రాష్ట్రీయం

నేడే ఖేడ్ ఉప ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఫిబ్రవరి 12: నారాయణఖేడ్ ఉప ఎన్నిక పోలింగ్ కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు 1.88 లక్షలమంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలను తలపింపజేసే ఖేడ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అందుకనుగుణంగా ఎస్పీ సుమతి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లోనూ ఘర్షణ వాతావరణం తలెత్తకుండా వెబ్ కాస్టింగ్ విధానంతో సిసి కెమెరాలు, వీడియో చిత్రీకరణకు ఏర్పాట్లు చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు వెబ్ కాస్టింగ్ విధానంపై శిక్షణనిచ్చి కలెక్టర్ రొనాల్డ్ రాస్ పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ నిర్వహణకు ఈవిఎంలను తీసుకుని ఎన్నికల యంత్రాంగం ఇప్పటికే కేంద్రాలకు చేరుకుంది. ముగ్గురు ఎఎస్పీలు, 9మంది డిఎస్పీలు, 25మంది సిఐలు, 125మంది ఎస్‌ఐలు, 194మంది ఎఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుళ్లు, 600 మంది కానిస్టేబుళ్లు, 400మంది హోంగార్డులు, 100మంది మహిళా పోలీసులు, 350మంది ఎఆర్ పోలీసులు, 6 కంపెనీల సిఆర్‌పిఎఫ్, సిఎస్‌ఎఫ్, 33 మొబైల్ బృందాలను ఏర్పాటు చేసి బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లో రెండు పోలింగ్ కేంద్రాలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించారు. 54, 61 పోలింగ్ కేంద్రాల్లో మరింత బందోబస్తు ఏర్పాటు చేశారు. పాత నేరస్తులను, గొడవలకు ఉసిగొలిపే వారిని గుర్తించిన పోలీసులు ముందుగానే బైండోవర్ చేశారు. ఎండలు సైతం మండిపోతుండటంతో ఉదయం, సాయంత్రం సమయాల్లోనే ఓటర్లు ఓటు వేసేందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఓటర్ల కోసం మంచినీటి సదుపాయం, మరుగుదొడ్లు, మూత్రశాలలు, వికలాంగుల కోసం ర్యాంపులను ఏర్పాటు చేశారు. నారాయణఖేడ్ ప్రాంతం నుంచి వలసలు ఎక్కువగా వెళ్లిన దృష్ట్యా హైదరాబాద్, జహీరాబాద్, నిజామాబాద్‌ల నుంచి ప్రత్యేకంగా బస్సులను సైతం నడిపిస్తున్నారు. వలస ఓటర్లను గుర్తించిన ప్రధాన పార్టీలు తమకు అనుకూలమైన ఓటర్లను రప్పించుకోవడానికి ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. గత యేడాది ఆగస్టు నెల వరకు ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ప్రధానంగా తెరాస, కాంగ్రెస్, తెదేపాలు నువ్వానేనా అన్నరీతిలో తలపడబోతున్నాయి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా, ఓటర్లు తమ తీర్పు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 16న అభ్యర్థుల రాజకీయ భవిష్యత్ తేలనుంది.