AADIVAVRAM - Others

జంతు హింస సంస్కృతి మనకుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్ణాటకలోని అడవుల్లోంచి ఏనుగులొచ్చి తన పొలాన్ని పాడుచేస్తున్నాయని ఆంధ్ర ప్రాంతంలోని ఒక రైతు తన పొలంలో గొయ్యితీసి, పైన చెరకు మొక్కలు దొంగ పొలంగా పాతాడు. ఆ రాత్రి ఒక ఏనుగు పిల్ల వచ్చి ఆ గోతిలో పడింది. మర్నాడు ఆ రైతు వచ్చి దాన్ని పైకి లాగటంలో దాని కాలు విరిగింది. ఆ రైతు దాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఆ ఏనుగు పిల్ల ఒక వారం పాటు లేవలేక, తిండి నీళ్లు లేక యాతన పడింది. ఇది చూసి ధర్మమూర్తులైన వాళ్లు ఎవరో ఫారెస్టు డిపార్టుమెంట్‌కు దాన్ని అప్పగించారు. వాళ్లు దాన్ని వైద్యంతో బాగుచేసి అడవిలో వదిలేశారు. యు.పి.లో ఒక గ్రామంలో ఒక ఆసామీ ఒక పండుగనాడు మాంసం పట్టుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ పక్కింటి యువకుడొకడు ‘అది ఆవు మాంసం. ఈ దేశంలో అది నిషేధం’ అని అల్లరి చేశాడు. గొడవలు, అరెస్టులు, చావులు మామూలుగానే జరిగాయి... కేరళలో కేరళ కాంగ్రెసు, కమ్యూనిస్టు కార్యకర్తలూ కలిసి వీధి కుక్కల్ని చంపుతున్నారు. కనబడిన వీధి కుక్కనల్లా కర్రల్తో దారుణంగా బాది రక్తం కక్కించి చంపేస్తున్నారు. దీన్ని కేరళ హైకోర్టు ఆపింది.
మాంసాహారులు ఆహారం కోసం ప్రత్యేకించబడిన కోళ్లు, గొర్రెలు వంటి కొద్ది జంతువులు తప్ప మిగతా జంతువులు వేటినీ హింసించటం ఈ దేశ సంస్కృతిలో లేదు. (యజ్ఞ యాగాదుల్లో జంతు హింస ఈ కలియుగంలో నిషేధించబడింది) అసలు మన పురాణ గాథల్లో జంతువులకూ కీటకాలకూ విశిష్ట స్థానం ఉంది. మన సంస్కృతికి పెద్ద పీట వెయ్యటంలో వీటిదే కీలక పాత్ర. కొన్ని గాథలు చూద్దాం.
అర్జునుడు అడవిలో ఒక వింత ప్రాణిని చూశాడు. దానికి కోడిపుంజు తల, నెమలి మెడ, సింహం మొల, ఎద్దు మూపురం, పాము తోక, పులి - జింక - ఏనుగు - మనిషి పాదాల వంటి నాలుగు పాదాలూ, మనిషి చేతులూ ఉన్నాయి. అర్జునుడు బాణం ప్రయోగించటానికి ఉద్యుక్తుడయ్యాడు. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచించాడు. ‘ఈ జీవి అసాధారణమైన ఆకారంలో కనిపించినంత మాత్రాన దీన్ని నేను రాక్షసుడిగా భావించి ఎందుకు చంపాలి? ఆ హక్కు నాకు ఎవరిచ్చారు?’ అనుకొంటూ తన విల్లును దించేశాడు. వెంటనే ఆ వింత ప్రాణి తన మానవ హస్తాన్ని ఎత్తి ఆశీర్వదించి మాయమై పోయింది! అర్జునుడికి అర్థమై పోయింది, తనని పరీక్షించటానికే భగవంతుడు అలా కనిపించాడు, అని!
గాంధారి, పొరబాటున ఒక కీటకం పెట్టిన వంద గుడ్లపై అడుగు వేసింది. అవన్నీ చితికిపోయాయి. ఆ తల్లి కీటకం గాంధారిని ‘నువ్వు కూడా నీ వంద మంది కుమారులూ నీ కళ్ల ముందే చనిపోవటాన్ని చూద్దువుగాక!’ అని శపించింది. మానవుల రోదనలు వినిపించినట్లే జంతువులు / కీటకాల రోదనలు కూడా భగవంతునికి వినిపిస్తాయి గదా! ఆ తర్వాత గాంధారి కొడుకులు (కౌరవులు) వంద మందీ ఏమయ్యారో మనకు తెలుసు!
