రాష్ట్రీయం

నిరుద్యోగం కాంగ్రెస్ పుణ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగ సమస్యకు గత కాంగ్రెస్ పాలకుల పుణ్యమేనని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయిందని, యువతలో నైపుణ్యత కొరవడిందని శుక్రవారం ఇక్కడ ధ్వజమెత్తారు. మూడు జనరేషన్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు పనికట్టుకుని మోదీపై విమర్శలు చేస్తోందని విమర్శించారు. స్కిల్ డెవలప్‌మెంట్-ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్‌పై ఇక్కడ జరిగిన జాతీయ సెమినార్‌లో మంత్రి మాట్లాడుతూ ‘ఏడు దశాబ్దాలపాటు అధికారంలోఉన్నపార్టీ 48 నెలల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది.. మోదీజీ ఉద్యోగాలు ఎక్కడ?అని. మూడు జనరేషన్లు అధికారంలో ఉండి దేశానికి చేసిందేమిటీ?’అని కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ‘నాయనమ్మ తండ్రి, నాయనమ్మ, తండ్రి అధికారం చెలాయించారు కదా?’అని రాహుల్‌ను ఎద్దేవా చేశారు. వారసత్వపాలనతోనే దేశం అధోగతి పాలైందని ప్రధాన్ ఆరోపించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంస్కరణలు దేశాన్ని ప్రగతిపథంలో నడుపుతున్నాయని ఆయన అన్నారు. నైపుణ్య అభివృద్ధికి పెద్దపీట వేసి తద్వారా ఉపాధికల్పనకు శ్రీకారం చుట్టారని మంత్రి స్పష్టం చేశారు.

విడాకులిచ్చెయ్!
*భర్త పీటర్‌కు ఇంద్రాణి నోటీసు
ముంబయి, ఏప్రిల్ 27: కన్నకూతురు హత్య కేసులో నిందితురాలిగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణీ ముఖర్జియా తన భర్తనుంచి విడాకులు కోరుకున్నారు. ఈమేరకు ముంబయిలోని బైకుల్లా మహిళా జైలునుంచే భర్త పీటర్ ముఖర్జీకి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. ఇంద్రాణీ కుమార్తె షీనాబోరా హత్య కేసులో తల్లే ప్రధాన నిందితురాలన్న విషయం తెలిసిందే. ఇంద్రాణీ భర్త పీటర్ సైతం ఈ కేసులో నిందితుడిగా శిక్ష అనుభవిస్తున్నాడు. అనూహ్య సంఘటనలతో వైవాహిక బంధం ముక్కలైన నేపథ్యంలో, విడాకులు కోరుకుంటూ ఏప్రిల్ 25న ఇంద్రాణీ తన భర్త పీటర్‌కు లీగల్ నోటీసులు పంపించారు. విడాకులతోపాటు చట్టబద్ధంగా ఆర్థిక వ్యవహారాలూ ఏప్రిల్ 30లోగా పరిష్కరించాలని కోరినట్టు తెలుస్తోంది. ‘మన వైవాహిక బంధం అనూహ్య సంఘటనలతో ముక్కలైంది. మళ్లీ చక్కదిద్దుకోగలమన్న ఆశలు కూడా లేవు. విడాకులు ఒక్కటే సరైన మార్గం’ అంటూ భర్త పీటర్‌కు కొరియర్ ద్వారా పంపించిన లీగల్ నోటీసులో ఇంద్రాణి పేర్కొన్నారు. సొంత కూతురు షీనా బోరా హత్య కేసులో నిందితురాలైన ఇంద్రాణి, 2015 ఆగస్టులో అరెస్టై కేసు విచారణలో భాగంగా జైలు శిక్ష అనుభవిస్తోన్న విషయం తెలిసిందే.

కేంద్రం పిటిషన్‌పై 3న విచారణ
* ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తీర్పును పునః సమీక్షించాలన్న కేంద్రం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై వెలువరించిన తీర్పును పునఃసమీక్షించాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మే 3న విచారించనుంది. దీనికి సంబంధించి లిఖితపూర్వంగా నివేదించినందున సాధ్యమైనంత త్వరగా విచారించాలని జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనాన్ని కేంద్రం కోరింది. ‘కేంద్రంతో పాటు నాలుగు రాష్ట్రాలు తీర్పుపై పునసమీక్షించాలని పిటిషన్లు వేశాయి. సంబంధిత సమాచారాన్ని లిఖితపూర్వకంగా మీకు అందజేశాం. ఏ రోజు విచారిస్తారో కచ్చితమైన తేదీ ప్రకటించండి’ అని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అభ్యర్థించారు. విచారణ వచ్చే వారానికి లిస్ట్ అయిందని, మే 3న వాదనలు వింటామని జస్టిస్ గోయల్ స్పష్టం చేశారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అప్పటికప్పుడే అరెస్టు చేయకూడదంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దళిత సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ హింసాత్మకంగా మారింది. ఏప్రిల్ 2నే కేంద్రం దీనిపై రివ్యూపిటిషన్ దాఖలు చేసింది.

పెట్రో ధరల పెంపుపై 8న సీపీఎం ఆందోళన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంపై సీపీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నరేంద్రమోదీ ప్రభుత్వం వల్లే పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశానంటాయని పార్టీ ధ్వజమెత్తింది. తక్షణం ధరలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మే 8న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని సీపీఎం వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ రీటైల్ ధరలు నింగినంటాయని, ప్రజలు బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే నిత్యావసరాల ధరలూ దారుణంగా పెరిగిపోయి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పార్టీ పొలిట్‌బ్యూరో తెలిపింది. పెరిగిన ధరలు తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. మోదీ ప్రభుత్వం కుభేరులకు కొమ్ముకాస్తోందని, లక్షల కోట్ల రూపాయలు పన్నులు ఎగవేస్తున్నా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందని సీపీఎం ధ్వజమెత్తింది. మే 8న జరిగే ఆందోళన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగాయన్న సాకుచూపి దేశంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపుతున్నారని సీపీఎం ఆరోపించింది.