రాష్ట్రీయం

అపర త్యాగరాజు మంగళంపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 22: బాల్యంలోనే మొగ్గ తొడిగిన విద్వత్తు ఆయన. సంగీతం అంటే ఏమిటో తెలియని వయసులోనే రాగం, తానం, పల్లవిని ఆయన ఔపోసన పట్టారు. సంగీతానికి సంబంధించిన సమస్త ప్రక్రియల్లోనూ అందెవేసిన చెయ్యిగా విశ్వవిఖ్యాతినార్జించిన సంగీత స్రష్ట మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఏ ప్రక్రియ చేపట్టినా స్వరం మాధుర్యం కరతలామలకమయ్యేది. ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల మంది రసజ్ఞుల హృదయాలను తనదైన గాత్రమాధుర్యంతో అలరించటంతో పాటు ఎన్నో వినూత్న ప్రక్రియలకు శ్రీకారం చుడుతూ, ఇది తన స్వరం, తన గళం, తన గాత్రం అంటూ చాటి చెప్పిన నవ్య రాగ సృష్టికర్త ఆయన. కర్ణాటక సంగీతంలో త్యాగరాజస్వామి వారి తరువాత మొత్తం 72మేళ కర్త రాగాల్లోనూ అనేక కృతులను రచించి స్వరపరచిన మంగళంపల్లి బాలమురళి 1930 జూలై ఆరున తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో పట్ట్భారామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు. సూర్యకాంతమ్మ వీణ కళాకారిణి. పట్ట్భారామయ్య వేణువు, వయోలిన్, వీణల్లో నిష్ణాతులు. బాలమురళి ఎనిమిదేళ్ల వయసులో విజయవాడలో జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాలలో తొలి కచేరీ చేశారు. పట్ట్భారామయ్య గురువుగారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు వద్దే ఈయనా శిష్యరికం చేశారు. పదిహేనేళ్లు వచ్చేసరికి సంగీతంలోని అన్ని మేళ కర్త రాగాలపైనా పట్టు సాధించారు. తెలుగుతో పాటు సంస్కృతం, కన్నడ, తమిళ భాషల్లో కలిపి దాదాపు 400కు పైగా కీర్తనలు, వర్ణాలు, జావళులు, తిల్లానాలు రచించి స్వరపరిచారు. ఆయన స్వరార్చన కేవలం కీర్తనల రచనలు, గాత్రంతోనే పరిమితం కాలేదు. అనేక కొత్త రాగాలను ఆయన సృజించారు. సర్వశ్రీ, మహతి, లవంగి వంటి అనేక రాగాలను సృష్టించి శాస్ర్తియ సంగీతంలో ఈశతాబ్దంలోనే ఎవరూ చేయని ప్రయోగాలు చేశారు. గతిభేదం, సశబ్ద క్రియ వంటి కొత్త రీతులలో తాళ వ్యవస్థను కూడా తీర్చిదిద్దారు. రామ, శివ, కృష్ణ తత్వాలను సృష్టించిన విద్వన్ శిరోమణి మంగళంపల్లి. రామదాసు కృతులకు ప్రాణం పోసి శాశ్వతత్వం కల్పించారు. సదాశివ బ్రహ్మేంద్రుల వారి పిబరే రామరసం అన్న కీర్తనను తెలుగు లోగిళ్లలో మార్మోగేలా చేశారు. మరుగున పడిన అనేక కృతులకు జీవం పోసి నిలిపారు. 1967లో భక్తప్రహ్లాద చిత్రంలో తన ప్రవృత్తికి తగిన నారదముని పాత్రలో వెండితెరపై నటించారు. ఆ తరువాత మరి కొన్ని చిత్రాలలో నటించారు. ఇంకొన్ని చిత్రాలకు బాణీలు అందించారు. కొన్ని చిత్రాలలో నేపథ్యగానం చేశారు. నర్తనశాల సినిమాలో సలలిత రాగ సుధారస సారం, గుప్పెడు మనసు చిత్రంలో వౌనమె నీ భాష ఓ మూగ మనసా, ఉయ్యాల జంపాల చిత్రంలో ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవువంటి పాటలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. హంసగీతె అన్న కన్నడ చిత్రంలో ‘హిమాద్రి సుతే పాహిమాం’ అన్న పాటకు 1976లో ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. మాధవాచార్య అనే సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. జాతీయ స్థాయిలో మూడు అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లను అందుకున్న మహోన్నత సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ. 2005లో ఫ్రెంచి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక షెవాలియర్ గౌరవాన్ని అందుకున్నారు. సంగీత రంగంలో అత్యధిక గౌరవ డాక్టరేట్లు అందుకున్న సంగీత సరస్వతి బాలమురళి. మద్రాసు సంగీత అకాడమీ నుంచి సంగీత కళానిధి, గాన కౌస్త్భు, కళాభూషణ, గాన గంధర్వ, గాయక శిఖామణి, సంగీత కళా సరస్వతి వంటి అనేక బిరుదులు, పురస్కారాలు అందుకున్న విద్వత్ శిరోమణి బాలమురళీకృష్ణ. తన జీవిత కాలంలో 25వేలకు పైగా కచేరీలు నిర్వహించి తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, శ్రీలంక.. ఇలా ఆయన తిరగని దేశం లేదు.. కచేరీ చేయని ప్రదేశం లేదు. గత ఏడాది గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలో ఆయన చివరిసారి కచేరీ నిర్వహించారు. పండిట్ భీమ్‌సేన్‌జోషి, పండిట్ శివకుమార్ శర్మ, కిశోరీ మోన్కర్, హరిప్రసాద్ చౌరాసియా, పండిట్ జస్రాజఖ, జాకీర్ హుస్సేన్ వంటి హిందుస్తానీ ప్రముఖులతో కలిసి ఉత్తర భారత సంగీత సంగమం చేసిన సంగీత కళాసరస్వతి బాలమురళీకృష్ణ ఒక్కరే. ఆయన కేవలం గాత్రంలోనే కాదు, వయొలిన్, మృదంగంలోనూ నిష్ణాతులే.