రామ రావణ యుద్ధం మొదలవ్వటానికి ముందు రామ సైన్యం సముద్రంపై వారధి నిర్మిస్తోంది. చిన్న ఉడత తన వొంటినిండా ఇసుక రేణువుల్ని పూసుకుని వాటిని మోసుకెళ్లి, వారధి నిర్మాణంలో కలిపింది. శ్రీరాముడికి ఆ ఉడతపై ప్రేమ ఉప్పొంగింది. ఆయన దాని వీపును తన చేతి మూడు వేళ్లతో నిమిరాడు. అవి అక్కడ చారలుగా ఏర్పడ్డాయి. జంతువులకు మనం చేసేవి చిన్న పనే్ల అయినా వాటిని అవి పెద్దగా గుర్తిస్తాయి.
ఒక అడవిలో ఒక మార్గం మీద ఒక ఋషి నడిచి వెళుతున్నాడు. పేడ పురుగు ఒకటి అతనికి అడ్డంగా హడావిడిగా నడిచి వెడుతోంది. ఆ ఋషి దాంతో ‘అంత హడావిడిగా వెడుతున్నావేమిటి, నీకేం ఇబ్బంది వచ్చింది?’ అన్నాడు. ఆ పేడ పురుగు, ‘అయ్యా, దూరం నించి ఒక రథం వస్తున్నట్టు నాకు వినిపిస్తోంది. ఈ కాలి దోవ మలుపులో ఆ రథం నా పిల్లల మీద నించి వెడుతుందేమో, వాటిని దూరంగా తీసుకెళదామని వెడుతున్నాను’ అంది. కీటకాలకు కూడా ప్రేమ ఆప్యాయతలు ఉంటయ్యా అని ఋషి ఆశ్చర్యపోయాడు. ఇంతలో రథం వచ్చింది. ఆ ఋషి దానికి అడ్డంగా నించుని ఆ సారధితో ‘నెమ్మదిగా సూటిగా నడుపు. ఇటుపక్క అటు పక్క కీటకాల పుట్టలున్నాయి’ అన్నాడు. ఆ రథం ప్రమాదాలు లేకుండా వెళ్లిపోయింది. అవతల పక్కనించి ఆ పేడ పురుగు ఆ ఋషితో ‘్ధన్యవాదాలు మహాత్మా’ అంటూ వెళ్లిపోయింది. ఇది మన ఉపనిషత్తులోని కథ.
ధర్మరాజు ఒక మహా యజ్ఞం (రాజసూయం) చేశాడు. అందరికీ షడ్రసోపేతమైన విందు ఇచ్చాడు. సగం శరీరం బంగారం రంగులో ఉన్న ఒక ముంగిస ఆ యజ్ఞ వాటికలోకి ప్రవేశించింది. అన్ని ఎంగిలి విస్తళ్లలోనూ పడి దొర్లుతూ తిరిగింది. ధర్మరాజు దాన్ని కారణం అడిగాడు. ఆ ముంగిస అంది, ‘రాజా, మహా ధనవంతుడైన రంతిదేవుడు అనే రాజు తన ధనమంతా దానం చేసి తపస్సు కోసం అడవికి వచ్చాడు. కొద్దిగా దొరికిన ఆహారాన్ని తన వాళ్లతో తినబోతూ, భిక్ష కోసం వచ్చి అడిగిన వాళ్లకు ఆ ఆహారం అంతా ఇచ్చేసి సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ దానం విస్తళ్లల్లో తిరగటంవల్ల నా శరీరం సగం బంగారం రంగుకి తిరిగింది. మిగిలింది నీ వల్ల తిరుగుతుందేమోనని వచ్చాను. ప్చ్. నాకు నిరాశే మిగిలింది’ అంది. అంటే మానవులు చేసే దానాలను జంతువులు విలువ కట్టగలవన్న మాట!
ఈ రచయితకే ఒక చిన్న అనుభవం ఉంది. తెలంగాణాలో పాలపర్తి అనే గ్రామం (పోతన గ్రామం)లో ఒక పెద్ద గుట్ట ఉంది. దాని మీద నరసింహ స్వామి దేవాలయం - సగం ఆ గుట్టలోని గుహలోకి చొచ్చుకువెళ్లి, సగం బయటికి వచ్చి ఉంది. ఆ దేవాలయం లోపలికి వెళ్లి పరిశీలిస్తే ఆ పెద్ద గుహ పక్కనే ఒక చిన్న, సన్న గుహ కూడా ఉంది. అర్చకుడిని ఆ వివరాలు అడిగాను. అతనన్నాడు ‘ఈ చిన్న గుహలో ఒక పెద్ద సర్పం నివసిస్తోంది. అప్పుడప్పుడు వచ్చి ఈ స్వామిని సేవించుకొని వెళ్లిపోతూంటుంది. ఇక్కడి అర్చకుడు ఒక రోజున ఆ పాము వచ్చి చుట్టుకొని ఉండటం చూసి భయపడి ఉద్యోగం మానేసి పారిపోయాడు. నెల అయింది. ఇదిగో ఇప్పుడు నేను చేస్తున్నాను. నాకు ఆ భయం లేదులెండి. ఇద్దరు స్వాములూ నన్ను కటాక్షిస్తారనే విశ్వాసం నాకుంది’ అన్నాడు.
