Others

పంచభూతేశ్వరుడు పరమశివుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమి జలం అగ్నివాయువు ఆకాశం పంచభూతాలు. ఈ పంచభూత ఉపాసన స్థూలమైన పృథ్వీ భూతంతో ప్రారంభం. భూమి కఠినత్వం గలది. అంటే గట్టిది. దున్నితే భూమి మెత్తగా తయారవుతుంది. మెత్తగా ఉంటే గాని విత్తనాలు వేయడానికి అవకాశం లేదు. విత్తనం వేస్తేగాని మొక్క పుట్టదు. మొక్క పెరిగి పుష్పించి ఆపైన కాయగా మారాలి. తర్వాత ఆ కాయే ఫలమవుతుంది.
ఇదే విధంగా మనిషి సాధనను కొనసాగించాలి. అనేక జన్మలనుండి ప్రాపంచిక విషయాలతో గడ్డకట్టి, గట్టి అయిన హృదయ క్షేత్రాన్ని కఠినమైన నియమ నిష్ఠలతో బాగా సాగుచేసి, అందులో వేదసూక్తులనే విత్తనాలు నాటి మొలిచిన మొక్కలను భక్తిజలంతో పోషిస్తూ, ఇంద్రియ ప్రవృత్తులనే కలుపుమొక్కలను మనోనిగ్రహంతో నశింపజేసి, కామక్రోధాదులను అదుపులో ఉంచుకుని బ్రహ్మజ్ఞానమనే పంటను పండించుకోవాలి సాధకుడు.
ఇక రెండవది జలభూతం. మనిషి నిలవడానికి భూమి ఆధారమైతే అతని ప్రాణాధారం జలం అని చెప్పాలి. భూమిపై పంటలు పండాలంటే, నీరు కావాలి. చల్లని నీరు దాహాన్ని దూరం చేస్తుంది. అవయవాలకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. నిర్మలత్వానికి నీటిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. జలానికి స్నేహం లక్షణం. అంతేకాదు ఆకారం లేని నీటిని ఏ పాత్రలో ఉంచితే ఆ పాత్ర రూపం ధరిస్తుంది. ఈ జలాన్ని ఆదర్శంగా గ్రహించిన సాధకుడు నీటివలె లౌకిక విషయాలపై పరుగులుతీసే మనస్సును భగవద్రూపాన్ని ధరించేటట్లు చేసుకోవాలి. అప్పుడే చల్లని చూపు చల్లని మాటలు చల్లని స్పర్శతో శరత్కాల చంద్రుడై ప్రకాశించి అందరికీ ఆహ్లాదాన్ని కలిగించగలుగుతాడు.
మూడవది అగ్నిభూతం. ఆహార పక్వతకు మనిషికి అగ్ని అత్యవసరం. రాత్రి సమయంలో ఏ పనిచేయాలన్నా, వస్తువు గోచరించాలన్న అగ్ని అంటే కాంతి అవసరం. మనం తిన్న ఆహారం జీర్ణంకావాలంటే కూడా జఠరాగ్ని ఉండి తీరాలి. ఇలా వివిధ రూపాలతో, వివిధ రీతులుగా వివిధ క్రియలను చేస్తుంటేనే మానవుని జీవయాత్ర సాగుతోంది. మానవ శరీరంలో వేడి తగ్గితే అనగా చల్లబడితే ఇక ఆ దేహాన్ని ఇంట్లో ఉంచరు. ఇదే మరణం కాబట్టి వేదాంతర్గత బ్రహ్మస్వరూపాన్ని గ్రహించి సాధకుడై, అనుభవసాగరంలో మునిగి సిద్ధుడైనవాడు అగ్నివలె తేజోమూర్తియై ప్రకాశిస్తాడు. అతడి సన్నిధి చేరినవారికి పాపాలంటవు. బ్రహ్మతేజస్సు అంటే ఇదే.
నాలుగవది వాయుభూతం. వాయువు ప్రతి జీవికీ అవసరం. వాయువు మనిషి దేహంలో పంచవిధాలుగా సంచరిస్తూ దేహం నిలవటానికి ఆధారమవుతోంది. వాయువు పీల్చకుండా కొన్ని క్షణాలైన నిలవడం కష్టం. ఈ వాయు సంచలనానికి భగవంతుడే కారణం. వాయువు సర్వత్రా సంచరిస్తుంది. అలాగే వైరాగ్య సంపన్నుడైన సాధకుడు కూడా దేశదేశాలలో పరివ్రాజకుడిగా సంచరిస్తాడు. గాలి అనేక కుసుమాల నుండి పరిమళాలను గ్రహించినట్లు, సాధకుడు కూడా అనేకమంది మహాత్ముల నాశ్రయించి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటాడు.
వాయువు సుగంధాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి వెదజల్లినట్లుగా ఈ సాధకుడు కూడా తాను సాధించిన అనుభవజ్ఞానాన్ని జాతి మతం కుల దేశ విభేదాలు లేక అందరికీ అందిస్తాడు. వాయువునేదీ అంటనట్లు ఇటువంటి మహనీయుని కూడా లోకంలో ఏదీ అంటదు. వాయువును ఎల్లరూ ఆహ్వానించినట్లే ఆ మహాత్ముని కూడా సర్వులూ హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తారు.
చివరిది ఆకాశ భూతం. ప్రాణులు నివసించడానికి ఆధారభూతమైన ఈ ఆకాశానికి సన్నిహితమైనది ఆత్మ. ఆకాశం నీలమై దగ్గరగా ఉన్నట్లుండి- దూరాన్ని సూచిస్తుంది. శ్రీకృష్ణుడు కూడా నీలమేఘ శరీరుడే. నల్లని మబ్బును చూడగానే నెమలి ఆనందంతో నృత్యంచేసినట్లుగా శ్రీకృష్ణపరమాత్మ అనే నీలి మబ్బు హృదయంలో ఏర్పడినప్పుడు భక్తుని హృదయం అనే మయూరం కూడా ఆనంద నృత్యంచేస్తుంది. ఆకాశం విశాలమైనది. అదే విధంగా ఈ ఆకాశభూత అర్చనారతుడు కూడా ఈ విశాల ప్రపంచంలో విశాల హృదయంతో విహరిస్తూ ఉంటాడు. ఈ పంచభూతాలు ఒకదాని కంటె ఒకటి సూక్ష్మం... ఈ పంచభూతాలను ధరించి శివుడు పంచభూతాత్మకుడయ్యాడు... భస్మధారణ పృథ్వీతత్వాన్ని , గంగను శిరస్సుపై ఉంచుకున్నందున జలతత్వాన్ని, త్రినేత్రధారి అవ్వడం చేత అగ్నితత్వ్తాన్ని సర్పాలను ధరించడంవల్ల వాయుతత్త్వాన్ని, దిగంబరత్వంతో ఆకాశతత్త్వాన్ని తనలో ఇముడ్చుకొని పంచభూతధారి అయ్యాడు. ఈ చరాచర జగత్తంతా ఈశ్వరునిచే ఆచ్చారితమై వుంది. ఈ విషయాన్ని అవగాహన చేసుకుని, ప్రతీదీ పంచభూతధారి అయిన పరమేశ్వరుని తత్వమై ఉన్నదనే జ్ఞానంతో జీవించమని, ఈ కార్తికమాసంలో పరమశివుడు ఆత్మశుద్ధితో పూజిస్తే సర్వపాపాలు హరించబడతాయని స్కాందపురాణం చెబుతోంది.

- చోడిశెట్టి శ్రీనివాసరావు