మిర్చిమసాలా

రెండో పాయింట్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మెల్యేలు మాట్లాడేటపుడు అనేక చమత్కారాలు, ఛలోక్తులు సహజం. కొంతమంది సభ్యులైతే- ‘అధ్యక్షా.. ఒకటో పాయింట్, అధ్యక్షా.. రెండో పాయింట్..’-అంటూ ఇక మూడో పాయింట్‌కు వెళ్లకుండానే రెండోపాయింట్ అంటూ పది విషయాలు చెప్పేస్తుంటారు. ఇలాంటి చమత్కారమే తెలంగాణ శాసనసభలో జరిగింది. టిడిపి సభ్యుడు ఆర్.కృష్ణయ్యకు మాట్లాడే అవకాశం వచ్చినపుడు పాయింట్ల వారీ చెబుతూ, ‘అధ్యక్షా ఒకటో పాయింట్...అధ్యక్షా రెండో పాయింట్..’ అంటూ చెప్పేసరికే ‘సమయం అయిపోయింద’ని స్పీకర్ పేర్కొనడంతో ‘అధ్యక్షా.. రెండో పాయింట్ చెప్పి ముగిస్తా’ అనగానే సభలో నవ్వులు విరిశాయి.
- బివి ప్రసాద్

భోజనం లేదన్నారు..!
ఉగాది వేడుకలకు పిలిచి, భోజనం పెట్టకుండా తమను పంపించేశారని వివిధ రంగాలకు చెందిన పురస్కార గ్రహీతలు ఆవేదన చెందారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు పండుగ నాడు భోజనం పెట్టడం ప్రభుత్వానికి భారమా? అని వారు ప్రశ్నించారు. బెజవాడలో ఏపి సర్కారు ఏర్పాటు చేసిన హేమలంబ ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ఉమ్మడి కుటుంబాల గొప్పతనాన్ని వివరించారు. ఉమ్మడి కుటుంబాల వల్లే తెలుగు రాష్ట్రాలకు ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉందన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఈ పురస్కార గ్రహీతలకు భోజన సౌకర్యం మాత్రం ఏర్పాటు చేయలేదు. ఇదే విషయమై కొందరు ప్రశ్నిస్తే- ‘టిఎ, డిఎలు ఇచ్చాం కదా.. ఇంకా భోజనాలు కూడానా..?’ అన్న సమాధానం అధికారుల నుంచి వచ్చింది.
- నిమ్మరాజు చలపతిరావు

ఇదేమి న్యాయం?
న్యాయం ఆలస్యమవుతుంది. కానీ, తిరస్కరించబడదనే సామెతను తరచుగా పుస్తకాల్లో చదువుతాం. సినిమాల్లో అయితే ఈ డైలాగ్ ఎక్కువగా వింటాం. వేదికలపైన వక్తలు ఉపన్యాసాల్లో తప్పనిసరిగా దీన్ని చెబుతుంటారు. సంచలనం కలిగించిన విజయవాడకు చెందిన ఆయేషా మీరా హత్య కేసులో సత్యం బాబు నిర్దోషి అని కోర్టు చెప్పింది. అయితే, సత్యం బాబుకు విలువైన ఎనిమిది సంవత్సరాల కాలం జైల్లో గడచిపోయింది. పోలీసులు చిత్రహింసలు పెట్టారు. తల్లి కూలిపని చేసి బతుకుతోంది. ఈ కేసులో నిజంగా చివరకు సత్యాన్ని, ధర్మాన్ని కోర్టు రక్షించింది. సత్యం బాబు పోగొట్టుకున్న వయస్సు, కాలం, మర్యాదను ఈ సమాజం ఇస్తుందా?
- శైలేంద్ర

ఎవరైతేనేం?
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ చకచకా నిర్ణయాలు తీసుకుంటూ అధికారులను పరుగులు పె ట్టిస్తున్నారు. సచివాలయంలో గోడలపై పాన్ మరకలు ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుం డా విధి నిర్వహణలో ఉన్నప్పుడు పాన్ వేసుకుంటే 500 రూపాయల జరిమానా విధించాలని ఆదేశించారు. కాగా, ముఖ్యమంత్రి కారు డ్రైవర్ మాత్రం తనకు ఏమీ కాదులే అనే ధీమాతో పాన్ వేసుకుని అధికారులకు దొరికి పోయాడు. డ్రైవర్‌తో పాన్ కక్కించడమే కాదు సుమా! 500 రూపాయలూ జేబులో నుంచి కక్కించారు. అటువంటి కఠిన నిర్ణయమేదో మన రాష్ట్రంలోనూ అమలైతే బాగుంటుంది కదూ!
- వి.ఈశ్వర్ రెడ్డి

తికమక ‘సార్వభౌమ’!
‘సార్వభౌమాధికారం’ అనే మాట రాజకీయ నాయకులకు చమటలు పట్టిస్తోంది. టిడిపి మూడవ తరం వారసుడు నారా లోకేశ్‌పై టిడిపి శ్రేణులు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ‘కాళ్లు కడిగిన నాడే కాపురం చేసే తీరు తెలిసింద’ని సామెత చెప్పినట్టు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకార సమయంలోనే లోకేశ్ నిరాశ పరిచారు. ‘సార్వభౌమాధికారం’ అనే మాట పలక లేక ఆయన ఇబ్బంది పడ్డారు. ఆ ‘ఇబ్బందుల’ వీడియోకు విపక్ష పార్టీల వారు ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. గతంలో చాలామంది మంత్రులు ‘సార్వభౌమాధికారం’ మాట పలక లేక ఇబ్బందుల పాలయ్యారు. లోకేశ్ ఇబ్బందిని చూశాక- ‘అంత కఠినమైన పదం అవసరమా? దాన్ని తొలగిస్తే పోలా?’ అని కొందరి ఉచిత సలహా!
- మురళి