అసలు మహాభారతం దేనితో మొదలయ్యింది? కుక్కతో! జనమేజయుడు యజ్ఞం చేసే ప్రదేశానికి సరమ అనే దేవతల కుక్క కొడుకైన సారమేయుడు అనే పేరుగల కుక్కపిల్ల వచ్చి ఆటగోలుతనంగా తిరుగుతోంది. యజ్ఞం చేసే చోటికి కుక్క రాకూడదు కనక, జనమేజయుడి ముగ్గురు తమ్ములూ ఆ కుక్కపిల్లని కొట్టారు. అది ఏడుస్తూ వచ్చి తన తల్లియైన సరమకు మొరపెట్టుకొంది. ఆ సరమ వచ్చింది. జనమేజయుడితో అంది ‘రాజా, జ్ఞానహీనులైన నీ తమ్ములు, చిన్నవాడూ, నేరం ఏమీ చేయనివాడూ అయిన నా కొడుకును కోపంతో కొట్టారు. ఈ పని యుక్తమైనది, అయుక్తమైనది కాదు అని ఆలోచన లేకుండానే బీదవారికీ, అశక్తులైన వారికీ, మంచివారికే కావాలని చేసే నీతి రహితులకు కారణం లేకుండానే ఆపదలు వస్తూంటాయి.’ - ఇట్లా పలికి ఆ సరమ అదృశ్యమై పోయింది. జనమేజయుడు తల పట్టుకున్నాడు. ఏవో ప్రాయశ్చిత్తాలు చెయ్యటానికి సోమశ్రవసుణ్ణి ఆశ్రయించాడు. కానీ ఏం లాభం? జరగనవసరం లేని సర్పయాగం జరిగింది.
చివరకు భారతం కథ ముగియటం కూడా కుక్కతోనే ముగిసింది. పాండవుల మహాప్రస్థానంలో ఒక కుక్క వాళ్ల వెంబడి వెళ్లింది. ‘మనం పుణ్య జీవితాలను గడిపితే భగవంతుడు మనల్ని తనలోకి ఆకర్షిస్తాడు’ అని ధర్మరాజు చెప్పాడు. తోవ మధ్యలో (హిమాలయాల్లో మరణం కోసం ఉత్తరం వైపు నడుస్తూ) ద్రౌపది, ధర్మరాజు తమ్ముళ్లు పడిపోయారు. చివరికి ధర్మరాజు ఆ కుక్కతో స్వర్గ ప్రవేశద్వారం దగ్గరకు చేరాడు. లోపల్నించి భగవంతుడు, ‘నువ్వు ఒక్కడివే లోపలికి రావచ్చు. కుక్క రావటానికి వీల్లేదు’ అన్నాడు. దానికి ధర్మరాజు, ‘మా ఇద్దరి దేహాలు వేరైనా, ఆత్మలు ఒక్కటే. దాన్ని రానివ్వకపోతే నేనూ లోపలికి రాను’ అన్నాడు. అప్పుడు ‘సృష్టిలోని ప్రాణులందరిలోనూ నేనున్నానని గ్రహించడం ద్వారా నీవు నీ ఆంతరంగిక మంచితనాన్నీ, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్నీ చూపావు’ అంటూ భగవంతుడు, ధర్మరాజునీ ఆ జాగిలాన్నీ లోపలికి ఆహ్వానించాడు.
ఈ విధంగా కుక్క కథతో మొదలైన భారతం కుక్క కథతో ముగిసింది.
మరి మన కేరళ కాంగ్రెస్, కేరళ కమీలు కుక్కల్ని చంపుతున్నారెందుకు? ఎందుకంటే ఈ చరిత్ర మీద, ఈ సంస్కృతి మీద వాళ్లకి విశ్వాసం లేదు గనక.
**

ఛెన్నైలో డాబా పైనుంచి కుక్కను విసిరేస్తున్న మెడికో (ఫైల్‌ఫొటో)

- జి. ఎస్. దీక్షితులు gsdeekshitulu24@gmail.com