతంగా ఉంది. తెలంగాణలో 10 జిల్లాలను పునర్విభజన చేసి కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు. అంటే మొత్తం 31 జిల్లాలు ఏర్పడుతాయి. తెలంగాణలో పరిపాలన వికేంద్రీకరణ వేగంగా జరుగుతోంది. ఆంధ్ర రాష్ట్రం భౌగోళికంగా తెలంగాణ కంటే పెద్దదే. కానీ, 13 జిల్లాలతో పరిపాలనతో సతమతమవుతోంది. కనీసం పెద్ద జిల్లాలు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురంను విభజించి కనీసం డజను కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. తూర్పుగోదావరిలో చింతూరునుంచి ఎదుర్లంకకు వెళ్లాలంటే 300 కి.మీ దూరం. ఇదే పరిస్ధితి గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఉంది. కర్నూలులో మంత్రాలయం నుంచి శ్రీశైలంకు 300 కి.మీ దూరం. రెవెన్యూ లోటు, విభజన కష్టాలు ఎప్పుడూ ఉండేవి. సాహసం చేయరా డింభకా అన్న పాతళభైరవిలో ఎస్‌వి రంగారావు డైలాగును చంద్రబాబు గుర్తు తెచ్చుకుంటే మేలు.
-శైలేంద్ర

ఒక్క ప్రకటన హీరోను చేసేసింది..
యుద్దం వస్తే అవసరమనుకుంటే తాను తిరిగి డ్యూటీలో చేరతానన్న ఒక్క ప్రకటన ఓ నేతను హీరోగా మార్చేసింది. తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భారతీయుడి గుండెను హత్తుకునే ప్రకటన చేసి ఆకట్టుకున్నారు. ప్రతిపక్ష నేతగా విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణాలతో రాజకీయాల్లో బిజీగా ఉంటున్న ఆయన ప్రకటన కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. 20 ఏళ్లుగా భారత వాయుసేనలో మిగ్ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్‌గా పనిచేసిన ఆయన ఇప్పటికీ కదనోత్సాహంతో ఉన్నారు. పాకిస్తాన్‌తో యుద్దం వచ్చే పరిస్థితులున్నాయని, పాకిస్తాన్ ఎప్పుడు, ఎలా స్పందిస్తుందో చెప్పడం కష్టమని దీంతో యుద్ధం వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. యుద్ధం కనుక వస్తే.. ఏ క్షణమైనా తాను విధుల్లో చేరడానికి సిద్ధమని ప్రకటించారు. దీశానికి సేవ చేయడం కంటే భాగ్యం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఏదీ మరచిపోయానని అనుకోవద్దని, ఈ క్షణంలో విధుల్లో చేరేందుకు సిద్ధమనే ప్రకటనతో ఆయన హీరోగా మారిపోయారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఇక రాజకీయాలెందుకు? అని అధికార పక్షం చేసిన ప్రకటన చాలామందిని ఆశ్చర్యపరచింది.
-సయ్యద్ గౌస్‌పాషా

ఫొటోతో ఇరకాటం..
ఒక్క ఐడియా మీ జీవితానే్న మార్చేస్తుంది.. అనే మాట ఎలా ఉన్నా ఒకే ఒక్క ఫోటో టిడిపిని ఇరకాటంలో పెట్టింది. నిమ్మకాయల చినరాజప్ప ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. టిడిపి యువనేత నారా లోకేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు. పార్టీ సమావేశంలో వేదికపై వేలు చూపుతూ చిన రాజప్పతో లోకేశ్ ఏదో మాట్లాడుతున్నారు. ఈ ఫోటో బయటకురాగానే సామాజిక మాధ్యమాల్లో రకరకాలుగా ప్రచారం జరిగింది. చినరాజప్పను లోకేశ్ మందలిస్తున్నట్టు ప్రచారం చేశారు. ప్రచారంలో దిట్ట అయిన టిడిపికే ఈ ప్రచారం దిమ్మతిరిగి పోయేట్టు చేసింది. అసలే కాపులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఫోటో వారిని మరింత రెచ్చగొట్టింది. బాబోయ్ చినరాజప్పను నేనేమీ అనలేదు. ఇదిగో వీడియో.. అని లోకేశ్ ఓ విడియో విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లోని ప్రచారం ఒక పార్టీని ఇంతగా ఇబ్బంది పెట్టిన సంఘటన ఇదేనేమో! ఇదంతా జగన్ చేసిన కుట్ర... జగన్ క్షమాపణ చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేయడం కొసమెరుపు!
-మురళి